ఒకరోజు మధ్యాహ్నం భోజనాలయ్యాక, ఏవో కబుర్లు చెప్పుకుంటూ కూర్చున్నారు అందరూ వసారాలో. ఏవో మాటల సందర్భంలో గోవిందుని అడిగారు వాసుదేవరావుగారు సెలవు ఎన్నాళ్లు పెట్టావని. వచ్చినప్పటినుంచి అసలుసంగతి ఎలాచెప్పాలా అని ఆలోచిస్తూన్న గోవింద్, ఇదే సమయమని అనుకున్నాడు.
"ఉద్యోగానికి రాజీనామా ఇచ్చాను మామయ్యా!" అన్నాడు.
"ఏం? ఊరికేనా? ఏమైనా గొడవలొచ్చాయా?" అన్నారు కంగారుగా.
"ఏంలేదు. నాకే బోరుకొట్టింది" నెమ్మదిగా అన్నాడు.
"నే ముందే చెప్పానా? ఈ ఉద్యోగాలు మనవల్ల కావురా, హాయిగా బిజినెస్ చ్సుకో అని" అన్నారు పరసింహరావుగారు.
"పోనీలెండి. ఇప్పటికైనా వచ్చేశాడుగా. ఆ సంగతి వాడు స్వయంగా తెలుసుకుని వచ్చేశాడు. పోనీలే ఇకనుంచి ఇక్కడే వుంటారు" సంతోషంతో మురిసిపోతూ అంది కామాక్షమ్మగారు.
ఆవిడ మాటలకి సుమతి కళ్ళలో నీళ్లు తిరిగాయి. తుమ్మువస్తూన్నట్టుగా ముఖానికి 'కర్చీఫ్' అడ్డం పెట్టుకుని కళ్ళు తుడుచుకుంది.
"అయితే ఏమైనా వ్యాపారంగురించి ఆలోచిస్తున్నావా బాబూ!" ఆదరంగా అడిగారు వాసుదేవరావుగారు.
ఎప్పుడో అప్పుడు అసలుసంగతి చెప్పక తప్పదని నిజం చెప్పెయ్యదలచుకున్నాడు గోవింద్.
"నేను మిలిటరీ ఆఫీసరుగా సెలక్టయ్యాను మామయ్యా!" అన్నాడు.
అంతే! వాసుదేవరావుగారికి షాక్ కొట్టినట్టయింది. నోట మాట రాలేదు. నరసింహారావుగారి పరిస్ధితీ ఇంచుమించు అలాగే వుంది. తాను వింటూన్నది నిజమా? కలా? అన్నట్టుంది. కామాక్షమ్మగారికి అంతా అయోమయంగా వుంది. నిశ్శబ్దం కొన్నిక్షణాలు రాక్షాసిలా తాండవం చేసింది.
షాక్ నుంచి తేరుకున్న వాసుదేవరావుగారు గొంతునూళ్ళుతూంటే మెల్లగా అడిగారు "ఇదేంపని గోవిందూ! ఇన్ని ఉపయోగాలుండగా, ఇన్ని వ్యాపారాలుండగా, ఏదీ లేకపోయినా చెప్పలేనంత ఆస్తి వుండగా, ఎక్కడో దూరాన అయినవారి నందరిన్ని వదలి ఈ ఉద్యోగం ఎందుకు బాబూ! అందులోనూ ఏ యుద్దమైన వస్తే?"
"మామయ్యా! మీరు చాదస్తంగా మాట్లాడ్డం నా కాశ్చర్యంగా వుంది. ఈ రోజుల్లో మనిషి ఆకాశంలో ఎగరడానికీ, సముద్రంలొ ఈదడానికి, అవసరమయితే చంద్రమండలంలోనే కాపురం పెట్టడానికీ సిద్దమావుతున్నాడు. అటువంటిది మనం ఒక సైనికోద్యోగిగా వెళ్ళడానికి సందేహిస్తాన్నం."
"ఏడిశావు లేరా! పొట్ట చేత్తో పట్టుకుని తిరిగేవాడు, నాలుగురాళ్ళకోసం నానా చోట్లకీపోతాడు, నానా పనులూ చేస్తాడు. మనకేం ఖర్మ? కడుపులో చల్ల కదలకుండా బతికే అవకాశం అందరికీ రాదురా."
"నాన్నా....నాక్కావలసింది వడ్డించిన విస్తరి కాదు. కడుపు నిండా తిని, కాళ్లుజాపుకు పడుకోవడం కాదు, నా ఆలోచనలనీ, నా శక్తి సామర్ధ్యాలనీ వృధా పోనీకుండా, పదిమందికి పనికొచ్చేలా మంచి పనులు చెయ్యడంలో నాకు తృప్తివుంది. అందుకే....."
"అదే నీ థ్యేయమయితే మంచిపనులు చెయ్యడానికి మార్గాలెన్నో వున్నాయి. గుళ్లు కట్టించు, బళ్లు పెట్టించు, ఆనాధశరణాలయాలు , ఆశ్రమాలూ, సత్రాలు నిర్మించు. దాన ధర్మాలుచెయ్యి."
"వాటిల్లో దేశరక్షణ బాధ్యత ఒకటి కాదా నాన్నా?"
