తెలుగు రామాయణాలు
ఈ సాహిత్యోపన్యాస సముచ్చయానికి "రామాయణ సుధాలహరి" అని నామకరణం చేయటం చాలా సముచితంగా ఉంది. ఏమంటే రామ కధ సుధామధురమైనది గదా మరి!
మధురము రామాయణ కధ
మధురము వాల్మీకి వాక్కు; మరి అందులకే
బుధు లందరు "రామాయణ
సుధాలహరి" యనిరి శ్రుతిసుభగముగాన్.
వాస్తావానికి వాల్మీకి మహర్షియే తన రామయాణాన్ని "పాట్యేగేయే చ మధురమ్ " అని ఉగ్గడించాడు. ఈ పరమార్ధాన్ని బాగా తెలిసినవాడు కనుకనే భోజదేవుడు తన "చంపూరామాయణం' లో
"శుభమతనుత కావ్యం స్వాదు రామాయణఖ్యం
మధుమయ ఫణితీనాం మార్గదర్శి మహర్షిః"
అని రామకధా స్వాదుత్వాన్ని "మధుమయ పదవిన్యాసాలకు మార్గదర్శకు "దైన వాల్మీకి మహర్షి కవితా మాధుర్యాన్నీ చక్కగా నొక్కి వక్కణించాడు. అటువంటి రాముని చరిత్రమూ వాల్మీకి కవిత్వమూ రెండూ సమైక్యం కావటంతో మధురాతిమధురమైన శ్రీమద్రామాయణ మహాకావ్యం ఆవిర్బవించింది. అందుకనే వాల్మీకికి హస్తాలు మోడ్చి నమస్కరిస్తూ ఒక మహాకవి ఇలా అన్నాడు.
కూజంతం రామరామేతి మధురం మధురాక్షరమ్,
అరువ్యా కవితాశాఖాం వందే వాల్మీకికోకిలమ్.
వాల్మీకి అనే కోకిల కవిత్వమనే కొమ్మ మీద కూర్చుండి "రామా రామా" అనే మధురాక్షరాలను మధురాతి మధురమైన కంఠస్వరంతో గానం చేస్తున్నదట! కోయిల కూర్చున్నదంటే ఆ కొమ్మ మామిడికొమ్మే అయి వుంటుంది. మామిడి కొమ్మ కోకిలగానమూ అనేసరికి 'వసంతం ' కనుల యెదుట సాక్షాత్కరిస్తుంది .అంటే - ఈ కవి కోకిల కాకలీధ్వనితో వైదికవాజ్యయోద్యానానికి వసంతో దయమైన దన్నమాట. వేదవేద్యుడైన ఆ పరంధాముడు శ్రీరాముడుగా అవతరించాడు. పురుషోత్తముడు ఉత్తమపురుషుడై ఉర్విపై ఉద్భవించాడు. నాదాత్మకమైన వేదం రసాత్మకమైన రామాయణ మహాకావ్యంగా ఆవిర్బవించింది. ఆధ్యాత్మికమైన పరతత్వం ఆదర్శ మానవత్వాన్ని అంగీకరించి దివి నుండి భువికి దిగి వచ్చింది.
వేదవేద్యే పరే వుంసి జాతే దశరధాత్మజే,
వేదః ప్రాచేతసాదాసీత్ సాక్షా ద్రామాయణాత్మనా.
అన్నారు పెద్దలు. బ్రహ్మపదవిహరిణియైన వైదికవాణి లౌకిక కవితా కల్యాణియై అవతరించింది. అందుకనే శ్రీనాధమహాకవి వాల్మీకి మహర్షిని బ్రహ్మపదావతీర్ణ కవితాలీలావతి వల్లభు" నిగా సందర్శించి సంస్తుతించాడు.
శ్లోకంబుల్ శతకోటికాండములుగా జోడించి రామాయణం
బెకై కాక్షర మెల్లపాపముల మాయింపంగ నిర్మించి సు
శ్లోకుండైన పురాణసంయమివరున్ జూతున్ మనోవీధి వా
ల్మీకిన్ బ్రహ్మపదావతీర్ణ కవితాలీలావతీ వల్లభున్.
