Previous Page Next Page 
సంధియుగంలో స్త్రీ పేజి 6


    ఆమె చనువుగా ఏది మాట్లాడినా అందులో అతనికి అహంకారమే కనిపిస్తుంది. ఈ విధంగా ఇద్దరి మధ్యా అగాధం ఏర్పడుతుంది. ఇది పురుష ప్రపంచం. పురుషుడిలో తాను అధికుడను అనే భావం తరతరాల నుంచి వచ్చింది. స్త్రీ కూడా పురుషుణ్ణి అధికుడిగానే చూస్తున్నది. అందువల్లనే ఉద్యోగం చేస్తున్న స్త్రీకి ఉద్యోగం లేని భర్త పెద్ద సమస్యగా తయారవుతున్నాడు. ఎంత సంస్కారం గల పురుషుడైనా ఈ కాంప్లెక్సు నుంచి బయటపడలేకపోతున్నాడు.
    కామేశ్వరిని చూస్తుంటే జాలి వెయ్యదు. నాకు కోపం వస్తుంది. ఆమె ఉద్యోగం కోసం ఒకరోజు తల్లిని వెంటబెట్టుకుని మండుటెండలో నా దగ్గిరకు వచ్చింది. అంత ఎండలోనూ పదినెలల కొడుకుని ఎత్తుకుని వచ్చింది. ఎంతోదూరం నడిచి జీవితంలో విసిగిపోయి బాటసారిలా కనిపించింది. ఆమెకు నిండా పాతిక సంవత్సరాలు లేవు.
    కామేశ్వరి ఎం.ఏ. పాసయింది. రెండేళ్ళ క్రితం వివాహం జరిగింది. ఎం.ఎస్.సి. చదివిన అబ్బాయికి పాతిక వేల కట్నంతోపాటు ఎం.ఏ. చదివిన అమ్మాయిని కట్టబెట్టి తల్లిదండ్రులు సంతృప్తిగా నిట్టూర్పు విడిచారు. ఆ అబ్బాయికి ఉద్యోగం లేదు. అయినా ఎం.ఎస్.సి. చదివిన మొగుడు, పాతిక వేలకు, అంత కారు చౌకగా దొరకడం మాటలు కాదు.
    కామేశ్వరికి వివాహం విషయంలో తనదంటూ ఒక ప్రత్యేక ఆలోచన లేదు. తలవంచుకుని, సిగ్గుపడుతూ, మంగళవాద్యాలు మోగుతుండగా, మంత్రోచ్చారణ జరుగుతుండగా, అగ్నిసాక్షిగా మెళ్లో మంగళసూత్రం కట్టించుకున్నది.
    "మంగళసూత్రం ఆడదాని మనుగడకు చిహ్నం. దానివల్ల స్త్రీకి సమాజంలో గౌరవం. ఒక స్థానం యేర్పడతాయి. మొగుడు అనేవాడు ఉండాలి. వాడు ఎలాంటి వాడైనా ఫరవాలేదు. స్త్రీ తన మాంగల్యాన్ని కాపాడుకోవాలి. దానిచాటున బతుకును సాగించాలి." ఈనాడు చదువుకున్న స్త్రీ కూడా ఈ సూత్రాలను అధిగమించి ఆలోచించలేకపోతున్నది. ఎవరైనా ఒకరిద్దరు ఆలోచించి ఎదురు తిరిగితే, వారిని సమాజం చిన్నచూపు చూస్తున్నది.
    కామేశ్వరి భర్త బీదకుటుంబం నుంచి వచ్చినవాడే. అతనికి ఇచ్చిన పాతికవేల కట్నంతో అతని చెల్లెలి పెళ్ళి చేశారు. ఆ చెల్లెలి భర్త కూడా బహుశా ఆ కట్నంతో తన చెల్లెలి పెళ్ళిచేసి వుంటాడు. వివాహం అయి రెండేళ్లు అయింది.
