Previous Page Next Page 
కరుణశ్రీ సాహిత్యము - 5 పేజి 32

 

        గానమున పేరువడసిన కన్నెపికము
        క్రమ్ము కాకుల కన్నుల దుమ్ము జల్లి
        యిమ్మయిన నాదు చిత్తచూతమ్ము జేరి
        ప్రణయ మకరందరస ముట్ట పోదు టెపుడో!

    తెరచాటు బొమ్మయై ప్రేయసి తీయతీయగా చిరునవ్వు నవ్వింది. ఆ నెచ్చెలి మధురమందహాసమే అచ్చు గ్రుద్దినట్లు అతని ఆత్మ ఫలకాన అతికింది. ఆ చిరునవ్వు ముఖమే నాయకునికి ప్రాణాధారమైంది.
    గోడదాటైనను ఆమె పడిన పాట అతని అనురాగాంకురమునకు అమృతధారఐనది. ఆవల ఆమె చేతిగాజులు "ఘల్లు" మన్నవి. ఈవల ఈతని గుండె "ఝల్లు" మన్నది. ఇక "వత్సల వలపు" గుండెల నేత్తావులు చిత్తగించండి.
        "చెప్పే నత్తమ్మచేతిలో చేయివైచి
        నీకుమారున కిచ్చెద నా కుమార్తె
        ననుచు మును నాన్న; నేడు పేరాస దగిలి
        తోసేరాజనె జేసిన బాసలన్ని."
    అవును అలనాడు వత్సల నాన్నగారు అనుగు చెల్లెలి చేతిలో చేయి వేసి చేసిన బాసలన్నీ ఈనాడు త్రోసిరాజన్నాడు. పేరాసతో వత్సలను వేరొక సంబంధం నిర్ణయించారు. కాని పాపం బాల్యం నుండి బావతో ఏర్పడిన ప్రణయ బంధం ఏం కావాలి? ఆ ఆత్మానుబంధం ఇప్పుడు ఏమైపోవాలి ?

        "పాలబుగ్గల చిన్నారి ప్రాయమందు
        నంతికొద్వాస వాటి నవ్యక్తమధుర
        మైన యనురాగ మూర నాన్యోన్యకంఠ
        సీమ గీలించితిమి సుమదామములను."
    
    హృదయాంతరంలో పదిలపరచుకొన్న బావ చక్కదనాల రూపం ప్రక్కకు తొలగించి అక్కడ ముక్కు మొగం తెలియని మరొక్క కొత్త విగ్రహాన్ని ప్రతిష్టించుకోవటం ఎలా సాధ్యం?
        'చిత్ర ఫలకమ్మునందు నచ్చేత్తినట్టు
        లంటియున్న బావయ్య నెయ్యంపురూపు
        చెఱపి ముక్కు మొగమ్ము గుర్తేఱుగరాని
        వాని జిత్రింప జేతులు వచ్చునెట్లు?"
    పై విధంగా తనకోసం పరితపించే ముద్దుల మరదలి నుద్దేశించి బావ కంఠంలో ప్రతిధ్వనించిన "ప్రణయహ్వాసం" తీరు పరికించండి.
    "మనము చకోరదంపతులమై తెలివెన్నెల తీవెగుంపులో
    చని చని తారకాకుసుమసౌరభావాహిని దోగి, కోసి తె
    చ్చిన విరులన్ సరమ్ములు రచించి పరస్పరరాగముద్రగా
    ప్రణయిని! రెండు మేనులకు బంధము వైచెద మేగుదెంచేదే?"
    
    అంతేకాదు. తన స్వాంత మనే పళ్ళెరంలో వలపుల కర్పూరం వెలిగించి తన ఆరాధ్యదేవతకు హరతీయాలనే ఆకాంక్షతో ఆమె ఆగమనం కోసం అనునిమేషం ఎదురు తెన్నులు కాస్తుంన్నానంటాడు.
    అది వసంత ఋతువు. వెన్నెల రాత్రి. అందం, అనందం చిందిపోతున్న అడ పిల్లలందరూ తోటలో ఒక చోట కూడి వెన్నెల కుప్పలూ, చెమ్మ చెక్కలూ , దగుడూమూతలూ ఆడుతున్నారు. తాను తెరచాటు నుండి చూస్తున్నాడు. తన చెల్లెలు కూడా వారిలో ఉంది. ఇంతలో

        "కన్నెగేదంగిరేకుల కన్నలైన
        నిగ్గుచెక్కిళ్ళ చిఱునవ్వు నృత్యమాడ
        నాటవెట్టుచు చెలుల వెన్నాడు కాంత
        నా మనోరంగమున ప్రేమ నాట్యమాడే."
    ఎవరి కోసం గుటకలు మింగుతూ ఎదురుచూస్తున్నాడో ఆ ప్రియురాలు 'అట పెడుతూ" కన్నులవిందుగా కన్పించనే కనిపించింది. ఆమె సాక్షాత్కరించిన ప్రకృతి దేవతలా ఉంది. ఎంతసేపు చూసినా తనివి తీరటం లేదు. ఆమెను కలుసుకోవాలనే కాంక్ష తనలో రేకెత్తింది. తెరవీడి ముందుకు వచ్చాడు. అక్కడ ఉన్న బావిబొద్దును అనుకోని మళ్ళీ తన ప్రణయసుందరిని సందర్శించాడు. ఒక్కక్షణం అలోచించి బావిలోకి తొంగిచూస్తూ "చెల్లాయ్! అద్భుతం! అద్భుతం! వేగం రా! చిత్రం చూద్దువుగాని" అని పెద్దగా అరిచాడు.
        బావిలో తొంగి చూచెడు పగిది నుండి
        అందరును వినునట్టు లుచ్చైస్వనమున
        చెల్లెలా! చూతు రమ్మించు చిత్రమొకటి
        అద్భుత మ్మద్భుటతమ్మని యఱచినాను."

