ఎప్పుడెప్పుడు తెల్లవారుతుందా అని ఎదురుచూసి తెల్లవారగానే ఆయన పరాత్సరరావుకి ఫోన్ చేసి ఎపాయింట్ మెంట్ తీసుకున్నాడు.
పరాత్పరరావు పేరుమోసిన లాయర్. ఆయన కేసు పట్టాడంటే అది గెలవకపోవడమన్నది అప్పటిదాకా జరగలేదు.
* * *
పరాత్పరరావు తన ప్రతిభతో 'విక్రమ్ ఆవేశంతో, అనాలోచితంగా కన్నతల్లి మీదున్న ప్రేమకొద్దీ చేసిన హత్య'గా వాదించి కేవలం మూడు సంవత్సరాల శిక్ష పడేటట్లు చేయగలిగాడు.
* * *
వార్త విన్న వర్షిణి వెంటనే హైదరాబాద్ వచ్చింది.
"విక్రమ్ ఇదంతా ఏమిటి? ఎలా జరిగింది?" వర్షిణి హృదయం వూడిపడేటట్లు ఏడుస్తూ అడిగింది.
విక్రమ్ ఆమె వంక ఆర్తిగా చూసి "నేను స్త్రీని చాలా గౌరవిస్తాను వర్షిణీ" అన్నాడు. ఆమె అతని కళ్ళలో కనిపిస్తున్న, అనిర్వచనీయమైన భాషకందని ఆరాధనని చూడసాగింది. "స్త్రీకి కూడా ఒక మనసుంటుందనీ, దానికి స్పందనలూ, కోరికలూ వుంటాయనీ, పట్టించుకోకుండా తన అవసరం తను తీర్చుకుని ఆమె మనసు ముక్కలు చేసే పురుషుడ్ని నేను క్షమించలేను. మీ ఆడవారు పరిస్త్య్తులు పూర్తిగా చేజారిపోయాక కానీ మీ స్వంత్రంత్ర్యాన్ని, కోరికల్నీ మీరు అనుభవించాలనుకోరు! మనసు లేకుండా కాపురాలు చేస్తూ...పిల్లల్ని కంటూ...ఏం గొప్ప మాతృత్వం మహత్తరం అని పాడుకుంటూ ఏం సాధించదానికి? పిల్లీ ఈనుతుంది తొమ్మిది ఈతలు" అన్నాడు విరక్తిగా. అంతలోనే "వర్షిణీ నువ్వు నాకుమాటియ్యి...ఎట్టి పరిస్థితుల్లోనూ మనసు లేని కాపురాన్ని చెయ్యననీ....అవసరమైతే ప్రపంచాన్ని ఎదిరిస్తాననీ నాకు మాటియ్యి" అన్నాడు విక్రమ్ ఆమె కళ్ళలోకి లోతుగా చూస్తూ.
వర్షిణికి ఆ నిమిషంలో కటకటాలు విరిచేసి అతన్ని దగ్గరగా తీసుకునే శక్తివస్తే బావుండును అనిపించింది.
"అలాగే విక్రమ్....తప్పకుండా మాటిస్తాను. ఎట్టి పరిస్థితిలోనూ మనసులేని కాపురం చేయను" అంది డగ్గుత్తికతో.
"నాకు తెలుసు నా వర్షిణి ఎంతటి ధైర్యస్తురాలో? నాకు నవ్వుతూ, కవ్విస్తూ హుషారుగా వుండే నా వర్షిణి కావాలి! ఇలా ఏడిచే అమ్మాయి నాకొద్దు" అన్నాడు అతని కళ్ళలోని సన్నటి నీటితెర ఆమె నుండి దాచలేకపోయాడు.
వర్షిణి కటకటాలని పట్టుకున్న అతని మునివేళ్ళను తాకుతూ, "నేను రోజూ నా ఆనందాల్నీ, విషాదాల్నీ, ఆలోచనల్నీ, ఆవేదనల్నీ దండగా గుచ్చి ఉత్తరాల్లో భద్రపరుస్తాను. మూడేళ్ళ తరువాత నువ్వు రాగానే ఆ దండ నీ మెడలో వేస్తాను. ఎంత బావుంటుందో వూహించుకో!" అని, కళ్ళు తుడుచుకుని కలకలా నవ్వి "అప్పుడు నువ్వు ఏం చేస్తావో తెలుసా?" అంది.
