Previous Page Next Page 
కరుణశ్రీ సాహిత్యము - 5 పేజి 34

 

        అంత  భరియింపలేక నా యక్షియుగ్మ
        మల్ల తెఱచితినో లేదో యంతరమున
        ప్రతిమ బ్రహ్మాండగోళమ్ము పట్టలేదు
        నేను నిలువను తావు సుంతైనా లేక.

    కనుకనే ఈ ప్రణయం అననుభూతపూర్వమనీ, నిత్యనూతనమనీ, సత్యసనాతనమనీ చాటి చెబుతాడు.
    ఆనాడు శుక్రవారం. వత్సల జగజ్జనని చరణసన్నిధిలో మోకరిల్లి పూజా పుష్పమైనది. సౌభద్రుడు సైతం భక్తీ పారవశ్యంతో పొంగి పులకించి తానూ ఒక ఆరాధనాపుష్పంగా మారిపొయినాడు. ఆ జంటపూవుల సౌరభంతో రోదసి నిండిపోయింది.

        ఆ త్రిలోకైక జనని పాదాబ్జసవిధ
        భూమి మీలితనేత్రవై మోకరిల్లి
        నీవు పూజా సుమమ్ము వైనావు , హృదయ
        కర్ణికామూలమున భక్తీ కందళించి
        అడరు పారవశ్యమున దొడిమయూడి
        నేను పూవునై పడితిని నీదు చెంత
        జంట పూవుల అమృతనిశ్వాస సౌర
        
    ఈ విధంగా సౌభద్రుని ప్రణయయాత్ర సహృదయ హృదయంగమంగా సాగింది. సౌభద్రుని జీవితగాన గమ్యాన్ని చేరుకొంది. వత్సలా సౌభద్రుల ప్రేమలత అంకురితమై పల్లవితమై కొరకతమై పుష్పితమై క్రమంగా ఫలోన్ముఖమైంది. ఇక "ఫలశ్రుతి " పఠించి ఆనందించుదాం.

    ఫలశ్రుతి

    ఆనాడు భగీరధుడు దివి నున్న గంగను భువికి తెచ్చినట్లు దేవతలు పాల సముద్రమును మధించి అమృతభాండమును సంపాదించినట్లు నా పురాకృత పుణ్యాలు ఫలించి జాహ్నవి స్వచ్చవూ సుధామధుర మూర్తివీ అయిన నీ సాన్నిధ్యం అందుకోగలిగాను. అని తన సంతుష్టిని ప్రకటించుకొంటాడు ఇందులో నాయకుడు.

        అంత శ్రమపడి పావన మభ్రగంగ
        ధారుణికి దెచ్చినాడు భాగీరధుండు
        అంత మధియించి కలశరత్నాకరమ్ము
        అమృతభాండమ్ము పడసినా రామరవరులు

        మత్సురానేక పుణ్యజన్మములు పండి
        జాహ్నవి స్వచ్చవును సుధాస్వాదుమూర్తి
        వైన నీ దివ్యసాన్నిధ్య మందుకొంటి
        పుడమికి స్వర్గమున కొక్కుముడి రచించి
        
        వత్సలాఫాలమున నెలవంక గుఱుతు
        కందళించి వికాసించి కళలుదేరి
        తరుణశారద రాకా సుధాకరాచ్చ
        బింబము అనంతములు లెక్కపెట్టుకొనేడు.

    నెలవంక కందళించి, వికసించి, కళలు నెలయించి రాకసుదాకర బింబాలను అనంతంగా సృష్టించిందనడం నాయికానాయకుల ప్రణయపరిపూర్ణస్వరూపాన్ని సూచిస్తుంది. ప్రేయసీ ప్రియులు దంపతులైనారు.
    "నన్ను నీ చెంత చేర్చుకొన్నావు దేవి!" అని సౌభద్రుడు వత్సలతో అంటాడు. "ఈ యమృత రాజ్యమున మన మిద్దఱమును,  నీవు రాజ్ఞివి నేను నీ సేవకుడును" అని తన సౌహార్ద సౌజన్యాలను ప్రకటిస్తాడు. "బావ యనుమాట ప్రేమ ప్రపంచమునకు నీవు పెట్టిన పేరు" అని తన సంతృప్తిని వెల్లడిస్తాడు.
    
        "నా సరస్వతి నీవు నా చదువు వీపు
        నా విపంచిక వీవు నా నవ్యమధుర
        గీతి వీవు నా హృదయమ్ము రీతి వీవు"

    అని తన ప్రణయాన్ని ప్రస్తావించి ప్రియురాలి ముందు పరుస్తాడు.
    
        "నా ప్రయాణమ్ము నీవు నా పధము నీవు
        నావిడిది నీవు నా చేరునగరు నీవు
        నా పరము నీవు నా పరాత్సరము నీవు"
        అని ఆమెకు నమస్సుమాలు అర్పిస్తాడు.

