Previous Page Next Page 
చిలకలు పేజి 4


     ఆమె కాళ్ళు తడబడుతున్నాయి.
    కాలు జారింది ముందుకు పడిపోయింది.
    మోకాళ్ళ దగ్గర చీర  చిరిగింది. వళ్ళంతా చమట్లు పట్టాయి. అంత గాలిలో కూడ. ఆమె చేతికి వెచ్చగా, జిడ్డుగా తడి తగిలింది. చేతినిండా రక్తం.
    బూటు కాళ్ల ధ్వని దగ్గరౌతున్నది.
    ఆమె చివ్వున లేచింది. కాళ్ళకున్న హైహీల్సు చెప్పులు లాగిపారేసింది. మళ్ళీ పరిగెత్తసాగింది.
    ఆమె మృదువైవ పాదాలు కొంత రాళ్ళమీదపడి లేస్తున్నాయి ప్రాణ భీతితో పరుగులు తీస్తోన్న ఆమె పాదాలకు తగులుతున్న దెబ్బలు బాధ తెలియడంలేదు.
    ఇనుప నాడాల బూట్ల శబ్దం నిముష నిముషానికి దగ్గర ఆపుతున్నది. ఆ శబ్దం ఎంతో కఠోరంగా ఉంది. ఆమెను  తరుముతోంది. ఆమె పిచ్చిగా పరుగులు తీస్తోంది.
    అల్లంతా దూరంలో ఓ మర్రి చెట్టు.
    అక్కడేదో అలికిడి.
    ఆమె ఆశగా అటుకేసి పరుగు తీసింది.
    తనను క్రూరంగా తరుముతున్న ఆ రాక్షసుడి బారినుండి తనను రక్షించడానికి అక్కడ మనుషులో దేవతలో ఉన్నారనే ఆశతో అటు కేసి పరుగుతీసింది.
    కాని__
    రామచిలుక ఒకటి ప్రాణ భీతితో పిచ్చిగా అరుస్తూ లేచివచ్చి మళ్ళీ చెట్టుమీదే వాలింది. చెట్టుమీద నిద్రలో ఉన్న పిట్టలు అరుస్తూ లేచి మళ్ళీ చెట్టుమీదే వాలుతున్నాయి.
    రామచిలుకను తరుముకుంటూ వచ్చిన రాబందు రెక్కల చప్పుడుకు పిట్టలన్నీ గోలగా అరుస్తున్నాయి.
    రాబందు చెట్టుమీద వాలింది. చెట్టు కొమ్మల ఊగాయి.
    ఆకుల మధ్య దాక్కున్న రామచిలుక వణికిపోతూంది.
    రాబందు భయంకరంగా అరుస్తూ లేచి రామచిలుక దగ్గరగా ఉన్న కొమ్మమీద వాలింది. కొమ్మ కదిలింది, ఆకులు వణికాయి. రామచిలుక 'గీ' పెడ్తూ లేచింది.
    రాబందు రెక్కలు విలయతాండవం చేశాయి. రాధ చెట్టుకిందకు పరుగెత్తింది.
    ఆమె పాదంమీద  బూటుకాలు బలంగా పడింది. ఆమె 'కెవ్వు'మని అరిచింది.
    కిందకు  పడిపోతున్న ఆమె శారీరాన్ని కబంధ హస్తాలు ఆమెను పైకి లాగాయి. మొరటుగా, బలంగా ఉన్న ఆ చేతులు ఆమె నడుమును బలంగా చుట్టివేశాయి.
    అతడి కళ్ళు నిప్పుకణాల్లా మెరుస్తున్నాయి.
    అతడి ముక్కోళ్లలోనుంచి వేడిగాలి బయటికి వస్తోంది.
    ఆ రాక్షసుడి ఇనుప కౌగిలిలో ఆమె శరీరం లేత లతలా నలిగిపోతున్నది.
    ఆమె పెదవులు లేత గులాబి మొగ్గల్లా చిట్లిపోయినై.
    చెట్టుమీద రామచిలుక రాబందు రెక్కలమధ్య నలిగిపోతున్నది.
    చెట్టుకింద అతడి ఇనుపచేతుల్లో ఆమె శరీరం నలిగిపోతున్నది.
    రామచిలుక మెడను రాబందు కటుక్కున కొరికింది.
    బలమైన అతడి చేతివ్రేళ్ళు ఆమె కంఠాన్ని కసికసిగా నలుముతున్నాయి.
    ఆమె కంఠం నుండి "కీచ్" మన్న ధ్వని వెలువడింది.
    రక్తసిక్తమైన రామచిలుక తల ఆమె  పాదాలముందు పడింది చెట్టుమీదనుంచి.
