మొదట్లో "మత్తేభయూధంబు మడుగు సొచ్చె" అన్నారు కదూ! ఆ మత్తేభాన్ని మకరి పట్టుకుంది కదూ! అప్పుడు మత్తేభం "రావే యీశ్వర కావనే వరద! సంరక్షించు భద్రాత్మకా!" అని భగవంతుణ్ణి ప్రార్ధించింది. అప్పుడు "మత్తేభరక్షణాయత్తచిత్తుడై" అడావుడిగా పరిగెత్తుకుంటూ వచ్చిన భగవంతుడి హృదయంలో అడుగడుగునా మత్తేభవృత్తాంతమే మెదలుతున్నది. అయన మనస్సు "మత్తేభమయ" మయింది. అటువంటి దేవుణ్ణి మీరు మనస్సులో భావించారు. మీకూ శ్రీహరికి సాదారణీకరణం ఏర్పడింది. అందువల్ల మీ గంటంలో అడుగడుగునా ఒకదాని వెంట ఒకటిగా మత్తేభవృత్తాలే దొరలి దొరలి వచ్చాయి. "పలికించేడు వాడు రామభద్రుడే"కదండీ . ఏమంటారు? లేకపోతే అనుకోకుండా అన్ని మత్తేభాలు ఎలా వస్తాయి/ ఎందుకు వస్తాయి?
పోతన్నగారూ! మీరు సహజపాండిత్యులు. మీకు గోపాలుడంటే ఎంత అడరమో గోవులన్నా అంత అనురాగం. గోపాలకృష్ణుని చేత ఒక్కొక్క అవుకు ఒక్కొక్క అందమైనపేరు పెట్టి ఆప్యాయంగా పిలిపించడమంటే మీ కెంత సంతోషమో మాకు బాగా తెలుసు.
"రా పూర్ణచంద్రికా! రా గౌతమీగంగ!
రమ్ము భాగీరధ రాజతనయ!
రా సుధాజలరాశి! రా మేఘమాలిక!
రమ్ము చింతామణి! రమ్ము సురభి!
రా మనోహరిణి! రా సర్పమంగళ!
రా భారతీదేవి౧ రా ధరిత్రి!
రా శ్రీమహాలక్ష్మీ! రా మందమారుతీ!
రమ్ము మందాకినీ! రా శుభాంగి!"
అబ్బ! ఎంత చక్కని పేర్లు పెట్టించారు. ఎంత చక్కగా పిలిపించారు. ఆ అవులకు కూడా ముద్దుల గోపాలుని మురళీగానమంటే ఎంత ఆనందమో! "చతుర నతమూర్తి" అయిన ఆ "గోపాల చక్రవర్తి" వేణువును మధురాధరం మీద చేర్చి "బ్రహ్మగాంధర్వ గీతాన్ని" ఆలపించగా బృందావనం పులకించింది. కాళింది పొంగి పొరలింది. ప్రకృతి పరవశించింది. లేళ్ళు మైమరచాయి. మోళ్ళూ పల్లవించాయి. రాళ్ళు ద్రవించాయి. ఆవులన్నీ మేతలు మాని "మమతన్ మోములు మీది కెత్తుకుని రోమంధంబు చాలించి" ఆనందభాష్పాలు కారుస్తూ నిశ్చలంగా నిలబడి అలకించాయి కదూ! ఇక గోవత్సాలంటారా! "తల్లుల చన్నుబాలు" త్రాగడం మానేసి కదలకుండా తదేకధ్యానంతో అదే పనిగా ఆ మురళీధరుడి ముద్దుల మోము వంకే చూస్తున్నాయి గదూ!
అన్నా! పోతన్నా! ఆ మాధవుడి మధుర మధుర వేణుగానంలో మైమరపించి పాపమా అమాయికలైన గోపికలను ఎన్ని తిప్పలు పెట్టించావయ్యా! చూస్తూ చూస్తుండగానే అదృశ్యమైపోయిన ఆ వంశీధరుడి కోసం -
"పున్నాగ కానవే పున్నాగవందితు
తిలకంబ కానవే తిలకనిటలు "అనీ
"మానినీ మన్మధ మాధవుగానరే
సలలితోదార వత్సకములార!" అనీ
"ఆదే నందనంధనుం దంతర్హితుండయ్యె
పాటలీతరులార! పట్టరమ్మ!" అనీ
"ఓ మల్లియలారా! మీ పొదల మాటున లేదుగదమ్మ చెప్పరే!" అనీ బృందావనంలోని చెట్టు చెట్టుకూ గుట్ట గుట్టకూ తిరిగి తిరిగి విసిగిపోయారే ఆ కుసుమకొమలులు!
