Previous Page Next Page 
మొగుడే రెండో ప్రియుడు పేజి 38

    "భ్రమరాంబా, వర్షిణి ఎక్కడికి వెళ్ళిందీ?" కాస్త చిరాగ్గా అడిగాడు విక్రమ్.


    "ప్రొద్దుటే వాళ్ళ వూరు నుంచి వాళ్ళ నాన్నగారు స్నేహితుడి కొడుకు ఎవరో వచ్చాడని ఫోన్ వస్తే బయటకి వెళ్ళింది. ఇప్పటివరకూ ఎందుకనో రాలేదు మరి!" అంది భ్రమరాంబ.

    విక్రమ్ చాలా అసహనంగా వున్నాడన్న విషయం అతను నిలబడిన తీరులోనూ, పెదవి కొరుకుతున్న విధానంలోనూ తెలిసిపోతోంది. వస్తున్న కోపాన్నీ బలవంతంగా నిగ్రహించుకుంటున్నట్టుగా చూశాడు.

    "ఎక్కడికి వెళ్ళి వుంటుందీ?" అడిగాడు మళ్ళీ.

    భ్రమరాంబ తల అడ్డంగా 'తెలియదు' అని అర్ధం వచ్చేలా వూపింది.

    అంతకు ముందు రోజే వాళ్ళ బాబాయ్ గారింటి నుంచి హాస్టల్ కి వచ్చింది వర్షిణి. ఆ రోజు ఆదివారం కావడంతో అతను ఆమెతో సరదాగా బయటికి ఎక్కడికన్నా వెళ్ళాలనీ, సాయంత్రం దాకా తాము ఇద్దరే తిరగాలనీ ఏవేవో వూహించుకుని వచ్చాడు. తీరా ఇక్కడ 'ఆమె లేదు' అన్న ఆశాభంగం ఎదురైంది.

    ప్రేమికులు నిర్లక్ష్యాన్ని సహించలేరు! అతనిలోని ఆవేశం బైక్ మీద వూరంతా తిరిగి అయినా సరే, వర్షిణిని పట్టుకుని, చెంప అదిరిపోయేలా కొట్టమంటోంది! ఆమె మీద ఇష్టం, అతనికి అలవాటులేని నిదానాన్ని పాటించమని ఆదేశిస్తోంది! ఏం చెయ్యడానికీ తోచని పరిస్థితి. 'నిజంగానే ప్రేమ చాలా బాధాకరం' అనిపించింది అతనికి.

    "నేను వెళ్తాను. మళ్ళీ గంట తర్వాత ఫోన్ చేస్తాను. తను వస్తే చెప్పు" అని భ్రమరాంబకి చెప్పి వెళ్ళిపోయాడు.

    అతను గంట దాకా ఆగలేదు. ఆ లోపులో మూడుసార్లు ఫోన్ చేశాడు.

    "లేదు, ఇంకా రాలేదు" అన్న సమాధానంతో అతనికి పిచ్చి ఎక్కినట్లయింది. మరో రెండుసార్లు వెళ్ళి చూసి వచ్చాడు.

    సాయంత్రం ఆరు అవుతుండగా అతనికి ఫోన్లో వర్షిణి గొంతు వినిపించింది. "చాలాసార్లు వచ్చావుటగా! సారీ, మరేమో నేనూ..."

    ఆమె చెప్పేది అతను వినిపించుకోలేదు. "గేటు దగ్గర నిలబడి వుండు. నేను వెంటనే వస్తున్నాను" అంటూ ఫోన్ పెట్టేశాడు.

    పది నిముషాల్లో అతను మోటార్ సైకిల్ మీద హాస్టల్ కి వెళ్ళాడు.

    వర్షిణి నవ్వుతూ ఎదురు వచ్చింది.

    "ఎక్కు" చెప్పాడు సీరియస్ గా.

    "ఎక్కడికీ?"

    "చెప్తేకానీ రావా?"

    వర్షిణి మాట్లాడకుండా ఎక్కి కూర్చుంది.

    అతను ఒక్కమాట కూడా మాట్లాడకుండా నడపసాగాడు.

    అతను ఎక్కడికి తీసుకువెళ్తున్నాడో ఆమె ఊహకి అందలేదు. ఓపిగ్గా కాసేపు కూర్చుంది.

    సందులూ, గొందులూ తిప్పుతున్నాడు. ఎక్కడా ఆపడంలేదు. అప్పుడు అడిగింది "ఎక్కడికి విక్రమ్?"

    అతను జవాబివ్వలేదు.

    వర్షిణి మరో రెండుసార్లు అడిగినా ప్రయోజనం కనిపించలేదు. దాదాపు గంటసేపు ఆమె అలా అయోమయంలోనే గడిపింది. చివరికి, "నీకు పిచ్చెక్కిందా? ఏమిటీ అర్ధంలేని తిరుగుడు? ఆపు" అంటూ అరిచింది.

    అతను ఆపాడు.

    ఆమె వెంటనే దిగి, "ఏమైంది నీకు మాట్లాడవేం?" అని అరిచింది.

    "ఎక్కడికి వెళ్ళావో, ఎందుకు వెళ్ళావో తెలియక నేను ప్రొద్దుటి నుంచీ నరకం పడ్డాను. నువ్వు గంట కూడా ఓర్చుకోలేవా?" అడిగాడు కోపంగా.

    వర్షిణికి అతని కోపం భయానికి బదులు నవ్వు తెప్పించింది "అదా! అడిగితే చెప్తానుగా..." అంటూ చెప్పబోయింది.

    "ఇప్పుడు చెప్పేం ప్రయోజనం? నేను ఇన్ని గంటలు పడ్డ బాధ పోతుందా?" అడిగాడు.

    అతని తర్కం ఆమెకి కోపం తెప్పించింది.

    "ఇప్పుడేమంటావు?" అడిగింది కనుబొమలు ముడిచి.

    అతను మాట్లాడలేకపోయాడు. చాలా అసహనంగా, కోపంగా వున్నాడు. కానీ ఎలా చూపాలో అర్ధంకావడం లేదు. "ఇన్ని గంటలు....ప్రొద్దుటి నుంచీ సాయంత్రం వరకూ..."తనలో తనే అనుకుంటున్నట్టు అన్నాడు.

    "అరె...అవసరం అయి వెళ్ళాను. నాన్నగారు ఒక అబ్బాయిని పంపించారు. అతనితో బాబాయ్ వాళ్ళింటికి వెళ్ళాను. వాళ్ళు బలవంతపెట్టి వుంచేశారు" అంది సంజాయిషీగా.

    "నిన్ననే కదా అక్కడ నుంచి వచ్చావు?" అతని కంఠం కటువుగా అంది.

    "అవును! కానీ అతనికి వూరు కొత్త...బాబాయ్ తో ఏదో అర్జెంట్ పనిట. ఇల్లు తెలుసుకోవడం కష్టం అనీ..."

 Previous Page Next Page