ఇం : (నవ్వుతూ) మీకలా - అనిపించిందా ? కావచ్చు. ఆమెతో మాట్లాడటం నాకు చాలా ఇష్టం.
రచ : ఆమెతో మాట్లాట్టం చాలా ఇష్టమా? కారణం-
ఇం : ఎందుకిష్టం అంటే ఎలా చెప్పడం? బహుశా రోజంతా మాట్లాడే మాటలకు - ఆమెతో మాట్లాడే మాటలకు భేదం వుండటం వల్ల కావచ్చు - బహుశా__
రచ : క్రికెట్ - రాజనీతి -సాహిత్యం -గురించి మాటలు కాదనుకుంటా.
ఇం : కాదు.
రచ : మరి ఏ విషయాలు?
ఇం : ఎన్నోవిషయాలు, నేను - నా గురించి నా స్నేహితుల గురించి మాట్లాడతాను. ఆమె తన కుటుంబ విషయాలు- కాలేజీ విషయాలు - స్నేహితురాండ్ర విషయాలు ఎన్నో మాట్లాడుతుంది.
రచ : ఇంకా?
ఇం : ఇంకా ఏమిటి? నీతో మాట్లాడతాను!
రచ : క్రికెట్ - సినిమా - రాజనీతి-
ఇం : అవే కాదు. ఇంకా ఎన్నో మాట్లాడుకుంటాం. నీ రచనల గురించి-తెలిసిన వ్యక్తులగురించి- భవిష్యత్తుగురించి ఇలా ఎన్నో విషయాలుంటాయి.
రచ : అవును కంగారు - ఎక్సిమో మొదలయిన వాటికి సంబంధించిన విషయాలు.
ఇం : ఇవన్నీ నేను అందరితో మాట్లాడలేదుగా.
రచ : మానసితో మాట్లాగలవుగా?
ఇం : ఆమె పేరు.
రచ : నాకు తెలుసు. ఆమె పేరు మానసి కాదు. నేను ఆమెను మానసి అంటే నీకేమైనా అభ్యంతరమా?
ఇం : (నవ్వి) అభ్యంతరం ఎందుకు? పైగా మానసి అనే పేరు బాగుందికూడా. ఆమె అసలు పేరులో ఇంత అన్యత్వం లేదు.
రచ : అయితే చెప్పు.
ఇం : ఏం చెప్పను?
రచ : నాతో మాట్లాడే విషయాలన్ని ఆమెతో మాట్లాడగలవా?
ఇం : గలను. అన్ని విషయాలు ఎప్పుడో చెప్పేశా- నీతో మాట్లడలేనివి ఎన్నో ఆమెతో మాట్లాడగలను.
రచ : నాతో మాట్లాడలేనివా?
ఇం : మాట్లడలేనివని కాదు....మాట్లాడలేదు. ఎన్నో విషయాలు మాట్లాడుకొంటాం. కొన్ని ముఖ్యమైనవి, కొన్ని అతిసాధారణమైనవి....కాని, ప్రత్యేకంగా చెప్పటానికి ఏమీలేవు.
రచ : మానసి నీ స్నేహితురాలా?
ఇం : స్నేహితురాలా? కావచ్చు. ఆమెతో మాట్లాట్టం నాకు ఎంతో ఇష్టం. ఆమెతో మాట్లాడితే, మనస్సు తేలికగా వుంటుంది. రోజులు (అకస్మాత్తుగా రచయితను చూస్తూ) నీకు అనిపించదూ?
రచ : ఏమని?
ఇం : రోజులు నిరర్ధకంగా గడచిపోతున్నాయని ఒక మహాచక్రం గిరగిర తిరుగుతుందనీ దాంతో పాటు మనమూ తిరుగుతున్నామని ఆనిపించదు.
రచ : ఒకటీ - రెండు - మూడు-
ఒకటీ-రెండు - మూడు- ఒకటి.
ఇం : ఏమంటున్నావ్?
(అంతలో వాద్యనాదం వినిపిస్తుంది. అమల్- ప్రొఫెసర్ రూపంలో ప్రవేశిస్తాడు.)
అమల్ :రోల్ నంబరు థర్టీ ఫోర్.
