Previous Page Next Page 
సంధియుగంలో స్త్రీ పేజి 5


                                ఉద్యోగంలో - స్త్రీ
    ఉద్యోగాలు చేసే స్త్రీలు ఆదివారం కొరకు ఎదురు చూస్తారు. పనిచేసే రోజుల్లో చెయ్యలేని పనుల్ని ఎన్నింటినో ఆదివారానికి పోస్టు పోను చేసుకుంటూ వారం అంతా గడుపుతారు. కాని ఆదివారం రోజు తీరిక బొత్తిగా ఉండదు.    
    స్నేహితులూ బంధువులు, తెలిసిన వాళ్ళూ, ఎవరో ఒకరు రోజంతా వస్తూ పోతూ ఉంటారు. "ఆదివారం గదా! ఇవాళ్ళయితే ఇంట్లో ఉంటారని వచ్చాం!" అంటారు. అది విని ఒక వెధవ నవ్వు నవ్వి సంతోషాన్ని వ్యక్తపరుస్తాం. నా పరిస్థితి కూడా దాదాపు అలాగే ఉంటుంది.
    ఆ రోజు ఆదివారం. నిద్రలేచాడో లేదో తలుపు ఎవరో దబదబబాదుతున్నారు. "మొదలైంది": గొణుక్కుంటూ వెళ్ళి తలుపు తీశాను. ఎదురుగా ఒక యువతి నిల్చొని ఉన్నది: బాగా పరిచయం ఉన్న ముఖమే అయినా ఒక్కక్షణం ఆలోచించాల్సి వచ్చింది. ఆమె చంకలో నెలల పిల్ల ఉన్నది. దాదాపు మూడేళ్ళ వయసుగల మరోపిల్ల బొటనవేలు చీకుతూ, తల్లిచీరెకుచ్చెళ్ళు పట్టుకొని, తలెత్తినా ముఖంలోకి బెదురుగా చూస్తూ నిల్చుని ఉన్నది.
    "గుర్తు పట్టలేదా?"
    "అయ్యో గుర్తుపట్టకేం! రా! లోపలకు. నీ పిల్లలా?" అంటూ చంద్రకళను లోపలకు ఆహ్వానించాను. ఏమిటి ఇలా అయిపోయింది? అంత అందం ఏమైంది? చంద్రకళ ముఖంలో చూస్తూ ఆలోచనలో పడ్డాను.
    మూడేళ్ళ క్రితం చంద్రకళ రోజూ బస్ స్టాండులో కన్పించేది. చీఫ్ ఇంజనీర్ ఆఫీసులో పనిచేస్తూ ఉండేది. అందంగా, ఆరోగ్యంగా, ఉత్సాహంగా ఉండేది. చంద్రకళ బి.ఏ. పాసయింది. తండ్రి చిన్నతనంలోనే పోయాడు. తల్లి నర్స్ గా పనిచేస్తున్నది. చంద్రకళనూ మరో ముగ్గురు సంతానాన్ని ఆమె రెక్కల కష్టం మీద పెంచుతున్నది. చంద్రకళ చేతికి అంది వచ్చింది. సంపాదిస్తున్నది.
    ఆ తల్లికి కొంచెం వూపిరి సలిపినట్లుగా ఉన్నది. రెండో వాడూ, మూడో పిల్లా కూడా కాలేజీలో చదువుతున్నారు. ఆఖరువాడు స్కూల్లో చదువుతున్నాడు. ఈ పరిస్థితుల్లో ఆ తల్లి సంపాదిస్తున్న కూతురి వివాహం గురించి ఆలోచించుకోలేకపోతున్నది. చంద్రకళకు పెళ్ళిచేసుకోవాలని ఉన్నది.
    క్రమంగా చంద్రకళకు తల్లి మీద కోపం పెరిగింది. ఒకసారి నాతో తల్లి మీద ఫిర్యాదు చేసింది. స్వార్థపరురాలని కన్నతల్లిని నిందించింది. నాకు ఏం మాట్లాడాలో తెలియలేదు. ఆ అమ్మాయికి వివాహం చేసుకోవాలన్న కోరిక. ఆ వయసులో కలగడం సహజమే. ఇక తల్లి విషయం, ఇంకా ముగ్గురు పిల్లలు చదువుతున్నారు. తన సంపాదనకు తోడు కూతురి సంపాదన కూడా ఉంటే వేన్నీళ్ళకు చన్నీళ్ళు ప్రాయంగా సంసార బరువును చేతికి అందివచ్చిన కూతురి భుజాల మీద వెయ్యాలనుకోవడమూ న్యాయంగానే ఉన్నది.
