Previous Page Next Page 
డా || వాసిరెడ్డి సీతాదేవి రచనలు - 4 పేజి 6


                                              4

 

    గోడ గడియారం ఎనిమిది కొట్టింది. తూర్పుదిక్కున బారెడు పొద్దు ఎక్కింది. కృష్ణారావు ఇవ్వాళ ఫ్యాక్టరీకి వెళ్ళటం ఆలస్యమయింది.

 

    హడావిడిగా భార్య ఇచ్చిన కాఫీతాగి హాల్లోకి వచ్చాడు. వెంటనే కృష్ణారావుకు రాత్రి తను డ్రాయరు సొరుగులో దాచిన డబ్బు విషయం జ్ఞాపకం వచ్చింది. కాంతమ్మ రజనికి వంటింట్లో పాలు పడుతోంది. ఆ డబ్బు భార్య చూడకుండా భద్రపరచటానికి ఇదే అదను అనుకున్నాడు.

 

    డ్రాయరు తెరుస్తూనే కాగితాలన్నీ చిందర వందరగా కెలికి వుండటం గమనించాడు కృష్ణారావు. ఆశ్చర్యం వేసింది. గబగబా డైరీ కోసం వెతికాడు. డైరీ చేతికి తగలగానే 'అమ్మయ్య' అనుకున్నాడు. తీరా తీసి తెరచి చూస్తే డబ్బులేదు! మరుక్షణంలోనే భార్యమీద కోపం వచ్చింది. ఇలాంటి విషయాలు పసికట్టటంలో ఆమెకు ఆమే సాటి అనుకున్నాడు. ఏమయినాసరే, తను చంద్రానికి ఆ డబ్బు ఇచ్చి రెండు రోజుల్లోనే గురుకుల్ కు పంపించాలి.

 

    "కాంతం.... కాంతం!" గావుకేక పెట్టాడు.

 

    "ఆ వస్తున్నా! ఏమిటా కేకలు, కొంపలంటుకుపోతున్నట్లు!" చేతులు పమిటకు తుడుచుకుంటూ వచ్చింది కాంతమ్మ వంటింట్లోనుంచి.

 

    "ఆ డబ్బు ఎందుకు తీశావు?"

 

    "ఏ డబ్బు!"తెల్లమొహం వేసింది కాంతమ్మ.

 

    అన్నీ వేషాలు. వళ్ళు మండిపోయింది కృష్ణారావుకు.

 

    "ఇంకేం డబ్బు? ఆ వెయ్యి రూపాయలు!" గర్జించాడు.

 

    "వెయ్యి రూపాయలా? ఎక్కడివి? ఎక్కడపెట్టారు?"

 

    "వేషాలు వెయ్యకు. ఇలాతే ఆ డబ్బు మర్యాదగా."

 

    "మీ కేమయినా పిచ్చిగాని ఎత్తలేదు గదా? అసలు మీరు అంటున్నది నాకు అర్థం కావటంలేదు-" ఈసారి కాంతమ్మకూడా వాల్యూం పెంచింది.

 

    "రాత్రి నాగేంద్రం వెయ్యి రూపాయలు తెచ్చి ఇచ్చాడు. అది ఇక్కడే ఈ డ్రాయరు సొరుగులోనే దాచాను. తెల్లవారేటప్పటికి ఏ దొంగ వస్తాడు? నువ్వే తీశావు. గొడవ చెయ్యకుండా ఇవ్వు. ఆ డబ్బు నాకు చాలా అవసరంగా కావాలి."

 

    "వెయ్యిరూపాయలు పోయాయా? పైగా నన్ను దబాయిస్తున్నారు. దొంగతనం చెయ్యాల్సిన కర్మ నాకేం కాలింది? తీస్తే తీశానని చెబుతాను."

 

    "అదే చెప్పమంటున్నాను."

 

    "నేను తియ్యందే తీశానని ఎందుకు చెబుతాను? అందుకే ఇంటి దొంగను ఈశ్వరుడైనా పట్టలేడంటారు."

 

    "అంటే?"

 

    "అంటే ఏముంది. నేను తియ్యలేదు. ఇకపోతే ఈ ఇంటిలో ఉన్న మూడో మనిషి...."

 

    "కాంతం!...." అరిచాడు కృష్ణారావు.

 

    "అవును, ఇంకెవరు, నీ తమ్ముడే తీశాడు!" కాంతమ్మ గట్టిగా హెచ్చుస్థాయిలోనే అంది.

