Previous Page Next Page 
మొగుడే రెండో ప్రియుడు పేజి 41

    ఆమె ఎక్కి కూర్చోగానే అతను బైక్ స్టార్ట్ చేశాడు.


    ప్రేమా పర్వతారోహణా ఒక లాంటివే! క్రిందకి చూస్తే కళ్ళు తిరుగుతాయి. పైకి ఎక్కుతూనే వుండాలి. శిఖరాన్ని అందుకునే దాకా!
   
                                               *    *    *

    జగన్మోహనరావు చాలా తీవ్రంగా ఆలోచిస్తున్నాడు.

    ఆయన సెక్రటరీ అర్జెంట్ మెస్సేజ్ ఒకటి ఇద్దామని రెండుసార్లు వచ్చి కూడా, ఆ పరిస్థితుల్లో ఆయన్ని కదపడం ఇష్టం లేక, వెనక్కి తిరిగి వెళ్ళిపోయింది.

    ఆయన తన మొహాన్ని రెండు చేతుల్లోనూ దాచుకొని కూర్చున్నాడు. 'తృప్తి' కన్ స్ట్రక్షన్స్ అధినేత, సిటీలో కెల్లా పేరున్న రియల్ ఎస్టేట్స్ వ్యాపారం చేసే పారిశ్రామిక వేత్తా అయినా జగన్మోహనరావుని ఇంత డిప్రెస్డ్ మూడ్లో ఆయన స్టాఫ్ ఎవరూ, ఎప్పుడూ చూసి వుండలేదు. ఎటువంటి పరిస్థితుల్లో అయినా, చాలా వేగంగా నిర్ణయాలు తీసుకోవడం, అమలు చేయించడం, దేనికీ చలించకపోవడం ఆయన ప్రత్యేకతలు.

    'ఆయన పట్టిందల్లా బంగారం అవుతుంది' అనే జనవాక్యం వుంది. ఆయనకీ బిజినెస్ మేగ్నేట్ అనే పేరు వుంది. ఎంతమంది మిత్రులున్నారో అంతమంది ప్రత్యర్దులూ వున్నారు. ఆయన ప్రాపకంలో బాగు పడాలనుకునేవారు మిత్రులుగానూ, ఆయన్ని బిజినెస్ లో అదిగమించాలనుకునేవారు శత్రువులుగానూ మారారు. సామాన్యమైన తెలివితేటలే వున్నా, కష్టపడే మనస్తత్వం, రిస్క్ తీసుకునే ధైర్యం వున వ్యక్తికి ఎప్పుడూ విజయం లభించే అవకాశాలు పుష్కలంగా వుంటాయి. జగన్మోహనరావులో చివరి గుణం ఎక్కువ! 'రిస్క్' తీసుకోవడానికి ఎన్నడూ వెనుకాడలేదు. అదే అతని విజయ రహస్యం!

    ఆయన సెక్రటరీ మళ్ళీ వచ్చింది. ఈసారి తిరిగి వెనక్కి వెళ్ళలేక "సార్!" అంటూ పిల్చింది.

    ఆయన చేతులలో నుండి మొహాన్ని తియ్యకుండానే "ఎస్!" అన్నారు చెప్పమన్నట్లుగా.

    ఆమె గొంతు సవరించుకుని "వినోభానగర్ లో ఈవేళ భూమి పూజ. అక్కడి మార్కెటింగ్ మేనేజర్ ఫోన్ చేశాడు. మీరు బయల్దేరుతున్నారా అనీ."

    "నో" వెంటనే చెప్పాడాయన.

    ఆమె ఆశ్చర్యంగా చూసింది. ఇలా ఎన్నడూ జరగలేదు. ఎన్ని పనులలో వున్నా, తను స్వయంగా వెళ్ళి, కొబ్బరికాయ కొట్టటం ఆయన అలవాటు. సెంటిమెంట్ కూడా!

    ఆమె అక్కడ నుండి వెళ్ళిపోతూ, తనలో తనే బాస చాలా డిస్టర్బ్ డ్ గా వున్నాడు. బిజినెస్ పరంగా అంత నష్టమేం జరగలేదే! అనుకుంది.