    తల్లి ఆలోచనలో స్వార్థమే ఉందో లేక నిస్సహాయతే ఉందో ఆలోచించే అవగాహన చంద్రకళకు లేదు. తల్లి మీద కసి పెంచుకున్నది. అందుబాటులో ఉన్న యువకుడ్ని ప్రేమించింది. పెళ్ళి చేసుకున్నది. పెళ్ళికి నన్ను ఆహ్వానించింది. వివాహం అయిన చంద్రకళను మొదటిసారిగా ఆ రోజే చూశాను.  
    "ఏమిటి చంద్రా! అలా ఉన్నావ్?" అన్నాను. చంద్రకళ కళ్ళలో ఏదో దిగులు కన్పించింది. ఆ అమ్మాయి చెప్పిన కథ ఇది.
    ఆ అమ్మాయి భర్త తల్లిదండ్రుల మాటకు జవదాటడు. చంద్రకళ సంపాదన చూచి పెళ్ళిచేసుకున్నాడట. పెళ్ళయినప్పటి నుండీ జీతం అంతా తీసుకొని, రోజూ బస్ ఛార్జీలకు బొటాబొటిగా డబ్బులు ఇస్తాడట. పైగా అతనికి అనుమానం ఎక్కువట. ఆఫీసులో కొంచెం ఆలస్యమయినా బస్ అందక ఆలస్యంగా ఇంటికి వచ్చినా లక్ష ప్రశ్నలు వేస్తాడట. పైగా నీ సంపాదన చూసి చేసుకున్నాను.  అంతేగాని నీ అందచందాలు చూసి కాదు అంటాడట. తన తమ్ముళ్ళుగానీ, చెల్లెలు గానీ చూడటానికి వస్తే ఇంట్లో కాఫీ ఇచ్చే స్వతంత్రం కూడా తనకు లేదట. చివరకు విసుగెత్తి పిల్లల్ని తీసుకొని పుట్టింటికి వచ్చేసిందట.  
    "నెలకు నాలుగు వందల ఏభై సంపాదిస్తున్నాను. ఒక్క రూపాయి లెక్క చెప్పకుండా ఖర్చు పెట్టుకునే స్వతంత్రం నాకు లేదు. పైగా రోజూ సాధింపులు. అందుకే పిల్లల్ని తీసుకొని వచ్చేశాను కాని అమ్మకు నేను ఇక్కడ ఉండటం ఇష్టం లేదు. పెళ్ళి చేసుకున్నాక కష్టమో నిష్టూరమో భర్తతో ఉండాలంటుంది. పైగా నిన్ననే ఆయన లాయర్ నోటీసు పంపించాడు. వెంటనే వెళ్ళాలట. లేకపోతే విడాకులు తీసుకుంటాడటా. అప్పటి నుంచీ అమ్మ ఒకటే సాధింపు." దాదాపు ఏడుస్తూనే అన్నది.
    "ఇష్టం లేని కాపురం చేసేకంటే విడాకులు తీసుకోవడమే మంచిదేమో?" అన్నాను నేను. చంద్రకళ ఒక్క క్షణం ఆలోచించింది. "నాకూ అలాగే ఉన్నది నేను సంపాదించుకుంటున్నాను. నా బిడ్డల్ని నేను పెంచుకోగలను. కాని కోర్టు పిల్లల్ని తండ్రికే ఇప్పిస్తుందటగా? ఆయన లాయరు నోటీసులో వెంటనే పిల్లల్ని తెచ్చి అప్పగించవలసిందిగా కూడా రాయించాడు. పిల్లల్ని వదిలి నేను ఉండలేను. పిల్లల్ని తల్లి నుంచి వేరు చెయ్యడం ఏం న్యాయం? మీలాంటి వాళ్ళు ఆడవాళ్ళు చదువుకోవాలంటారు. ఆర్ధిక స్వాతంత్ర్యం ఉంటే బానిసత్వం నుంచి విముక్తి కలుగుతుందంటారు. ఏదీ? ఎక్కడుంది ఆ విముక్తి? పెళ్ళికాక ముందు మా అమ్మ నా జీతం కోసం ఎదురు చూసేది. పెళ్ళయాక భర్త ఎదురు చూస్తున్నాడు.
    చదువుకొని ఉద్యోగాలు చేసే ఆడవాళ్ళకంటే చదువు లేకుండా భర్త సంపాదన మీద ఆధారపడి బతికే ఆడవాళ్ళే సుఖంగా ఉన్నారు. ఆడదానికి ఈ చదువులు ఎందుకూ? ఈ ఉద్యోగాలు ఎందుకూ?"
    చంద్రకళ ఉద్రేకంగా అన్నది.
    "భర్త సంపాదన మీద బ్రతికే వాళ్ళు సుఖంగా ఉన్నారా? ఎందుకలా అనుకుంటున్నావ్? వాళ్ళు ఎన్ని అనుమానాలనైనా భరించి గడపదాటరు. అందుకేనా? నీకు సంపాదన ఉన్నది. అందుకే ధైర్యంగా ఇంట్లో నుంచి బయటకి నడిచావ్. నీకు జరుగుతున్న అన్యాయాన్ని గురించి ఆలోచిస్తున్నావ్? చర్చిస్తున్నావ్!"   
