Previous Page Next Page 
యువత నవత పేజి 4

   
     "కబుర్లు తరువాత, భోజనాలు త్వరగా కానీయండి! వాళ్ళొస్తారేమో!" వనజాక్షి తండ్రివచ్చి అన్నాడు.

     మూడు గంటలప్రాంతంలో వరుడు వేం చేశాడు తలిదండ్రులతో.

    వరుడు బాగానలుపు. చదువు, ఉద్యోగం ఆస్థి.... ఇహ అన్నీ విషయాల్లోనూ సంతృప్తికరంగానే వున్నాడు. వనజాక్షిని చూసి, అన్ని మర్యాదలూ హుందాగా స్వీకరించి ఓ గంట తరువాత వెళ్లిపోయారు వాళ్లు.

     "అతడికి నచ్చిందంటే వనజాక్షిని ఇఛ్చి చేస్తారాండీ ఆ తారుడబ్బాకి?" అనడిగింది సుధ.

     కాస్త నలుపుంటే ఏం? ముఖం కళగానే వుంది. ఉద్యోగం, ఆస్తి పాస్తులు బాగానే వున్నాయి ! అన్నీ కుదరాలంటే ఎలా?" అంది సుగుణమ్మ.

     "ఏం కళలెండి! ముఖమంతా కారునలుపుతప్ప ఇంకేం కనిపించలేదు నాకు! మన వనజాక్షి ప్రక్కన పున్నమి  ప్రక్కన అమావాస్య వున్నట్లుగా వుంటాడు! అందమైన భార్యలు కావాలని మగవాళ్లు కోరుకున్నట్లే అందమైన భర్తలు కావాలని అమ్మాయిలు కోరుకోరా! కోరుకో కూడదా? వనజాక్షినే అడగండి, అబ్బాయి నచ్చాడేమో?"

    ఆ నల్లటి నలుపు చూసేసరికి కంపరమెత్తినట్లుగా అయింది వనజాక్షికి కాని  ఆ మాట తలిదండ్రులముందుచెప్పే ధైర్యం లేదు!

     సుధ వత్తిడి పెట్టేసరికి, మెల్లగా నోరు విప్పింది. "మరీ అంత నలుపుకాకపోతే బాగుండును."

    "పూటకు నాలుగుసార్లు రిన్ సబ్బుతో ఉతికి తెలుపు చేసుకోవచ్చు! కట్టుకో! ఎగతాళి చేసింది సుధ.

     "దానికి లేనివి నేర్పించకండి అమ్మాయ్! కాస్త నలుపైతే ఏం? మన వనజాక్షి ఎర్రతోలేగాని  ఆ పిల్లవాడిపాటి కళలేదు ముఖంలో ముందు చూడగానే ముఖంలో కొట్టొచ్చినట్టుగా కనిపించేవి ఆ ఎత్తుపళ్ళేకదా?"

    "మరి మీరెందుకు అన్నారండీ, ఆ ఎత్తుపళ్ల పిల్లని!"

    "అబ్బా! ఊరుకో సుధా: అమ్మకు కోపం వచ్చేసినట్టుంది!" మెల్లగా అంది వనజాక్షి.

    "మరి మమ్మల్నెందుకు పిలిచావే?"

    "ఆ పెళ్లికొడుకుగారు ట్యూబ్ లైట్ వెలిగినట్టుగా వుంటాడని తెలియక" గొంతులో సుళ్లు తిరుగుతున్న దుఃఖంతో అంది వనజాక్షి.

     "దురదృష్ట వశాత్తూ నీకతడితోనే పెళ్లి సెటిలైందనుకో! నేను నీ పెళ్లికిరాను:ఎందుకంటే నీ ప్రక్కన   ఆ నల్ల మొద్దుని చూసి భరించలేను!" వచ్చేస్తూ అంది సుధ.

     శాలినితో రోడ్డుమీదికి వచ్చాక అంది సుధ. ఏ బంధాలూ, కళ్ళాలూ లేకుండా ఓ ఎద్దునో, గుఱ్రాన్నో బాగా స్పీడుగా పరిగెత్తనిచ్చి హఠాత్తుగా  అలా పరిగెడుతున్న దాని మెడలో వుచ్చు బిగించారనుకో!  అది  ఒక్కసారిగా పల్టీకొట్టి గిలగిలాతన్నుకు చస్తుంది.  సరిగ్గా అలాగే జరుగుతూంది ఈనాటి  ఆడపిల్ల పరిస్థితి.  చదివిస్తున్నారు. స్వేచ్చగా తిరుగనిస్తున్నారు. స్నేహితులతో షికార్లకు సినిమాలకు వెళ్లనిస్తున్నారు. కాని అతి ముఖ్యమైనది, ఆడపిల్ల జీవితంలో అతి ముఖ్యమైన ఘట్టం దగ్గరికి వచ్చేసరికి గొంతుకి ఉరి బిగిస్తున్నారు. పెళ్లంటే, ఆడపిల్ల జీవితాంతం మెడకు  కట్టుకు ఈదే బంధంకాకూడదు.  సహజీవనం చేసే ఒక తోడు అంతే! ఆ తోడు నిర్ణయంలో చేసుకొనే ఆడపిల్లకు కాస్తకూడా ప్రమేయం లేకుండా ఎందుకు చేస్తున్నారు ఈ తల్లిదండ్రులు? ఈ పెద్దలు? వరుడు  జీడిగింజలా వున్నా తనకు నచ్చలేదని చెప్పేపాటి స్వతంత్రం కూడా ఎందుకివ్వడంలేదు. ఆ జీడిగింజకూ, గింజ అమ్మా నాన్నకు ఎంత నమ్రతగా మర్యాదలు చేశారు? ఎంత అణుకువగా  మాట్లాడారు? మగవాడు అనగానే అంత ఉన్నతస్థాయి ఎందుకు కల్పిస్తున్నారు ఇవతలివాళ్లు? అతడికా స్థాయి కల్పిస్తున్నాం కాబట్టే అతడు కొండెక్కి కూర్చుంటున్నాడు. అందుకే మనల్ని చీమల్లా, దోమల్లా చూస్తున్నారు ఈ మగ వెధవలు!

    తన ధోరణిలో తను ఉద్రేకంగా మాట్లాడుతూ నడుస్తూంది సుధ ఎదురుగా వస్తూన్న  ఒక సూట్ వాలా సుధ చివరిమాట విని కనుబొమ్మలెత్తి మిర్రిచూశాడు.

     శాలిని గతుక్కుమని, సుధను మోచేత్తో తట్టింది "రోడ్డు, మనవైపు తిరిగేట్టు  మాట్లాడకు పెద్దగా: చూడు, నీ మాటవిని ఆయన ఎలా చూశాడు?"

    "ఎలా చూశాడంటావు?"

    " మగవెధవలని తననే తిట్టినట్లుగా, తెల్లబోయినట్టుగా?"

    ఫక్కున నవ్వింది సుధ.

 Previous Page Next Page