వాస్తవమే. మాతృదేవతకు తన అంతరంగమే ఆలయం. ఆమె దివ్యస్మృతికి అయన జీవితమే ఒక శిలాశాసనం.
తల్లి లేని తనయుణ్ణి అంతా చులకనగా చూస్తారు. పాపం! తాను స్నానం చెద్దామని దిగుడుబావికి వెళ్ళాడు. అక్కడ ఒడ్డును తాకుతున్న అలలు "మీ అమ్మ ఏదీ?" అని అడిగినాయిట. ఎంతటి రసార్ద్రమైన భావం!
ఏను స్నానమ్మునకు బావి కేగినాను
లేత సూర్యుని బంగారు పూతలందు
మురియుచును తల్లియెద్దును ముద్దుగొనుచు
'అమ్మఏదిరా" యన్న వాయలలు నన్ను.
అలలే కాదు - పైన తేలుతున్న తాబేలు కూడా ఆయన్ని చూచి అవహేళనగా మునిగిపోయిందిట.
పైని వేంచేసి యూపిరి పట్టుకొనుచు
చిన్ని తాబేలు నాన్ను వీక్షించి జలము
త్రవ్వుకొను చేగె కూపగర్బమున దాగ
పైనలముకొన్న సుళ్లు నాపాల విసరి.
తాబేలు మునిగినప్పుడు నీళ్ళలో గుండ్రని సుళ్ళు బయలుదేరాయి. ఆ సుళ్లు సున్నాలు చుట్టునట్లున్నాయి. అంటే "మీ అమ్మ నీకు సున్నా" అన్నట్లుగా ఉందట. రసధ్వని ప్రతిధ్వనించింది.
"నీకు లేదమ్మ' యన్నది నీటిపాము
పై కెగసి యొక్క కప్పను పట్టుకొనుచు -
కప్పను కబళిస్తున్న పాము కఠోరమృత్యువుకు ప్రతీక. "మీ అమ్మను ఇదే విధంగా మృత్యువు మ్రింగేసింది. ఇక నీకు అమ్మలేదు పో" అన్నట్లనిపించింది.
శివరాత్రి వచ్చింది. కడచిన ఏడాదివలె అమ్మ "సువర్ణముఖి " లో స్నానం చేసి కాళహస్తీశ్వరుడి గుడిలోకి తీసుకువెళ్ళటానికి రానే లేదు. నూతన సంవత్సరాది వచ్చింది. అమ్మ తన శిరోజాలు చిక్కుతీసి తనకు తలంటిపోయటానికి రానేలేదు. ఆరోజు బ్రాహ్మణుడు తెచ్చియిచ్చిన వేపపూతపచ్చడి అచ్చంగా చేదుముద్ద అయింది.
మాతృగీతాల్లోని ప్రతిగీతంలోను నాయనివారి అశ్రుబిందువులు చిందిపోతుంటాయి. ఇది అరవైమూడు గీతాలు గల విషాదకావ్యం. ఇది కవిగారి కన్నతల్లియైన "ఉదయమ్మ తల్లి" కి అంకితం.
విషాద మోహనము:
ఇది రెండువందల ఇరవై అయిదు మధ్యాక్కఱలతో కూర్చిన విషాదకావ్యం. మాతృవియోగాన్ని మరచిపోయి కొంత విశ్రాంతిగా జీవితం గడుపుతున్న నాయనివారికి ఏకైకపుత్రుడైన మోహనక్రుష్ణుని మరణం గోరుచుట్టు పై రోకటిపోటు అయింది. అయన హృదయవేదనయే విషాదమోహనంగా ఆవిర్భవించింది.
జీవస్మరణ సంధి గొట్టుకోనుచున్న చిన్నారిసుతుని
ప్రోవు మంబా! యంచు శోకబాష్పావరుద్దకంఠమున
శ్రావణ శుక్రవారమున వరలక్ష్మీ సన్నిధి వగపు
క్రోవి వత్సల కొట్టినట్టి టెంకాయ క్రుళ్ళిపోయినది!
ఎంతటి అపశకునం! రాబోయే అమంగళం ముందుగానే కన్పించింది. ఇక అన్నం ముందు కూర్చున్నప్పుడు అయన అవస్థ అతిదీనంగా ఉంది - అవలోకించండి -
'అన్నమ్ము ముందఱ కూరుచుండి మోహనుచు రాడేమి
అన్నాని " కని యలవాటు చొప్పున ననబోయి యంత
పున్నేమ్మునకు నోచుకోనని దురదృష్ట భూతాహతుండ
నన్నమ్ము మ్రింగుడు పడక నిన్నెంచి యశ్రువుల్ రాల్తు!
వార్ధక్యంలో ఏకైక పుత్ర శోకవిహ్వలుడైన దంపతుల దయనీయ దశ హృదయ విదారకంగా ఉన్నది చూడండి.
ఒకరి నొక్కరు చూచుకొనుచు సంతాపయుత వీక్షణముల
ఒకరి నొక్కరు పిల్చి పల్కరించుకో నుధ్యుక్తులగుచు
ఒకరిమే నొకరు నిమురుచు దురదృష్ట మోడు హస్తముల
ఒకరి బాష్పమ్ముల నొకరు తుడుచుచు నూఱడిల్లెదము!
కరుణం పరాకాష్ట చెందింది. కలం కదలలేనంటున్నది. కన్నతండ్రి చిన్నకుమారుణ్ణి ప్రశ్నిస్తున్నాడు.
పోయిన సూర్యుండు వచ్చు! పోయిన చంద్రుండు వచ్చు!