    ఓ మాత్రం నష్టాలు ఆయన్ని కదిలించలేవని ఆమెకి తెలుసు.

    ఈ నెలలో ఇటువంటి మూడ్ లో, మూడోసారి చూడడం అనుకుంది. ఆ తరువాత వినోబానగర్ మార్కెటింగ్ మేనేజర్ కి ఫోన్ చేసి "పూజ కానిచ్చేయండి, ఎం.డి. గారికి ఒంట్లో బాలేక రాలేకపోతున్నారు" అని చెప్పింది.

    మొదటిసారిగా జగన్మోహనరావు సెంటిమెంట్ కి భిన్నంగా ప్రవర్తించిన రోజు అది! బిజినెస్ పీపుల్ సెంటిమెంట్స్ కి ఇచ్చినంత విలువ దేనికీ ఇవ్వదు. అటువంటిది అది కూడా మరచిపోగలిగేటంత పెద్ద సమస్యలో ఇరుక్కున్నాడాయన.

    ఆయన సమస్య అహల్య.

                                                                        *    *    *

    అహల్య చాలా అందమైన స్త్రీ. ఆమె నవ్వులో సన్నజాజులు విరబూస్తాయనీ, ఆమె చూపులో వెన్నెల కురుస్తుందనీ, ఆమె చూపులో వెన్నెల కురుస్తుందనీ, ఆమె మీద కవిత్వం చెప్పేవాళ్ళు ఆమె వయసులో వున్నప్పుడు.

    ఇప్పుడు ఆమె వయసు నలభై రెండు సంవత్సరాలు. చూసిన వాళ్ళు ఠక్కుమని "ముప్పై ఏళ్ళుంటాయి" అని పప్పులో కాలేస్తారు. తన శరీరం గురించి ఆమె తీసుకునే జాగ్రత్తలు కూడా కొంతవరకూ అందుకు కారణం. భగవంతుడు జన్మతః ఇచ్చిన సౌందర్యం వరమైతే 'కీప్ ఫిట్' లూ, 'బ్యూటీ కేర్' లూ ఆ వరాన్ని ఇన్ని సంవత్సరాలుగా కాపాడుకుంటూ వస్తున్న సాధనాలు.

    ఆమె భర్తతో కలిసి వెళ్తూంటే, తండ్రీ కూతుళ్ళు అనుకుంటారు తెలియనివాళ్ళు. ఆమె జగన్మోహనరావు అర్ధాంగి.

    మానవుని సాంఘిక జీవన పరిస్తితులే అతని ఆలోచనా విధానాన్ని నిర్ణయిస్తాయి అనడానికి నిదర్సనం అహల్యా, జగన్మోహనరావుల మనస్తత్వాలు!

    మధ్యతరగతి నుండి కష్టపడి పైకొచ్చిన ఆయనకీ, పరబ్రహ్మ డబ్బేస్వరూపం. దానిముందు అందాలూ, భావుకతలూ అన్నీ బలాదూర్.

    పుట్టుకతోటే బంగారు ఉగ్గుగిన్నెతో ఉగ్గు తాగిన అహల్యకి, డబ్బు అంటే లెక్కలేదు. ఆ యావలోపడి అతి చిన్న వయసులోనే వృద్దుడయిపోయిన భర్తని చూస్తే జాలి!

    పండు వెన్నెలలో కూర్చుని భర్తకి చిలకలు మడిచి అందిస్తూ "ఎంత బావుందో కదూ!" అంటే,

    "ఔను! ఈపాటికి సైట్ లో స్లాబ్ వేసేసే వుంటారు. ఇంకా ఫోన్ రాలేదేమిటి చెప్మా?" అనే అతన్ని చూస్తే తనమీద తనకే పుట్టెడు జాలి! అహల్య వూహల్లో వూహించుకున్న సహచరుడికి పూర్తిగా వ్యతిరేకం ఆమె భర్త!

 Previous Page Next Page