"నిజమే!! వెరీగుడ్ !.... ఒరేయ్.... వాసూ .... నేను తాత నవబోతున్నానురా! అంతే .... ఏం కంగారులేదు. ఏం భయంలేదు. ఇదంతా మనవడి గొడవే....."
"ఒరేయ్ పూల్ నరసింహ .....నువ్వోక్కడివేకాదు.... నేనూ తాతనవుతున్నానురా... ఈ సంబరం నీ ఒక్కడిదేకాదు, నాదీనూ...." అన్నారు వాసుదేవరావుగారు, ఆనంద భాష్పాలను నవ్వూతూ, కండువాతో తుడుచుకుంటూ.
"అవునురోయ్.... మరిచేపోయాను.... మనం తాతలమావుతున్నాం.... ఒరేయ్ వాసూ ఈ రోజు మనకి ఎంత సుదినంరా..... నాకెంతో ఆనందంగా వుంది. ఆఁ..... .... డాక్టరుగారూ ....మీరు వారం వారం వచ్చి , మా సుమతిని పరీక్షచేసి వెళ్ళాలి. సుమతి ఆహారవిషయాలూ, మందులు ఏమేమి ఇవ్వాలో, ఎలా ఇవ్వాలో అన్నీ మా ఆవిడతో చెప్పండి."
"అలాగే " నవ్వూతూ డాక్టర్ వెళ్ళిపోయింది. ఉదయం కన్నా రెట్టింపు సంతోషంతో ఒకరితో ఒకరు సరసాలాడుకున్నారు వాసుదేవరావుగారు, నరసింహారావుగారూ, కామాక్ష్మమ్మాగారూను. పడంటి పాపని గురించి ఊహించుకుంటూ పడుకున్న సుమతిని "అమ్మదొంగా ....ఇన్నాళ్ళూ నాకు చెప్పలేదేంటి" అంటూ ముద్దులతో ఉక్కిరిబిక్కిరి చేసేశాడు గోవింద్.
"సర్ ప్రైజ్ చెద్దమనీ__ కళ్ళుతిప్పుతూ అంది సుమతి.
"ఊఁ....గడుసుదానవే...." అంటూ మంచం ఎక్కబోతూన్న గోవింద్ ని చూసి "అత్తయ్యా!" అంది లేచికూర్చుంటూ సుమతి.
"అమ్మాయ్ ....ఈ పళ్ళరసం తాగు" అంటూ లోపలికొచ్చిన కామాక్షమ్మాగారు నువ్వవతిలికెళ్ళరా.... అమ్మాయిని మాట్లాడించకు, విశ్రాంతి తీసుకోనీ" అంది. "సరేఅమ్మా.....జాగ్రత్తగా చూసుకో" అంటూ , అవతలి కొచ్చేశాడు గోవింద్. కొంటెగానవ్వింది గోవింద్ కేసి చూస్తూ సుమతి, ఉడికిస్తూ "బాగయిందిలే" అన్నట్టు. "ఉండు నీ పని చెప్తా" అన్నట్టు చూపుడువేలుతో సైగచేస్తూ, వెళ్ళిపోయాడు గోవింద్.
పళ్ళరసం త్రాగి గ్లాసు ప్రక్కనపెట్టింది సుమతి. "కాస్సేపు నిద్దరపో.... ప్రయాణబడలిక కొంతా ...." అంటూ దుప్పటి కప్పింది కామాక్షమ్మగారు. తల్లిలాంటి ఆమె ప్రేమకి కరిగిపోతూ, హాయిగా నిద్దరపోయింది సుమతి.
