"మరి ఏముంది చెప్పండి ఇల్లు కట్టడానికీ"
"ఏమీ లేని పాడికి అప్పు ఎల్లాగ వుడుతుందీ? పోనీ అప్పు పుట్టించే శక్తి అయినా ఉంది అంటావా!" అన్నాను నేను కనుబొమ్మ లెగరేస్తూ.
"మన నిజస్థితి తెలిస్తే అదీ పుట్టదు" అన్నది ఆవిడ ఇక ఆ జవాబుకు తిరుగు లేనట్టు."
"మీ తమ్ముడికి ఒకరి దగ్గరకు వెళ్ళవలసిన అవసరం లేదు. వాడికేం కర్మం మహా రాజుబిడ్డ" అంది ఆవిడ గర్వంగా.
ఇట్లా మా ఆవిడ అసందర్భపు ప్రశ్నలన్నీ వేసినా ఆర్ధిక పరిస్థితి గూర్చి నిరసనగా మాట్లాడం చూస్తే నాకు ఎట్లాగుందీ? నాద ప్రపంచంలో, యమముఖోద్భవములైన రెండు శ్రుతులలో తుది శ్రుతి క్షోభిణియందు విషాదస్వరముతో ఐక్యం పొందుతున్నట్లుంది. అంటే వళ్ళు మండి పోతున్న దన్నమాట. అందుకని చివరకు విసుగుతో "అయితే నేనేనా దరిద్రుడ్ని మీ తమ్ముడు మహారాజుబిడ్డ అయితే!" అని అన్నాను.
"నేను అన్నానా ఏమిటి? అన్నీ మీరే అనుకొంటున్నారు" అన్నది ఆవిడ జవాబుగా,
"అనకపోతేమట్టుకూ, ఏమిటీ మాటలూ!! శుభమా అంటూ ఇల్లు కట్టుకొందామనుకొంటూ ఉంటే" అన్నాను ముఖం చిట్లించి కోపంగా.
కోపం వచ్చిందని గ్రహించింది కాంతం గ్రహించి తగ్గింది. తగ్గి,
"కట్టండి మీ కోదణ్ణం, ఆదా చేసే కడతానో, అయిన మగవాళ్ళు ఏం జేస్తారో నీకెందుకూ! ప్రతిదీ నాకు కావాలని వస్తావూ, ఇక వూరుకో" అన్నాడు కోపంగా.
"నేను ఏమన్నా అంటే ఒట్టు. రేపే కట్టండి. అన్నది" రేపే అన్నమాట నొక్కినొక్కి అంటూ.
"కడతాను చూస్తుండు. రేపే కడతానో లేకపోతే ఇంకా నాలుగేండ్లకే కడతానో తీరిగ్గా." అన్నాను నిర్లక్ష్యంగా నీ లెక్కేమిటి అన్నట్లు.
"మీ ఇష్టం అంటినిగా ఇక నన్ను వాగించకండి. పెద్దపోట్లాట అవుతుంది. యింతటితో పోనీయండి రికామిగా అన్న మాటలో ప్రతి అక్షరాన్నీ సాగదీస్తూ.
నేను ప్రతి అక్షరాన్ని సాగదీస్తూనే జవాబు చెప్పాను "నకామిగానే కడతాను. నీ సలహా ఏమిటి నాకు నీ మాటలు వింటూంటే మంతెత్తుతుంది. మనిషి యందూ ఒక్క పిసరన్నా గౌరవం లేదాయె యెంత చెప్పినా మనిషి యందు నమ్మకం లేదాయె! యింతకూ నీకు స్వంత యిల్లు వుండే ప్రాప్తం వున్నట్లు లేదు. నేనేం జేసేది!
ఊహు__అటు తిరుగు.
* * *
ది పర్ ఫెక్ట్ వైఫ్
"ఏమిటండీ ఇవన్నీ అన్నది మా ఆవిడ నేను తెచ్చిన ఆ చిత్రపటాలన్నింటిని వుద్దేశించి. "ఇన్ని బొమ్మల పుస్తకాలు ఎక్కడివండీ అబ్బో! అట్టలమీద అతికించారే కొన్ని" అన్నది మళ్ళీ.
"తెచ్చాను నీ కోసం చూడు ఎంచక్కని బొమ్మలో!
"యివన్నీ కొన్నారా ఏమిటి కొంపదీసి."
"ఆఁహాఁ."
"ఆఁకొనే వుంటారు. మిమ్ములను ఎవరో టోపీ వేశాడు. యివేం బొమ్మలండీ!"
"ఏం?"
"సరే ఏంజెప్పేది. ఎందుకూ పనికిరానివన్నీ మీకు అంటగట్టినట్లున్నారు చూడండీ మీరు చూసే కొన్నారా ఇవన్నీ? అయ్యయ్యో! తలకు మాసినవాడు ఎవరండీ మిమ్ములను అన్యాయం చేసిందీ?
