అహల్యకి ఒక్క నిమిషం, కత్తితో ఎవరో నిలువునా చీరినట్టుగా అనిపించింది. మరునిమిషం భగ్గుమన్న మంట మొదలయింది. "అమ్మా!" అన్న అరుపు ఆ గదిలో మార్మోగింది.
తెల్లని ఆ శరీరం మీద రక్తం గూడుకట్టుకుని, ఎర్రగా ఏర్పడిన చార, అతన్ని మరింత ఉన్మత్తుడిని చేసింది మరో దెబ్బ! ఈసారి ఇంకా సున్నితమైన ప్రదేశంలో పడింది. అహల్య పెద్దగా ఆక్రంధనచేస్తూ నేలమీద వాలిపోయింది. ఆమె ఏ.సి.లో తప్ప ఎప్పుడూ క్షణం కూడా ఊపిరి పీల్చలేదు. గట్టిగా ఎండలో, చలిలో ఎప్పుడూ శరీరాన్ని నిలబెట్టలేదు! ఏడు మల్లెపూల ఎత్తుగా పెంచుకున్న సుకుమారమైన తనూలత ఆమెది. ఆమెకి అతను కొట్టే దెబ్బలు తెలీకుండా ఒళ్ళంతా మొద్దుబారుతోంది. బాధ భరించలేని శరీరం స్పృహ తప్పుతోంది అనడానికి నిదర్శనంగా నెమ్మదిగా కళ్ళు మూతలు పడుతున్నాయి.
అప్పుడు...ఆమె జుట్టు పట్టి, కసిగా పైకెత్తి, "ఏమిటీ? అని అడిగావుగా, ఇదిగో చూడు! నీ రాసలీలలు" అంటూ ఆమె ముఖం మీదకి విసురుగా పడేశాడు చేతిలోని ఫోటోలని.
ఆమె బలవంతంగా కళ్ళుతెరవడానికి ప్రయత్నిస్తూ, ఆ ఫోటోలని చూసింది. ఈలోగా మరో దెబ్బ పడింది ఆమె ముఖం మీద! ఈసారి ఆమె ఆక్రందన చెయ్యలేదు. ఆ 'దెబ్బ'ల కన్నా చేతిలోని ఫోటోలే ఎక్కువ బాధ పెడ్తున్నట్లు కాళ్ళ నుంచి నీరు జలజలా కారిపోతోంది.
జగన్మోహనరావు చేతిలోని బెల్ట్ విసిరికొట్టి వొగరుస్తూ అన్నాడు "వాడు...ఆ భరద్వాజగాడు....బిజినెస్ లో నన్ను ఏ విధంగానూ దెబ్బ తియ్యలేకపోయాడు. చవట వెధవ! ఈమధ్య....తారసపడకపోతే....ఎక్కడో కట్టెలమ్ముకుంటుంన్నాడేమో అనుకున్నాను. కానీ నాకే కాష్టం తయారుచేస్తున్నాడనుకోలేదు. ఛీ....ఛీ...ఎంత నీచానికి ఒడిగట్టాడూ? కోట్లకి సంబంధించిన నా టెండర్ ఒకటి నేను విత డ్రా చేసుకోకపోతే, ఈ ఫోటోలన్నీ, వాల్ పోస్టర్లుగా నా ప్రతి ఆఫీసు బిల్డింగ్ మీదా అంటపెట్టిస్తాడుట! ఈసారి పరువుకోసం వదిలేసినా....మరోసారి ఇలాగే బ్లాక్ మెయిల్ చేస్తాడు కదా! ఆ నెగిటివ్ లు వాడి దగ్గర వున్నంతకాలం ఇలా సాగించుకుంటాడు. నేను అడుక్కుతినేవరకూ వాడు శాంతించడు. నీవల్ల...ఇదంతా నీ వల్ల...అసలూ...నిన్నూ..." ఆమె తలని గోడకేసి కచ్చగా కొట్టాడు. "థూ" అంతలోనే చీత్కారం చేసి, వదిలేసి వెళ్ళిపోయాడు.
అతను వెళ్ళిపోయాక ఆమె తన శరీరాన్ని తన అధీనంలోకి తెచ్చుకుని లేచి కూర్చోవడానికి ప్రయత్నించింది. ఒక్క అవయవంకూడా సహకరించలేదు! ఎదురుగా చిందర వందరగా నేలమీద పడి వున్న ఫోటోలని చూస్తున్న కొద్దీ ఆమె కడుపులో బాధ సుళ్ళు తిరుగుతోంది.
