Previous Page Next Page 
డా || వాసిరెడ్డి సీతాదేవి రచనలు - 4 పేజి 5


    "బలేవాడివే. నీ పరీక్షపోయి బాధపడుతున్న వాడివి నన్ను కంగ్రాచ్యులేట్ చెయ్యటానికి రావటం ఏమిటి? ఉదయం పేపరు చూడగానే నేనూ నాన్నగారూ రావాలనుకున్నాం. కానీ నీవు ఎంత బాధపడుతూ ఉంటావో ఊహించిన నేను రాలేకపోయాను. నాన్నగారుకూడా రాత్రికి వెళదాంలేమ్మా అన్నారు."  

 

    "ఆఁ అవును, చంద్రం! పొద్దుటినుంచీ నువ్వు ఇంటికే రాలేదట? మీ అన్నయ్యకు ఒకటే గాబరా. ఫోనులమీద ఫోనులు చేశాడు. మీ వదిన కూడా పాపిష్టిదాన్ని, నేనే తిట్టి చంద్రాన్ని ఇంటినుంచి వెళ్ళగొట్టానని ఏడుస్తున్నదట. ఇంట్లో ఎవరూ అన్నాలు తిన్నట్టులేదు. పద ఇంటికి వెళదాం," అన్నాడు ప్రసాదరావు.

 

    అందరూ నడుస్తున్నారు మౌనంగా. చంద్రం బుర్రలో ఆలోచనలు ముసురుకుంటున్నాయి. వదిన ఏడ్చిందా? వదినకు తనంటే నిజంగా ప్రేమ ఉన్నదన్నమాట!

 

    ఆమెకు తన ప్రేమను ఎలా చూపించాలో తెలియదు. పైకి ఎంత కఠినంగా కనిపించినా ఒకోసారి అంతగా కరిగిపోతుంది.

 

    ప్రసాదరావు చంద్రాన్ని బలవంతంచేసి ముందు తన ఇంటికి తీసుకెళ్ళాడు. భోజనంచేసి ప్రసాదరావు చంద్రాన్ని వెంటబెట్టుకొని వచ్చేప్పటికి కృష్ణారావు వరండాలో ఆదుర్దాగా పచార్లు చేస్తున్నాడు.

 

    తమ్ముడు ఏమయాడో తెలియదు. తను ఇంతవరకూ వెదికాడు కాని, ఎక్కడా కనిపించలేదు. ఏవేవో అపశృతులతో హృదయం కంపించిపోతూంది. కాంతమ్మ కనిపిస్తేనే కళ్ళలో కారం చల్లినట్లుంది - కృష్ణారావుకి. అల్లరి చేస్తున్న రజనికి రెండు తగలనిచ్చాడు. కాంతమ్మ కూడా ఏదో అరిష్టాన్ని ఊహించుకొని భయంతో కుక్కిన పేనులా, బిక్కమొహంతో వంటింటి గడపలోనే కూర్చుండిపోయింది.   

 

    ప్రసాదరావుతో కలిసివస్తున్న చంద్రాన్ని చూడగానే కృష్ణారావుకి ప్రాణం లేచి వచ్చింది. తమను అంత గాబరా పెట్టినందుకు కోపంకూడా రాకపోలేదు. తమాయించుకున్నాడు.

 

    "కృష్ణారావుగారూ! చంద్రం మా ఇంట్లో భోజనం చేశాడు. దిగాలుపడి పార్కులో కూర్చొనుంటే చూసి, ఇంటికి తీసుకెళ్ళి ధైర్యం చెప్పాను. అసలే కుంగిపోతున్నాడు. సున్నిత హృదయం, మరేమీ అనకండి" అన్నాడు ప్రసాదరావు కుర్చీలో కూర్చుంటూ.

 

    "అసలు వాణ్ణి నేనేమయినా అంటేగదా మీరేమయినా అనటానికి? ఏంరా, అలా వెళ్ళేవాడివి మాటమాత్రం చెప్పొద్దూ! ఉదయం నుంచీ మీ వదినా, నేనూ కూడా ఎంత బాధపడిపోతున్నామో ఊహించావా?"  

 

    "వాడి దృష్టిలో మనం రాక్షసులం. మనం తనకోసం ఎందుకు బాధపడతాం?" అంటూ అందుకుంది కాంతమ్మ.

 

    చంద్రం అపరాధిలా తలవంచుకొని నిలబడ్డాడు. కాంతమ్మ రజని ఏడుపువిని లోపలకు వెళ్ళిపోయింది. కృష్ణారావు, ప్రసాదరావు కూర్చుని ఉన్న కుర్చీకి ఎదురుగా కూర్చున్నాడు. అదను చూచుకొని చంద్రం చిన్నగా అక్కడనుంచి కదలాడు.

 

    "చంద్రం! ఇలా వచ్చి కూర్చో" అన్నాడు ప్రసాదరావు.

 

    రెండు అడుగులు ముందుకు వేసిన చంద్రం అలాగే నిలబడిపోయాడు.