కళ్ళుతెరచేసరికి అయిదు దాటింది. సూర్యుడు పడమటింటికి చేరుకున్నాడు. కిటికీప్రక్కనున్న మల్లెతీగ గాలితాకిడికి, పరిమళాలను వెదజల్లింది కాబోలు, గుప్పున పూలవాసన గదిలో కొచ్చింది. మెల్లగాలేచి కూర్చుంది. సుమతి 'ఎవరో వచ్చినట్టున్నారు, మాటలు వినిపిస్తున్నాయ్. కామాక్షమ్మగారు చెబుతోంది.' "మాకోడలి కిప్పుడు నాలుగోనెల, ఇవాళే వచ్చా రిక్కడికి. ప్రయాణంలో బాగా అలసి పోయింది. నిద్దరపోయింది పాపం. మధ్యాహ్నం తిన్నదంతా వాంతయిపోయింది. లేవగానే, కాస్త వేడివేడిగా ఉప్మా పెడదామని చేస్తున్నాను. పుల్లపుల్లగా రుచిగా వుంటుందని, బాగా నిమ్మపండు పిండాను. కాస్తనోట్లో వేసుకో సావిత్రమ్మా...."
వాళ్ళ మాటలు వింటూ ఒక్కనిమిషం అలాగే మంచంమీద కూర్చుంది సుమతి. సావిత్రిమ్మంటే పంక్కిటావిడన్నమాట "కొంచెంపెట్టు కామాక్షక్కా! మేమూ ఇవాళ పొద్దుపోయిభోంచేశాం" అందావిడ.
"అలాగేలే...."
"ఎంతైనా నీలాంటి అత్తగారు దొరకడం, ఆపిల్ల అదృష్టం కామాక్షక్కా" సావిత్రమ్మ గొంతు.
"మా సుమతిలాంటి కోడలు దొరకడం నా అదృష్ట. కూడానూ....అత్తయ్యా .... అత్తయ్యా... అంటూ ఆప్యాయంగా మాట్లాడుతుంది."
"అంతేలే....మనం బావుంటే వాళ్ళు బావుంటారు. వాళ్ళు బావుంటే మనమూ బాగుంటాం. అత్త అత్తలాగకాక అమ్మలాగా వుంటే ఏకోడలుమాత్రం సరిగ్గా వుండదూ? బిడ్డలా చూచుకునే అత్తుంటే కోడలుమాత్రం ఎందుకు సరిగ్గా చూచుకోదూ?" చిన్న ఉపన్యాసం ఇచ్చింది సావిత్రమ్మ.
"నిజమే...."
"నన్నడిగితే కోడళ్ళేనయమేమో ఈ రోజుల్లో మొహమాటానికైనా పెడతారు, చేస్తారు."
"ఏమిటో సావిత్రమ్మా! పెట్టుపోతల మాట అటుంచీ కూతురైనా , కోడలైనా, మనసును పంచుకునేవాళ్లై, మనుషుల్ని కలుపుకునే వాళ్లై వుండాలి. కన్నవారి కష్టాలతో ప్రమేయం లేకుండా ఎంతసేపూ, ఏం దోచుకుపోదామా అనే స్వార్ధపరురాలైన కూతుర్ని, కూతురుకదా అని నెత్తిన పెట్టుకోవడం పోరపాటే స్వపర భేదం లేకుండా, అత్తగారింట్లో అందరికీ తల్లో నాలుకలా మెలిగే కోడల్ని 'కోడలు' అని దూరంగాపెట్టడం పొరపాటే. బందుత్వాన్ని బట్టి ప్రేమల్ని కొలవకుండా మనసుల్నిబట్టి, మంచి తన్నాన్నిబట్టి మనుషుల్ని అంచనా వెయ్యాలి."
"నిజమే. నువ్వుచెప్పింది అక్షరాలా నిజం. 'కూతుర్ని, ఒకరి ఇల్లు ఉద్దరించడానికి పంపేము. కోడల్ని మన ఇల్లు ఉద్దరించుకోవడానికి తెచ్చుకున్నాం ' అనుకుంటే ఏ గోడవావుండదు. కూతురుకోడలూ ఇద్దరూ రెండుకళ్ళలాంటివారు. ఇద్దరూసమానమే. ఇహ వస్తా కామాక్షక్కా.....రేపోస్తాలే.....కోడల్నిచూడ్డానికి పడు. కొనియ్యి పాపం! అలిసిపోయినట్టుంది."