    ఆ చిత్రమేమో చూద్దామనే కుతూహలంతో ఆడపిల్లలంతా ఆటలు మానేసి గబగబ పరుగెత్తుకు వచ్చి బావి చుట్టూ మూగారు. తన ప్రియురాలు మాత్రం మల్లెపాదు దాకా వచ్చి మధ్యలోనే సిగ్గుతో ఆగిపోయింది. "చెల్లాయి! అవిగో చూడు రంగు రంగుల నీటి కోళ్ళు మూడు బావిలో మునిగి తేలుతున్నాయి. చూస్తూ ఉండు" అన్నాడు. అంతా తదేకధ్యానంతో రెప్పవేయకుండా బావులోకి చూస్తున్నారు.
    
        "మునిగి యడుగున కేగిన పులుగు నిపుడే
        తేలి మీ కద్భుతమ్ము సంధించు నిందు
        చూడు డని వారదే దృష్టి జూచుచుండ
        సందు గనుగొని చల్లగా జారినాను."

    అలా జారుకొని ప్రియురాలిని సమీపించాడు. ఒక మల్లెమొగ్గ కోసి ఆమె జడలో అలంకరించాడు. ఆమె ముసిముసి నవ్వులు నవ్వింది. "పలుకే బంగారమా" అని ఆ సిగ్గుల పెళ్ళికూతురిని పలుకరించాడు. కొంచెం ధైర్యం తెచ్చుకొని ప్రేయసి హస్తము తన వక్షమున గట్టిగా నొక్కిపట్టి -

    "వలపు 'కీ' పూర్తిగా నీయబడిన కతన
    గుండెగడియార మెటు కొట్టుకొనునో చూడు"
    అన్నాడు ఆమె కరం కంపించింది. వదనపద్మంలో స్వేదమధువు చిందింది. కనుగొనలలో చికిలి వాల్పుపులు చిక్కుపడ్డాయి. ఇంతలో అసలు రహస్యం తెలుసుకొన్న అమ్మాయిలందరూ వెనక్కు తిరిగి వస్తున్నారు. "ఉత్తకొంటేచినన్న" అన్నది చిన్నారి చెల్లి అంతా చప్పట్లు కొట్టారు. ఆ చప్పట్ల చప్పుడుకు అతనికి మెలకువ వచ్చింది. ఎంత తీయని కల! అందుకనే ఈ ఖండిక నామం' స్వప్నప్రణయం" అన్నారు.
    ప్రణయసూత్రం చాలా చిత్రమైంది. ఎంత చిత్రమైందో అంత సుకుమారమైంది. అది "అనోరాణీయాన్" అది "బిసతంతు తనీయనీ" అందుకనే తెగిందాకా లాగాకూడదంటారు. ప్రియురాలు తన ప్రియుణ్ణి గాలిపటం చేసి ఎగురవేస్తుంది. గిరికీలు కొట్టిస్తుంది. గంతులు వేయిస్తుంది. నభోంగణంలో నాట్యమాడిస్తుంది. ప్రియురాలి చేతిలోని ప్రేమసూత్రం ఎక్కడ తెగిపోతుందో అని ప్రియుడు గిలగిల కొట్టుకుంటాడు.
        "కందే జుట్టుచు దారమ్ము క్రమముగా త్వ
        దీయసామీప్యమునకు రావించి నన్ను
        నీదు హృదయంతరమున బంధింపు మంచు
        వేడుకోనుచుంటలేదు, నీ వ్రేళ్ళ మధ్య
        నలరు దారమ్ము ద్రెంపకు మంతె చాలు."
        అని ప్రాధేయపడతాడు.
        "నిజముగా నన్ను ప్రేమించునెలత వేని
        క్షణమయినా నిల్వరాదా నా సరస నీవు"
    అంటూ ఆ మధుర "క్షణం" కోసం ప్రతిక్షణం ప్రతీక్షిస్తాడు. ప్రణయదేవత సాక్షాత్కారం కోసం నిరంతరం నిరీక్షిస్తాడు.
    ప్రేయసీ ప్రియుల ప్రేమ కలాపం "దాగిలిమూత" ఆటవంటిది. అట ఆరంభమైంది. తల్లి యైన ప్రేమ దేవత కన్నులు మూసి "పిల్లి వచ్చే ఎలుక భద్ర " మని విడిచి పెట్టింది. ప్రియురాలి కోసం ప్రియుడు అన్వేషణ సాగించారు.
        ఈ గులాబీ పూవుటీరంపు మొత్తమ్ము
                      లో దుష్టకంటకబాధ గొనక
        చెరలాడితిని నవాసృగ్భంచు రేఖారు
                    ణాంశుమాలా శోభితయైన మేను
        నా మనోరాగ చిహ్నమ్ముగా నను ఐచ్చి
                      తేనెల క్రొంగ్రొత్త తీపుపసలు
        జార్చు మందార ప్రసవగుచ్చమధుర సౌ
                           రభములో నీ యనురాగ మహిమ
        చడువుచును నిన్ను వెదకితి సంతతమ్ము
        నాదువీనుల శబ్దించు నీదు హస్త
        కంకణారవమును బాదకంజనూపు
        రధ్వనియు దోచుగా నహోరాత్రములును.

    ప్రియుడు ఎంత అన్వేషించినా ప్రియురాలి జాడ తెలియలేదు. వెతకి వెతకి వేసారి పోయి -

        "ఏ పొదల మధ్య దాగినావో ప్రభాత
        మందమలయానిలమున నీమాట లేదు

 Previous Page Next Page