Previous Page Next Page 
మొగుడే రెండో ప్రియుడు పేజి 33

    "ఇటువంటి కేసుల్లో..."ఆయన హింట్ ఇస్తున్నట్టు "చాలా ఖర్చవుతుంది! అందులోనూ నువ్వే కొట్టానంటున్నావు" అన్నాడు.


    విక్రమ్ అసహనంగా "ధర్మాసుపత్రిలో ఖర్చు ఏవిటీ?" అన్నాడు.

    "ధర్మాసుపత్రి కదా అని నువ్వు ప్రతివాడినీ అధర్మంగా చావబాది తీసుకొచ్చి పడేస్తే వైద్యం చేసెయ్యాలా?" ఆయన వ్యంగ్యంగా అడిగాడు.

    నర్స్  అదేదో జోక్ లా నవ్వుతోంది.

    అప్పుడు జరిగింది ఎవరూ ఊహించని ఆ సంఘటన! మెరుపు కన్నా వేగంగా కదిలి విక్రమ్ ఆయన కాలర్ పట్టుకున్నాడు. "మర్యాదగా చూస్తావా? లేక నీకు కూడా ఈ గతి పట్టించాలా?" ఆవేశంగా అరిచాడు.

    దాంతో ఆయన తడబడి "మా ఇబ్బందులు మాకుంటాయి....నర్స్...స్ట్రెచర్ ని ఏర్పాటు చెయ్యి..." అంటూ తన విధి నిర్వహణలో బలవంతంగా పడ్డాడు.

    విక్రమ్ భుజం మీద అతన్ని స్ట్రెచర్ మీద పడుకోబెట్టాడు.

    చేతులకి గ్లౌజ్ వేసుకుంటూ, మామూలుగా "నర్స్ ముందు ఆ గాయాలు క్లీన్ చెయ్యి" అంటూ వచ్చిన డాక్టర్ పేషెంట్ ని చూస్తూనే అదిరిపడ్డాడు. "గిరీ" అని గావుకేక పెట్టాడు.

    విక్రమ్ ఆయన వంక 'ఏవిటి' అన్నట్లు చూశాడు.

    ఆయన ఆందోళన, కోపం కలగలపి "వీడు ఎవరనుకున్నావు? నా కొడుకు...తెలుసా?" అన్నాడు.

    "అయితే ఏవిటిట?" నిర్లక్ష్యంగా అడిగాడు విక్రమ్.

    ఆయన ఆవేశాన్ని దిగమింగుకుని పేషెంట్ ని తీసుకుని లోపలికి వెళ్ళాడు.

    నర్స్ హడావుడిగా బైటికి వచ్చి, "ఆ గ్రూప్ రక్తం మన దగ్గర స్టాక్ లేదు. ఎవరైనా డోనర్స్ వున్నారేమో చూడు!" అంటూ మరో నర్స్ తో కంగారుగా చెప్తోంది.

    విక్రమ్ లేచి నిలబడి "ఏ గ్రూప్ రక్తం కావాలి?" అడిగాడు.

    నర్స్ చెప్పింది.

    "నాది టెస్ట్ చెయ్యండి. కలవకపోయినా ఫరవాలేదు. మా కాలేజీలో చాలామంది స్టూడెంట్స్ వున్నారు. ఎవరిదో ఒకళ్ళది తప్పకుండా కలుస్తుంది" అన్నాడు స్థిరంగా.

    ఎంక్వయిరీ చేసి-హాస్పిటల్లోకి ఎంటర్ అవుతూ, విక్రమ్ విశ్వరూపం చూసి, దూరంగా నిలబడ్డ వర్షిణీ వాళ్ళు "కావాలంటే మాది కూడా టెస్ట్ చెయ్యండి" అంటూ ముందుకి వచ్చారు.

    విక్రమ్ బ్లడ్ అదే గ్రూప్ కి చెందినది కావడంతో చకచకా గిరికి ఎక్కించేసే ఏర్పాట్లు జరిగిపోయాయి!

    ఓ గంట పోయాక గిరికి స్పృహ వచ్చింది.

