Previous Page Next Page 
మొగుడే రెండో ప్రియుడు పేజి 42

    రవిశంకర్ సితార్ వింటూ, బాలమురళీ గాత్రంలో కరిగిపోతూ, క్షేత్రయ్య పదాలలో భావానికి కదిలిపోతూ, తనూ చరిత్రలో వివశమై పోతూ, కృష్ణశాస్త్రి ఊర్వశిలో విలీనమైపోతూ ఆమె కలలు కన్న వూహా సుందరుడు ఇతడు కాడు!

    "చిన్న వయసులోనే చాలా డబ్బు సంపాదించాడు. ఇంకా సంపాదిస్తాడు కూడా!" అంటూ తండ్రి ఆనందంగా జగన్మోహనరావుతో అహల్య పెళ్ళి జరిపించాడు.

    అహల్య అందం ఆ వయసులో కళ్ళు తిప్పుకోనిచ్చేది కాదు ఎవర్నీ ఆ సంగతి ఆమెకి తెలియడం ఆమె దురదృష్టం! ఆమె అందాన్ని చూసుకుని ఆమె అమితంగా గర్వపడేది.

    కోటి కోర్కెలతో శోభనం గదిలోకి అడుగుపెట్టిన ఆమెకి అర్ధగంటలో తెలిసింది తన భర్తకి భావుకత్వంతోపాటు శృంగారం కూడా చాతకాదని!

    అతను గోడవైపు తిరిగి గురకపెడ్తూ వుంటే, ఆ ధ్వని గదిలో ప్రతిద్వనిస్తూ, ఆమె ఇరవై ఏళ్ళుగా తనలో పెంచుకున్న అందాన్నీ, అహాన్నీ కూడా పరిహసించినట్లు అనిపించింది.

    ఆ అర్దరాత్రి గది తలుపులు తీసుకుని పరిగెత్తుకుంటూ వెళ్ళి తన బీరువాలో దాచుకున్న తన కొచ్చిన వందలాది ప్రేమలేఖల్ని గుండెలకి హత్తుకుని బోరుమని తనివితీరా ఏడవాలనిపించింది.

    ఆ రాత్రినించీ ఆమెకి అలా అనిపిస్తూనే వుంది! కొంతకాలానికి అలవాటయిపోయి అనిపించడం మానేసింది.
   
    జగన్మోహనరావుకి ఆమె ఒక అవసరం తీర్చే సాధనం మాత్రమే! ఆమె అందచందాలూ, మనోభావాలూ అతనికి అవసరంలేదు.

    అహల్య చాలా యాంత్రికంగా ఒక బిడ్డకు తల్లిగా మారింది. ఆమె నిస్సారమైన జీవితంలో ఆమె కొడుకు కొంత చైతన్యాన్ని నింపాడు. అదీ ఓ పన్నెండు సంవత్సరాలే! ఆ తరువాత మగపిల్లవాడు కావడంతో దూరం అయ్యాడు. స్నేహితులవల్ల కొంతా, చదువు పేరుతో కొంతా!

    ప్రొద్దుటే లేచి ఎక్సర్ సైజులూ, ఫేస్ కి ప్యాక్ లూ వేసుకుంటూ, బిజీగా వుండే తల్లీ, రాత్రి అప్పుడప్పుడూ, పగలు ఎప్పుడన్నా కనిపించే తండ్రీ, ఆ కొడుకుని పెద్దగా ఆప్యాయతని అందించలేకపోయారు.

    ఫలితంగా అతను వారినుండి తప్పుకు తిరగడం మొదలుపెట్టాడు. కొన్నాళ్ళకి ఆ ఇంటి వాతావరణాన్ని భరించలేని స్థితికి వచ్చేశాడు. చదువు వంకతో ఆ ఇంటినుండి తప్పించుకున్నాడు.

   
                                                                  *    *    *

    అహల్యలాంటి స్త్రీలు కోకొల్లలు. నిరాసక్తంగానే జీవితాన్ని కడదాకా ఈడ్చి కడతేరిపోయే కథలెన్నో!

    అహల్య జీవితం కూడా అలాగే గడిచిపోయేది భరద్వాజ పరిచయం కాకపోతే.

