"సారీ" మిస్టర్ నరేంద్రా! అర్ధరాత్రిపూట మిమ్మల్ని డిస్టర్బ్ చేస్తున్నా మని అంటూ పోర్టికోలో నిలబడి ఉన్న ఒక యువకుడు ముందుకు వచ్చాడు.
అతడి వెనక ఒక యువతి నిలబడి ఉంది.
"అనుకోవడం ఏమిటి? డిస్టర్బ్ చేశారు" విసుగ్గా అన్నాడు నరేంద్ర మూసుకుపోతున్న కనురెప్పల్ని బలంగా ఎత్తుతూ.
"సారీ సర్! క్షమించండి. ఈ రాత్రిపూట తప్పనిసరి అయి వచ్చాం."
నరేంద్ర వాళ్ళిద్దర్నీ ఎగాదిగా చూశాడు.
"నాతో మీకేమైనా పని ఉందా?"
"అవునండి. చాలా ముఖ్యమైన పని ఉండే ఇంత రాత్రిపూట మీ నిద్ర పాడుచేశాం" అన్నాడు అతను.
"అయితే రేపు ఉదయం ఎనిమిది గంటలకు రండి" ఛళ్ళు ముఖం మీద బాదినట్టే అన్నాడు.
కాని నరేంద్రకు తలుపులు మూసే అవకాశం కూడా ఇవ్వకుండా అతడి వెనకే వాళ్ళూ హాల్లోకి ప్రవేశించారు.
నరేంద్రకు చర్రున కోపం వచ్చింది. చొక్కా చేతులు పైకి మడిచాడు. అది చూసి ఆ యువకుడు రెండడుగులు వెనకు వేశాడు.
"క్షమించండి" అంటూ అతడితో వచ్చిన స్త్రీ ఇద్దరి మధ్య వచ్చి నిలబడింది.
ఆమె గొంతులో ఆదుర్దా, ఆమె ముఖంలో భయం కన్పించాయి. ఆమె అందం నరేంద్ర చేతుల్ని కట్టి పదేశాయ్ కొద్దిక్షణాలపాటు.
"మేడమ్, నేను చెప్పింది అర్థం కాలేదా?" అన్నాడు నరేంద్ర.
అయితే నరేంద్ర కంఠంలో మొదటి కరకుతనంలేదు.
"అర్థమైంది."
"మరి ఇంకా నిల్చున్నారేం? వెళ్ళండి రేపు ఉదయం రండి" విసుగ్గా అన్నాడు నరేంద్ర.
"ఇంత అర్థరాత్రి మేము ఎంత చిక్కులో ఇరుక్కుంటే వచ్చామో ఆలోచించండి. కనీసం మేము చెప్పేది వినండి, వినకుండానే వెళ్ళిపొమ్మనడం న్యాయం కాదు. ఆపదలో మీరే మాకు ఆపద్బాంధవుడిలా కన్పించారు. అందుకే వచ్చాం. ఆ యువతీ హాలులో ఉన్న సోఫాలో కూర్చుంది.
"ఏమిటా ఆపద?" చిరగ్గానే ప్రశ్నించాడు నరేంద్ర.
"చెప్పు!" అన్నది యువతి తనతో ఉన్నయువకుడితో.
"నువ్వే చెప్పు" అన్నాడు యువకుడు.
"ఎవరూ చెప్పక్కర్లేదు. ముందు మీరు బయటకి నడవండి" సహనం కోల్పోయిన నరేంద్ర పెద్దగా అరిచాడు.
"ప్లీజ్! అలా అనకండి. ఎంతో ఆపదలో వచ్చాం." ఆయువతి రెండు చేతులూ జోడించింది. అందమైన ఆమె చేతివెళ్లను చూస్తూ చల్లబడి పోయాడు నరేంద్ర.
"చంపకుండా త్వరగా చెప్పు ఆ ఆపద ఏమిటో?" అన్నాడు నరేంద్ర.
"ఏనాడో చనిపోయినా నా భర్త ఇప్పుడు తిరిగి వచ్చాడు."
"వాట్!" నరేంద్ర ఇంచెత్తున ఎగిరి పడ్డాడు. అతడి నిద్రమత్తు పూర్తిగా వదిలి పోయింది.