కరుణార్ద్రమైన క్రౌంచవధూ విలాసానికి కరగి నీరైన వాల్మీకి హృదయంలో పెల్లుబికిన శోకమే శ్లోకమై అయన కంఠంలో నుండి ధ్వనించింది. ఆదికవి అంతరంగంలో పొంగిన ఆ కరుణతరంగమే అదికావ్యమై - రసవత్తర రామాయణ మహాకావ్యమై ప్రవహించింది.
క్రౌంచవధూవ్యధా విధుర కంఠవిముక్త విషాదగీతికా
సంచలితాత్ముడౌ ప్రధమసత్క విభాగము పొంగి వెల్లువై
ముంచుకొనేన్ రసజ్జజగమున్, రాఘురామకధాసుధాధారసా
భ్యంచితమై ప్రపంచ 'మహహా" యని మెచ్చిన అదికావ్యమై.
సంస్కృతంలో ఎన్ని రామాయణాలు ఆవిర్భవించినా అన్నిటికీ మూలమైనది "పరం కవీనాం ఆధార" మైనది వాల్మీకి రామాయణమే. అందుకనే అది 'ఆదికావ్య" మనీ వాల్మీకి 'ఆదికవి" అనీ ప్రసిద్ది వచ్చింది.
వాల్మీకి రామాయణానికి ఇంతటి ప్రసిద్ది రావటానికి ప్రధాన కారణం సకల సద్గుణసంపన్నుడు, ఆదర్శమానవుడూ , ఉత్తమనాయకుడూ అయిన శ్రీరామచంద్రుడు నాయకుడు కావటమే. "ఉపశ్లోక్యస్య మహత్మ్య దుజ్జ్వ్లాలాః కావ్య సంపదః" అన్నట్లు ఉత్తమ నాయకమైన కావ్యం దేదీప్యమానంగా ప్రకాశిస్తుంది.
శ్రీరాముని చరిత్రమే ఎందుకు మరల మరల వ్రాయాలి? అనే సందేహానికి సమాధానంగా మురారి మహాకవి తన "అనర్ఘరాఘవం" లో ఈ విధంగా వక్కణించాడు.
యది క్షుణ్ణం పూర్వైరితిః జహాతి రామస్య చరితమ్,
గునై రేతావద్భిః జగతి పునరాన్యో జయతికః
"ప్రాచీనకపు లెందరో శ్రీరాముని చరిత్ర క్షుణ్ణంగా వర్ణించారు. మళ్ళీ మళ్ళీ మనం వర్ణించటం దేని " కని వైముఖ్యం వహించినట్లైతే ఏతాదృశలోకొత్తర గుణోత్తరోదాత్తుడైన కధానాయకుడు మరొక్కడు మనకెక్కడ లభిస్తాడు?
ప్రసన్నరాఘవకర్తయైన జయదేవుడు పై భావాన్నే భంగ్యంతరంలో మరింత చమత్కారంగా చెప్పాడు.
స్వసూక్తీనాం పాత్రం రఘుతిలకమేకం కలయతామ్ ,
కవీనాం కో దోషః సతు గుణాగుణానామవగుణః
కవులు తమ కావ్యాలకు అధినాయకుణ్ణి గా ఆ రఘుకుల తిలకమైన రామచంద్రున్నే ఎన్నుకుంటున్నారంటే అది ఆ శ్రీరాముని యందున్న గుణగణముల దోషమే కాని కవుల దోషం ఏమాత్రం కాదు. లోకంలోని సమస్త సద్గుణాలూ శ్రీభూతమై మరెక్కడా చోటు లేనట్లు ఆ రామున్నీ ఎందుకు ఆశ్రయించాలి? నిర్వచనోత్తరరామాయణంలో తిక్కన మహాకవి -
ఎత్తరినైనను ధీరో
దాత్తనృపోత్తముదు రామధరణీపతి స
ద్వ్రుత్తము సంభావ్యమగుట
నుత్తర రామయణూక్తి యుక్తుడ నైతిన్.
