Previous Page Next Page 
చిలకలు పేజి 5


    " మీ వాడు అప్పుడే డిటెక్షన్  ప్రారంభించినట్టున్నాడు." కారు అద్దంలో నుంచి బయటికి చూస్తూ అన్నాడు అద్వయితం.
    అంతలో కారు చుట్టూ పత్రికా విలేకరులు మూగారు. నరేంద్ర కారు అద్దందించాడు.
    "సార్! ఈ హత్య గురించి మీ అభిప్రాయం ఏమి ఒకటి విలేకరి అడిగాడు.
    నరేంద్ర ఆ ప్రశ్న తనకు కానట్టే మౌనంగా ఉండిపోయాడు.
    "బలత్కారం తర్వాత హత్య! అంతేనా!" మరో విలేకరికారులోకి తల దూర్చి అడిగాడు.
    "లేకపోతే హత్య చేశాక శవాన్ని బలాత్కారం చేశాడంటారా మీరు!" ఇన్ స్పెక్టర్ చిరాగ్గా అన్నాడు.
    అంతలో విజయ్ ఓ జత హైహల్స్ చెప్పులు ఎడం చెత్తో పట్టుకుని రొప్పుతూ వచ్చాడు. జనాన్ని తోసుకుంటూ వచ్చికారు ఎక్కాడు.
    "ఇవి హత్యా ప్రదేశానికి వంద గజాల దూరంలో దొరికాయి. మంచి క్లూ దొరికింది." చెప్పులు కార్లో పడేస్తూ అన్నాడు విజయ్.
    "హత్య కావించబడిన యువతి శవమే దొరికింది. ఆమె చెప్పులెందుకూ?" అన్నాడు అద్వయితం విజయ్ ను చిన్నపుచ్చడానికి అవకాశం దొరికినందుకు సంబరపడిపోతూ.
    "నీ క్లూ సంగతి తర్వత చూసుకోవచ్చు. ముందు కారు స్టార్ట్ చెయ్" అన్నాడు నరేంద్ర విలేకరుల ప్రశ్నలతో విరాకు పడిపోయి.
    విజయ్ గతుక్కుమన్నాడు.
    కారు స్టార్టు చేశాడు.
    "నరేంద్రా! మీ అభిప్రాయం చెప్పారు కాదు. మానభంగం తర్వాత హత్యా! అమ్తేకడూ! సాగిపోతున్నకారు వెనక నుంచి అరిచాడు ఒక విలేకరి.
    "వీళ్ళోకళ్ళు. ప్రాణాలు తోడేస్తారు. చెప్తే ఒక చావు చెప్పకపోతే ఒకచావు." విసుగ్గా అన్నాడు పోలీసు ఇన్ స్పెక్టర్ అద్వయితం.
    నరేంద్ర ఇన్ స్పెక్టర్ కేసి జాలిగా చూశాడు.
    క్రైం బ్రాంచ్ సబ్ స్టేషన్ లో ఇన్ స్పెక్టర్ అద్వయితం, డిటెక్టివ్ నరేంద్ర,అసిస్టెంట్ విజయ్ కూర్చుని ఉన్నారు.
    అద్వయితం ఏకదాటిగా క్రితం రాత్రి జరిగిన హత్య గురించి  చెప్పుకుపోతున్నాడు. నరేంద్ర, విజయ్ మౌనంగా వింటున్నారు.
    ఇన్ స్పెక్టర్ గ్లాసుడు మంచినీళ్ళు తెప్పించుకొని గలుగలుతాగి, ఖాళీ గ్లాసు బల్లమీద పెట్టాడు.
    "మీక్కూడా మంచినీళ్ళు తెప్పించమంటారా?" అన్నాడు అద్వయితం.
    "అరగంటసేపు పుల్ స్టాపు కామా లేకుండా ఏకదాటిగా మాట్లాడింది నువ్వేగా? మరో గ్లాసు నీళ్ళు తెప్పించుకొని నువ్వేతాగు" వీజయ్ ఇన్ స్పెక్టర్ను చిలిపిగా చూస్తూ అన్నాడు.
    "పోనీ అరగ్లాసు తాగు. నువ్వు అసిస్టెంటువేగా అరగ్లాసు చాల్లే. తెప్పించనా?" అన్నాడు అద్వయితం మాటకుమాట విసురుతూ.
    "ఊహూ! ఏం మర్యాదయ్యా!పోలీసు మర్యాదా? నువ్వెక్కడికైనా వెళితే కాఫీలూ, కొబ్బరినీళ్ళుతప్ప తాగవు. నువ్వు ఇవ్వాల్సివస్తే మంచినీళ్ళిస్తావా? బలే మర్యాదలే!" దేప్పుతూ అన్నాడు విజయ్.
    అద్వయితం పకపకా నవ్వి అదా సంగతి? కాఫీ కావాలని అడుగరాదూ? మీ డిటెక్టివ్ బెట్టు  పోనిచ్చావేకాదు. కాఫీ తెప్పిస్తాలే! ముందు ఓ గ్లాసు  మంచినీళ్ళు తాగు" అన్నాడు.