    "అందువల్ల ప్రయోజనం ఏమిటండీ? నా ప్రశ్నకు పరిష్కారం ఏమిటి? పిల్లల్ని వదిలి ఉండలేను. పిల్లలకోసమైనా అవమానాలను భరించి ఆయన దగ్గిరకే వెళ్ళిపోతాను వస్తాను" అంటూ చంద్రకళ వెళ్ళిపోయింది.    
    నేను ఆమె వెళ్ళిన వైపే చూస్తూ ఆలోచిస్తూ ఉండిపోయాను.
    అవును! చంద్రకళ ప్రశ్నలకు సమాధానాలు ఏమిటి? ఆమె సమస్యకు పరిష్కారం ఏమిటి? సంపాదిస్తున్నదే కాని నిజమైన ఆర్ధిక స్వాతంత్ర్యం ఆమెకు లేదు. ఈనాడు సంపాదిస్తున్న ఆడపిల్లలకు పెళ్ళిళ్ళు చెయ్యడానికి అనేకమంది తల్లిదండ్రులు ఇష్టపడడం లేదని చాలామందికి తెలుసు. ఇది అన్యాయం అని అందరూ అనేదే. ఈ సమస్య మీరు నవలలూ, వ్యాసాలు అనేకం వస్తున్నాయి. ఆడపిల్లల మీద జాలికలిగే ఇలా రాస్తున్నారు. కానీ వారెవరూ శాస్త్రీయ దృక్పథంతో ఇలా జరగడానికి గల కారణాలను అర్థం చేసుకొని చర్చించడం లేదు. ఇలాంటి దోపిడీకి కారణం ఈ ఆర్ధిక వ్యవస్తేననే విషయాన్ని వదిలేస్తున్నారు.
    భర్తకు ఉద్యోగం లేకపోతే.... స్త్రీలు ఎందరో ఈనాడు వంటింటి ఖైదు నుంచి బయటపడి ఉద్యోగాలు చేస్తున్నారు పెద్ద పెద్ద డిగ్రీలు సంపాదిస్తున్నారు. అన్ని రంగాల్లోనూ పురుషులతో భుజం కలిపి సమానంగా ముందుకు నడుస్తున్నారు. ఎన్నో సంస్కరణలు చేస్తున్నారు. ఇంకా ఏం స్వతంత్రం కావాలి? అని ప్రశ్నిస్తున్నారు ఈనాడు అనేకమంది ఇలా అనేవారు ఒకనాటి స్త్రీని దృష్టిలో పెట్టుకుని అంటున్నారే కాని, ఈ మారిన కాలంలో స్త్రీ ఎదుర్కొంటున్న సమస్యల్ని నూతన కోణం నుంచి ఆలోచించటం లేదు.
    ఈనాటి సమస్యలను గురించి స్త్రీలు స్వతంత్రంగా ఆలోచించగలుగుతున్నారా? తరతరాలుగా నరాలలో జీర్ణించుకున్న సంప్రదాయక విలువలనూ, మూఢ నమ్మకాలనూ అవసరమైనప్పుడైనా ఎదిరించి నిలబడడానికి ప్రయత్నిస్తున్నారా? వారి చదువులూ, ఆర్జించిన విజ్ఞానం స్త్రీలను మానసిక బానిసత్వం నుంచి విముక్తుల్ని చేస్తున్నాయా?    
    భర్త అంటే భరించేవాడు అని అర్థం. భార్య అంటే భరించబడేది అని అర్థం. చిత్రం ఏమిటంటే మరే దేశంలోనూ 'భర్త' అనే శబ్దానికి ఇలాంటి అర్థం లేదు.
    ఇటువంటి సంస్కారం వంటబట్టిన మనదేశంలో భర్తకు ఉద్యోగం లేకపోగా భార్య ఉద్యోగం చేస్తున్నట్టయితే ఆ ఇల్లు ఒక నరకమే అవుతున్నది. ఆ భార్యకు ఆ భర్త న్యూసెన్సుగా తయారవుతున్నాడు. భార్య కూడా ఉద్యోగం మానేస్తే సంసారం గడవదు. అందుకే కిక్కురుమనకుండా ఉంటాడు. కాని అతనిలో ఇన్ఫీరియారిటీ కాంప్లెక్సు ప్రారంభం అవుతుంది. భార్య ఏది మాట్లాడినా పెడర్థాలు స్ఫురిస్తాయి. ఆ భార్య కూడా భర్త దగ్గిర అతి జాగరూకతతో మెలగాల్సి వస్తుంది.              

 Previous Page Next Page