"సరే .....రేపురా...."
వీళ్ళ సంభాషణలోని సంస్కారానికి, ఆశ్చర్యబోయింది సుమతి. "అందుకేనేమో! చదువుకీ, సంస్కారానికీ సంబంధం లేదంటారు. వీళ్ళేం చదువుకున్నారనీ? కానీ, వీళ్ళు చెప్పిన మాటలలో ఎంత సత్యంవుంది. చదువుకున్నవాళ్ళుకూడా, ఆలోచించలేని విధంగా వీళ్ళు ఆలోచిస్తూన్నారు. ఆలోచించడమే గాక, అమలులో పెడుతున్నారు కూడా ..." అంటువంటి ఉత్తమురాలు తనకు అత్తగారైనందుకు, తృప్తిగా నిట్టూర్చింది సుమతి. మెల్లగాలేచి, బద్ధకం తీరేలాగా ఒళ్ళునిరుచుకుని ఇవతలికొచ్చింది.
తండ్రీ మామగారూ ఏదో మాట్లాడుకుంటున్నారు డ్రాయింగ్ రూంలో, గోవింద్ ప్రెండ్స్ తో కాబోలు, ఫోనులో మాట్లాడుతున్నాడు.
"లేచావా?....రాఅమ్మా..... వేడివేడిగా కాస్త ఉప్మా తిందువుగాని" అంటూ ప్లేట్లో ఉప్మా పెట్టి తెచ్చింది కామాక్షమ్మగారు.
"అత్తయ్యా.... పొద్దుటినుంచీ మీరు చాలా శ్రమపడ్డారు. కాస్సేపు రెస్టుతీసుకొండి. రాత్రి వంట నే చేస్తాను" అంది సుమతి ప్లేటందుకుంటూ.
"ఇంకానయం నువ్వు వంటచేస్తావా? అదేం కుదరదు ఇన్నాళ్ళూ అక్కడ ఏం వండుకున్నావో, ఏం తిన్నావో, ఇప్పుడు మాత్రం నా చేతులమీదుగా మీ క్కావలసినది పండి పెడితేనే నాకుతృప్తి అందులోనూ, ఉత్తమనిషివికావాయె. నువ్వేపనీ చెయ్యడానికి వీల్లేదు. చక్కగా స్నానంచేసి, బట్టలు మార్చుకుని , ముస్తాబై కబుర్లు చెప్పుకుంటూ వుండండి. క్షణంలో వుండేస్తా."
"అమ్మా.... ఏమిటమ్మా నువ్వు మరీను నువ్వు కూర్చో సుమతి చేస్తుందిలే....." అన్నాడు గోవింద్ ఫోన్ పెట్టేసి అక్కడికోస్తూ.
"చాల్లేరా.... నీకేమయినా మతిపోయిందా? సుమతి ఉత్తమనిషనుకున్నా వేమిటి? తనేపనీ చెయ్యడానికి వీలులేదు. కావలసినది తినడం విశ్రాంతిగా వుండడం తప్ప."
"ఇలా అయితే వారం తిరగకుండానే ఈ ద్వారబంధాలన్నీ పెద్దవి చేయించవలసోస్తుంది సుమా!"
"ఛీ....పోండి" అంది సుమతి నవ్వుతూ....
అందరూనవ్వేశారు.
"నీళ్ళు పెట్టనండి" అంది పనిమనిషి, సుమతి నుద్దేశించి. పుల్ వాయిల్ చీరమీద ఆకుపచ్చని ప్రింటుపువ్వుల తెల్లజాక్కెట్టూ, తలనిండా విచ్చిన మల్లెలూ, కడిగిన ముత్యంలా వుంది సుమతి. తలోకరూ తలొకమాట తలొక తమాషా చెయ్యడంతో గంటలు నిమిషాల్లా దొర్లిపోయాయి ఆ రోజంతా.