పోయిన పదునాఱుకళలు పూర్తిగా విధునకు వచ్చు!
పోయిన తారకల్ మినుకు పూవుల గుత్తులు వచ్చు!
పోయిన మోహనా! వినయభూషణా! తిరిగి రావేమి?
మోహనా! అందరూ పోయినవాళ్ళు తిరిగి వస్తూనే ఉన్నారు. సూర్యుడూ, చంద్రుడూ, నక్షత్రాలూ కాని నీవు మాత్రం తిరిగిరావడం లేదు!
"ప్రాసాదే సా పధిపధిచ సా వృష్టతస్సా పురస్సా"
అన్నట్లు ఆయనకు అంతటా కుమారుడే కన్పిస్తున్నాడు.
సృష్టి సమస్తం మోహనమయమైపోయింది.
నిదురలోపల నీవు! స్వప్నవీధిలో నీవు! కన్పింప
నెదురుగా చిఱునవ్వు లొలుకబోయిచు నీవు! కన్మూయ
కుదురుగా మన్మనస్సింహపీఠిపై కొలువుండి నీవు!
మదఖిలదైనిక కార్యజాతంపు మలుపుల నీవు!
చదువుకో తెరచు పొత్తమ్ము పోరటల సందుల నీవు!
చెదరినదృష్టిలో నస్పుటమ్ముగా చిక్కు జీరులుగ
పదిలమ్ము కొఱవడ్డ ముద్రితాక్షర పంక్తుల నీవు!
మదినంకురించెడు భావములు విప్పు మడతల నీవు!
భావాలు విప్పేమడతల్లోనే కాదు. గుండెలోతుల్లో నుంచి ఉబికి వచ్చే పద్యాల బరువుల్లోనూ నీవే ప్రత్యక్షమౌతున్నావని వాపోతుంది. ప్రేమమయమైన పితృహృదయం గుండెలు కదిలించే ఎన్నో సన్నివేశాలనూ సంఘటనలనూ తాలచుకొని తలచుకొని మధురభాషణుడూ వినయభూషణుడూ అయిన తనయుని కోసం తల్లడిల్లి పోతారు. నాయనివారు. ఇందలి ప్రతి పద్యంలోనూ అయన తన దైన్యాన్ని ఆవేదననూ కన్నీళ్ళనూ మూటగట్టిలో కాని కందించారు. జాలిజాలిగా స్పందిస్తూ కన్నీరు చిందిస్తూ కలకాలం నిలచే కరుణ కావ్యాలు రచించిన కవులకూ ఈకావ్యం అంకితం చేశారు కవిగారు.
వేదనావాసుదేవము :
మడిగట్టుకొని పూజాపాత్రపట్టుకొని దేవుడి సన్నిధికి పోతూ కన్నతల్లి తన్ను వెంట పెట్టుకొని పోలేదు. అలనాడు పోయిన మోహనుడు తిరిగి రాలేదు. ఇలువేలు పైన ఏడుకొండలవాడు కూడా కొంచెమైనా కనికరింపలేదు. విశ్వమంతా వేదనామయంగా కన్పిస్తుంది. సంసారసముద్రాన్ని ఈదలేక ఊపిరాడక గిలగిల కొట్టుకుంటున్నది జగత్తు. జగత్తులోని ప్రతిమానవుడి వేదనను తన వేదనగా చేసుకొన్నా నాయని వారు తన ఆవేదనను దేవదేవుడైన వాసుదేవుడికి నివేదించుకొన్నారు. అదే వేదనావాసుదేవము. నాయని వారి దృష్టిలో వాసుదేవుడే వేంకటేశుడు . ఈ కావ్యంలో మాట ఎనిమిది పద్యాలున్నాయి. కొంత స్తుతి. కొంత వ్యాజస్తుతి. కొంత భక్తీ, కొంత రక్తి. మరికొంత విరక్తి ఇందులో చోటు చేసుకొన్నాయి.
ఆ మహాతల్లి చలువ గోటానుకోట్ల
కీవు పడగలెత్తితివి కొండెక్కి కులుక
అలి చేసిన సంపన్మహనుభావ!
వట్టి పిసినారి వగుట భాష్యమ్మటయ్య!
తనయందు కొంచెమైన కనికరం చూపని ఏడుకొండల స్వామిని పైవిధంగా ఉల్లాసమాడారు. దుష్టులకు వరాలిచ్చే శివుడూ, శిష్టులను బాధలు పెట్టె కేశవుడూ వీరిద్దరూ ఇద్దరేనంటారు -
ఆ జగల్లయకారి సాంబయ్య భ్రష్ట
చిత్తులకు త్రవ్వితండమ్ము లేత్తువాడు
బిట్టుగాఱాచి ఱంపాన బెట్టి చిదిమి
కాని వదలని గడుసు వెంకయ్య వీవు!
మాన్యులైన మీరిద్దరూ సామాన్యులైన మానవులను మాయచేస్తున్నారు. ఏమంటే-
అయన నిను జూపించును
అయన జూపింతు వీవు, హరిహరబలవ
న్మాయా వాగుర నెఱకలు
పోయిన పక్షినయి దొద్దవోవుదు నేనున్.
తోడు దొంగలైన మిమ్మల్నిద్దరినీ మేలవేసి పట్టుకొని కొందరు హరిహరాద్వైతమనే కళ్లంలో కలిపికొట్టారు. మరి వారికేమైనా వరాలు రాలాయో లేదో! ఇక్కడ ఖలాంతరంలో కలిపికొట్టమన్నది చమత్కారం.