అతను గుసగుసగా "ఈ దేవత పేరు తెలుసుకోవచ్చా?" అడిగాడు.
"అహల్య" చిన్నగా నవ్వి చెప్పింది.
అతనో నిమిషం ఆగి "మీ పేరు అహల్య కాకుండా వుంటే బావుండేది" అన్నాడు.
ఆమె ఉలిక్కిపడి రెప్పలల్లార్చి చూసింది.
"ఆ అర్ధం అంత బావుండదు లెండి" అన్నాడు సీరియస్ గా.
ఆమె ఆ అర్ధం గురించి ఆలోచిస్తూ వుండగా,
"వెన్నెల అని పెట్టి వుంటే మీకు సరిగ్గా సరిపోయేది" అన్నాడు.
ఆమెలో సన్నగా ప్రకంపనలు మొదలయ్యాయి. అలౌకికమైన స్థితిలో అతనివైపు అనిమిషంగా చూస్తుండిపోయింది.
ఆమె గులాబీ రేకుల వంటి పెదవులు మెల్లగా అదురుతుండగా అతను ముందుకి వొంగాడు.
అహల్య కళ్ళల్లో లీలగా భయం పొడజూపింది.
అతను అది గ్రహించి, వెనక్కి జరుగుతూ, "మీకు అభ్యంతరం అయితే వద్ద్దు" అన్నాడు.
ఆమె అతని కళ్ళలోకి సూటిగా చూసింది. ఈసారి ఆ చూపులో ఓ మెరుపు...ఆహ్వానం కనిపించాయి.
అతని కళ్ళు నవ్వుతున్నాయి! "మీరు వెన్నెల, నేను వెన్నెల పురుగుని. మీకు నా వెన్నెల కోలు" అన్నాడు.
ఆమె నవ్వింది. ఈసారి అతను ముందుకి జరుగుతుంటే ఆమె తప్పించుకోలేదు!
"సో స్వీట్" అన్న అతని కాంప్లిమెంట్ కి ఆమె పదహారేళ్ళ పడుచులా సిగ్గుపడింది. చంద్రకాంతి సోకి మురిసిపోయే కువలయంలా కళకళలాడింది.
మ్యూజిక్ ఆగిపోయింది.
"వస్తా, మళ్ళీ కలుద్దాం" అతను వెళ్ళిపోయాడు.
కానీ ఆమె మనసులోంచి అతను అంత త్వరగా వెళ్ళిపోలేదు. పెళ్ళయిన ఇరవై సంవత్సరాల తర్వాత తన అందాన్ని పొగిడిన మగవాడు. తన పాత జీవితాన్నీ, మరిచిపోయిన యవ్వనాన్నీ తిరిగి గుర్తుచేసిన మగవాడు! అందులోనూ అందమైన మగవాడు! ఆమెని అంత త్వరగా మరిచిపోనివ్వలేదు.
పొగడ్త పన్నీరు వంటిది. వాసన చూసి వదిలెయ్యాలే కానీ, తాగుతూ కూర్చోకూడదు! కానీ, స్త్రీలు ప్రతిసారీ మోసపోయి, తాగి, వెగటుపుట్టి, జీర్ణంకాక, జీవితాలు పోగొట్టుకుంటూనే వుంటారు.
మగవాడి అవసరం ఆమె అందం అయితే, అతని నోటి నుంచి వచ్చే పొగడ్త ఆమె బలహీనత!
ఆమె పార్టీ నుంచి ఇంటికి రాగానే ఫోన్ వచ్చింది. ఆమె అవతలి నించి విన్పించిన గొంతు గుర్తించి, ఒక్కక్షణం అచేతనమయింది.
"మొదటి చూపులో కలిగే ప్రేమల్ని నేను ఇన్నాళ్ళూ నమ్మలేదు. ఎద్దేవా కూడా చేశాను. కానీ ఈరోజు నమ్ముతున్నాను. ఒకేసారి చూసి మిమ్మల్ని గాఢంగా ప్రేమించాను. ఐ లవ్ యూ! నేనెవరో ఈపాటికి గుర్తుపట్టే వుంటారనుకుంటాను. బై!"
ఆమె ఫోన్ అలాగే చెంపకి ఆన్చుకుని నిలబడిపోయింది. "ఇది నిజమేనా? ఈ వయసులో ప్రేమింపబడడం!" అన్న సందేహం వచ్చినా ఎంతోసేపు నిలవలేదు. పరిగెత్తుకుంటూ గదిలోకి వెళ్ళి తలుపేసుకుని, అద్దంలో ఆనందంగా చూసుకుంది. తాను ధరించిన నగలన్నీ తన అందం ముందు వెలవెలపోతున్నట్లుగా అనిపించాయి. తీసిపారేసింది, బట్టలతో సహా! ఆ తరువాత ఈ వయసులో కూడా వన్నె తరగని లావణ్యాన్ని చూసుకుని తనే బోలెడు ఆశ్చర్యపోయింది. ఆమెకి ఆ ఆనందంలో దుఃఖం ముంచుకువచ్చేసింది.
అద్దంలో తనని తాను చూసుకుని అమితంగా ఆనందపడే స్త్రీ ఎవర్నీ ఆనందపెట్టలేదు అన్నది ఒక నానుడి. కానీ, తను కూడా ఎక్కువ కాలం ఆ ఆనందాన్ని అనుభవించలేదు అన్నది 'నిజం.'
ఆమెకి మరునాడు ఫోన్ మొగినప్పుడల్లా మదిలో మంజులనాదం వినిపిస్తూనే వుంది. చివరికి ఆమె స్నానం చేస్తూండగా ఆమె ఎదురుచూసిన కాల్ వచ్చింది.
సాధారణంగా 'ఏం చేస్తున్నారూ?' అని మొదలవుతుంది సంభాషణ.
భరద్వాజ కూడా అదే ప్రశ్న వేశాడు.
ఆమె నగ్నంగా టబ్ లో పడుకుని వుంది. ఆమె గులాబీ రంగు శరీరం, తెల్లని నురుగుతో కలిసి మంచు కురిసిన గులాబీలా వుంది. ఆమె ఆ ఆసమయంలో ఏం జవాబు చెప్పినా అతను నమ్ముతాడు. కానీ ఆమె నిజమే చెప్పింది. అది సిన్సియారిటీ కాదు, అదో రకమైన స్టుపిడిటీ! ఎవర్నో ఆడిస్తున్నాం అనుకుంటూ తాము ఆటబొమ్మలయిపోయే మూర్ఖత్వం.
అతను కాసేపు మాట్లాడలేదు.
"హలో....వున్నారా?" అడిగింది.
"కేవలం వూహించుకుంటున్నాను కాబట్టి బ్రతికే వున్నాను. నిజంగా ఈ సమయంలో మీ ముందు వుంటే...అంత అందాన్ని చూసి పిచ్చెక్కి చచ్చిపోతానేమో....నవ్వకండి! నిజంగా అంటున్నాను. మీ మీద ఒట్టు"
ఆమె తెరలు...తెరలుగా నవ్వుతూనే వుంది. చాలా రోజులకి....చాలా సంతోషంగా...చాలా ...చాలా అమాయకంగా!
"నాకు ఇప్పుడే ఓ విషయం తెలిసి నిశ్చేష్టుడిని అయిపోయాను" అతని గొంతులో గంభీరత చోటు చేసుకుంది.