    అతనికి ఇంకా ఉద్యోగం దొరకలేదు. కామేశ్వారికి ఒక ఆఫీసులో (హైదరాబాద్ లో) యల్.డి.సి. (గుమస్తా) ఉద్యోగం దొరికింది. అది తాత్కాలిక (టెంపరరీ) ఉద్యోగం. చిన్న వాటా అద్దెకు తీసుకుని కాపురం పెట్టారు. కామేశ్వరి తల్లిదండ్రులు కొత్త కాపురానికి అవసరమైన హంగులు ఏర్పాటు చేసి వెళ్ళారు.
    భార్య ఉద్యోగం చేస్తున్నది. భర్తకు ఉద్యోగం లేదు. ప్రయత్నం చెయ్యడు. బయటికి వెళ్ళడు. పదిమందిలో కలిసిపోయే చొరవ లేదు. భార్య ఆఫీసుకు వెళుతుంది. భర్త ఇంట్లోనే ఉంటాడు. ఏమి తోచదు. వంటింటిలోని డబ్బాలు వెతుకుతూ, కూరగిన్నెల మీద మూతలు తీసి చూస్తూ ఉంటాడు తినడానికి దొరుకుతుందేమోనని. చిరుతిండి దొరకని రోజు ఆఫీసు నుంచి వచ్చిన భార్యను సాధించడం ప్రారంభిస్తాడు.  
    మార్కెట్ పని కూడా ఆమె చూసుకోవాలి. మహా సోమరిగా తయారయ్యాడు. పైగా సాధింపు ఒకటి. కామేశ్వరి కిక్కురుమనకుండా భరిస్తున్నది. ఎప్పుడైనా మరీ విసుగ్గా ఉన్నప్పుడు సమాధానం ఇస్తుంది. అతను కోపగించుకుని వెళ్ళిపోతాడు.  వెళ్ళిపోయిన వాడు ఊరికే ఉండడు. రోజుకు ఒక ఉత్తరం సాధిస్తూ రాస్తాడు.
    "ఫలానా రోజు సున్ని ఉండలు చెయ్యమంటే జంతికలు చేశావు. ఆ రోజు కావాలనే పప్పుచారులో ఉప్పు ఎక్కువ వేశావు. నీకు అహంకారం ఎక్కువైంది. సంపాదనపరురాలిని అనే గర్వంతో భర్తను చిన్నచూపు చూస్తున్నావు" అంటూ ఏమేమో రాస్తాడు. కామేశ్వరి తల్లిదండ్రులు లబలబలాడుతూ వెళ్ళి అల్లుణ్ణి బతిమిలాడి అలకతీర్చి తీసుకుని కామేశ్వరికి అప్పగించి ఆమెకు నీతులు బోధించి వెళ్ళిపోతారు.
    సర్వీస్ కమీషన్ కండిడేట్ రావడంవల్ల కామేశ్వరి ఉద్యోగం పోయింది. ఉద్యోగ ప్రయత్నాలు చెయ్యమని కామేశ్వరి భర్తతో అన్నది. అతను తల్లిదండ్రుల దగ్గరకు వెళ్ళిపోయాడు. ఆ పిల్ల పసిపిల్ల వాడిని చంకన వేసుకుని ఉద్యోగం కోసం హైదరాబాద్ ఆఫీసుల చుట్టూ తిరుగుతున్నది. నాకు అమ్మాయిని చూడగానే గుండెలు పిండినట్టు అయింది.
    జాలికి బదులుగా కోపం వచ్చింది.
    "నా బిడ్డ బతుకు ఇలా అవుతుందని అనుకోలేదు" కామేశ్వరి తల్లి దాదాపు ఏడుస్తూనే అన్నది.
    "మీరు చేతులారా చేశారు. అసలు కామేశ్వరికి చదువు ఎందుకు చెప్పించారు?" అన్నాను.
    "అదేమిటండీ? ఈ ఊళ్లో చాలామంది ఆడపిల్లల్ని చదివించారు. మాకు ఒకే బిడ్డ. చదివించాలని ముచ్చట పడ్డాం" అన్నది కామేశ్వరి తల్లి.
