Previous Page Next Page 
మొగుడే రెండో ప్రియుడు పేజి 46

    అన్నమాట ప్రకారం విక్రమ్ మరునాటి ఉదయానికల్లా వచ్చేశాడు. కానీ మాట్లాడడానికి తల్లి లేదు!

    అహల్య ఈ లోకాన్ని అమితంగా ద్వేషించి, తనని తనే వెలేసుకుంటూ పై లోకాలకి వెళ్ళిపోయింది.

    తల్లి మరణవార్త విక్రమ్ ని నిలువునా కృంగదీసింది. నిన్న మధ్యాహ్నం చక్కగా, ప్రేమగా మాట్లాడిన మనిషి, ఈనాడు 'కట్టెగా' మారి ఎదురుగా వుండటం ఆశ్చర్యాన్ని కలిగించింది.

    తండ్రి దగ్గరకెళ్ళి ఏడుస్తూ, "డాడీ? ఇదెలా జరిగింది?" అని అడిగాడు.

    ఆయన "పైకి రా" అంటూ కొడుకుని తనతోబాటు పైకి తీసుకువెళ్ళి అలమారలోంచి ఫోటోలు తీసి చేతికిచ్చాడు.

    విక్రమ్ చేతిలో అతని తల్లి....భరద్వాజతో కలసి వుండగా తీసిన చిత్రాలు! ఏ కొడుక్కీ రాకూడని పరిస్థితి. అతని మోహంలో కట్టలు తెంచుకున్న ఆవేశం చోటుచేసుకుంటుండగా, "ఎవరతను?" అడిగాడు.

    జగన్మోహనరావు అంతా వివరంగా చెప్పాడు. "నన్నే విధంగానూ ఓడించలేక... మీ అమ్మని వల్లో వేసుకుని, నన్ను బ్లాక్ మెయిల్ చేస్తున్నాడు" అన్నాడు కోపంగా.

    విక్రమ్ ఏమీ మాట్లాడలేదు తండ్రితో.

    జగన్మోహనరావు డబ్బు వెదజల్లి, అహల్యది ఆత్మహత్య కాదనీ, సహజమరణమేననీ రిపోర్ట్ తెప్పించాడు.

    విక్రమ్ తల్లికి దహన సంస్కారాలు నిర్వర్తించాడు. సరిగ్గా అప్పుడే...మరొకడి దండనానికి ముహూర్తం నిర్ణయించాడు.

    అహల్య పోయిన మూడోనాడు భరద్వాజ హత్యకావింపబడ్డాడు విక్రమ్ చేత!

    భరద్వాజని హత్యా చేసిన విక్రమ్ తనంతట తనే పోలీస్ స్టేషన్ కి వెళ్ళి అరెస్ట్ అయ్యాడు.

    జగన్మోహనరావు హుటాహుటీ పరిగెత్తుకుంటూ వచ్చాడు. "నువ్వేం కంగారుపడకు...ఎంత డబ్బైనాసరే ఇచ్చి మంచి లాయర్ని పెడతాను. శిక్ష తక్కువ పడేట్లు చేస్తాను. అయినా ఇంత తొందరపడ్డం నాకు ఒక్కమాట చెప్పి వుంటే....మన చేతికి మట్టి అంటుకోకుండా..." అన్నాడు నెమ్మదిగా.

    విక్రమ్ నిప్పులుకక్కే కళ్ళతో ఆయన్ని చూశాడు. ఆ చూపులోని తీక్షణతకి ఆయన తట్టుకోలేనట్లు చూపులు వాల్చుకున్నాడు.

    విక్రమ్ ఆవేశంగా "నేను వాడ్ని చంపింది మీ కోసం, మీ కోట్లతో నడిచే వ్యాపారం కోసం కాదు! మీ కొచ్చే అపవాదులకోసం, పరపతి నష్టం కోసం అంతకన్నా కాదు!" అన్నాడు.

