అమల్ : చూశారా?
విమల్ : ఈ మధ్య ఇంద్ర మారటానికి కారణం ఇప్పుడు అర్ధమయింది.
కమల్: sinking, sinking, drinking water. ఓ కవి పుంగవా- తిలకించావా?
రచ: తిలకించాను.
అమల్: ఏమర్ధమయింది?
రచ: నాటకానికి స్త్రీ పాత్ర దొరికిందని.
విమల్: ఇంద్రను హీరోను - మమ్మల్ని - సిపాయిల్ని గా చిత్రించు.
కమల్: హీరోయిన్ ఎవరో, చెప్పగలవా?
అమల్: నాకేం తెలుసు! ఇంద్ర ఎప్పుడైనా చెప్పాడా?
విమల్ : గంభీరమైనవాడు.
కమల్:గంభీర్యంకాదు గర్వం. తనేదో గొప్పవాణ్ణి అనుకొంటున్నాడు. నేను యిలాంటి వాళ్ళలోగల నరనరం తెలుసుకోగలను.
అమల్ : కవీ! నువ్వేరుగుదువా?
రచ : ఎవర్నీ ?
అమల్ : నీ నాటకంలోని హీరోయిన్ని, మూడ్ లో పడిపోయావా ఏమిటి?
రచ : ఆమెపేరు మానసి.
కమల్ : చూశావా! కవికి తెలుసు. బహుశా ఇంద్ర పరిచయం చేసివుంటాడు.
రచ: కాదు.
అమల్ : ఏమయ్యా! కవీ! మమ్మల్ని బోల్తా కొట్టేస్తున్నావా?
రచ : నన్ను నమ్ము. నేను ఆమెను మొదటిసారిగా ఇప్పుడే చూశాను.
విమల్ : సరేలే ! ఇంద్ర నీకేం చెప్పాడు, చెప్పుదూ!
రచ: నాకేం చెప్పలేదు.....
కమల్ : నమ్మమంటావ్ - ఆమెను మొదటిసారి చూశావు. ఇంద్ర యేమీ చెప్పలేదు. కానీ ఆమెపేరు మానసి అని, నీకు తెలుసు!
అమల్ : ఈ కవి జాతితో వచ్చిన చిక్కే యిదిరా బాబూ. కవి ఎప్పుడు కవిత్వం రాస్తాడో, ఎప్పుడు ఆరోహ్యమ్గా వుంటాడో ఆ భగవంతుడికే తెలుసు.
రచ: నాటకం పేరు ఏం పెట్టమంటారు?
విమల్ : మొదటే పేరు పెట్టాలా?
కమల్ : పేరు వుండాల్సింది మొదటేగా? నువ్వే చెప్పు నామకరణం చెయ్యటంలో, నేర్పరివిగా?
రచ: అమల్, విమల్, కమల్ ఇంద్రజిత్, మానసి అనే పేరు పెడదామనుకొంటున్నాను.
అమల్: అయ్యబాబో! అట్ట సరిపోతుందా?
విమల్: మమ్మల్నెందుకయ్యా లాగుతావు. మేము నీ నాటకంలో దృతసైనికులం మాత్రమే.
కమల్: నిజమే! "ఇంద్రజిత్ - మానసి" అనిపెట్టు ఇకపదండి టైం అయింది.
అమల్: ఎక్కడికి?
విమల్: కమల్! టీ, తాగిస్తావా?
కమల్: అలాగే, పదండి.
(ముగ్గురూ వెళ్ళిపోతారు.)
రచ:"ఇంద్రజిత్ - మానసి."
"ఇంద్రజిత్ - మానసి"
(ప్రేక్షకులనుద్దేశించి మాట్లాడుతాడు.)