 

    "రా! కూర్చో" అన్నాడు కృష్ణారావు. చంద్రం వెళ్ళి అన్న పక్కగా కూర్చున్నాడు.

 

    "పరీక్ష పోయినందుకు చాలా బాధపడుతున్నాడు. ఇక చదువుమాని వ్యాపారంలో దిగమంటారని భయపడుతున్నాడు," అన్నాడు ప్రసాదరావు - చల్లకువచ్చి ముంత దాచటమెందుకు అన్న ధోరణిలో.

 

    "అవునండీ, నేనూ అలాగే అనుకుంటున్నాను. పాసయితే చదివించాలనే అనుకున్నాను. మళ్ళీ ఈ స్కూలు ఫైనల్ ఇంకో సంవత్సరం చదవాలి. అయినా స్వంత వ్యాపారం ఉన్నవాళ్ళకి డిగ్రీ చదువు లెందుకులెండి! ఉద్యోగం చెయ్యాల్సిన అవసరం చంద్రానికి లేదు. నలుగురికి ఉద్యోగం యివ్వగల వ్యాపారం చేతిలో ఉన్నవాళ్ళం. ఇప్పటినుంచే వాణ్ణి వ్యాపారంలో పెడితే మంచిది" అన్నాడు కృష్ణారావు సిగరెట్టు ముట్టించుకొంటూ.  

 

    "నేను ఇంకా చదువుకుంటాను." గొణుగుతూ లోపలికి వెళ్ళాడు చంద్రం.

 

    అలా వెళుతున్న చంద్రంవైపు చూస్తూ సిగరెట్టు పొగ వదులుతున్నాడు కృష్ణారావు.

 

    "చంద్రానికి గురుకుల్ వెళ్ళి చదవాలనివుంది. భారతీయ సంస్కృతినీ, చరిత్రనూ క్షుణ్ణంగా అర్థం చేసుకోవాలనీ, అది ఇంగ్లీషు చదివి సాధించేది కాదనీ చంద్రం అభిప్రాయం. సంస్కృత సాహిత్యాన్ని క్షుణ్ణంగా చదవాలని ఉవ్విళ్ళూరుతున్నాడు. ఇంత చిన్నతనంలో అన్ని నిశితమైన అభిప్రాయాలున్న కుర్రాడి మేథస్సు ఎలాంటిదో ఊహించుకోండి. అతను కల్పించుకున్న ఊహాసౌధాల్ని పడగొట్టకండి. పసిహృదయం గాయపరచకండి గురుకుల్ కు పంపించండి. అక్కడ చాలా నియమాలను పాటించాలి. అవన్నీ నచ్చకపోతే తిరిగి వచ్చేస్తాడు. మీరు మాత్రం పంపించకుండా ఉండి, తరువాత పశ్చాత్తాపపడే పరిస్థితులు కల్పించకండి -" అన్నాడు ప్రసాదరావు.

 

    లోపల ఇష్టం లేకపోయినా చంద్రం సంతోషం కోసం ఒప్పుకున్నాడు కృష్ణారావు. పోనియ్, కొంతకాలం వదినగారి సాధింపులన్నా తగ్గుతాయి అని మనస్సుకు సర్ది చెప్పుకున్నాడు. ఏడు సంవత్సరాలు తమ్ముణ్ణి వదిలి ఉండాలంటే తనకు కష్టంగానే ఉంది. కానీ తనక్కూడా భార్యమధ్యా - తమ్ముడిమధ్యా అడకత్తెరలో పోకలాంటి బ్రతుకు తప్పుతుంది. మళ్ళీ తిరిగివచ్చేప్పటికి చంద్రం ఇరవై రెండు ఏళ్ళవాడు అవుతాడు. పూర్ణ వ్యక్తిత్వంతో వస్తాడు. తమ్ముణ్ణి పాతికేళ్ళ రూపాన్ని ఊహల్లోనే చిత్రించుకున్న కృష్ణారావు ఆనందంతో ఉక్కిరిబిక్కిరి అయాడు.  

 

    ఇంతలో కృష్ణారావు పొగాకు కంపెనీలో పనిచేసే నాగేంద్రం వచ్చి నిలబడ్డాడు.

 

    ప్రసాదరావు -"పొద్దుపోయింది. వస్తా"నంటూ తను వచ్చినపని సవ్యంగా జరిగినందుకు సంతోషంతో చేతికర్ర ఊపుకుంటూ వెళ్ళిపోయాడు.

 

    "ఏం నాగేంద్రం! ఇంత పొద్దుపోయి వచ్చావు?" అడిగాడు కృష్ణారావు.

 

    "ఆ పొగాకు అమ్మిన తాలూకు వెయ్యిరూపాయలు ఇంతకుముందే ఆ ఆసామి తెచ్చి ఇచ్చాడు. నా దగ్గిర ఆ పూరి గుడిసెలో దాచటానికి భయపడి ఇచ్చిపోదామని వచ్చాను బాబుగారూ!" అంటూ రొంటినుంచి రూపాయల కట్టతీసి అందించాడు నాగేంద్రం కృష్ణారావుకు. నోట్లు లెక్కపెట్టాడు. పది వంద రూపాయల నోట్లు.    