    "ఇన్ స్పెక్టర్ ముందర ఈ కేసు ఏడు చెరువుల నీళ్ళు తాగాల్సిన రోజులు ముందున్నాయి. ఇప్పుడు కాఫీ మాత్రం తెప్పించు" అన్నాడు డిటెక్టివ్ నరేంద్ర.
    పడి నిముషాల్లో కుర్రాడొకడు వచ్చి మూడు కప్పుల కాఫీ ఒక బర్కిలి  సిగరెట్  పెట్టె తెచ్చి బల్లమీద పెట్టాడు.
    ఇన్ స్పెక్టర్ కాఫీ తాగి, సిగరెట్ వెలిగించుకున్నాడు. గట్టిగా సిగరెట్  దమ్ములాగి  ముక్కుల్లోనుంచి పొగ వదలి  ముఖం గంభీరంగా పెట్టి అన్నాడు- ఆ సోమసుందరంగాడ్ని బొక్కలో తోసేసి, రోకలి ప్రయోగం చేస్తే నిజం కక్కేస్తాడు ఐదు నిమిషాల్లో.
    "ఏ ఆధారంతో అతడ్ని అరెస్టు చేస్తావ్?"
    "చివరిసారిగా ఆమెతో మాట్లాడింది వాడేనని వాచ్ మెన్  చెప్పాడు తన కారులో డ్రాప్ చేస్తానన్నాడట. ఆమె వద్దంది."
    "అయితే?" అన్నాడు విజయ్.
    నరేంద్ర ఆలోచిస్తూ కూర్చున్నాడు.
    "ఇంకా ఏం ఆధారాలు కావాలయ్యా. ఆ వనజాక్షి చెప్పిన సాక్ష్యం చాలదా?"
    "వనజాక్షా?"
    "అదేనయ్యా! ఆ టైపిస్టు. ఆవిడే రాధారాణితో క్లోజ్ గా ఉండేదట".
    "ఏం చెప్పిందీ? సోమసుందరమే హత్యచేశాడని చెప్పిందా? ఎగతాళిగా చూస్తూ అన్నాడు విజయ్.
    "ఇంకా ఏం చెప్పాలి? సోమసుందరం ఆ అమ్మాయికి ఉద్యోగం ఇస్తాడు. పని ఉన్నా లేకపోయినా ఆ పిల్లను  పలకరిస్తూ  ఉండేవాడు. అనవసరంగా ఆమెపట్ల అతిశ్రద్ద చూపించేవాడు. అంటే ఆ పిల్లంటే అతడికి మోజు ఉందని తెలియడంలా?"
    "ఊ. కానియ్! ఆపావేం?" అన్నాడు నరేంద్ర చిరునవ్వుతో.
    "ఆ అమ్మాయి బ్యాగ్ లో  దొరికిన ఉత్తరాన్నిబట్టి ఆమె ఎవర్నో ప్రేమిస్తుందని తెలుస్తూనేఉంది. ఆమె ప్రియుడు వస్తున్నాడని ఎయిర్  పోర్టుకు వెళ్ళాలని ఆఫేసులో అందరూ వెళ్ళాకకూడా కూర్చుంది. తను ప్రేమించిన ఆడది మరొకడి పొత్తుకాబోతుందని తెలుసుకొని, అతడే కార్లో ఎక్కించుకొని ఊరి బయటకు తీసుకెళ్ళి చంపాడు." అన్నాడు అద్వయితం హంతకుడు దొరికినట్టే సంబరపడిపోతూ.
    "అతడు ముందే కార్లో వెళ్ళిపోయాడని వాచ్ మెన్ చెప్పాడుగా?"
    "వాచ్ మన్ అనుమానం రాకుండా ఉండటానికి వెళ్ళిఉంటాడు. ఏదార్లోనో కాపువేసి ఆమెను ఎయిర్ లో దించుతాను కారు ఎక్కమని అనిఉంటాడు. తీరా కారు ఎక్కాక దారి మరలించి ఉంటాడు...."
    "ఆగవయ్యా బాబూ! ముందు నీ ఊహలకు ఆధారం ఏమిటో చెప్పు" న్నాడు నరేంద్ర.
    ఇన్ స్పెక్టర్ ఓ క్షణం ఆలోచించాడు. "ఇలాకూడా అయివుండొచ్చు."
    "ఎలా? ఏదోఅద్భుతమైన కొత్త క్లూ దొరికినట్టుంది ఇన్ స్పెక్టర్ అద్వయితం గారికి" వ్యంగ్యంగా అన్నాడు విజయ్.
    "అవును. అద్భుతమైన క్లూయే దొరికింది."
    "ఏమిటిది?"
    "సోమసుందరం కాకపోతే, ఆ ఉత్తరం రాసినవాడే చంపిఉండొచ్చుగా?