మానసి-ఇంద్రజిత్ లను తీసుకొని అనేకదేశాల్లో అనేక యుగాలగా, నాటకాలు తాయబడినవని మీకు తెలుసు. పౌరాణికాలు, చారిత్రకాలు, సాంఘికాలు, సుఖాంత -దుఃఖాంత నాటకాలు ఎన్ని రూపాల్లో- ఎన్ని పేర్లతో - ఎన్ని అంతస్తుల్లో-ఇంద్రజిత్-మానసీలు జన్మించారో-ప్రేమించారో -చెప్పలేం. సంయోగ వియోగం - సుఖదుఃఖాలు- ఈర్ష్యాద్వేషాలు సాంఘిక ఒడుదుడుకుల్ని, చూపిస్తూ-వీళ్ళను గురించి ఎన్ని నాటకాలు రచించబడ్డాయో చెప్పలేం. ఇంద్రజిత్- మానసి వీరిద్దరి ప్రేమ, నాటకాలకు చిరంతనమైన ఇతివృత్తం.
"ఇంద్రజిత్"(అని పిలచును)
(ఇంద్రజిత్ ప్రవేశం.)
ఇం : ఏమయింది? ఎందుకలా, కేకలేస్తావ్?
(రచయిత నాటకం ధోరణిలో మాట్లాడిన తర్వాత- ఇంద్రజిత్ స్వరం తమాషాగా వినిపిస్తుంది. అయినా- రచయిత యింకా నాటక ఫక్కీలోనే మాట్లాడుతాడు.)
రచ : చెప్పు?
ఇం : ఏం చెప్పను?
రచ : నీ కథ చెప్పు. అతి పురాతనమైన నిత్యనూతనమైన నీకథ చెప్పు. మహాభారత యుగంనుండి ప్రారంభించు.
ఇం : కవిత్వంలో మాట్లాట్టం మానేసి, ఆ అడిగేదేదో సరిగ్గా అడుగు.
(రచయిత ఆవేశం-కొంత చల్లబడుతుంది.)
రచ : నువ్వు-నీ మానసిని గురించిన కథ-
ఇం : మానసీ! మానసి ఎవరు?
రచ : ఆ రోజు బజారులో ఒక అమ్మాయితో నీవు వెళ్ళలేదు.
ఇం : చూశావూ. అయినా, ఆ అమ్మాయి పేరు మానసి కాదే- ఆమె పేరు.....
రచ : ఆమె పేరు నాకు అక్కరలేదు. నేను ఆమెకు మానసి అని పేరు పెట్టాను.
ఇం : నువ్వు ఆ అమ్మాయికి పేరు పెట్టడం, ఏమిటి వాళ్ళమ్మా -నాన్నా -ఆ అమ్మాయికి.....
రచ : అమ్మా-నాన్నా -ఏ పేరు పెడితేనేంలే చెప్పు.
ఇం : ఏం చెప్పను?
రచ : మీ ఇద్దరిని గురించి. ఆమె నీకు ఏమవుతుంది?
ఇం : చెల్లెలు!
రచ : చెల్లెలా? (కొంచెం ఆగును)
ఇం : అవును - మా పిన్నికూతురు.
రచ : పిన్ని కూతురా ? ఎందుకూ ?
ఇం : ఎందుకేమిటి? ఆమె తల్లి నాకు పిన్ని గనుక!
రచ : అలా కావటానికి వీల్లేదు. అయితే నీతో ఎందుకు వుంది ?
ఇం : మా ఇంటికి వచ్చింది. ఆమెను పంపటానికి బయలుదేరాను. ఎప్పుడూ నేనే పంపిస్తాను.
రచ : అయితే...అయితే...ఆమెపేరు మానసి కాదంటావు.
ఇం : చెప్పానుగా - కాదని.
రచ : మీ ఇద్దరూ ఏదో మాట్లాడుకుంటున్నట్లు అనిపించింది.
ఇం : అవును, మాట్లాడుకొంటూనే వున్నాం.
రచ : చాలా ఆత్మీయతతో మాట్లాడుతున్నట్లు చూశాను.