ఆ నవ్వుకి ప్రక్కన నడుస్తున్న ఒకావిడ విడ్డూరంగా చూసింది. చూసి ఊరుకోలేదు "రోడ్డుమీద ఆ నవ్వులూ, విరగబాట్లూ ఏమిటమ్మాయ్? ఇంటికి వెళ్లాక నవ్వుకోండి నలుగురు నడిచేదారిలో కాస్త ఒళ్లు దగ్గర పెట్టుకునడిస్తే బాగుంటుంది?"
"నేను నవ్వితే నీకేమిటి? విరగబడితే నీకేమిటి?"
"నాకేంకాదు! మీ కబుర్ల లోకంలోపడి నడుస్తూ వెనుకనుండి ముందునుండి ఏం వస్తున్నాయో చూసుకోవడం లేదు. ఇంతకుముందు ఆటో నీకు రాచుకొన్నట్లుగా వెళ్లింది. ఆ ఆటో నీమీదినుండే పోయిందనుకో! ఆ ఆటోడ్రైవర్ జీవితానికి గ్రహణం పట్టేది : నీకు ఆ తెలివే లేనట్టుంది! జీవిత సమస్యలన్నీ రోడ్డుమీదే చర్చిస్తున్నావు."
నిజమే! అయిదు నిముషాలముందు ఆటో సుధను రాచుకొన్నట్లు గానే వెళ్లింది.
సుధతో స్నేహితులకు ఇదే పేచీ. సినిమాకు వెళ్లినా అంతే. తనకు నచ్చని విషయం వుంటే ఇలాగే కామెంట్ చేస్తూంటుంది. సినిమా చూడకుండా ఏమిటీ డిస్టర్ బెన్స్ అన్నట్టుగా చుట్టుప్రక్కల సీట్లవాళ్లు కోపంగా తలలు తిప్పి చూస్తుంటారు.
బస్ స్టాప్ లో నిలబడి, అయిదు నిముషాలు వెయిట్ చేశాక బస్సు వచ్చింది."
పరిగెత్తుకువెళ్లి బస్సు ఎక్కారు సుధా, శాలిని.
బస్సు కదులుతూంటే మరొకరు పరిగెత్తుకు వచ్చారు ఫ్రంట్ డోర్ నుండి.
"ఏంటయ్యా? ఆడవాళ్లలోకి దూరుతున్నావు? చదువుకున్నోడున్నట్టున్నావు! ఆమాత్రం తెలియదా?" ఒకామె కయ్ మంది.
"ఏయి మిస్టర్! ఇవతలకిరా!" కండక్టర్ కళ్ళెర్రజేస్తూ అన్నాడు. ఆశాల్తీ బిక్కచచ్చి బిత్తరపోయి చూస్తూంటే శాలిని, సుధ పక్కన నవ్వారు. "రమ్మంటూంటే! అక్కడే అంటుకుపోయావేం?" కండక్టర్ మొరటుగా అన్నాడు. ఆశాల్తీ శాలినివాళ్ల క్లాస్ మేట్ సుసీఅనే అమ్మాయి జుట్టుకత్తిరించి. పాంట్ వేసుకోవడంతో వచ్చింది చిక్కు.
ఆడపిల్లనే అని చెప్పుకోవడానికి సిగ్గు పడుతున్నట్లుగా పెదవులు కొరుకుతూ నిలబడింది సుసీ.
"మీద మీద పడతావేం? దూరం జరుగు!" సుసీ పక్కనున్న అమ్మాయి విదిలించింది.
"మగడ్రస్సు వేసినదానివి! మగవాళ్లలోకి వెళ్లి నిలబడితేనేం? వెళ్లు!" నవ్వుతూ అంది శాలిని.
"పాంట్ వేసినంత మాత్రాన మగాణ్ణి అయిపోయానా?ఛీ!"
సుసీ గొంతు విప్పాకగానీ తెలియలేదు, ఆడపిల్ల అని! తెలిశాక ఒకటే నవ్వులు బస్సులో, డ్రెస్సులమీద కామెంట్స్:
మరో రోజు ఫస్ట్ షోకు సినిమాకు వెళ్లాలని నిర్ణయం తీసుకొని విడిపోయారు సుధా, శాలిని.
* * * * *
పిక్చర్కు లేటైపోతుందన్న తొందరలో వడివడిగా వచ్చింది సుధ , శాలిని ఇంటికి. "నువ్వింకా తయారు కాలేదూ?" పిక్చర్ మొదలు కావడానికి ఇంకో పావుగంట కూడా టైం లేదు.మనం నడిచేసరికి ఆ పావుగంట అయిపోతుంది! నాకు పిక్చర్ మొదటనుండీ చూస్తే తప్ప చూసినట్టుండదు:"
కిటికీ దగ్గర కుర్చీలో ఇంతవరకు నిశ్శబ్దంగా కూర్చొన్న శాలిని "కొంచెం నా ముఖంలోకి చూసి మాట్లాడు, అద్దంలో పమిట సరిచేసుకోవడం చాలించి!" అంది విసుగ్గా.
"నీ ముఖానికేమొచ్చిందే? రెండురోజులు నీటి చుక్క తగలకపోయినా ఇప్పుడే కడిగినంత ప్రెష్ గా వుంటుంది నీ ముఖం నాలాగా పూటకు నాలుగుసార్లు పౌడరద్దాల్సిన జిడ్డుముఖం కాదునీది:" సుధ తిరగకుండానే అద్దంలో చూచుకొంటూ భుజంమీద పమిటకూ, జాకెట్ కూ, జాకెట్ కూ, కలిపి పిన్ను పెట్టుకొంటూంది.
"ఒకసారి చూడమన్నానా?" ఈసారి శాలిని స్వరంలో కోపం చోటుచేసుకుంది.
"అబ్బ! ఏమైందే నీ ముఖానికి:" పిన్ను పెట్టుకోవడం పూర్తి చేశాకే ఇటు తిరిగింది సుధ." కళ్లు ఉబ్బినట్టున్నాయి! తలనొప్పా?"
"నీ ముఖం! ఏడ్చిన కళ్లకీ. తలనొప్పి కళ్లకీ భేదం తెలియదు మొద్దుకు:"
"ఏడిచావా ఎందుకు?"
అప్పుడే అక్కడికి వచ్చిన శాలిని తల్లి రాధమ్మ చెప్పింది జవాబు.య "ప్రొద్దుటినుండి ఒకటే యుద్దం తల్లీ!దానికి వనపర్తి దగ్గర ఏదో పల్లెటూరికి పోస్టింగ్ వచ్చింది టీచరుగా. వెడతానని తను, వద్దని మేమూ!"
"వద్దని మీరా? ఎందుకు?" విస్మయంగా అడిగింది సుధ.
"ఆడపిల్లను అంతదూరం పంపించడం మీ అంకుల్ కి ఇష్టం లేదు!"
"అనవసరంగా నాన్నని ఎందుకు ముందుకు తోస్తావు? ముఖ్యంగా నీకే ఇష్టంలేదని చెప్పకూడదు?"శాలిని కస్సుమంది.
"బాగుంది! నేరం నా మీదా? మీనాన్న ఒప్పుకొంటే నేను పెదవి విప్పితే అప్పుడడుగు"ఆవిడ కోపంగా అంది.