"చచ్చిపోయిన మనిషి తిరిగి వచ్చాదా?" తనను తనే ప్రశ్నించుకుంటున్నట్టుగా గొణుక్కుంటూ వచ్చి ఆమెకు ఎదురుగా ఉన్న సోఫాలో పక్కగా కూర్చున్నాడు.
ఏమిటి ఆవిడ చెప్పింది? తమ పొరపాటుగా వినలేదు కదా ? నిద్రమత్తులో ఆమె తన భర్త గురించి ఏదో చేస్తే తనకు అలా విన్పించి ఉండాలి. లేకపోతే చచ్చిపోయిన మనిషి తిరిగి ఎఆవడం ఏమిటి?
ఎదురు సోఫాలో కూర్చున్న వాళ్ళిద్దర్నీ మార్చి మార్చిపరిశీలనగా చూడసాగాడు నరేంద్ర.
"నేను చెప్పింది మీరు నమ్మడంలేదు కదూ?"
"మీరేం చెప్పారో మరోసారి చెప్పండి."
"చచ్చిపోయిన-అదే-ఏనాడో చచ్చిపోయిన నాభర్తఇప్పుడు తిరిగొచ్చాడు." ఆమె శబ్దాలను నొక్కుతూ అన్నది.
నరేంద్ర పకపక నవ్వాడు. విరగబడి నవ్వాడు.
"మీరు నమ్మడంలేదు కదూ?" ఆవేదనగా అన్నది యువతీ.
"చచ్చిపోయిన మనిషి తిరిగి రావడం ఏమిటి? మీకు మతిపోయినట్టుంది."
"అవునండీ. నిజంగా తిరిగొచ్చాడు."
"ఆ తిరిగి వచ్చిన ఆయన మీ భర్తేనన్నారు కదూ?"
"అవునండీ!"
"చచ్చిపోయిన మీ భర్త తిరిగొస్తే సంతోషించాల్సింది బాధపడ్తున్నారేం?" ఆబో పక్కన ఉన్న యువకుడ్ని పరిశీలనగా చూస్తూ అన్నాడు నరేంద్ర! నరేంద్ర చూపులను తట్టుకోలేనట్టుగా నెల చూపులు చూడసాగాడు ఆ యువకుడు.
"పోయిన వస్తువు మళ్లీ దొరికితే సంతోషించ వచ్చు. భర్త పోయిన మనిషి-అందులోనూ భర్త అయితే- తిరిగి రావడం చాలా చిక్కులకు దారి తీస్తుందండీ జీవితంలో జరిగిన పొరపాట్లనుగానీ, సంఘటనలనుగానీ తుడిచి వేయడం సాధ్యమయ్యే పనికాదుగా?" అన్నది ఆమె.
"ఇంతకీ మీ భర్త తిరిగి రావడం మీకు ఇష్టంలేదు. అంతేనా?" సూటిగా ఆమె కళ్ళల్లోకి చూస్తూ అన్నాడు నరేంద్ర.
"ఇష్టం ఉన్నా లేకపోయినా అది జరిగింది" వ్యానిటీ బాగ్ నుంచి కర్చీపు తీసి ముఖానికి పట్టిన చమట తుడుచుకున్నది.
"ఎక్స్ క్యూజ్ మీ "అంటూ నరేంద్ర లేచి తన గదిలోకి వెళ్ళాడు. రెండు నిముషాల్లో సిగరెట్ తాగుతూ బయటికి వచ్చాడు. అంతవరకూ గుసగుసలాడుతున్న ఆ యువతీ యువకులు సంభాషణ నరేంద్ర రాకతో ఆగిపోయింది.
ఎదురు సోఫాలో కూర్చుని సిగరెట్ దమ్ములాగి "ఇంతకూ మీరెవరో చెప్పారు కాదు," అని అగాడు నరేంద్ర వారిని పరిశీలనగా చూస్తూ.
"నాపేరు అనసూయా. ఆయన నాభర్త! అనసూయ ఆటో మొబైల్స్ కంపెనీ ప్రొప్రయిటరు," అన్నది ఆ యువతి.
"పేరూ?" నరేంద్ర అడిగాడు.
ఆమె చెక్కిళ్ళు ఎరు పెక్కాయి. అతడి కేసి చూసింది.
