Previous Page Next Page 
మొగుడే రెండో ప్రియుడు పేజి 39

    "ఇన్ని గంటలు ఎలా గడిపావు?"


    అతని ప్రశ్న ఆమెకి మొదట అర్ధం కాలేదు.

    అతను మళ్ళీ అడిగాడు. "ఇన్ని గంటలు ఎలా వుండాలనిపించిందీ! నేను గుర్తుకు రాలేదా?"

    ఆమె తల అరచేత్తో కొట్టుకుంటూ, "వచ్చావు! ఎందుకు రావూ! నాన్నగారు అతనికి వూరు కొత్త కాబట్టి, తిరిగి అతను రైలెక్కేవరకూ వెంట వుండమని ఉత్తరం వ్రాసి పంపారు. తెలుసా?" అని చేతిలో వున్న బ్యాగ్ లోంచి ఓ కాయితం మడత తీసి "చూడు కావలిస్తే..." అంది.

    అతను ఆమెను వారిస్తూ చెయ్యి చూపించి, "అయితే మాత్రం...ఇంతసేపు అసలు ఎలా వుండగలిగావూ?" అడిగాడు మళ్ళీ అదే రకమైన గొంతుతో.

    "నేను చెప్పింది నీకు అర్ధం కాలేదా?" విసుగూ, కోపం కలిపి అడిగింది.

    "నా ప్రశ్న నీకు అర్ధం అయిందా?" అడిగాడు సీరియస్ గా చూస్తూ.

    ఆమె కొద్దిగా తగ్గి, అనునయిస్తున్నట్లు "చాలాసార్లు గుర్తొచ్చావు కానీ..."

    "అబద్దం" అరిచాడు.

    "నిజం-ఒట్టు!"

    "వస్తే సాయంత్రం దాకా ఎలా వుండగలిగావూ? నేను నీ కోసం అర్దరాత్రి వచ్చెయ్యలేదూ!"

    "నీలా నేను చెయ్యలేని పరిస్థితి! నీకూ నాకూ తేడా లేదా?" ఆశ్చర్యంగా అడిగింది.

    "ప్రేమించడంలో కూడా తేడాలుంటాయా!"

    అతను తీవ్రంగా అడిగాడు.

    "నీకు ఎలా చెప్పాలో తెలియడం లేదు. నాకు వచ్చెయ్యాలని చాలా అనిపించింది. కానీ వాళ్ళ బలవంతంవల్ల వుండిపోవలసి వచ్చింది. అందులోనూ...నాన్నగారు ఉత్తరం కూడా రాసి ఇచ్చారాయె."

    "నాకు ఇప్పుడు అర్ధం అయింది" అతను విసురుగా అన్నాడు.

    "ఏం అర్ధమయింది?"

    "నీకు మీ నాన్నగారి మీదా, ఆ వచ్చిన అతని మీదా, మీ పిన్నీ బాబాయ్ ల మీదా వున్నంత ప్రేమ నా మీద లేదు."

    ఆమెకి ఆ నిముషంలో అతనిమీద అపారమైన జాలీ, ప్రేమా కలిగాయి. అంతలోనే అతని మూర్ఖత్వానికి చిరాకు కూడా కలిగింది.

    "ఏమిటా పిచ్చిమాటలు? అతనిమీద నాకేం వుంటుంది? ఏదో రమ్మన్నాడు కదా అని తోడు వెళ్ళాను."

    "వెళ్ళేటప్పుడు అతనితో నవ్వుతూ మాట్లాడ్తూనే వెళ్ళావుగా! అక్కడ కూడా అతనికి కంపెనీ ఇచ్చావు కదా! నన్నే తలుచుకుంటూ, దిగులుగా, మాట్లాడకుండా అయితే వుండి వుండవు కదా..."

    "విక్రమ్...ఈర్ష్యకి కూడా హద్దు వుండాలి!"

    "హద్దు వుంటే ప్రేమెందుకు అవుతుంది?"

    "అంటే, సరదాగా మాట్లాడినంత మాత్రానా, అతనితో కలిసి వెళ్ళినంత మాత్రానా తప్పేనా?"

    "తప్పే! నూటికి నూరుపాళ్ళు తప్పే!" అతను అరిచిన అరుపుకి ఆమె తెల్లబోయింది.

    అక్కడే ఆడుకుంటున్న ఇద్దరు పిల్లలు బెదిరిపోయి, పారిపోయారు.

    "తప్పా!" ఆమె కళ్ళల్లో అంతులేని ఆశ్చర్యం.