ఇం : యస్ -సర్.
అమల్ : what ik the specific gravity of iron.
ఇం : Eleven point seven sir (11.7)
(గంట-అమల్ వెళ్ళిపోవటం-విమల్ ప్రవేశం)
విమల్ : రోల్ నంబర్ థర్టీఫోర్.
ఇం : యస్ - సర్.
విమల్ : who was Mazzini ?
ఇం : One of the founder of italy.
(గంట-మ్రోగుతుంది. విమల్ వెళ్ళిపోతాడు. కమల ప్రవేశిస్తాడు.)
కమల్ : రోల్ నంబరు థర్టీ ఫోర్.
ఇం : యస్ - సర్.
కమల్ : భారతీయుల వైరాగ్యభావం యొక్క ప్రభావం ప్రాచీన సాహిత్యం మీద ఎంతవరకు పడింది?
ఇం : భారతీయ సాహిత్యంలో కన్పించే అనవసర ప్రసంగాలన్నీ- భారతీయుల వైరాగ్యానికి ప్రతీకలు. అనవసర వర్ణనలు - తత్వచింతన- అర్ధంలేని పిట్టకథలు - ఇవన్నీ సాహిత్య ప్రవాహానికి అడ్డంకులే.
[కమల్ మధ్యలోనే వెళ్ళిపోతాడు. వాద్యనాదంలో ఇంద్రజిత్ కంఠం వినిపిస్తూ వుంటుంది. యువకుడుగా- అమల్ ప్రవేశం.]
అమల్ : ఇంద్రా! నా ప్రాక్సీ ఇచ్చేయ్. నేను సినిమాకు వెళ్ళాలి.
ఇం : అలాగే.
(అమల్ నిష్ర్కమిస్తాడు. విమల్ ప్రవేశం.)
విమల్ : శనివారం నీ కెమిస్ట్రీ నోట్సు యిస్తావా ఇంద్రా-?
ఇం : అలాగే, తీసుకో.
[విమల్ నిష్ర్కమణ - కమల్ ప్రవేశం.]
కమల్ : నీ దగ్గర ఒక రూపాయివుందా? మళ్ళీ సోమవారం ఇచ్చేస్తాను.
ఇం : ఇవ్వాళలేదు. కావాలంటే రేపు ఇస్తాను.
[కమల్ వెళ్ళిపోతాడు-పిన్ని వస్తుంది]
పిన్ని : భోజనం వడ్డించనా ?
ఇం : కాసేపు ఉండమ్మా.
పిన్ని : ఇంకెంతసేపు ఎదురుచూడమంటావురా. తేనేస్తే పని తీరిపోతుందిగా/
[పిన్ని వెళ్ళిపోతుంది. వాద్యసంగీతం పెద్దగా వినిపిస్తుంది.]
[తొమ్మిది-ఎనిమిది-ఏడు-ఆరు-ఐదు-నాలుగు-మూడు రెండు-ఒకటి. ఆగిపోతుంది సంగీతం.]
ఇం : మనం అందరం గిర్రున తిరుగుతున్నాం -తిరిగి పోతున్నాం.
పిన్ని : (నేపథ్యంలోనుంచి) "ఇంద్రా!"
ఇం : ఆఁ వస్తున్నానమ్మా!
[ఇంద్ర నిష్ర్కమణ -పిన్ని ప్రవేశం.]
పిన్ని : నువ్వు భోంచెయ్యవు?
రచ : చెయ్యను.
[పిన్ని వెళుతుంది-మానసి ప్రవేశం.]
మానసి : రాశావా కవీ ?
రచ : లేదు.
(మానసి వెళ్ళిపోతుంది)
రచ : ఒకటి - రెండు - మూడు. అమల్ - విమల్ - ఏవం- ఇంద్రజిత్ - ఏవం - మనసి - ఇంటినుండి స్కూలుకు- స్కూకునుండి కాలేజీకి. కాలేజీనుండి ప్రపంచానికి- అందరూ పెద్దవాళ్ళవుతున్నారు. తిరుగుతున్నారు. ఒకటి - రెండు - మూడు- రెండు- ఒకటి- అమల్ - విమల్- కమల్ - ఏవం ఇంద్రజిత్.