వర్షిణి అతని భుజం మీద తల ఆన్చి, చెవిలో నెమ్మదైన స్వరంతో చెప్పసాగింది. "విక్రమ్...నాకు ప్రేమ అనేది ఎంత ఇంట్రెస్టింగ్ సబ్జెక్టో ఇప్పుడిప్పుడే తెలుస్తోంది! దీని లోతుపాతులు పూర్తిగా శోధించి డాక్టరేట్ తీసుకుంటే కానీ విశ్రమించణు. ఇద్దరం కలిసి 'కంబైన్డ్ స్టడీస్'చేద్దాం! పరిపూర్ణతని నేను ఆశిస్తాను. ఏదైనా సరే! నేను పూర్తిగా ఇస్తాను. అవతలివారినించి పూర్తిగా అందుకుంటాను. అవసరమైతే నేనీ ప్రపంచాన్నే...నీకోసం వదిలేస్తాను. మరి నువ్వూ...అలాగే....అంత స్థాయిలో 'రెసిప్రాకేట్' చెయ్యగలవా?"
గడచినా రోజుకి అంతం, గడవబోయే రోజుకి మొదలూ అయినా ఆ ఝాములో, ఆమె ప్రశ్న ఒక 'సవాల్' లా వినిపించింది.
గడియారం పన్నెండు గంటలు కొట్టింది.
విక్రమ్ ఆమెని మరింత దగ్గరగా తీసుకుంటూ, "జీవితంలో మనం గడపాల్సిన ప్రతి నిమిషం మీదా ఒట్టుపెట్టి చెప్తున్నాను. 'ప్రేమంటే ఇదా!' అని నువ్వు ప్రతి నిమిషం ఆశ్చర్యపోయేంతగా నిన్ను ప్రేమిస్తాను. గలగలమని పారే సెలయేరులాంటి నీకు...జలజలమని జారే జలపాతంలాంటి ప్రేమని రుచి చూపిస్తాను. ఆ ప్రేమలో పడి కొట్టుకుపోయే మనకి...లోకం...సమయం...రెండూ తెలియకూడదు!" అన్నాడు.
"చాలు! ఇంకా ఆపెయ్. తియ్యగా ఏదైనా చెప్తావు అనుకుంటే, అగ్నిగుండాలు, జలపాతాలూ అని భయపెడ్తున్నావు" అంది భయం అభినయిస్తూ.
"నువ్వు అగ్నిగుండంలో దూకమన్నా నేను సిద్దమే!" అతను అదే సీరియస్ తో చెప్పాడు.
"నేను కూడా నువ్వు దూకమన్నప్పుడల్లా దూకేశానుగా!" ఆమె పెదవులపై కొంటె నవ్వు విచ్చుకుంది, విక్రమ్ ణి మొదటిసారి కలుసుకోవడం గుర్తొచ్చి.
"నువ్వు అగ్నిగుండంలోంచి ఇవతలకి దూకి, అగ్నిపునీత వయ్యావు! ఇంకా ప్యూచర్ లో ఎవరూ నిన్ను అగ్నిపరీక్షకు గురిచెయ్యనక్కరలేదు" అన్నాడు నవ్వుతూ.
వర్షిణి చిరుకోపంగా, "నన్ను అగ్నిపరీక్షకు నిలబడమనే భర్తే గనక దొరికితే...అసలు నేను అతనితో ఒక నిమిషం కూడా కాపురం చెయ్యను....విడాకులిచ్చేస్తాను" అంది.
విక్రమ్ ఆమె బుగ్గ పట్టుకుని, "మనం అనవసరంగా చాలా దూరం వెళ్ళిపోయినట్లున్నాం" అన్నాడు.
"అయ్యో నువ్వు చెప్పాలా బాబూ! లేకపోతే ప్రాణాలుపోవూ! అర్ధరాత్రీ, అపరాత్రీ అని చూసుకోకుండా నీలాగా సేవచేసే యువకులు వుండబట్టే ఈ దేశం ఇంకా ఈ మాత్రంగా వుందేమో!" అంది ఆవిడ సంతోషంగా.
విక్రమ్ వెళ్ళిపోయాక కూడా ఆవిడ అతని వినయాన్నీ, మంచితనాన్నీ పొగుడుతూనే వుంది!
వర్షిణి వస్తున్న నవ్వుని దాచుకోవడానికి చాలా కష్టపడాల్సి వచ్చింది.