"సూర్యనారాయణ, అనసూయ నన్ను సూర్యం అని పిలుస్తుంది," అన్నాడు అనసూయ భర్త.
"ఒహొ! సూర్యం అని పిలుస్తుందా? మరి మీ పేరు చెప్పడానికి ఎందుకంత సిగ్గు పడిపోయింది" నరేంద్ర కంఠంలో వ్యంగ్యంధ్వనించింది.
"హిందూ స్త్రీ భర్త పేరు చెప్పదుగా?" సూర్యనారాయణ అన్నాడు.
"భర్తపేరు చెప్పని స్త్రీ భర్తను పేరుతో పిలవదు మిస్టర్!"
"బహుశా మీ ముందు అనసూయ ఆర్థాడాక్స్ గా కన్పించడానికి, సిగ్గు పడినట్టు నటించిందేమో!" అన్నాడు సూర్యనారాయణ నవ్వుతూ.
"ఇది మరీ బాగుందండీ! నా దగ్గర ఆర్థడాక్స్ గా కన్పించండం ఏమిటి? అది మీ నాన్న దగ్గరో, అమ్మదగ్గరో....."
"నాకు అమ్మా నాన్న లేరండీ!" అన్నాడు సూర్యం.
"సారీ!" అన్నాడు నరేంద్ర_
"నేను నాటకం ఆడలేదు సార్. పరాయి మగాడి ముందు భర్త పేరు చెప్పాలంటే సిగ్గు వేసింది" భర్తను ఓరకంట చూస్తూ అన్నది అనసూయ.
"అది సరే! వదిలెయ్యండి. ఇన్నింటికి మీరు మీ భార్యకు ఇష్టంలేని పని ఎందుకు చేసినట్టూ?"
నరేంద్ర ప్రశ్నకు ఇద్దరూ విస్తుపోయి చూశారు.
"చెప్పిండి."
"మీరు అడిగింది నాకు అర్థం కాలేదు."
"నేను లాటిన్ లో మాట్లాడలేదు. తెలుగులోనే అడిగాను."
"అది కాదండి! నేను ఆమెకు ఇష్టం లేని పని ఏది చెయ్యలేదే? మీరలా ఎందుకడిగారా అని..." సూర్యం అయోమయంగా చూస్తూ అన్నాడు.
"ఆమె గోలంతా అదేగా?"
"నేను ఆయన మీద కంప్లైంటు ఏమీ చెయ్యలేదండి!"
"ఏమయ్యా నేను లోపలకువెళ్ళి వచ్చేసరికి ఇద్దరూ కూడబల్కున్నట్టున్నారు?"
"అదేం లేదుసార్!"
"అసలు, నువ్వు ఒకసారి చచ్చిపోయి మళ్ళీ బతికి ఎందుకొచ్చావయ్యా?" పక పక నవ్వాడు నరేంద్ర.
ఆ మాటకు సూర్యం కూడా గొల్లున నవ్వాడు. అనసూయ మాత్రం ఏడుపు ముఖం పెట్టింది.
"చంపేశారు సార్?" మళ్ళీ విరగబడి నవ్వ సాగాడు సూర్యం.
నరేంద్ర ముఖం గంభీరంగా మారింది. ఆ ముఖం చూసిన సూర్యం నువ్వు ఒక్కసారిగా ఎవరో మీటనొక్కినట్టుగా ఆగిపోయింది.
"ఆ పని చేసేది నేను కాదు సార్!"
ఈ సారి నరేంద్ర అయోమయంగా చూశాడు.
"ఆమె మొదటి భర్త!" అన్నాడు సూర్యం."
"ఓ.ఐ.సి." మరో సిగరెట్ వెలిగించుకొని గట్టిగా దమ్ము పీల్చాడు నరేంద్ర.
"అతని పేరూ?"
"రామానందస్వామి"
"అసలు పేరు రామకృష్ణ" అన్నది అనసూయ మధ్యలో అందుకొని.
"అనసూయ అతడ్ని "కృష్ణా" అని పిల్చేది."
"అవన్నీ చెప్పాలా?" అనసూయ సూర్యం కేసి చుర చుర చూసింది.
సూర్యం తప్పయిపోయినట్టు నాలుక కరచుకొన్నాడు.
వాళ్ళ మాటలేవీ వినడం లేదు నరేంద్ర.