అని ధీలోదాత్తనృపోత్తముడైన రామచంద్రుని చరిత్రం సర్వధా సర్వదా సత్కవులకు సంభావ్యమని నిర్వచించినాడు. ఇక కంకంటి పాపరాజు గారు తన ఉత్తర రామాయణంలో - "రాఘవేశ్వారు చారిత్రము లెంద రెన్ని గతులన్ వర్ణించినంగ్రాలదే" అని ఆత్మవిశ్వాసాన్ని ప్రకటించి "
".......... చారు కవిత్వము నేర్చి జానకీ
జాని కధల్ వచింపక యసత్కాధ లెన్ని రచించే నేనియున్
వాని వివేకమేమిటికీ? వాని కవిత్వామహత్త్వ మేటికిన్?"
అని తన రామాయణ రచనా ప్రవృత్తికి హేతువును ఎలుగెత్తి చాటాడు.
రామాయణం ఆబాలగోపాలానికీ ఆదరప్రాతమైన మహాకావ్యం. అందులో తెలుగు వారికి సీతారాముల ఆరాధ్యదైవాలు. తెలుగుదేశంలో రాముని గుడి లేని గ్రామం లేదు. తెలుగువాడు "శ్రీరామ" చుట్టకుండా ఏ వ్రాతా ప్రారంభించడు. తెలుగు దేశంలోని గోదావరీ తీరం సీతారాముల పవిత్ర పాద పరగాములచే పులకించి పోయింది. అందువల్లనే రామకధ అంటే ఆంధ్రులకు అభిమానం. తెలుగుభాషలో ఉన్నన్ని రామాయణాల మరే భాషలోనూ లేదంటే అతిశయోక్తి అణుమాత్రమూ కాదు. తెలుగు రామాయణాలను గురించి ముచ్చటించుకుందాం.
రంగనాధ రామాయణం (1240)
ఉపలభ్యములైన తెలుగు రామాయణాలన్నింటిలో మొట్ట మొదటిది రంగనాధ రామాయణం. గోన బుద్దారెడ్డి మార్గ - దేశి సంప్రదాయాలను జోడించి ఈ ద్విపద రామాయణాన్ని రచించాడు. కనుకనే ఇది తెలుగు దేశంలో పండితపామరులకు పారాయణ గ్రంధమైంది. దేశికవితారీతిలో రంగ నాధ రామాయణమూ, మార్గ కవితాపద్దతిలో భాస్కర రామాయణమూ అగ్రశ్రేణికి చెందిన ఆంధ్ర రామాయణాలు.
రంగనాధ రామాయణం రచించినది గోన బుద్దారెడ్డి కాదనీ "రంగనాధు" డనే ఎవరో ఒక కవి రచించి తన ప్రభువైన బుద్దారెడ్డి పేరన వెలయింపజేసి ఉంటాడని కొందరు విమర్శకులు అభిప్రాయపడ్డారు.
'అతత కృతి పేర అతిపుణ్యు పేర
మా తండ్రి విట్టలక్ష్మానాధు పేర"
దీనిని రచిస్తున్నానని అవతారికలో స్పష్టంగా బుద్దారెడ్డి పేర్కొన్నాడు. అయితే "బుద్దారెడ్డి రామాయణం" కావాలి కాని రంగనాధ రామాయణ మేమిటని అక్షేపం. బుద్దారెడ్డి తండ్రిగారైన విట్టలక్ష్మానాధుని పూర్తీ పేరు పాండురంగ విట్టలనాధుడై ఉంటుందనీ "నామైకదేశేనామగ్రహణం" న్యాయాన్ని అనుసరించి అందులోని రంగనాధ పదాలు కలిపి తండ్రి పేరు కలిసి వచ్చేటట్లు "రంగనాధ రామాయణం" అన్నాడనీ సమాధానం. అటువంటప్పుడు "పాండురంగ రామాయణం" మనో లేదా "విట్టలనాధ రామాయణ" మనో అనటం సమంజసం కాని అక్కడొక పదం ఇక్కడొక పదం తీసి అతుకుల బొంత చేసి "రంగనాధ రామాయణం" మనటం అసహజంగా ఉందని మళ్ళీ అక్షేపం.