ఇంతలో భ్రమరాంబ వారి దగ్గరికి వస్తూ "అరె! నువ్విక్కడున్నావా! ఇంతసేపూ విక్రమ్ తోటే మాట్లాడి వస్తున్నాను" అంది.
ఆ పేరు వినగానే నాగస్వరం విన్న పాములా వర్షిణి ఠక్కున తల ఎత్తింది. ఆమె కళ్ళు ఆశగా అతనికోసం నలుదిశలా వెతికాయి!
భ్రమరాంబ సాగతీస్తూ, "కూర్చో...నీతో మాట్లాడాలి అన్నాడు. అన్నట్లు రాత్రి...మీరిద్దరూ ఏదో గొడవ పడినట్లున్నారూ.." అంది.
"ఏమైనా చెప్పాడా?" ఆతృతగా అడిగింది వర్షిణి.
"అదే, నేనూ ఏదో చెప్తాడనుకున్నాను. అసలు ఆ సంగతే ఎత్తకుండా, రాత్రి ఫ్రెండ్స్ తో ఏదో కామెడీ సినిమా చూసొచ్చాడుట. అందులో జోక్స్ చెప్పడం మొదలెట్టాడు అబ్బా! నవ్వలేక చచ్చాననుకో! అసలు తనంత విట్టీగా మాట్లాడకలడనే నాకు తెలీదూ" అంటూ అవి గుర్తుకు తెచ్చుకుని మళ్ళీ నవ్వసాగింది భ్రమరాంబ.
వింటున్న వర్షిణికి ఒళ్ళు మండిపోతోంది. గుప్పెటలో వున్న రుమాలు కసిగా నలిపేసింది. కళ్ళల్లో నీళ్ళు చిప్పిల్లదానికి సిద్దంగా వున్నాయి. "రాత్రి అతను ఫ్రెండ్స్ తో సినిమాకి వెళ్ళాడా?" ఆ వాక్య నిర్మాణంకోసం అక్షరాలు తడుముకోవలసి వచ్చింది.
భ్రమరాంబ వెంటనే, "ఆ...ఫ్రెండ్స్ తోటే వెళ్ళాడట" అని వర్షిణి మొహంలోని భావాలు అప్పుడే గమనిస్తున్నట్లు చూసి "అదేమిటే అలా అయిపోయావ్? అతను సినిమాకి వెళ్తే నీకెందుకూ దుఃఖం? నిన్ను ప్రేమించాడు కాబట్టి అతనికి మరో ప్రపంచం వుండకూడదా మిగతా అందరు ఫ్రెండ్స్ నీ వదిలి పెట్టేసెయ్యాలా?" అంది.
వర్షిణి రోషంగా, "నీకూ...నీకూ...అర్ధం కాదులే" అంటూ వస్తున్న దుఃఖాన్ని ఆపుకోవడానికి శతవిధాల ప్రయత్నిస్తూ తల వంచుకుని గేటువైపు వడివడిగా వెళ్ళిపోయింది.
"అసలే అది రాత్రంతా ఏడుస్తూనే వుంది. ఆ పోచుకోలు వాగుడంతా చెప్పి మళ్ళీ ఎందుకు ఏడిపించినట్లూ?" అంది శిల్ప కోపంగా భ్రమరాంబతో.
"నీకు అర్ధం కాదులే" అంటూ భ్రమరాంబ పక పకా నవ్వింది.
చుట్టూ వున్న పరిసరాల మీద ధ్యాస లేకుండా, తల వంచుకుని, వేగంగా నడుస్తోంది వర్షిణి. ఆమె గుండెల్లో లావాలా దుఃఖం సుళ్ళు తిరుగుతూ, బయట పడడానికి సిద్దంగా వుంది 'నన్ను అనరాని మాటలని, ప్రేమ గురించి ఉపన్యాసాలిచ్చి, తను చేసినా పనేమిటీ? హాయిగా సినిమా చూసొచ్చి, కేంటీన్ లో నా స్నేహితురాలితో కబుర్లు చెప్తూ కూర్చుంటాడా? నేనేమో ఏదో తప్పు చేసేసినట్లు రాత్రంతా ఏడ్చి, మనసు పాడు చేసుకుని, పిచ్చిదానిలా.."ఆమె ప్రమేయం లేకుండానే కన్నీరు చెంపలమీదుగా జాలువారుతోంది. ఆ బాధలో పక్కనే ఆగిన వెహికల్ ని పట్టించుకోలేదు.