భర్త అన్న మాటలకీ, కొట్టిన దెబ్బలకీ ఆమె బాధపడడం లేదు. తను గుడ్డిగా నమ్మి...ప్రేమించి...సర్వం సమర్పించిన భరద్వాజ తనను ఇంత దారుణంగా మోసం చేశాడన్న సత్యం ఆమె జీర్ణం చేసుకోలేకపోతోంది.
అతని కబుర్లు విని, అతను కూడా తనని నిజంగా ప్రేమించాడనుకుంది. పోనీ, కేవలం తన అందం చూసి, పిచ్చివాడయిపోయి, తనని 'ట్రాప్' చేసి అనుభవించి వదిలేసినా ఆమె అంతగా బాధపడేది కాదేమో! కానీ, అతను...తన కోసం కాక...తన భర్తని వ్యాపారంలో దెబ్బ కొట్టాలని ఒక పథకం ప్రకారం ఇదంతా చేశాడన్న చేదు నిజాన్ని ఆమె తట్టుకోలేకపోతోంది. ఆమె 'ఈగో' ఘోరంగా దెబ్బతింది.
నమ్మి...అతని ఆనందానికై...పూర్తిగా సహకరిస్తున్న స్త్రీని వంచన చేసి, రహస్యంగా ఫోటోలు తీయించిన నైచ్యాన్ని ఆమె తట్టుకోలేకపోతోంది. వాడ్ని ముక్కలు, ముక్కలుగా నరికెయ్యాలన్న కోరిక కలిగింది.
అంతకుముందు రోజు ఆమె ఫోన్ చేస్తే అతను మాట్లాడ్తూ, మాట్లాడ్తూ మధ్యలో కట్ చేశాడు. ఆమె మళ్ళీ చేసింది. "బిజీగా వున్నాను" అని విసుక్కున్నాడు.
ఆమె ఉక్రోషంతో వెంటనే బయల్దేరి వెళ్ళింది. లోపల వుండే పనివాళ్ళతో లేడని చెప్పించాడు. ఆమె ఏడుస్తూ, మనసు వికలం చేసుకుని ఎక్కడ ఎక్కడో తిరిగి ఇల్లుచేరింది. రాగానే భర్తతో ఘర్షణ జరిగింది. భరద్వాజతో తన సంబంధం గురించి, ఎవరో ఫోన్లో చెప్పారట! తనూ తెగించి మాట్లాడింది.
"నీ కొడుక్కి టెలిగ్రాం ఇచ్చి పిలిపించి, వాడితో అన్నీ చెప్పేస్తాను" అన్నాడు చివరి అస్త్రంగా.
ఆమె భయపడింది. "వద్దు, ఇంకెప్పుడూ వెళ్ళను, అన్నీ మానేస్తాను" అని అతన్ని బతిమాలుకుంది!
ఆ రాత్రే నిశ్చయించుకుంది. అన్నీ మానేసి, తిరిగి ఇదివరకులా మారిపోవాలని ఇంతలో... ఇలా... ఆమెకి చాలా విరక్తిగా, ఈ ప్రపంచం అంటేనే చెప్పలేనంత వెగటుగా అనిపించింది.
మధ్యాహ్నం కొడుకు దగ్గర్నుంచి ఫోన్ వచ్చింది. అతను రాత్రి బయల్దేరి మర్నాడు వస్తున్నట్టుగా చెప్పాడు.
ఆమె అతనితో చాలా ప్రేమగా మాట్లాడింది. "కన్నా! నిన్ను త్వరగా చూడాలని వుందిరా...కానీ!"
"అదేవిటే? రేపు చూద్దువుగాని, వచ్చేస్తున్నాగా! నేనూ మీతో ఒక విషయం అర్జెంట్ గా చెప్పాలి" అన్నాడు.
"ఎవరినైనా ప్రేమించావా?" ఆమె భావ రంజితంగా అడిగింది.
"ఔను" వెంటనే చెప్పాడు.
"మన ఇంట్లో ప్రేమ అచ్చిరాదేమోరా కన్నా!" ఆమె భారంగా అంది.
"అదేం మాట? సరే...సరే....రేపు వచ్చాక మాట్లాడుకుందాం" ఫోన్ పెట్టేశాడు విక్రమ్!
అహల్య టేబుల్ మీద వున్న విక్రమ్ ఫోటోని చేతిలోకి తీసుకుని ముద్దు పెట్టుకుంది.
ఆమె కళ్ళ నుంచి స్రవిస్తున్న కన్నీటి చుక్కలు రెండు జారి ఫోటోమీద పడ్డాయి.
* * *