    "అంత పెద్ద డిగ్రీ సంపాదించుకున్న పిల్లకు కట్నం యిచ్చి పెళ్లెందుకు చేశారు?"
    "కట్నం లేకుండా ఈ రోజుల్లో ఎవరు చేసుకుంటారండీ?"
    "ఏం చేసుకోకపోతే?"
    "అదేమిటండీ? ఆడపిల్లకు పెళ్ళి చెయ్యకుండా ఎలా చూస్తూ ఊరుకోగలం? తీగకు పందిరి కావాలిగదండీ?"
    "చూశావా కామేశ్వరీ. నువ్వు ఎం.ఏ. పాసయినా నీ తల్లిదండ్రులకు తీగలాగా కనిపిస్తున్నావ్. అంటే పురుషుడి అండ లేనిదే బతకలేని అబలగా కనిపిస్తున్నావన్నమాట. అంటే ఈనాటి విద్యావంతురాలైన ఆడపిల్లల వ్యక్తిత్వాల మీద వారి తల్లిదండ్రులకే నమ్మకం కలగడం లేదు.
    "దానికేం? మగపిల్లవాడితో జీవితాన్ని మలుచుకుంటుంది. తనకు ఇష్టం అయినవాణ్ణి చేసుకుంటుంది" అనే ధీమా తల్లిదండ్రుల్లో చదువుకుంటున్న యువతులు కలిగించలేకుండా ఉన్నారు. నీ విషయమే తీసుకో -- వివాహం అనేది స్త్రీకి ఎంత ముఖ్యమో పురుషుడికీ అంతే ముఖ్యం. వివాహం స్త్రీని ఉద్ధరించడానికి జరిగేది కాదు. మీ ఇద్దరికీ సమానమైన డిగ్రీలు ఉన్నాయ్.  
    అయినా కట్నం యిచ్చి పెళ్ళి చేసుకున్నావ్. అతనికి ఉద్యోగం లేదు. నువ్వు ఉద్యోగం చేసి పోషిస్తున్నావ్. అయినా నీలో పురుషుడు నాకంటే అధికుడు అనే భావం పోలేదు. అందుకే అతను నిన్ను హింసిస్తున్నాడు. అధికారం చలాయిస్తున్నాడు. పురుషుడు తెలివయినవాడు. సంప్రదాయాలూ, మూఢనమ్మకాలూ, స్త్రీ ఒడిలోనే భద్రంగా ఉంటాయని అతనికి తెలుసు. అందుకే హిందూ సంప్రదాయంలోని కట్టుబాట్లనూ, నీతి నియమాలనూ, స్త్రీ రక్షణలోనే వదిలేశాడు.  
    స్త్రీ వాటిని యినాటికి చంకన వేసుకుని అపురూపంగా సాకుతున్నది. యిప్పుడు నన్నేం చెయ్యమంటావ్?
    నేను ఆలోచనలో పడ్డాను. అవును ఏం చెప్పాలి? నీ భర్తను వదిలేయ్ అని చెప్పనా? డైవర్సు తీసుకోమని చెప్పనా? డైవర్సు అయాక అతనికి మళ్ళీ పిల్లను యిస్తామని క్యూలో నిలుచుంటారు ఆడపిల్లల తల్లిదండ్రులు కట్నం కూడా ఇస్తారు. కానీ కామేశ్వరి ఏమవుతుంది? కామేశ్వరి మళ్ళీ వివాహం చేసుకోవడం సాధ్యపడుతుందా? పైగా ఒక బిడ్డ కూడా ఉన్న స్త్రీని వివాహం చేసుకోవడానికి ముందుకు వచ్చే విశాల హృదయులు ఎంతమంది ఉంటారు?