        "నీ తొడ తలాడగా శయనింపగలిగి
        దేవి! నా జన్మమున్ సమర్ధించినాను,
        ముక్తి సీమంతినీ త్రపాముగ్ధవరద
        హస్తవలయితుడౌ పరమాత్మ  బోలి"
        అని తమ దాంపత్యాన్ని దివ్యంగా భవ్యంగా చిత్రిస్తాడు.
        "పరమపదనాదు కొఱకు పార్వతియు బోలె
        నా కొఱకు మౌనముద్ర నున్నావు నీవు"
    అని తమ ప్రణయాన్ని అది దంపతుల ప్రణయంతో ధ్వనింపచేస్తాడు.

        "మనము ప్రణయమహాకావ్యమున నపూర్వ
        నాయికా నాయకుల మభిన్నమ్ములైన
        మన మనోభావగీతమ్ములను పఠించి
        పరవశము పో రసజ్ఞ ప్రపంచ మెల్ల"

    అని తమది ఆదర్శదాంపత్యమనీ, ఈ ధార్మిక ప్రణయకావ్యానికి తాము నాయికా నాయకులనీ తమ భావగీతాలు పఠించి భావుకప్రపంచం పరవశించిపోతుందనే అచంచలమైన ఆత్మ విశ్వాసంతో మురిసిపోతాడు.
    ఫలశ్రుతి ముప్పది ఖండికలున్నాయి. భావకవిత్వానికి ధార్మిక ప్రణయానికి విజయకేతనాలైన "సౌభద్రుని ప్రణయయాత్ర" "ఫలశ్రుతి" శాశ్వతంగా నిలుస్తాయి.

    మాత్రుగీతాలు:

    శృంగారం సుకుమారమైతే కరుణం పరమసుకుమారం. ఇష్టజన వియోగ జన్యమైన శోకం కరుణరసానికి స్థాయి భావం. నాయని వారి ప్రణయయాత్ర ఆనందమయంగా ముగిసిందే కాని అనంతరజీవితంలో ఆయనకు మాతృవియోగం ఎంతో దుఃఖాన్ని తెచ్చి పెట్టింది. తన్ను కనిపెంచి పెద్ద చేసిన కన్నతల్లి వియోగాన్ని అయన సహింపలేక పోయాడు. వారి అంతరంగంలో పొంగి పొరలి ప్రవహించిన శోక తరంగాలే వారి మాతృగీతాలు. తన్ను వదలి ఒక్కక్షణ కాలం కూడా నిలువలేని తల్లి తన్ను శాశ్వతంగా విడిచి పోయింది. మాతృమరణం ఆయనకు ఆశనిపాతం అయింది. ఆ చల్లని తల్లి మళ్ళీ తిరిగిరాని లోకానికి వెళ్ళిపోయింది. ఎప్పుడూ వెళ్ళేటప్పుడు తనను వెంట తీసుకువెళ్ళేది. ఇప్పుడు చెప్పకుండా వెళ్ళిపోయింది. జననీ శోక విహ్వలమైన కుమారుని కంఠంలో విషాదవీణ మ్రోగింది. 'ఆపిగ్రావా రోది త్యపిదళతి వజ్రన్య హృదయ" అన్న భవభూతి మహాకవి సూక్తి గుర్తుకు వస్తుంది.

        నీవు మడిగట్టుకొని పోయినావు పండ్లు,
        పుష్పములు తీసికొని దేవపూజ కేటకో\
        నేను నీ కొంగు పట్టుక నీడు వెంట
        పోవుటకు లేక కన్నీటి బొట్లు రాల్తు.
    అపరకర్మ చేయించే పురోహిత బ్రాహ్మణుడు వైతరణీనదిని తరింపజేయటానికి గోదాన విమ్మన్నాడు. ఎంత అవివేకం! ఈ సందర్భంలో నాయని అంటారు.

        నీవు గమియించ వితరణీ ప్రవాహ
        మావు నొక దానమిమ్మనే నవనిసురుడు
        నాకు తెలియును నీ స్పర్శ సోక నందు
        అమరశైవాలినీ సహస్రములు పుట్టు.

        అవును, అమ్మ స్పర్శ తగలంగానే జ్వాలనజ్వాలలతో భగభగ మండే వైతరణీ ప్రవాహాలు అమరగంగా ప్రవాహలుగా మారిపోతాయి. ఆ తల్లి చలువ అలాంటిది.

        ఇంక నా జీవితమ్ము నీ స్మృతికి చెక్క
        బడిన యొక శాసనమ్మయి వరలు నటవే
        చిన్ని నీ విగ్రహము ప్రతిష్టితము నాడు
        నంతరంగమ్ము నీకు దేవ్యాలయమ్ము.

 Previous Page Next Page