    "నీ తల్లి ఋణం తీర్చుకోడానికా?" వ్యంగ్యంగా అడిగాడాయన.

    "కాదు!"

    "మరి?"

    "అటువంటి నీచుడు బ్రతకకూడదు. అందుకు! నమ్మి వచ్చిన ఆడదాన్ని, అందులోనూ అమాయకంగా ప్రేమించిన ఆడదాన్ని...ఈ విధంగా మోసం చేసే హక్కు ఎవడికీ లేదు! కుట్ర పన్ని ఇంత కుత్సితంగా ఆమె మనసుని ఆమె శరీరానికన్నా ముందే చంపిన వాడికి ఏ శిక్ష విధించినా తక్కువే! ఆమె నా తల్లైనా, చెల్లైనా, భార్యైనా ఎవరైనా కానియ్యి. 'ప్రేమ' పేరుతో నయవంచనకు పాల్పడిన వాడిని బ్రతకనివ్వకూడదు!"

    అతను ఆ క్షణంలో రుధిరాగ్నిజ్వాలలు కక్కుతున్న సూర్యుడిలా వున్నాడు. అప్రయత్నంగా జగన్మోహనరావు కొడుకుని చూసి, ఒక్క అడుగు వెనక్కి వేశాడు.

    విక్రమ్ ఆయన కళ్ళల్లోకి సూటిగా చూస్తూ "భరద్వాజని నేను ప్రత్యక్షంగా హత్యా చేశాను. అందుకు నాకు శిక్ష పడుతుంది. భరద్వాజా, నువ్వూ కలసి నా తల్లిని పరోక్షంగా హత్యా చేశారు. అందుకు ఒకడికి నేను శిక్ష విధించాను. ఇంకొక వ్యక్తిని ఏ చట్టం శిక్షించలేదు. కేవలం ఆత్మసాక్షి తప్ప! నాకు మీ లాయర్లూ, డబ్బూ, పైరవీలు ఏమీ వద్దు! ఆ ఇంటికన్నా ఈ జైలు నాకు విశాలంగా, స్వేచ్చగా కనిపిస్తోంది. మీరు చేయవలసినదల్లా ఒకటే. అదే అమ్మ డయరీలు...నా టేబుల్ మీద వుంటాయి చూడండి! ఆమెని అర్ధం చేసుకోవడానికి కాదు. అందువల్ల ప్రయోజనం కూడా లేదు. మీరు ఏవిటో ఆవిడ దృష్టిలో మీకు తెలియడానికి" అన్నాడు.

    జగన్మోహనరావు తల వంచుకున్నాడు. అక్కడినుంచి ఇవతలికి వస్తుంటే మొదటిసారిగా ఆయనాకి తను 'ఏమీ లేనివాడిననే' భావన కలిగింది.

    ఆ రాత్రి అహల్య జీవితాన్ని చదువుతుంటే, కళ్ళనిండా నీళ్ళు చేరి అక్షరాలు మసక మసకగా మారి కనిపించడం మానేశాయి. పూర్తిగా చదవడం ఆయన శక్తికి మించిన పనయింది.

    వ్యక్తుల్ని భరించవచ్చు! వ్యక్తిత్వాన్ని భరించడం కష్టం! వ్యక్తిని హత్యచేసినవాడు శిక్షింపబడతాడు. వ్యక్తిత్వాన్ని హత్య చేసినవాడు నిర్లజ్జగా తిరుగుతుంటాడు. నిజానికి రెండోది మొదటి దానికన్నా ఘోరమైన నేరం! ఇటువంటి హంతకులు ఎందరో వుంటారు మనచుట్టూ.

    ఆ రాత్రి ఆయన జాగరణం చేశాడు. మేలుకునే కలలుకన్నాడు! అహల్యా, విక్రమ్ మాటిమాటికీ ఆయన కళ్ళముందుకి వచ్చి నవ్వుతూ ఎగతాళి చేస్తూనే వున్నారు.

 Previous Page Next Page