పోతన్నగారూ! మీ భాగవతంలోని పాత్రలు మా హృదయాలలో చెరగని ముద్ర వేసుకున్నాయి. "నీకున్ మ్రొక్కెద త్రుంపవే భావలతల్ నిత్యాసుకంపానిదీ!" అని కృష్ణుణ్ణి ప్రార్ధించే కుంతీదేవీ, "నాతోడన్ ప్రతిభాషలాడేదు! జగన్నాధుండ, నాకంటే నీ భూతాశ్రేణికి రాజు లేడొకడు" అని ప్రహ్లాదున్ని గద్దించే హిరణ్యకశిపుడు, "తిరగన్నెరదు నాడు జిహ్వ వినుమా ధీవర్య! వేయేటికిన్" అని పలికే దానవీరుడు బలిచాక్రవర్తీ, "అమ్మా! మన్ను దినంగనే శిశువునో అకొంటినో వెఱ్రినో" అని తల్లి దగ్గర ముద్దులు గురిసె బాలగోపాలుడూ, "ఒంటివాడ నాకు ఒకటి రెండడుగుల మేరయియ్యి" అంటూ బలిచక్రవర్తిని చేజాచి యాచించే చిట్టిపొట్టి వామనుడూ, "కలడు కలం డనేదివాడు కలడో లేడో!" అని నక్రానికి చిక్కి ఆక్రోశించే గజెంద్రుడూ, "చదువులలో మర్మమెల్ల చదివితి తండ్రీ!' అని కన్నతండ్రికి సమాధానం చెప్పే ప్రహ్మదుడు, "నవనీతంబుల ముద్దా కాదు వినరా నా ముష్టి గోపార్భకా!' అని బారలు దాచే చాణూరమల్లుడూ, "తాటంకాచలనంబుతో భుజనట్టద్దమ్మిల్లబంధబుతో" పతివెంట పరువేత్తుకు వస్తున్న శ్రీదేవీ, "నా దయితు కట్టనేటికీ శ్రీదయితా చిత్తచోర! శ్రితమందారా!" అని శ్రీహరిని కన్నీళ్ళతో ప్రశ్నిస్తున్న బలిచక్రవర్తి భార్య వింధ్యావళీ, "విచ్చేయుము తల్లి కడుపు వెడలి ముకుందా!"అంటూ దేవకీ గర్బష్టుడైన దేవదేవుడిని చేతులు మోడ్చి ప్రార్ధిస్తున్న ముక్కోటి దేవతలూ, "గుఱ్ఱము గొనిపో ముద్దుల కుర్రడ!" అని సగర పౌత్రుడైన అంశుమంతున్ని ఆప్యాయంగా అభినందిస్తున్న కపిల మహర్షి, "అన్నము లేదు కొన్ని మధురంబువులున్నవి త్రావుమన్న" అంటూ తన ప్రాణాన్ని కూడా లెక్కించకుండా తన దగ్గర ఉన్న కాసిని నీళ్ళూ అతిధికి ధారాపోస్తున్న రంతిదేవుడు, :వీడటే రక్కసి విగతజీవగచన్నుబాలు త్రాగిన మేటి బాలకుండు" అని మేడల మీద నుంచి కుతూహలంతో కృష్ణుణ్ణి చూస్తున్న మదురానగర నారీమణులూ , "ముని నీరు సొచ్చి వెడలడుచనియేడు ద్వాదశియు" అని ద్వాదశీవ్రతభంగానికి ఆందోళన చెందే అంబరీషుడు, "మన సారధి మన సచివుడు..... మనలను విడనాడి చనియె మనుజాధీశా!" అని కన్నీళ్లు తుడుచుకుంటూ అన్నగారికి కృష్ణనిర్యాణం విన్నవిస్తున్న అర్జునుడు, "వీరేవ్వరు శ్రీకృష్ణలు కారా! ఎన్నడును వెన్న గానరట గదా! " అంటూ వెన్నదొంగను వెన్నాడి పట్టుకొని కట్టనుంకించే యశోదమ్మా అసురకృత్యంబుధర్మమగునే ? తండ్రీ!" అని పుత్రఘాతి అయిన అశ్వత్ధామను ప్రశ్నిస్తున్న పాంచాల రాజపుత్రీ , "నీ పాదకమల సేవయు నీ పాదార్చకులతోడి " అని గోపాలదేవుణ్ణి ప్రార్ధించే సుదాముడూ, "ఘను డా భూసురుడేగెనో నడుమ మార్గశ్రాంతుడై చిక్కెనో" అని శ్రీకృష్ణుడి రాకకోసం వేయి కన్నులతో నిరీక్షించే రుక్మిణీకన్యా, "అన్న! శమింపుమన్న! తగదల్లుడు గాడిది మేనకోడలే" అని కంసుడిని బతిమాలే దేవకీ దేవీ , "వనితా! ఏమి తపంబు చేసేనోకో ఈ వంశంబు వంశంబులోన్" అని మురళిని చూచి గ్రుక్కిళ్ళు మ్రింగుతున్న బృందావన గోపికా మా కన్నుల ముందు కలకాలం కదలాడుతూనే ఉంటారు.
పోతన్నగారూ! ధన్యులండీ మీరు!
భీష్ముని కుప్పించి లఘించు గో
పాలకృష్ణుని కుండలాలకాంతి
కరిరాజు మొరవెట్ట పరుగెత్తు కరివేల్పు
ముడివీడి మూపు పై బడిన జుట్టు
సమరంబుగావించు సత్య కన్నుల నుండి
వెడలు ప్రేమక్రోధ వీక్షణములు
కొసరి చల్డులు మేకకు గొల్లపిల్లల వ్రేళ్ల
సందు మాగాయ పచ్చడి పసందు
ఎపుడు కనుగొంటివయ్య? నీకెవరు చెప్పి
రయ్య! ఏ రాత్రి కలగంటివయ్య! రంగు
కుంచెతో దిద్ది తీర్చి చిత్రించినావు
సహజ పాండితి కిది నిదర్శన మటయ్య!
మీ క్రాంత దర్శిత్వానికి కైమాడ్పులండీ!
అన్నగారూ! మీరన్నా మీ భాగవతమన్నా మాకేండుకండీ యింత యిష్టం! నిజంగా ఇది మా జన్మజన్మాల అదృష్టం! మీక్ కవిత చిరంజీవిని. లోకపావని. ఆ 'జగన్మోహిని' కి ఆ 'పిల్లాబ్జాక్ల్షి' కి ఆ 'సరస్వతి' కో ఆ 'భగవతి' కి ఆ 'పూర్ణేందుబింబానన' కు ఇవే మా శతసహస్త్ర ప్రణామాలు.