Previous Page Next Page 
వివాహం పేజి 5

   
    పెట్టె తెరవకుండా చెప్పేసింది. యీ పేర్లన్నీ, తను రోజూ వుచ్ఛరించేవాటివలె. ఎట్లా తెలుసు? అందులో "సత్యం-శివం-సుందరం" తన దగ్గిర వుందని రవణకి తెలీడం ఆయనకి సిగ్గేసింది. అదేదో కొత్త రకం పుస్తకమని రైల్లో ఎవరో సగం ఖరీదుకి అంటకట్టారు. రెండు పేజీలు చదివేప్పటికే, యెవరన్నా చూస్తారని భయమేసి వొదల్లేక, వొదల్లేక పెట్టెలో దాచాడు.

    రవణా వాళ్ళ యిల్లు చేరుకున్నాక ఆ పుస్తకం మళ్ళీ తీశాడు. చదవడం తప్పనుకున్నాడు. కాని తమ్ముడు పోయిన దుఃఖం - మరి ఏదో ఒకటి చదివితేగాని పోదు కదా? తీరా కొన్నది చదివితేనేం? .యీ లోకంలో యెటువంటి దుర్మార్గపు కవులు వుంటారో తెలుస్తుంది, అని రాత్రి వొంటిగంట దాకా చదివి చివరి పేజీవరకు ముగించి, నిట్టూర్పు విడిచి రెండుగంటలదాకా, ఆ పుస్తకం వ్రాసినవాణ్ణి తిట్టుకుని పడుకున్నాడు. కాని ఎంత తిట్టినా ఆ పుస్తకాలమీద కోపం చల్లారలేదు, నిద్రపట్టలేదు.

    తను దేనికోసం తన జన్మని ధారపోస్తున్నాడో ఆ మర్యాదనీ, సంసారసుఖాన్నీ, ఆ పుస్తకం రాసినవాడు వెక్కిరించాడనీ, ఆ వెక్కిరింపుకి కారణముందేమోననీ, వుక్రోషం కలుగుతోంది. ఒక్కసారి ఆ గాడిద కనబడితే? పేరూ ప్రతిష్టాలేని వెధవయి వుంటాడు. పేరున్న వాళ్ళని చూసి కడుపు మంటకొద్దీ వ్రాశాడు. ఇట్లాంటి పుస్తకాలు అచ్చు వెయ్యనీయడమే బుద్ధి తక్కువ. ఏ "సెక్షన్" కిందా దీన్ని నిర్మూలం  చెయ్యడానికి వీల్లేదా? కాని, వాడుకలేక ఆ 'క్రిమినల్ లా' ఆ భాగం బూజుపట్టి జ్ఞాపకం రాలేదు. పత్రికలకు వ్రాస్తే? ఆయన కీ కోపమెందుకని యోచిస్తారు. పోనిద్దూ? ఎవరిఖర్మం వాళ్ళదీ. వాడి పాపం వాడే అనుభవిస్తాడు. తన కెందుకు?

    డబ్బు పెట్టి కొన్ని పుస్తకం ఎంత చెడ్డదైనా పారెయ్యడానికి చేతులు రాక దగ్గుమంద పొట్లాలకన్నా అక్కర కొస్తుందనీ, పెట్టెలో వేసి వుంచాడు. అది రవణ తీసి చదవలేదు కద? ఆడపిల్ల చదివితే ఇంకేమన్నా వుందా? అది పాడైతే పాడయింది, తన సంసారాన్ని, తనకి పుట్టబొయ్యే కూతుర్నీ, ముప్ఫయేళ్ళ తన భార్యనీ - ఛీ, తన భార్యని పాడుచేసేదేమిటి? ఏమో ఏం చెయ్యగలం? మొన్న భారతిలో ఆ సినీమా నటకుని-చూసి చూసి- ఆమె.... కాని ఆమె ఉబలాటపడితేనేం? ఆమెనెవరు పరిగ్రహిస్తారు కళ్ళారా చూసి! అతని గుండె నిబ్బరపడ్డది! కాని అదీ లేచిపోతేనేం? ఎవరన్నా కొత్తగా చిన్నపిల్లని తను వివాహ మాడవొచ్చుగా, ఈ రమణ ఈడుదాన్ని! కాని అప్రదిష్ట! తన ఆలోచనలు చూసి తనే నవ్వుకున్నాడు- ఆ పాడు పుస్తకం చదవడం వొల్ల వొచ్చాయీ యీ తుచ్ఛమైన ఆలోచనలు! వీటిని తగలెయ్యా!

    తన చేతుల్లో కుడుతూ వున్న షర్టుని పక్కనపెట్టి రవణ లేచి బొడ్డులో చీరె తడుముకుంటోంది. తన షర్టుని గుర్తుపట్టాడు పంతులు.

    "ఆ .... షర్టు.... యేం .... చేస్తున్నావు?" 

     "ఇట్లాంటి షర్టు తెచ్చుకున్నావేం బాబాయ్, పెద్దమ్మ యేం చేస్తుంది ప్రొద్దస్తమానం? వంట మనిషి కూడా వున్నట్టుంది.... యీ చేతులు- యీ మెడా చూడు. పోనీ నీ సామాను సద్ది పంపేప్పుడన్నా చూడాలా?"

 Previous Page Next Page