అతను నిర్లిప్తంగా ఆమెవైపు చెప్పమన్నట్లు చూశాడు.
"తెల్లని లాల్చీ పైజమా వేసుకుని...శుభ్రంగా గడ్డం చేసుకుని....అదిగో, ఆ బుంగమూతి పెట్టకు! గడ్డం మనకీ అడ్డం కదా! వెనక్కి వాలి నువ్వు దిండుకు జారగిలబడి నా ఉత్తరాలు చదువుకుంతావు. నేను నీ మోకాలి మీద నా గడ్డాన్ని ఆన్చి నీ కళ్ళల్లో భావాల్ని పగ్గాలు వేసి పట్టుకోవడానికి ప్రయత్నిస్తుంటాను. చిరునవ్వుతో చదువుతున్నవాడి వల్లా నా నెత్తిమీద మొట్టికాయ వేస్తావు. ఎందుకంటే...."
మొదట్లో చాలా నిరాసక్తంగా వింటున్నవాడల్లా, ఆమె చెప్పే తీరుకి ఆకర్షితుది, అందులోని తీపిని ఆస్వాదించడం ప్రారంభించి ఆలస్యం భరించలేనట్లు ఉద్వేగంగా చూశాడు.
"ఎందుకంటే....నా అల్లరి ఆలోచనలూ, చిలిపి వూహలూ తెలిసి నేను ముద్దొచ్చేస్తానన్నమాట! 'అమ్మ దొంగా, నీకు చాలా తెలుసే' అంటూ నన్ను దగ్గరికి తీసుకోబోతే నేను తల అడ్డంగా వూపి హఠం చేస్తూ 'అన్నీ చదవాల్సిందే' అంటాను. నువ్వు నిస్సహాయంగా మన చుట్టూ ఎగురుతున్న వేలాది ఉత్తరాలు చూస్తూ 'సీరియస్ గా చదువుతాను' అంటావు. నేను కోపం తెచ్చేసుకుంటాను నన్ను నీలో పొదుపుకుంటూ 'ఈ ఉత్తరాలు బైండ్ చేయించి' దాస్తాను మన పిల్లలకి చూపించాలిగా! అంటావు. నేను నీ స్పర్శలో లాలిత్యానికి కరిగిపోతూ, నీ గుండెల్లో గువ్వపిట్టలా...ఏయ్? ఏమిటీ? ఎక్కడికెళ్ళిపోయావ్?" ఆమె అతని కళ్ళముందు చిటికెలు వేస్తూ అల్లరిగా అడిగింది.
స్వప్నావశిష్టుడిలా వింటున్న అతను వులిక్కిపడ్డాడు. ప్రేమంతా గుండెలోతుల్లోంచి చోపులతో తోడి ఆమెని అభిషేకిస్తూ "ఎంత పిచ్చి దానివి వర్షిణీ, నీకేంరాదు ప్రేమించడం తప్ప! నీకేం దాచుకోకుండా మొత్తంగా నీ ప్రేమంతా ప్రేమించిన వారికి ధారపోస్తావు. ప్రేమకి నిర్వచనం నా వర్షిణి" అన్నాడు.
"త్వరగా వచ్చేసెయ్... నీ కోసం ఎదురుచూస్తుంటాను" అంది తన కంటి నీరు అతనికి కనిపించకుండా చప్పున తల వంచుకుని.
"ఇట్టే రాదూ...మూడేళ్ళు ఓ పెద్ద కాలమా? నీలాంటి ప్రేయసి వుంటే ఆ తలపులతో ముప్పై ఏళ్ళు ఆనందంగా గడిపేయయచ్చు" నవ్వుతూ అన్నాడు.
వర్షిణి కూడా నవ్వేసింది! సమయం అయిపోవడంతో ఆమెకు అతన్ని వదలిరాక తప్పలేదు.
బయటికి రాగానే అడుగు వేసే శక్తి లేనట్లు క్రిందే కూలబడిపోయి, గుండె తేలికపడేటట్లు దుఃఖించింది.