భోజనాలయ్యాక "ఇహ వెళతారా! రేపోస్తాలే" అంటూ లేచారు వాసుదేవరావుగారు.
"పోనీ ఈ రాత్రికి ఇక్కడ వుండిపో రాదురా?"
"లేదు. రేపోస్తాగా."
ఎంత చెప్పినా వుండరన్న సంగతి అందరికీ తెలుసు కనుక ఎవరూ అతన్ని బలవంతం చెయ్యరు. వాసుదేవరావుగారు వెళ్ళిపోయాక, ఎక్కడివాళ్ళు అక్కడ నిద్ర కుపక్రమించారు.
"ఏమండీ!"
"ఊఁ.... చెప్పండీ" అన్నాడు బట్టలు మార్చి నైట్ డ్రస్ వేసుకుంటూ గోవింద్.
"రోజంతా ఎంతోహాయిగా, ఆనందంగా గడిచిపోయింది కదూ! ఇదే హైదరాబాదులో అయితే, ఏంచెయ్యాలో అని ఆలోచించాలి."
"ఇక్కడ దేవిగారికి వి. ఐ. పి. ట్రీటుమెంట్, అక్కదేముందీ?....అందుకనీ...."
"ఆఁ....అదేంకాదు నాన్నగారూ, అత్తయ్యా, మామయ్యా, అయినవాళ్ళందరి సమక్షంలో, కాలం ఇట్టే గడిచిపోతుంది. ఇదంతా వదులుకుని....." ఇంక ఏం చెప్పబోతుందో తెలుసుకున్నాడు గాబోలూ గోవింద్. గబుక్కున లైటార్పేసొచ్చి సుమతికి దగ్గరగా పడుకుని, పెదవులు ముద్దెట్టుకున్నాడు మరి మాట్లాడ్డానికి అవకాశం ఇవ్వకుండా. ఆరోజుకింక ఆ ప్రసక్తి తేవడం ఇష్టంలేక ఊరుకుంది సుమతి.
* * *
చుట్టాలూ స్నేహితులూ రాకపోకలతో నాలుగైదు రోజులు ఇట్టే గడచిపోయాయి. సాయంకాలం టైమున్నప్పుడు ఏ సినిమాకో , బీచికో పోయేవారు. కొడుకూ, కోడలూ వచ్చినప్పటినుంచి కామాక్షమ్మగారికి ఒక్కక్షణం తీరికలేదు. 'తోచదు' అన్నక్షణం రోజులో ఒక్కసారైనా ఆమెకి కలగడంలేదు. పై పెచ్చు "వీళ్లేప్పుడూ ఇలాగే, ఇక్కడే వుండిపోతే బాగుండు" అనుకునేది, ఏ క్షణాన గోవిందు ప్రయాణం కడతాడో అన్న భయంతో వచ్చే పోయే జనం, ఇక్కడ పనెక్కువుంటుందనిచెప్పి, వాసుదేవరావుగారు ఆయమ్మని ఇక్కడికే పంపించేశారు. ఆయమ్మ వీళ్ళ అలవాట్లూ అభిరుచులూ తెలిసిన మనిషవడంవల్ల, ఆమెచేత పండించుకోవడానికి, కామాక్షమ్మకి అభ్యంతరమేమీ లేదు. వంటింటి పనులు ఆయమ్మ చూసుకోవడంవల్ల కోడలూ, తనూ కలసి కబుర్లు చెప్పు కోవడానికీ, షికార్లు తిరగడానికీ కావలసినంత కాలక్షేపం. వాసుదేవ రావుగారు ఒక్క పడుకోవడానికి తప్ప ఇంటి కెళ్ళడం లేదు.