    భరద్వాజతో ఆమె పరిచయం చాలా మామూలుగా ఒక పార్టీలో జరిగింది. రూప గార్డెన్ లో ఏర్పాటయిన ఆ పార్టీలో అందరూ జంటలుగా చేరి కబుర్లు చెప్పుకుంటూ డ్రింక్ చేస్తున్నారు.

    అహల్య ఎప్పటిలాగే ఒంటరిగా కూర్చుని 'జిన్' సిప్ చేస్తోంది. జగన్మోహనరావు సాధారణంగా ఆమెతో కలిసి ఎక్కడికీ రాడు అతనికి ఇష్టం వుండదు.

    బేరర్ ట్రే ఆమె దగ్గరకు తీసుకురాగానే ఆమె ఖాళీ గ్లాసు అందులోపెట్టి మరో గ్లాసు అందుకుంటుండగా...ఎక్కడినుండి వచ్చిందో ఒక బొద్దింక ఎగురుతూ వచ్చి ఆమె గ్లాసుమీద వాలింది. ఆమె కెవ్వుమని అరుస్తూ చేతిలోని గ్లాసు జారవిడిచింది.

    ఇంతలో ఓ చెయ్యి ఆమె భుజాన్ని గుచ్చి పట్టుకుంది. "వాట్ హాపెండ్?" అడిగాడు ఆ వ్యక్తి.

    ఆమె ఇంకా ఆ కంగారులోంచి తేరుకోలేదు.

    "పు....రు...గు" అంది భయంగా. అప్పటికే ఆమె పాదంమీద గ్లాసుపడి పగలడం వలన, గాజు పెంకు గుచ్చుకుని మంట పెడ్తోంది. చప్పున వంగి, పాదం పట్టుకుని "అమ్మా" అంది బాధగా.

    అతను ఆమె పాదాల దగ్గర కూర్చుని, చీర కుచ్చిళ్ళు గబగబా పైకెత్తి "అరె బ్లడ్ వస్తోంది" అన్నాడు. వెంటనే తన జేబులో నుండి కర్చీఫ్ తీసి కత్తు కట్టాడు. అయినా ఆమె కుచ్చిళ్ళు క్రిందకి జార్చనివ్వలేదు. అలాగే పట్టుకుని 'బ్యూటీఫుల్' అని గొణిగాడు.

    అహల్య స్పృహలో కొచ్చినట్లు సిగ్గుపడింది. అతన్ని విడిపించుకోజూసింది.

    పెద్ద మోతతో స్టీరియోలోంచి మ్యూజిక్ అదిరిపోతోంది అందరూ ఉత్సాహంగా నృత్యం చేస్తున్నారు.

    అతను నెమ్మదిగా లేచి, ఆమె నడుం మీద తన చేతులు వుంచి లయగా అడుగులు వేస్తూ "కమాన్" అన్నాడు.

    అహల్య అసంకల్పితంగా అతని చేతితో అటూ ఇటూ కదలసాగింది. ఇద్దరూ నృత్యం చేస్తున్నారు.

    "నా పేరు భరద్వాజ" చెప్పాడతను ఆమె కళ్ళలోకి చూస్తూ.

    ఆమె కూడా ఈసారి అతని వంక నిర్భయంగా చూసింది చాలా ఆకర్షణీయంగా వున్నాడు. నలభై ఐదు ఏళ్ళలోపే వుండవచ్చు. ముఖం మీద పడ్తున్న అతని ముంగురులలో ఓ పక్క తెల్లగా వున్న వెంట్రుకలు కూడా అతనికి హుందాతనాన్ని ఇచ్చాయి. అతని కళ్ళు చాలా లోతుగా ఆమెని చీల్చుకుని వెళ్తున్నట్లుగా చూస్తున్నాయి. అతని పెదవులు వొంపు తిరిగి అది రకమైన కవ్వింపుతో కూడిన నవ్వు నవ్వుతున్నాయి. అతను చాలా పొడగరి. ఆమె గడ్డం అతని గుండెలకి తాకుతోంది.

 Previous Page Next Page