ఆ ప్రాంతం యూనివర్సిటీకి దగ్గరగా వుండటంతో సంగతి తెలియగానే స్టూడెంట్స్ తక్షణ సహాయక చర్యలు మొదలుపెట్టారు. విక్రమ్ ఆలోచించే వ్యవధి లేనట్లు ఆ నిప్పుల గుండంలోకి దూసుకుపోయి తనకి చేతనయినంత మందిని బయటికి మోసుకొచ్చి పడేస్తున్నాడు. ఎక్కువగా వృద్దులూ, పిల్లలూ అందులో చిక్కుకుపోయారు.
"నా పాప! నా పాప!" అంటూ గుండెలు బాదుకుంటూ పొగిలి పొగిలి ఏడుస్తోంది ఒక స్త్రీ. ఆమెని ఎంతమంది పట్టుకుని ఆపజూస్తున్నా "నా పాప పోతే నేను మాత్రం ఎందుకు బతకడం?" అంటూ తిరిగి మంటల్లోకి దూసుకుపోతోంది.
ఆడపిల్లలు కూడా తమ వంతు సహాయం తాము చేస్తున్నారు.
ఫైర్ ఇంజన్ వచ్చేలోపల, నీళ్ళు తోడి బక్కెట్లతో తెచ్చి పోస్తున్నారు.
"మా నాన్న"
"అయ్యో, నా చెల్లెలు..."
"నా కూతురు...."
అంటూ రకరకాల ఆర్తనాదాలతో శోకాలతో ఆ ప్రాంతమంతా దద్దరిల్లుతోంది.
వారి బాధని చూసి భ్రమరాంబ లాటి అమ్మాయిలూ తామూ ఏడ్చేస్తున్నారు.
ఎవరి నోళ్ళల్లో చూసినా 'విక్రమ్' 'విక్రమ్' అన్న పిలుపులే!
వర్షిణికి ఆ పసిపిల్ల తల్లిని కంట్రోల్ చేయడం శక్తికి మించిన పనిగా వుంది. వదిలిపెడ్తే చాలు "నా పాప...నా పాప" అంటూ మంటల్లోకి దూసుకుపోతోంది.
"ఆరు నెలల పసిపాప! అన్నెం పున్నెం ఎరగని నా పిచ్చితల్లి! అలా మాడి బుగ్గి అవాల్సిందేనా! ఇంతమంది వున్నారు...నా పాపని కాపాడలేరా?" ఆమె హిస్టీరిక్ గా గుండెలు బాదుకుంటూ ఏడుస్తోంది.
వర్షిణి స్పృహ తప్పుతున్న ఆ తల్లి నోటికి మంచినీళ్ళు అందించబోయింది. అంతే! ఈడ్చి చెంపదెబ్బ కొట్టిందా తల్లి! వర్షిణి చెంప పట్టుకుని ఆమెవంక ఓ నిమిషం అలాగే చూస్తుండిపోయింది. నవమాసాలూ మోసి నరనరాల్లో ఆ బాధనీ తీపి జ్ఞాపకాలనీ జీర్ణం చేసుకుని, ఎన్నో కళలు కని, ఆ కళలు కళ్ళముందే కాలిపోతుంటే ఆ కన్నతల్లి పడుతున్న నరక బాధ ఆమెని నిలువునా కదల్చివేసింది.
సృష్టిలో అన్నింటికన్నా తియ్యనిది మాతృత్వం! అన్నింటికన్నా బాధాకరమైన బాధ్యత కూడా మాత్రుత్వమే! బిడ్డ నవ్వితే తల్లికి వెన్నెల! బిడ్డ రోదిస్తే తల్లి హృదయంలో అగ్ని జ్వాల! వయసుతో నిమిత్తం లేదు. కడుపునా పుట్టినవాడు ఎప్పుడూ ఆమెకి పసివాడే!
ఒక వృద్దుడ్ని భుజాన వేసుకుని వస్తున్న విక్రమ్, తన కాళ్ళని ఎవరో బలంగా బంధించడంతో ముందుకి అడుగువెయ్యలేకపోయాడు.
"అన్నా! నా పాపని రక్షించు...నా పాలిత దేవుడివే అనుకుంటాను..... నా పాపని..." ఆమె అతని కాళ్ళని చుట్టేసి ఏడుస్తూ అక్కడే కుప్పకూలిపోయింది.
విక్రమ్ చేతిలో వున్న వృద్దుడ్ని మిత్రులకి అందిస్తూ..."పాప ఎక్కడ?.." అని అడిగాడు గబగబా.
"పై అంతస్తులో ఆ మూలనున గదిలో మంచం మీద పడుకుంది" ఎవరో ఆ దిక్కుగా వేలుపెట్టి చూపిస్తున్నారు.
ఫైర్ ఇంజన్ వస్తున్న గుర్తుగా గంటలు గణగణ లాడాయి. చాలామంది మొహాల్లో కాస్త ఆశ కనిపించింది.
"నీ పాపకేం ఫరవాలేదు...ఎలాగైనా రక్షిస్తాను..." అంటూ విక్రమ్ ఆమె చేతులు తన కాళ్ళ మీద నుంచి తొలగిస్తూ వుండగానే-
"విక్రమ్....విక్రమ్..." అన్న కేకలు వినిపించాయి పైనించి. అతను ఆశ్చర్యంగా చూశాడు అగ్నిబిలంలో నిలబడ్డట్టు, అగ్నిజ్వాలలతో నిలువునా మండుతున్న కిటికీ దగ్గర నిలబడి వుంది వర్షిణి. ఆమె చేతిలో ఉన్ని రగ్గులో చుట్టబడి వుంది పసిపాప!
"మైగాడ్!" అన్న మాటలు అప్రయత్నంగా వచ్చాయి అతని నోటి నుండి.
"పాప ఇదిగో!" ఆమె కళ్ళు మూసుకుపోతున్నాయి ఆ మంటల వేడికి.