క్రింద వల పరిచారు. "పాపని క్రిందికి విసిరేయ్! ఏం ఫరవాలేదు" అరిచాడు విక్రమ్.
ఆమె ఒకసారి దేవుడ్ని ప్రార్ధించి, పావని జారవిడిచింది.
పాప బంతిలా...మల్లెపూల చెండులా వచ్చి సురక్షితంగా వలలో పడింది.
"ఇదిగో అమ్మా నీ పాప!" ఎవరో ఆ తల్లికి అందించారు.
అప్పుడే స్పృహ తప్పుతున్న ఆమెపై ఈ మాటలు అమృత వర్షంలా కురిశాయి. "నా తల్లీ...నా... పాపా" అంటూ బిడ్డని హృదయానికి హత్తుకుని ముద్దులు కురిపించింది.
ఇది ఏమీ తనకు పట్టనట్లు పసిపాప ఆమె గుండెల దగ్గర ఆత్రంగా తడమసాగింది. ఆ తల్లి ఆనందాశ్రువులతో బిడ్డకు స్తవ్యమిచ్చింది గుండెలు తేలిక పడేటట్లు.
వర్షిణికి ఏమీ తెలియడం లేదు. ఒళ్లంతా వెచ్చగా ఆవిరి పట్టినట్లుగా అయిపోతోంది. బహుశా మంటలు తన బట్టలని అంటి వుంటాయి. క్రింద నుండి తన బట్టలని అంటి వుంటాయి. క్రింద నుండి తన పేరు వినిపిస్తోంది లీలగా! కళ్ళు మంటలవల్ల తెరవడం లేదు. బలవంతంగా కళ్ళు తెరిచి క్రిందకు చూసింది.
విక్రమ్ కనిపించాడు. రెండు చేతులూ జాపి "జంప్...దూకు! దూకేసెయ్...ఆలస్యం చెయ్యకు, నీకేం ప్రమాదం లేదు" అని శక్తికొద్దీ అరుస్తున్నాడు.
ఆమెకి తనేం చేస్తోందో తెలియడం లేదు. కేవలం "దూకు....ఆలోచించకు" అన్న గొంతే వినిపిస్తోంది.
ఆమె ఆలోచించలేదు. దూకేసింది.
ఆమెకి స్ప్రుహ తప్పుతూ వుండగా ఆమె చెంపల మీద గరుకుగా ఏదో తగిలింది. కళ్ళు తెరిస్తే ఆ తరువాత అతని పెదవులు ఆన్చి "వర్షిణీ యూ ఆర్ ఎ డేరింగ్ ఏంజిల్! ఐ యామ్ ప్రౌడ్ ఆఫ్ యూ" అని విక్రమ్ అనడం ఆమెకి తెలిసింది.
వర్షిణికి కొద్దిగా వీపు మీదా, పాదాల మీదా కాలడం వలన ఒకవారం రోజులు ఆసుపత్రిలో వుండవలసి వచ్చింది.
విక్రమ్ ప్రతి రోజూ వచ్చి వెళ్తున్నాడు. అతను వున్నంత సేపూ ఆమెకి స్వర్గం! అతను వెళ్ళిపోతే ఆమెకి నరకం!
వర్షిణికి కొద్దిగా తగ్గుముఖం పట్టగానే తల్లిదండ్రులు ఫోన్ చేయించింది.
చక్రధరరావుగారు వస్తూనే, వెంటనే తెలియబరచనందుకు ఛడామడా తిట్టారు.
జగదీశ్వరి కూతురి వీపు మీద మచ్చని చూసి, "అప్పుడంత బాధ ఎలా ఓర్చుకున్నావే తల్లీ!" అంటూ వెక్కి వెక్కి ఏడ్చింది.
"ఇలా గొడవ చేస్తారనే తెలియబరచలేదు. ఇప్పుడు ఎందుకు ఏడుపు? తగ్గిపోయిందిగా" అంటూ వర్షిణి వాళ్ళని ఓదార్చింది.