 

    చంద్రం రజనిని భుజాలమీద కూర్చోపెట్టుకుని ఆడిస్తూ వరండాలోకి వచ్చాడు.

 

    "బుల్లెమ్మగోరూ! ఇంకా నిద్రపోలా?" అంటూ నాగేంద్రం, చంద్రం దగ్గిరకెళ్ళి రజనిని అందుకోబోయాడు. గళ్ళలుంగీ, ఎర్ర బనీనులోనుంచి నల్లగా బలిసిన శరీరం, నాగేంద్రం రూపం చూసి రజని రెండు చేతులతో బాబాయి మెడను చిట్టివేసి మొహం పక్కకు తిప్పుకుంది.

 

    డబ్బు లెక్క పెట్టుకుని కృష్ణారావు తలెత్తి చంద్రం వైపుచూశాడు. అతని బుర్రలో ఓ ఆలోచన మెరిసింది. చంద్రాన్ని గురుకుల్ పంపించటానికి ఎటూ నిర్ణయించుకున్నాడు. ఈ వెయ్యి రూపాయలు భార్యకు తెలియకుండా అట్టేపెట్టి గప్ చుప్ గా చంద్రాన్ని రైలు ఎక్కించవచ్చును. తనకు ప్రత్యేక దాపరికం లేదు. వచ్చింది వచ్చినట్లు కాంతమ్మ దాపరికంలోనే ఉంటుంది. బ్యాంకులో డబ్బులెక్క వారానికోసారి గుమాస్తా దగ్గిర ఆరాతీస్తుంది. చంద్రాన్ని చదువుకు పంపటానికి ప్రస్తుతం ఓ వెయ్యి రూపాయలన్నా కావాలి. ఆ వెయ్యి రూపాయలు బ్యాంకునించి తియ్యాలంటే భార్య ఓ చిన్న గాలిదూమారం లేపుతుందని తనకు తెలుసు. అదొక్కటే ముఖ్యంగా చంద్రం చదువును గురించి తన భయం. ఇప్పుడు ఆ సమస్యకూడా భగవంతుని దయవల్ల దానంతట అదే తీరిపోయింది. తను పొగాకు అమ్మింది ఆమెకు తెలియదు. అదృష్టవశాత్తు ఇప్పుడు నాగేంద్రం ఈ డబ్బు తెచ్చి ఇవ్వటంకూడా ఆవిడ చూడలేదు. డ్రాయరు సొరుగులాగి డైరీ తీసి అందులో పది పచ్చనోట్లు పెట్టి మళ్ళీ డైరీ సొరుగులోపెట్టి మూశాడు.

 

    బీరువాతీసి పెట్టాలంటే అసలే కాంతమ్మ అనుమానం మనిషి.

 

    నాగేంద్రం కృష్ణారావు దగ్గిర సెలవు తీసుకొని వెళ్ళిపోయాడు. చంద్రం మాత్రం కృష్ణారావు ఎదురుగా నిద్రపోతున్న రజనిని భుజంమీద పడుకోబెట్టుకొని అలాగే నిల్చున్నాడు. అతన్ని చూసి కృష్ణారావుకు తనను ఏదో అడగాలనే నిల్చున్నాడని అర్థం అయింది. తమ్ముడు ఏ విషయం తనను అడగటానికి నిల్చున్నాడోకూడా అర్థం అయింది కృష్ణారావుకు. తన నిర్ణయాన్ని తమ్ముడికి చెప్పాలనుకున్నాడు. ఇంతలోనే లోపలకు వస్తున్న కాంతమ్మను చూసి ఆగిపోయాడు.  

 

    "ఏరా, ఇంకా నిల్చొనే ఉన్నావు? వెళ్ళి పడుకో. రజనిని ఇలా ఇవ్వు" అంటూ తమ్ముడి భుజంమీద నిద్రపోతున్న రజనిని అందుకొని తమ్ముడికి మాట్లాడటానికి అవకాశం యివ్వకుండా తన గదిలోకి గబగబా వెళ్ళిపోయాడు.

 

    తనను చదివిస్తాడో లేదో తేల్చేసుకోవాలని ఎంతో ఆలోచించి ధైర్యం కూడదీసుకొని వచ్చిన చంద్రంకు అసలు విషయం మాట్లాట్టానికి అవకాశం కూడా చిక్కలేదు. రోషం, కోపం పెనవేసుకొని వస్తున్నాయి. ఏమయినా సరే తను చదవాల్సిందే. అన్న డబ్బు ఇస్తేసరి. లేకపోతే ఆ ఇంట్లో ఒక్కక్షణం ఉండకూడదనుకొన్నాడు. ఏదో నిర్ణయానికి వచ్చిన చంద్రం పగలంతా ఎండలో తిండీ తిప్పలూ లేకుండా తిరగాడేమో పక్కమీద మేను వాలుస్తూనే గాఢనిద్రలో మునిగిపోయాడు.

 Previous Page Next Page