"నిజమే! కానీ , వాటిని చూసుకోవడానికీ కొందరున్నారుగా! అన్నాది నువ్వోక్కగా నొక్క కొడుకువి. వాసుకీ సుమ ఒక్కరై. మా ప్రానాలన్నీ మీమీదే పెట్టుకుని బ్రతుకుతున్నాం. నువ్వు మా కళ్ళెదుటే వుండాలని తపించిపోతున్నాం. నువ్వు మా కళ్ళముందు నుంచి దూరమయిపోతే ఎలా బ్రతగ్గలం బాబూ! ఏం చూసుకు బతుకుతాం?" ఆవేశంతో ఆయనగోంతు బొంగురు పోయింది. దుఃఖం గొంతు కడ్డుపడి మాట రాకుండా చేసింది. వాసుదేవరావుగారు ఎడం చేతిమీద తల ఆవించి కూర్చున్నారు మతిలేని వాడిలా తండ్రీ, కొడుకుల సంభాషణ వింటూ.
కామాక్షమ్మగారి పమిటచెంగు తడిసి ముద్దయింది. సుమతి లేచి లోపలి కెళ్ళిపోయింది. మళ్ళీ నిశ్శబ్దం తాండవం చేసింది. నిశ్శబ్దాన్ని చీల్చుకుంటూ గోవిందే మొదలెట్టాడు.
"నాన్నా! భగవంతుడు ఒక్కొక్కసారి మనకు అత్యంత ప్రియమైన వాటిని శాశ్వతంగా దూరం చేస్తాడు. ఏ జబ్బో చేసి హఠాత్తుగా నేను చచ్చిపోయాననుకోండీ....."
"బాబూ!...."
"గోవింద్.....!"
అందరూ ఒక్కసారిగా అరిచారు. ఆ అపశకునపు మాటల్ని వినలేనట్టు.
"అంత మాటనకురా! నీ యిష్టం వచ్చినట్టే చేసుకో. నువ్వెక్కడున్నా పదికాలాలపాటు చల్లగా వుండాలనే కోరుకుంటాం" దుఃఖాన్నాపుకోలేకపోయారు నరసింహరావుగారు. గొంతు బొంగురు పోయింది.
"ఇప్పుడేమయిపోయిందని? కొంతకాలం ఆ సరదాగూడా తీర్చుకొని వచ్చేస్తాను. జీవితంలో ముందు కెళ్ళడానికి భయపడితే ఎట్లా? సంవత్సరానికోసారి రెండు నెలలు సెలవులిస్తారు. మే మొస్తాం లేదా మీరూ రావొచ్చు. నాన్నా! దేశంఅంతా చూడ్డానికి మీకుమాత్రం ఇది చాన్స్ కాదా? బంగారుకత్తి అని గొంతు కోసుకుంటామా చెప్పండి? ఒక్కడే కొడుకుని ఇంట్లో కట్టిపడేస్తే ఏమవుతుంది?"
".... .... ..."
"బాబూ! కన్నకడుపు తీపి నీ కిప్పుడు తెలీదు. రేపు నీ కొడుకు పెరిగి పెద్దవాడై నీకు దూరమవుతూన్నప్పుడు కానీ మమకారం అంటే ఏమిటో తెలీదు." కొంచెం నిష్ఠురంగానే అంది కామాక్షమ్మగారు కొడుకు మొండితనానికి విసుగుతో.
"అలా అనకు చెల్లెమ్మా! మన బాధలు వాళ్ళకుకూడా రాకూడదు" అన్నారు వాసుదేవరావుగారు.
కళ్ళు తుడుచుకుంటూ అక్కడినుండి వెళ్ళిపోయింది కామాక్షమ్మగారు. మెల్లగా ఒక్కొక్కరే లేచి వెళ్ళిపోయారు ఏదో మిషమీద. అంతవరకూ ఎంతో ఉల్లాసంగా , హాయిగావున్న వాతావరణం క్షణంలో మారిపోయింది. బరువెక్కిన హృదయాలతో శోకదేవత స్థావరంలా వుంది ఇల్లు. ఆ రోజంతాకూడా ముభవంగానే గడిచి పోయింది. గోవిందు పట్టుదల అందరికీ తెలుసుకనుక, ఇంక ఎవ్వరూ నచ్చజెప్పడానికి ప్రయత్నించ లేదు.
రోజులు గడుస్తున్నాయ్. గోవింద్ స్నేహితులూ, పార్టీలూ బిజీగా వున్నాడు. ఇంట్లో వున్నంతసేపూ అందరితోనూ ఎంతో కలివిడిగా వుంటాడు. అతని మనసు నొప్పించకుండా వుండడానికి అందరూ సంతోషంగా వున్నట్టుగానే ప్రవర్తిస్తున్నారు. కానీ, వారి హృదయంలోని వేదన చల్లారలేదు.
"అమ్మాయ్ ! నువ్వు ఉత్తమనిషికూడా కాదు. నీ మనసు ప్రశాంతంగా వుండాలి. నువ్వేమీ బెంగపెట్టుకోకు" అంటూ ఓదార్చేది కామాక్షమ్మగారు.
"మీరూ పెద్దవారు. లేనిపోని బెంగలతో మీ ఆరోగ్యం పాడుచేసుకోకండి. ఎలా జరగాలో అలా జరుగుతుంది" అంటూ ఓదార్చేది సుమతి.