    ఆమె శరీరం కొండరాయి మీదపడి కిందకు దొర్లింది.
                                         2
    ఉదయం ఏడు గంటలు అయింది.
    ఇటెక్టివ్ నరేంద్ర తన గదిలో కూర్చుని పేపరు చూస్తున్నాడు.
    నరేంద్ర అసిస్టెంట్ విజయ్  టేబులు ముందు కూర్చుని పేపరు చూసృన్నాడు.
    నరేంద్ర  అసిస్టెంటు విజయ్  టేబులు ముందు కూర్చుని బాంక్  ఏజెంట్ మర్డర్ కేసుకు సంబందించిన కాగితాలు చూస్తున్నాడు.
    గది బయట హాలులో బూట్ల శబ్దం "టక్ టక్" ని వినిపిస్తోంది.
    స్ప్రింగ్ డోర్ నెట్టుకొని ఇన్ స్పెక్టర్ అద్వయితం గదిలో ప్రవేశించాడు.
    "హల్లో నరేంద్రా గుడ్ మార్నింగ్ , హల్లో విజియ్  మార్నింగ్"
    "వెరీగుడ్ మార్నింగ్  నరేంద్ర! విజయ్ ఒకేసారి అన్నారు.
    నరేంద్ర ఇన్ స్పెక్టర్ కు కుర్చీ చూపించాడు.
    "నో!నో! కూర్చునే టైంలేదు బయలుదేరు. త్వరగా!" అన్నాడు అద్వయితం.
    "ఏమిటంత హడావిడి? ఎక్కడన్నా పెళ్ళి ముహూర్తం దాటిపోతుందా" చిరునవ్వుతో అన్నాడు నరేంద్ర.
    "పెళ్ళాపాడా?"
    "మరి?" శోభనం ముహూర్తమా?" అన్నాడు విజయ్.
    "ఉండవయ్యా నువ్వొకడివి పానకంలో పుడకలాగా!" విసుక్కున్నాడు ఇన్ స్పెక్టర్ విజయ్ మీద.
    "మరి అంతర్జంటు ఏమిటీ?" అన్నాడు విజయ్.
    ఇన్ స్పెక్టర్ విజయ్  కేసి గుర్రుగా చూసి, నరేంద్రవైపు ముఖం తిప్పాడు.
    "చెప్పు! సంగతేమిటి? ఇంత హడావిడిగా వచ్చారు?" డిటెక్టివ్ నరేంద్ర అడిగాడు.
    "హత్య! దారుణమైన హత్య!"
    "అంతేలే! నీ సర్వీసంతా చావుకబుర్లు మోయడమేగా" పెదవివిరుస్తూ అన్నాడు విజయ్. అద్వయితాన్ని ఆటలు వట్టించడం విజయ్ కు సరదా.
    "లేక పోలీసు ఉద్యోగం అంటే పెళ్ళిళ్ళ పేరయ్య ఉద్యోగం అనుకొన్నావా" విజయ్ కేసి చురచుర చూస్తూ అన్నాడు.
    "ఇంతకీ సంగతేమిటో చెప్పు!" నరేంద్ర సిగరెట్ దమ్ములాగి పొగ వదుల్తూ అన్నాడు.
    "దారుణ హత్య! స్త్రీ హత్య ! జూబిలీహిల్స్ లో  దూరంగా! ఫిలిం నగర్ దగ్గర మూడు  నాలుగు కిలోమీటర్స్ దూరంలో, ఒక చెట్టు కింద శవం ఉందట. అందమైన యువతి శవం అట."
    "ఎవరు చెప్పారు?" డిటెక్టివ్ అడిగాడు.
    "ఎవరో ఫోన్ చేశారు. పేరు కూడా చెప్పకుండా పెట్టేశాడు."
    "పేరు చెబితే మీ పోలీసొళ్లు అతడ్ని ఒకపట్టాన వదుల్తారా? అందుకే చూసిన వాటినికూడా చెప్పడానికి ఎవరూ ఇష్టపడరు" అన్నాడు అద్వాయితాన్ని చిలిపిగా చూస్తూ విజయ్.
    "విజయ్!" డిటెక్టివ్ విజయ్  కేసి చురుగ్గా చూశాడు.
    "ఊ త్వరగా బయలుదేరు. ప్రెస్  కరెస్పాండెంట్సు అక్కడకు చేరే  ముందే మనం వెళ్ళడం మంచిది" గదిలో ఆదుర్దాగా తిరుగుతూ అన్నాడు అద్వయితం.
    "ఈ పాటికి ప్రెస్ వాళ్ళంతా మనకోసం ఎదురు చూస్తూనే ఉంటారు". అంటూ నరేంద్ర లేచి కోటు వేసుకొని "అయాం  రెడీ! ఇన్ స్పెక్టర్!" అన్నాడు.