 

    "ఛీ! నోరుముయ్!" కాంతమ్మ చెంప చెళ్ళుమన్నది.

 

    కాంతమ్మకి ప్రపంచమంత తలక్రిందులైనట్లనిపించింది. భర్తచేత తను దెబ్బతిన్నది. పది సంవత్సరాలుగా తన మాటకు జవదాటని తన భర్త కృష్ణారావు మొదటిసారిగా తనమీద చెయ్యిచేసుకున్నాడు. దెబ్బవల్ల కలిగిన బాధకంటే కాంతమ్మకు భర్తలో కలిగిన మార్పు ఎక్కువ బాధను కలిగించింది. వాకిట్లో కట్టి ఉండే మూగపశువు ఒక్కసారిగా మానవ భాషలో యజమానిని తిట్టటం ప్రారంభిస్తే ఆ యజమాని పరిస్థితి ఎలా ఉంటుంది? సరిగ్గా అలాగే ఉంది కాంతమ్మ మానసిక పరిస్థితి. పైటకొంగుతో కన్నీరు తుడుచుకుంటూ కదలిపోయింది కాంతమ్మ.  

 

    కాంతమ్మ చెంప ఛెళ్ళుమన్న మరుక్షణంలోనే కృష్ణారావు కోపమంతా నీరుకారిపోయింది. కాలు జారితే తీసుకోవచ్చు కాని, నోరు జారితే తీసుకోలేమనే సామెత ఉంది. కాని చెయ్యిజారితేకూడా తీసుకోలేం. తను ఏనాడు చెయ్యని పని చేశాడు. కాదు తన భార్య తనచేత ఇంతపని చేయించింది. కాకపోతే చంద్రం తన రక్తం పంచుకొని పుట్టిన తన సోదరుడు దొంగా? చంద్రంలాంటి బుద్ధిమంతులు ఎందరు ఉంటారు? వాడి మంచితనానికి తనూ, తన భార్యా ఇచ్చే ప్రతిఫలం చివరకు ఇదేనా? తన తల్లీతండ్రీ బ్రతికివుంటే ఈనాడు తన భార్య చంద్రానికి దొంగతనాన్ని అంటగట్టగలిగేదేనా? అసలు ఇలాంటి పరిస్థితి వచ్చేదా?

 

    అదిరిపోతున్న కణతలు నొక్కుకుంటూ కుర్చీలో కూలబడ్డాడు కృష్ణారావు.

 

    ఏమయినా తను కాంతాన్ని కొట్టటంలో చాలా తొందరపడ్డాడు. భార్యమీద చెయ్యి చేసుకొనే మగవాణ్ణి తను పశువుకంటే హీనంగా తలచేవాడు. ఈ రోజు తను అదేపని చేశాడు. నిజంగానే కాంతం తియ్యలేదేమో! డబ్బు విషయం అడగ్గానే తెల్లమొహం వేసింది. అంతా వేషాలు అనుకున్నాడు తను వళ్ళు తెలియని ఆవేశంతో. ఒకవేళ తీసివుంటే "తీశాను, ఏం చేస్తావు?" అనే తత్వం ఆమెది. పైగా ఆవిడకు నాగేంద్రం తనకు డబ్బు ఇవ్వటంగానీ, దాన్ని తను దాచటంగానీ తెలియనే తెలియదు. అలాంటప్పుడు తను ఆమెకు దొంగతనాన్ని అంటగట్టాలా? తను చేసిందిమాత్రం ఏమిటి? తను తన భార్యను 'దొంగ' అంటే, ఆమె తన తమ్ముడే దొంగ అంది, అంతే. అంతమాత్రానికే తను చెయ్యి చేసుకున్నాడు. చివరకు మొగవాడిగా ముఖ్యంగా మొగుడిగా తనలో తెలియకుండానే దాగివున్న అధికారం, అహంకారం సమయం చూచుకొని బయటపడ్డాయి.

 

    ఇంతకూ ఆ డబ్బు ఏమయినట్లు? రాత్రికి రాత్రి ఏ బయటి దొంగ వచ్చివుంటాడు? ఆ డబ్బు సంగతి తనకూ నాగేంద్రానికీ మాత్రమే తెలుసు. వెంటనే కృష్ణారావుకు రాత్రి తన ఎదుట ఏదో చెప్పటానికి నిల్చొనివున్న చంద్రం జ్ఞాపకం వచ్చాడు. ఎవరో వీపుమీద కొరడాతో కొట్టినట్లయింది కృష్ణారావుకు ఆ ఆలోచన రాగానే.