    "అతడు ఆమెను ప్రేమిస్తున్నాడు"
    "దొంగ ప్రేమ ఆశ్రమ సన్యాసికి పేరేమిటి? దొంగసన్యాసి....ఈ సన్యాసులంతా...."
    "అద్భుతమైన బుర్ర" ఇంకేదో అనబోతూ నరేంద్రముఖం చూసి  ఆగిపోయాడు విజయ్.
    అంతలో "బావా!బావా!" అంటూ సునంద లోపలకు పరిగెట్టు కొచ్చింది. విజయ్ ఎదురుగా ఉన్న కుర్చీలో రొప్పుతూ కూర్చుని కర్చీపుతో ముఖం తుడుచుకొసాగింది.
    "ఏమిటమ్మ ఏమైంది?" అడిగాడు ఇన్ స్పెక్టర్.
    "ఏం  జరిగింది సునందా?" గాభరాగా అడిగాడు విజయ్.
    నరేంద్ర మౌనంగా  చెల్లెలు ముఖంలోకి చూశాడు.
    "ఏమిటమ్మా అంత హడావిడిగా పరుగెత్తుకొచ్చావ్?" ఇన్ స్పెక్టర్ అడిగాడు.
    సునంద అలుపు తీర్చుకొని, గొంతు సవరించుకొని చెప్పసాగింది.
    "మా ఫ్రెండ్ సరళ ఇంటికివెళ్దామని బయలుదేరానండీ. తోవలో ఎవరో  నన్ను వెంబడిస్తూ వచ్చాడు. ఏదోఏదో వాగాడు అంతా పిచ్చి వాగుడు. వాడ్నీ, వాడి చూపుల్నూ చూసి భయపడి స్టేషన్ లోకి పరిగెత్తు కొచ్చాను." అన్నది సునంద గాభరాగా. సునందకు నరేంద్ర ముఖంలోకి చూసే ధైర్యం చాలడంలేదు.
    "ఎవడా రాస్కెల్ ? ఎక్కడున్నాడూ?" పిడికిలిబిగించి చివ్వున లేచి నిల్చున్నాడు విజయ్.
    "ఇంకా వాడెక్కడున్నాడు? నేను స్టేషన్ లోకి రావడం చూసి పక్కసందులోపడి పారిపోయాడు.
    "ఏయ్ విజయ్! కొంచెం తగ్గు. వాడి సంగతి నేను చూసుకుంటాను." అన్నాడు ఇన్ స్పెక్టర్.
    మీ పోలీసోళ్ళు చూసుకుంటే ఇలాంటివి ఇంకా ఎందుకు జరుగుతాయి. ఈవ్ టీజింగ్ అపరాధంగా చట్టం వేశారు. అయినా  జరుగుతూనే  వున్నాయ్. ఆ మధ్య ఒక టెలిఫోన్  గరల్ ను ఎదురుతిరిగిందని నలుగురు ఖైరతా బాద్ దగ్గర పడేసికొడ్తుంటే ఏం చేశారు మీ పోలీసోళ్ళు?'
    "అన్నిటికీ  పోలీసోళ్ళను నిందించడం అలవాటపోయింది. ప్రజల సహకారం కావాలి. ఆ రోజు మగవాళ్లంతా దారిన పోయేవాళ్ళు ఏం చేశారు? నిల్చుని తమాషా చూశారు. ఒక ఆడకూతురు అడ్డుపడి ఆ అమ్మాయిని పత్రికాఫీసులోకి తీసుకెళ్ళింది."
    "ఆ తర్వాత వాళ్ళను  శిక్షించారా?"
    "శిక్షించే వుంటారు. అది నా జూరిస్ డిక్షన్ లో జరిగిన కేసు కాదు."
    "అర్థరాత్రి ఆడపిల్లలు హాస్టల్లో చొరబడి ఒక యువతిని పొడిచారు. మళ్ళీ అదే హాస్టల్లో  ఈమధ్య రౌడీవెధవలు జొరబడ్డారట. పోలీసులు అప్రమత్తంగా ఉంటే ఇలాంటివి జరుగుతాయా?" విజయ్ ఆవేశంగా అన్నాడు.
    "మనగొడవ కాసేపు ఆపు. ముందీ సంగతి చూద్దాం. అమ్మా! ఆ రాస్కెలును నువ్వు  గుర్తించగలవా?" అన్నాడు ఇన్ స్పెక్టర్.
    "ఓ! నిముషంలో గుర్తుపడ్తాను. వాడు బస్ స్టాండులోనే అదో  మాదిరిగా చూస్తూ  ఈలవేశాడు. దాంతో భయపడి బస్ ఎక్కలేదు. వాడికి బుద్ది చెప్పాలనే ఉద్దేశ్యంతో స్టేషన్ వైపు బయలుదేరాను. వాడూ నా వెంటే పిచ్చిగా వాగుతూ వచ్చాడు. కాని నేను పోలీసు కేసి రావడం చూసి పక్క సందులోపడి బాణంలా  దూసుకుపోయాడు" అన్నది సునంద.

 Previous Page Next Page