    విజయ్ ఫైల్ మడిచి టేబుల్ మీద పెట్టాడు. లోపల కెళ్ళి డ్రెస్  మార్చుకొని వచ్చాడు. గ్యారేజీలో ఉన్న ఎర్ర మారుతి ఎ.ఐ.ఎ.2000 బయటికితీశాడు. పోర్టికోలోకి తెచ్చి ఆపాడు.
    డిటెక్టివ్ నరేంద్ర, ఇన్ స్పెక్టర్ ఆద్వయితం కార్లో వెనక సీట్లో కూర్చున్నారు.
    అరగంటలో కారు బంజారా హిల్స్ దాడి, జూబ్లీహిల్స్ లో ప్రవేశించింది మరో పదిహేను నిముషాల్లో అన్నపూర్ణా స్టూడియో దాటి మూడు కిలో మీటర్లు వెళ్ళింది. కొంత దూరం వెళ్ళేసరికి రోడ్దు ఆగిపోయింది. కారు వెళ్ళడానికి అవకాశం లేదు.
    ఎర్రమారుతి2000 చూడగానే ఆగి ఉన్న వ్యాన్ లో నుంచి హెడ్ కానిస్టేబుల్ దిగాడు. అతడి వెనకే మరో ఇద్దరు కానిస్టేబుల్స్ దిగారు. మారుతి దగ్గరకు పరుగు పరుగున వచ్చారు.
    మారుతిలో నుంచి నరేంద్ర, అధ్వయితం దిగారు.
    హెడ్  కానిస్టేల్ అటెన్ షన్ లో నిలబడి శాల్యూట్ చేసి  'ఇటు సార్." అంటూ  హత్యా ప్రదేశానికి దారి తీశాడు.
    నరేంద్ర, అద్వాయితం, హెడ్డు వెనకే నడుస్తున్నారు.
    పది నిముషాల్లో ఓ పెద్ద మర్రిచెట్టు దగ్గరకు వచ్చారు. వలయాకారంగా ముగ్గురు కానిస్టేబుల్స్ నిలబడి ఉన్నారు. వాళ్ల మధ్య యువతీ నేలమీద, ఎండిపోయిన ఆకుల మధ్య మెలికలు తిరిగి పడిపోయి ఉంది. పోలీసులకు కొంచెం దూరంగా  నలుగురై దుగురు పత్రికా విలేకరులూ, మరో ఇరవైమంది దాకా జనం నిలబడి ఉన్నారు.
    డిటెక్టివ్ నరేంద్ర పత్రికలవాళ్ళనూ, జనాన్ని తప్పుకొని శవం దగ్గర కొచ్చి పరిశీలనగా చూశాడు.
    శవం మీద బ్లౌజు, చీరా చిరిగి ఉన్నాయి. జుట్టంతా చెదిరిపోయి ఉంది. పెదవుల మధ్య నుంచి నాలుక బయటికి వచ్చింది మీదరక్తం గడ్డకట్టుపోయి ఉంది. మెడ చుట్టూ కమిలిపోయి ఉంది.
    నరేంద్ర మోకాళ్ళమీద కూర్చుని  పరిశీలనగా చూశాడు.
    శవం పక్కగా పడివున్న నల్ల హండ్ బాగ్ ను కర్చీపుతో తీసి ఇన్ స్పెక్టర్ కు అందించాడు."
    "ఇన్ స్పెక్టర్! ఇక మనం వెళ్ళొచ్చు అనకుంటాను" అన్నాడు నరేంద్ర.
    అద్వయితం తల ఊపాడు హెడ్డును చూసి "శవాన్ని ఉన్మానియాకు చేర్చండి. నేను ప్ గంటలో వస్తాను" అన్నాడు ఇన్ స్పెక్టరు.
    "యస్సార్!" ఏడుకొండలు ఇన్ స్పెక్టర్ కు శాల్యూట్ చేసి కాని స్టేబుల్స్ కు సౌంజ్ఞ చేశారు.
    శవాన్ని పోలీసు వాన లోకి ఎక్కించారు-
    వాన్ కదిలి దుమ్ము రేపుకుంటూ వెళ్ళిపోయింది.
    నరేంద్ర, అద్వాయితంకారు దగ్గర కొచ్చారు. అక్కడ విజయ్  లేడు. ఇద్దరూ వెనక సీట్లో కూర్చున్నారు.
    "విజయ్ ఎక్కడి కెళ్ళాడూ?" అన్నాడు నరేంద్ర ఇన్ స్పెక్టర్ ను చూస్తూ."

 Previous Page Next Page