 

    అయితే... ఇంకా అనుమానం ఎందుకు? ఇది వాడిపనే. తను చదివించడనే అనుమానంతోనే చంద్రం ఇంతపని చేశాడు. ఎంత అవమానం!  ఎంత అప్రతిష్ట? తన వంశంలో ఎన్నడూ లేనిపని జరిగింది. ఇంక కాంతంముందు తను తల ఎలా ఎత్తుకు తిరగ్గలడు?           

 

    కృష్ణారావు హృదయంలో కోపం సుళ్ళు తిరగసాగింది. గబగబాలేచి చంద్రం గదిలోకి వెళ్ళాడు. ఖాళీమంచం బోసిగా కృష్ణారావు మొహంలోకి చూసింది. బాత్ రూమ్ దగ్గరకు వెళ్ళాడు. చంద్రం అక్కడా లేడు. ఇంటిచుట్టూ, ఇల్లంతా పిచ్చివాడిలా చంద్రంకోసం తిరిగాడు. చంద్రం జాడలేదు.   

 

    కృష్ణారావు వరండాలో గేటువైపు చూస్తూ నిల్చున్నాడు. ఆకాశం మేఘావృతంగా వుంది. మధ్యమధ్య వానజల్లులు పడుతున్నాయి. కృష్ణారావు మనసు ముసురు పట్టిన ఆకాశంలా ఉంది.  

 

    చంద్రం సాధారణంగా ఎనిమిది గంటలకు ముందు నిద్రలేవడు. ఈ రోజు నిద్రలేవటమే కాకుండా ఈ వర్షంలో ఎవరూ చూడకుండా బయటకు వెళ్ళిపోయాడు. ఇంకా అనుమానం దేనికీ? ఇది వాడిపనే. ఎక్కడకు వెళ్ళాడో? రానియ్! తాట వలిచేస్తాను.

 

    ఇంతపని చేసినవాడు మళ్ళీ తిరిగివస్తాడా! ఒకవేళ తిరిగి రాకపోతే! అంత కోపమూ నీళ్ళుకారిపోయింది. ఏదో అజ్ఞాత భయంతో వణికిపోయాడు, కృష్ణారావు.     

 

    ఆ వెయ్యి రూపాయలు ఖర్చుపెట్టేస్తాడు, ఏ బొంబాయికో చేరి. ఆ తరువాత! ఏ రౌడీల చేతిలోనో.... లేక బిచ్చమెత్తుకొనో.... ఇక ముందుకు ఆలోచించలేకపోయాడు. అలా జరిగితే తన తల్లిదండ్రుల ఆత్మలు తనను శపిస్తాయి. నిజమే. తన తమ్ముడు ఇలా దిగజారిపోవటానికి కారణం ఎవరు? తనే! తన భార్య భయంతో ఏనాడూ తమ్ముణ్ణి ఆప్యాయంగా దగ్గరికి తీసికున్న పాపాన పోలేదు. ఆప్యాయంగా మాట్లాడి ఎరుగడు. కనీసం తన ఆస్తిలో సమభాగస్తుడయిన చంద్రానికి చదువు చెప్పించటానికి తనకూ, తన భార్యకూ ఇష్టం లేకపోయింది. తన పాపానికి పరిష్కారం లేదు.   

 

    వెంటనే ఏదో గుర్తుకు వచ్చి ఫోన్ దగ్గరికి వెళ్ళాడు.

 

    "హల్లో! నేను కృష్ణారావును. అమ్మా హేమా! నాన్నగారు లేరా? ఆహాఁ - ఏం లేదు. చంద్రం అక్కడికి వచ్చాడేమోనని.

 

    ......"

 

    "రాలేదా! పొద్దుటే ఎక్కడికో వెళ్ళాడు, అందుకే...." అంటూ ముందుకు మాట్లాడలేక కృష్ణారావు రిసీవర్ పెట్టేశాడు.     

 

    హృదయంలో బాధ, భయం, అవమానం. కోపం ఒకదాన్ని ఒకటి పెనవేసుకుపోతున్నాయి. అరచేతితో నొసలు పట్టుకొని కూలబడ్డాడు ప్రక్కనే ఉన్న సోఫాలో.

 

    ఇల్లంతా తుపాను రాబోయేముందు ఉండే ప్రశాంతత అలుముకుపోయింది.

 Previous Page Next Page