    "ఔను! నా సమక్షంలో తప్ప ఎవరి సమక్షంలో నువ్వు ఆనందంగా వున్నా తప్పే! వాళ్ళు నీ అన్నదమ్ములైనా...తల్లిదండ్రులైనా, ఎవరైనా, సరే! ఎంత ఆహ్లాదరకరమైనవాతావరణంలో వున్నా, ఎన్ని ఆనందాలూ, అందాలూ చుట్టూ వున్నా, అందర్నీ వదిలి, అన్నింటినీ వదిలి, ప్రేమించే మనిషికోసం పరుగుపెట్టాలనిపించాలి. అప్పుడే "ఐ లవ్ యూ" అన్నమాట ధైర్యంగా చెప్పే అర్హత లభిస్తుంది. లేని పక్షంలో అసలు 'ప్రేమ' లాంటి పెద్ద మాటలు వాడడం మానెయ్యాలి" అతని మాటలు సూటిగా వున్నాయి.

    వర్షిణి కళ్ళల్లో గిర్రున నీళ్ళు తిరిగాయి. "ఇంత సంకుచితంగా ఆలోచిస్తా వనుకోలేదు."

    "సంకుచితం కాదు! ఫ్రాంక్ గా మాట్లాడ్తున్నాను. దగ్గరవాళ్ళ దగ్గర 'హిపోక్రసీ' ఇష్టం వుండదు నాకు. ఇందాక అడిగావు చూడు! సరదాగా మాట్లాడినంత మాత్రాన...కలిసి వెళ్ళినంత మాత్రానా...తప్పా? అనీ...అసలు సరదాగా ఎందుకు మాట్లాడాలనిపిస్తుందీ? అతను నిన్ను తాకకుండా అతిదూరంగా నిలబడి గంటలు గంటలు మాట్లాడితే లేదనీ...ఇంకేదో చేస్తేనే తప్పనీ అనుకోకు! శారీరకంగా మరొకరితో నువ్వు ఏదో ఐదు నిమిషాలు చేసినా భరిస్తానేమో కానీ, మానసికంగా నువ్వు మరొకరి సమక్షంలో ఆనందంగా వుంటే మాత్రం భరించలేను."

    "విక్రమ్!" ఆమె విస్మయంగా చూసింది!

    అతనూ ఆమె కళ్ళలోకి తీక్షణంగా చూశాడు.

    "నన్ను హాస్టల్ దగ్గర దింపెయ్" చెప్పింది గంభీరంగా.

    "పద" అతను బండి స్టార్ట్ చేశాడు.

    అతను ఆపగానే ఆమె 'వెళ్ళొస్తాను' అని కూడా చెప్పకుండా లోపలికి వెళ్ళిపోయింది.

    అతనూ వెంటనే వెళ్ళిపోయాడు.
   
                                                *    *    *

    విక్రమ్ చెప్పిన మాటల్లో వాస్తవికత ఆమెకి మరునాడే తెలిసింది!

    హాస్టల్ రూంకీ ఇంటికీ పెద్ద తేడా మొదటిసారిగా తెలిసినట్లయింది వర్షిణికి. మనసు తీరా బావురుమని ఏడవలేని తన దుస్థితికి తనే విచారిస్తూ మౌనంగా రోదిస్తూ, దిండులో ముఖం దాచుకుని పడుకుంది.

    తెల్లవారాక ఆమె ఎర్రని కళ్ళని చూసి "ఏవైందే! రాత్రంతా నిద్రపోలేదా! విక్రమ్ ఏమైనా అన్నాడా!" అని అడుగుతున్న స్నేహితురాళ్ళకి ఏమీ జవాబు ఇవ్వకుండా అలాగే పడుకుని వుండి పోయింది.

    "టైం అవుతోంది కాలేజీకి రావా!" అడిగింది శిల్ప.

    "నేను రాను. మీరు వెళ్ళండి" అంది వర్షిణి ముఖం మళ్ళీ దిండులో దాచేసుకుంటూ. ఆ నిమిషంలో ఆమె మనసు ఏకాంతం కోసం పరితపిస్తోంది.

    కాసేపటికి భ్రమరాంబా, శిల్పా కాలేజీకి వెళ్ళిపోయారు.

    తలుపులు వేసుకుని, మనసు తేలిక పడేదాకా ఏడుస్తూ పడుకుంది వర్షిణి. అదీ కాసేపే! తరువాత ఒంటరితనం ఎంతటి శాపమో ఆమెకి తెలిసివచ్చింది. ఏదో ఆశతో మాటిమాటికీ వరండాలోకి వచ్చి, గేటు వైపు చూసి వెళ్తోంది.

    ఓ గంట తర్వాత ఆమె ప్రమేయం ఏమీ పెద్దగా లేకుండానే ఆమె తయారయి కాలేజీకి బయలుదేరింది.

    వర్షిణిని చూస్తూనే శిల్ప ఎదురొచ్చి "కాఫీ ఐనా తాగావా? చూడు ఒక్కరోజుకే మొహం ఎలా పీక్కుపోయిందో?" అంది ఆప్యాయంగా.

    "భ్రమరాంబ ఏదీ?" అడిగింది వర్షిణి.

    "కేంటీన్ లో ఎవరితోటో హస్కు కొడుతోంది." అంది శిల్ప.

 Previous Page Next Page