"మాకిఅనా చెప్పలేదు చూడు..." అంటూ ఊళ్ళో వున్న బాబాయ్ నిష్టూరమాడాడు.
"చదివిన చదువులు చాలు. నా బిడ్డ నా కళ్ళముందు వుంటే అదే పదివేలు!" అంది జగదీశ్వరి కళ్ళు వత్తుకుంటూ.
"పిచ్చిగా మాట్లాడకు! ఇప్పుడు అది అంత కాని పని ఏం చేసిందని? ఒక మంచి పని చేసి నలుగురి చేతా 'శభాష్' అనిపించుకుంది. ఎంతైనా అది నా కూతురు" అన్నారు చక్రధరరావుగారు గర్వంగా.
వర్షిణి ఆనందంగా తండ్రి వైపు చూసింది.
తల్లీ తండ్రీ ఆమెని బాబాయ్ గారింట్లో పది రోజులు వుండమని అడిగారు, ఏదో రకంగా 'ఆ వూళ్ళో' వుంటే చాలనుకున్న వర్షిణి మరింత ఆనందంగా ఆ ప్రపోజల్ కి ఒప్పుకుంది.
వెళ్లేముందు విక్రమ్ కోసం చూసింది! అతను రాలేదు. భ్రమరాంబకీ, శిల్పకీ ఎడ్రెసూ, ఫోన్ నెంబరూ ఇచ్చి దిగులుగా వెళ్ళిపోయింది.
* * *
వర్షిణి చాలా దిగులుగా వుంది! ఆమె పిన్నీ, బాబాయ్ ఆ దిగులంతా ఆమె తల్లిదండ్రులు వెళ్లిపోయారని కాబోలు అనుకున్నారు కానీ, అసలు బాధ ఎందుకో వర్షిణికి మాత్రమే తెలుసు!
ప్రేమలో పడ్డాక, కన్నవాళ్ళూ, తోబుట్టువులూ, స్నేహితులూ అందరూ మరో లోకంలో మనుషులైపోతారు. పరాయిగా కనిపిస్తారు!
'చంద్రుడిలో మచ్చలన్నీ విరహిణులు కాల్చినవే' అన్నాడొక కవి. విరహంలో అంత వేడి లేకపోతే ప్రణయంలో అంత వాడి లేదన్న మాటే!
వర్షిణి నిద్ర రాక అటూ ఇటూ దొర్లుతోంది.
ఆమె బాబాయ్, పిన్నీ ఇద్దరూ బి.పి పేషెంట్లే. విద్రమాత్రలు వేసుకుని పడుకుంటే, తెల్లారేవరకూ లేవరు.
ఫోన్ రింగ్ అయింది.
వర్షిణి ఆశ్చర్యంగా చూసింది. అప్పుడు రాత్రి పదకొండున్నర కావొస్తోంది. ఆమె బిరబిరా హాల్లోకి వెళ్లేసరికి వాళ్ళ పిన్ని మాట్లాడుతూ కనిపించింది.
ఆమె ఫోన్ పెట్టేసెయ్యగానే, "ఇంత రాత్రివేళ ఎవరు పిన్నీ?" వర్షిణి ఆత్రంగా అడిగింది.
ఆవిడ నిద్రమత్తులో ఆవలిస్తూ, "రాంగ్ నెంబర్! 'గుండె ఆసుపత్రేనా? అర్జెంట్ గా డాక్టర్ తో మాట్లాడా' లంటాడు..." అంటూనే గదిలోకి వెళ్ళి, "చూశావా? నిద్ర మాత్ర వేసుకోవడం మరిచిపోయాను. అందుకే మెలుకువ వచ్చేసింది" అని టాబ్లెట్ వేసుకుని, పడుకుంది.
"గుండె ఆసుపత్రేనా?" అని అడిగాడు అనగానే వర్షిణికి అనుమానం వచ్చింది. ఎందుకైనా మంచిదని అక్కడే కూర్చుంది. గుండెకి సంబంధించిన విషయాలు ప్రేమికుల్ని గుర్తుచేస్తాయి.