    నీకు ఏదో ఉద్యోగం దొరుకుతుంది. మళ్ళీ నీ భర్త నీ దగ్గరకు వస్తాడు. ఉద్యోగం చెయ్యడు. మగవాడి మనస్తత్వం చిత్రంగా వుంటుంది. అతని ప్రవర్తన భరించలేనిదిగానే ఉంటుంది. అయినా ఏం చేస్తావ్? భరించు అన్నాను ఆమె సమస్యకు పరిష్కారం చెప్పలేని నేను. ఆఫీసుకు ఆలస్యమయితే సరోజిని సాధారణంగా ఆఫీసుకు ఆలస్యంగా వస్తుంది. అయినా ఎవరూ పట్టించుకోరు. ఆమె ఆఫీసరు గారి అభిమానాన్ని చూరగొన్నది. అందుకే ఆమె జోలికి ఎవరూ వెళ్ళరు. ఇలాంటి వారి సంఖ్య చాలా తక్కువే.   
    సుందరమ్మ కూడా ఆలస్యంగా ఉంటుంది. ఆ రోజు కూడా ఆలస్యంగానే వచ్చింది. ఎప్పుడూ పరధ్యానంగా ఉంటుంది. నాలుగు దాటినప్పటి నుంచీ ఆమె కళ్ళు గడియారం మీదే ఉంటాయి.   
    "ఏం తల్లీ! ఇవ్వాళా ఆలస్యంగానే వచ్చావు! స్పెషల్ వర్క్ ఉంటుందని తెలియదూ? అందరూ ఎనిమిదింటికే వచ్చారు. మీ ఆడవాళ్ళతో ఇదేన్యూసెన్సు. పండగ వస్తే సెలవు. పనిమనిషి నాగా పెడ్తే సెలవు. బంధువులు వస్తే సెలవు. భర్తకు తలనొప్పివస్తే సెలవు. పురుడు వస్తే ఇక చెప్పనే అక్కర్లేదు..... స్పెషల్ సెలవు" సూపర్నెంటు పంచాంగం విప్పాడు.   
    సుందరమ్మకు ఇలాంటి మాటలు వినడం అలవాటే. పట్టించుకోకుండా వెళ్ళి సీటులో కూర్చుంది. పక్క సీటులో తల వంచుకుని పనిచేస్తున్న జానకి తలెత్తి చురచుర చూసింది.
    "ఇదుగో సుందరమ్మ! నువ్వు ఉద్యోగం మానెయ్యకూడదూ?" అడిగింది జానకి.
    సుందరమ్మ జానకి ముఖంలోకి బేలగా చూసింది.
    "ఉద్యోగం మానేస్తే ఎలా? ఆయన ఒక్కడి సంపాదనతో యిల్లు గడవదు."
    "అయితే టైంకు రా! సెలవులు పెట్టకు. నీలాంటి వాళ్ళు ఉద్యోగాలు చేస్తే ఆడవాళ్ళందర్నీ తేలిగ్గా మాట్లాడతారు. నేను ఇవ్వాళ అందరితోపాటు ఎనిమిదింటికే వచ్చాను. నువ్వు కనీసం ఆఫీసు టైంకు కూడా రాలేదు రోజూ ఆలస్యంగా వచ్చి ఇలా మాటలు అనిపించుకోవడానికి సిగ్గుగా లేదు?"
    "ఏం చెయ్యను జానకి! రోజూ ఏదో ఒక అడ్డంకు వస్తూనే ఉంటుంది. ఇవ్వాళ మావారు ఇంట్లోనే ఉన్నారు. ఆరోగ్యం అంత బాగాలేదు. నన్ను సెలవు పెట్టమన్నారు. కాని అర్జంటు పని ఉందని వచ్చేశాను. ఆయనకు కోపం కూడా వచ్చింది." అమాయకంగా అన్నది సుందరమ్మ.    
    "నీకు వంట్లో బాగాలేకపోతే మీ ఆయన సెలవు పెడ్తాడా? ఆలస్యంగా ఆఫీసుకు వెళ్తాడా?"

 Previous Page Next Page