"హూ! టైం. నాకుగాక ఇంకెవరికి తెలుస్తుందీ? గడిచిన ప్రతిక్షణం నన్ను చూసి నవ్వుతున్నట్లూ, గడవాల్సిన ప్రతిక్షణం నన్ను చూసి ఏడుస్తున్నట్లూ వుంది పరిస్థితి" ఉద్రేకంగా అన్నాడు.
"విక్రమ్ అలా అంటే ఎలా?" ఆమె బాధగా అంది.
"నేను వెంటనే వస్తున్నాను."
"ఏయ్, ఏవిటా తొందరపాటు? అర్దరాత్రి వస్తే ఏం చెప్తావు?"
"టెలిఫోన్ రిపేర్ చెయ్యడానికని చెప్తాను"
"వాళ్ళు అంత అర్ధరాత్రిళ్ళు రారు."
"వెంటనే నిమిషాల మీద బాగుచెయ్యల్సినవేమున్నాయి ఇంట్లో?"
వర్షిణి ఆలోచిస్తోంది.
"హుర్రే!" అంటూ అరిచాడతను ఉద్వేగం పట్టలేనట్టు.
"ఏమయిందీ!"
"ఏం కాలేదు! ఐడియా నువ్వు వెంటనే వంటింట్లోకి వెళ్ళి గ్యాస్ సిలిండర్ 'ట్యూబ్' బ్లేడుతో కోసేసెయ్"
"ఆ!!"
"నేను పావుగంటలో వచ్చి 'ట్యూబ్' మారుస్తాను. అది అర్జెంట్ గా రిపేర్ చెయ్యాల్సిన విషయమేగా!"
"తీరా నేను కోసేశాక నీకు మరో ట్యూబ్ దొరకకపోతేనో?"
నీకు ఒక్కటి కూడా ప్రొడక్టివ్ గా వుండే డౌట్లు రావు కదా! ముందు చెప్పిన పని చెయ్యి. ఆ గ్యాస్ వాసనకి మీ బాబాయీ, పిన్నీ లేస్తే 'ఏం ఫరవాలేదు నేను ఎమర్జెన్సీ సర్వీస్ కీ ఫోన్ చేశానూ, అని చెప్పు...."
"వాళ్ళు తెల్లవారేవరకూ ఎట్టి పరిస్థితుల్లోనూ లేవరు. నిద్రమాత్రల అలవాటు వుంది."
అయితే ఇంకేం? నిదానంగా నేను వచ్చాక, ఆ ట్యూబ్ కట్ చేసి, తీసేసి, ఈ ట్యూబ్ వేసేద్దాం. వస్తున్నాను" అంటూ ఫోన్ పెట్టేశాడు.
పావుగంట తర్వాతః, వంటింట్లో విక్రమ్ కి టీ ఇస్తూ అడిగింది వర్షిణి, "నేను వచ్చి ఇరవై నాలుగు గంటలయింది. ఇపుడా రావడం?"
అతను గంభీరంగా "మొదట్లో నాకు కలిగే బాధ ఎందుకో తెలియక తమాషాగా అనిపించింది. అది రాను రాను ఉధృతం అవుతుంటే, అప్పుడు తెలిసింది. 'నిన్ను చూడకుండా వుండవలసిరావడమే' ఆ బాధకి కారణమని! ఎంతైనా...నాకు మొదటిసారి కదా...." అన్నాడు.
"అంటే? నీ ఉద్దేశం నాకు ఎన్నోసారనీ?" ఆమె బుంగమూతి పెట్టి, అతని తల మీద మొట్టికాయ వేస్తూ అంది.
"నీకూ మొదటిసారేనా?" అతను ఆశ్చర్యంగా, అప్పుడే తెలిసినట్టు అడిగాడు.
ఆమె మాట్లాడలేదు మూతి బిగించింది కోపంగా.
టీ సిప్ చేస్తూ "నాకు చివరిసారి కూడా!" అన్నాడు.
అయినా ఆమె మాట్లాడలేదు.
తలెత్తి ఆమె వంక చూసి, ఉదికిస్తున్నట్టు "నీకో మరి?" అన్నాడు.
"ఏమో! ఏం చెప్పగలనూ? మానవమాతృరాలిని...నీకంటే చార్మింగ్ గా ఎవరైనా కనిపిస్తే.." మిగతా మాటలు పూర్తి చెయ్యలేక పోయింది. ఆమెకి ఏం జరిగిందో తెలిసేలోపే అతని పెదవులు ఆమె పెదవులని కసిగా నొక్కేశాయి!
ఆమె నిముషంపాటు అచేతనంగా అయి, ఆ స్థితిని ఆస్వాదించింది. అంతలోనే తెలివితెచ్చుకుని, "విక్రమ్...వదులు" అంటూ బలవంతంగా వదిలించుకుంది.
"ఇటువంటి తొందరపాటు పనులు నాకు ఇష్టం వుండవు" ఎర్రనైన మొహంతో కోపంగా చెప్పింది.
"నాకూ ఇష్టం వుండదు! ఇంకెప్పుడూ అలా హాస్యానికి కూడా మాట్లాడకు" అతను అంతకంటే సీరియస్ గా చెప్పాడు.
వర్షిణికి అతని కోపం చూస్తే నవ్వొచ్చింది. ప్రేమలో పడిన మొదట్లో అవతలివాళ్ళు ఏ కొద్ది సాయం చేసినా, తమ మీద శ్రద్ద కనపరచినా, "అయ్యో నా కోసం ఎంత శ్రమ తీసుకున్నావూ!" అని తెగ బాధపడిపోతారు. ప్రేమ రెండో స్టేజ్ లో "ఎంహ్దుకు చెయ్యవూ! నా కోసం కాక ఇంకెవరి కోసం చేస్తావూ?" అనే అధికారం చూపిస్తారు. ఆఖరి స్టేజ్ కి చేరాక, "అసలు నా గురించి తప్ప, నీ గురించి కూడా నువ్వు ఆలోచించకు! అసలు 'నేను' తప్ప నీకు వేరే అస్తిత్వం వుండకూడదు" అనే హక్కు సంపాదించేస్తారు.