"చాల్లే యిక వూరుకో. నీకు వాటి సంగతి ఏం తెలుసునని మాట్లాడుతున్నావు? అవన్నీ గొప్ప ప్రసిద్దులయిన చిత్రకారులు గీసిన పటాలు, కొంటే ఒక్కొక్కటి రెండు వందల రూపాయలు ఖరీదు వుంటుంది. మన బాపిరాజుగారిని అడిగి బ్రతిమిలాడి, ససేమిరా ఇయ్యనంటే వేధించి, యివన్నీ తెచ్చాను నీకు చూపిద్దామని.
ఇది ప్రపుల్లచంద్ర ముఖర్జీ వ్రాసింది. ఆ స్త్రీ ఒక విరహిణి. వియోగం కలిగి ప్రియాగమనానికై నిరీక్షిస్తున్నది.
ప్రొద్దస్తమానమూ ఊరిమీద తిరిగి నిరీక్షిస్తుంటే ఎంత ఆనందంగా వుంటుందో ఊహించు నేను వచ్చేసరికి నీవు యిల్లాగ వుండరాదూ? యిదేమంత కష్టమైనా పని అయినా కాదు. తెల్లని చీర కట్టుకొని, తలలో పూలు అర్ధచంద్రాకారంగా చుట్టుకొని, ఆ వున్న ఆభరణాలు, గడియారం గొలుసో, కాచికాయగుండ్లో, మెళ్ళో వేసుకొని కళకళలాడుతూ వున్న ముఖంతో కనబడుతూ, నీ గడ్డం పట్టుకొని బ్రతిమలాడుతున్నానూ.
అయితే ఆ కనబడడం ఈ బొమ్మలో వున్న మాదిరిగా కనబడాలె. చూడు. ఈ "నిరీక్షణము" నీవు కూడా మంచి చాపపైన వయ్యారంగా ఈ ఫోజులో కూర్చో గడ్డం క్రింద చెయ్యి పెట్టుకొని మన గవాక్షంలో నుంచి చూస్తుండు.
"ఏం చూస్తుండమంటారు? వీధిలో వాళ్ళనా?"
"అదే తెలివు తక్కువ. అప్పుడు నీ చూపులు విచిత్రంగా వుండాలె. దగ్గరవున్న వస్తువులను చూస్తున్నట్లు వుండరాదు. దూరాన ఎక్కడో స్వప్న లోకంలో వున్న ఒక దివ్య దృశ్యాన్ని గమనిస్తున్నట్లుండి కళ్ళు నిమిలితంగా వుండాలె. ఆ కూర్చున్నప్పుడు నీ శరీరం కూడా చక్కని వంపులతో లావణ్యాన్ని వర్షిస్తూ నిరీక్షణ భావానికి అనుగుణ్యంగా భవిష్యత్తులోనికి సాగినట్లు వుండాలి. విన్నావా?""ఆహా వింటూనేవున్నా. బాగానే...వుంది మీరు చెప్పింది"
అలాగే పిల్లలకు పాలు ఇస్తున్నప్పుడు ఈ 'పట్టితల్లి' అన్న బొమ్మలో మాదిరిగా మాతృత్వం మూర్తీభవించిన రూపులో, దృక్కులలో మాతృ ప్రేమ ఒలికిస్తూ కనబడాలె, తెలిసిందా!"
పిల్లలకు పాలీయిటం తెలియదండీ నా కర్మకాలి పోతే?" అని అంటూ తొలిగిపోయిన పమిటను సవరించుకొంది.
"పాలీయటం తెలియటం కాదు. ఆ మాదిరి భావాన్ని వ్యక్తపరుస్తు కనబడటంలో వుంది అందమంతా" అన్నాను పళ్ళు బిగించి విసుక్కుంటూ.
"సరేలెండి. ఇదేమిటండీ. యిందులో పిల్లతో తల్లీ వున్నారూ?" అని అంటూ మా పసిదాన్ని దగ్గరకు తీసుకొని ముద్దాడింది.
"అది చాలా గొప్ప పిక్చర్. ప్రసిద్దుడైన బెంగాలు కారుడు దీనిని వ్రాశాడు. దీనికి 'దిలైట్ ఆఫ్ ది హోమ్.' అని పేరు, నీవు పిల్లలకు జెడ వేసి బొట్లు పెడుతున్నపుడు ఈ చిత్రంలోకి పద్ధతిని అనుకరించవలసి వుంటుంది. చూడు, యిందులో ఆమె ఎంత మనోహరంగా వుందో చుక్కల మధ్య చంద్రుడిలాగ ప్రాకాశిస్తున్నది!"