    జరిగినా విషయమంతా తెలుసుకున్న డాక్టర్ అలసటగా టేబుల్ మీద తల పెట్టుకుని కూర్చున్నాడు.

    "డాక్టర్..ఖర్చవుతుంది అన్నారుగా! ఎంత ఇమ్మంటారు! అడిగాడు విక్రమ్ ఆయన దగ్గరగా వెళ్ళి.

    డాక్టర్ నెమ్మదిగా తలెత్తి విక్రమ్ ని చూసి, ఆ కళ్ళలోని తీక్షణత భరించలేనట్లు అంతలోనే తల తిప్పేసుకుని ఎటో చూస్తూ అన్నాడు- "నా బిడ్డని దారునమగా కొట్టినందుకు నిన్ను దూషించాలో? సమయానికి తీసుకొచ్చి ప్రాణం రక్షించినందుకు కృతజ్ఞతలు చెప్పుకోవాలో? వాడు ఆ అమ్మాయిని అవమానించినందుకు ఈ పరిస్తితుల్లో వాడ్ని దండించాలో? నా విధి నిర్వహణ నేను నిర్వహించడానికి నిన్ను లంచం అడిగినందుకు సిగ్గుతో ప్రాణాలు తీసుకోవాలో? ఏమీ తెలియని పరిస్థితి...ఏమీ తెలియని మూర్ఖత్వం...జీవితంలో మంచి గుణపాఠం నేర్చుకున్నాను. థాంక్స్ ఆయన గొంతు దుఃఖంతో పూడుకుపోయింది!

    విక్రమ్ నెమ్మదిగా ఆయన భుజంమీద తట్టి బైటికి నడిచాడు. వర్షిణీ వాళ్ళు అతన్ని అనుసరించారు.

    అతను వాళ్ళని పట్టించుకోకుండా నడిచి ముందుకి వెళ్ళిపోయాడు.అతను దూరం అవుతునకొద్దీ వర్షిణి మనసు భారం అయింది.
   
                                             *    *    *   

    హాహాకారాలు! ఎక్కడ చూసినా పెడబొబ్బలు! పసి పిల్లలు వృద్దులు పెద్దలు పిన్నలు అందరూ హృదయ విదారకంగా రోధిస్తున్నారు. ఇదేమీ పట్టనట్టు ఎన్నో ఏళ్లుగా వాళ్ళని తన గుండెల్లో పెట్టుకుని భరించిన ఆ భవనం నిలువునా మండుతోంది. అగ్నిదేవుడు తనకోరలు జాపి అందర్నీ ఆహుతి చేసుకోవడానికి అమితోత్సాహ పడ్తున్నాడు.

    ఆ యింటి వయసు ఎవరూ సరిగ్గా చెప్పలేరు, కారణం అందులో వాళ్ళు తమ తాత ముత్తాతల కాలం నాటి నుంచి అంటే రెండు రూపాయలు అద్దెగా చెల్లించే కాలం నాటి నుండీ వుంటున్నారు. ఆ బంగళా యాజమాన్యం స్వీకరించిన వ్యక్తి సిటీ సెంటర్ లో వున్న ఆ నాలుగొందల గజాల స్థలంలో ఎపార్ట్ మెంట్స్ కట్టాలని సంకల్పించాడు. ఆ సంగతి అందులో కాపురం వుంటున్న కుటుంబాలకి తెలియబరిచి "ఖాళీ చెయ్యండి, తృణమో, పణమో ఇస్తాను" అని ఆశపెట్టాడు.

    వాళ్ళు అందుకు సమ్మతించలేదు రెంట్ కంట్రోల్ కేస్ పెట్టి కోర్టుకి ఎక్కి గెలిచారు. బహుశా దాని పర్యవసానమే వారిలా అగ్ని జ్వాలల మధ్య చిక్కుకుపోవడమేమో! దాదాపు పద్దెనిమిది కుటుంబాలు, దగ్గర దగ్గర యాభైమంది మనుష్యులు నివసిస్తున్న నివాస భవనానికి నిపు అంటుకుంది.

 Previous Page Next Page