"ఎక్కు" అన్న స్వరం చెవి పక్కన వినిపించడంతో అదిరిపడి చూసింది.
మోటార్ సైకిల్ పక్కనే ఆపి, విక్రమ్ నవ్వుతూ చూస్తున్నాడు.
అతన్ని చూడగానే ఆమె అది రోడ్డు అన్న విషయం కూడా మరిచిపోయి బ్రేక్ అయిపోయింది! "నన్ను నిలదీసి నువ్వు చేసిన పనేమిటీ? నేను అవసరం అయి వెళ్తే తప్పూ, నువ్వు అవసరం లేకపోయినా కులాసాగా తిరిగితే ఒప్పూ కదూ! జాత్యాహంకారంతో మిడిసి పడ్తున్న మామూలు మగాడివే నువ్వూనూ....స్త్రీ పురుష అసమానత మీ నరనరాల్లో పాతుకుపోయింది...అసలూ...నిన్నూ..." ఆపైన పూర్తి చెయ్యలేక వెక్కి వెక్కి ఏడ్చింది.
అంతా అయ్యేదాకా ఆగి, విక్రమ్ ఒక్కొక్క అక్షరమే వత్తి పలుకుతూ అన్నాడు.
"అ...స...మా...న...త" అని, తరువాత చిన్నగా నవ్వి, "ఔను! అసమానతేగా! నీకు ఇప్పుడు కలిగినంత బాధా నాకు నిన్న కలిగింది. కానీ, నేనూ నీలా వెక్కి వెక్కి ఏడ్చి హృదయం తేలిక చేసుకోలేకపోయాను కదా! అసమానత కాక మరేంటి? సృష్టి మీ కిచ్చిన ఈ బలహీనతని, మీరింత పదునైన ఆయుధంగా వాడుతుంటే, జాత్యహంకారం ముసుగులో మేము ఎంత మధనపడ్తున్నామో మీ కరుణరస పూరిత స్త్రీ హృదయాలకి ఏ శతాబ్దంలో అర్ధం అవుతుందీ?" అతను స్వరంలో వ్యంగ్యం, ముఖంలో నవ్వూ, కురిపిస్తూ అన్నాడు.
వర్షిణి విస్మయంగా అతని కళ్ళల్లోకి చూసింది. అతని కళ్ళల్లో కనిపిస్తున్న రాగధారలో నిలువెల్లా కరిగిపోయింది! ఆమెకి గుడిపాటి వెంకటాచలం వ్రాసిన వాక్యాలు గుర్తొచ్చాయి. "యుగయుగాల తన దీనాలాపనలతో, శరణార్తితో పురుషుడ్ని బంధించుకున్న అబలత్వం, ఆమెని రక్షిస్తున్నాననే మోసానికి, స్వతంత్ర్యాన్ని బలిచ్చుకున్న పురుష ధీరత్వం."
ఆమె ముందు నిలబడ్డ ఆ పురుషుడు ఆమెకి ఆ నిమిషంలో అమ్మ కొంగు పట్టుకుని, వదిలి వెళ్లనని మారాం చేస్తున్న పసివాడిలా కనిపించాడు. స్త్రీ మనసు ఈర్ష్య వల్ల ఇరుకు సందుగానూ, దయవల్ల సముద్రమంత విశాలంగానూ మారిపోగలదు! ఆమెలో అంతర్లీనంగా మాతృత్వం ఎప్పుడూ ప్రవహిస్తూనే వుంటుంది. ఆమె అంతులేని ప్రేమ ఆమెకి అశక్తతనీ, అతనికి అహంకారాన్నీ బహుమతిగా ఇస్తుంది.
"నిజంగా...నిజంగా...ఇంత బాధపడ్డావా పిచ్చీ!" అంది వేదనని రెండు కళ్ళనిండా నింపుకుని.
అతను నవ్వేసి "ఇప్పుడు పోయింది. నా బాధని సరిగ్గా అర్ధం చేసుకున్నావుగా" అన్నాడు.
ఆమె అతని తల మీద చెయ్యి వేసి నొక్కింది. ఇష్టమైన వారితో సంభాషించడానికి స్పర్శని మించిన భాష లేదు!