Previous Page Next Page 
కరుణశ్రీ సాహిత్యము - 5 పేజి 31

 

                                 నాయనివారి వ్యక్తిత్వం - కవిత్వం

    ఆరోజు సాయంకాలం నరసరావు పేట కాలేజీలో నా ఉపన్యాసం. "కావ్యశిల్పం ' అన్న విషయం మీద మాట్లాడాను. "కవి తన కావ్యాన్ని ఎంత అందంగా దిద్ది తీర్చుకుంటాడో అంత ఆనందంగాను ఆకర్షకంగానూ అర్ధవంతంగాను ఆ కావ్యానికి పేరు పెట్టడం కూడా ఎంతో ఆవశ్యకం" అని చెప్పి ప్రతిమ,  కుందమాల,  కాదంబరి, కళాపూర్ణోదయం , సౌందర్యనందం, సౌభాద్రుని ప్రణయయాత్ర ఇత్యాదులు కొన్నియా ఉదాహరణ లిచ్చారు.
    ఉపన్యాసానంతరం మిత్రులతో కలిసి హాలు వెలుపలికి వచ్చారు. ఎదురెగుండా వరనండాలో ఒక సన్నని పొడుగాటి వ్యక్తీ  గంభీరంగా నిలబడి ఉన్నాడు. ఒక మిత్రుడు "వారే నండీ మీ సౌభధ్రులు" అని ఆయన వైపు చూపించాడు. నేను అయన ఎవరో అర్ధం కాకుండానే "నమస్కారమండీ" అన్నాను. వారు తిరిగి నమస్కారం చేస్తూ "నా పేరు నాయని సుబ్బారావు" . మీ ఉపన్యాసం విందామని వచ్చాను. అంతా విన్నాను. చాలా రసవంతంగా ఉంది. " అన్నారు. నేను చాకితుడినై ఆనందంతో ముందుకు చాచిన వారి చేతులు ముద్దు పెట్టుకున్నాను.
    ఆ రోజుల్లో నాయనివారు నరసరావు పేట హైస్కూల్లో ప్రధానోపాధ్యాయులుగా పనిచేస్తూ ఉండేవారు. పేరెన్నిక గన్న భావకవుల్లో అయన ఒకరు. వారి "సౌభద్రుని ప్రణయయాత్ర" "మాతృగీతాలు ' బాగా ప్రచారంలో ఉండేవి.
    సుబ్బారావు గారు మితభాషి, స్మితభాషి. ఆ ప్రసన్నమైన ముఖం - విశ్రాలమైన ఫాలం - ఆప్యాయంగా పలకరించే కళ్ళూ - వాత్సల్యాన్ని చిలకరించే చూపులూ - ప్రధమదర్శనంలోనే ఆ సాహితీసౌభద్రుడు నా హృదయాన్ని బాగా ఆకట్టుకున్నాడు.
    నాయనివారు 1899 లో జన్మించారు. ఈయన వంశం దానధర్మాలకూ భగవద్భక్తికి సారస్వత సంపదకూ పేరుబడ్డ వంశం. ఆనాటి వాతావరణాన్ని అనుసరించి నాయన భావుకవులలో ప్రధమ శ్రేణిలో ప్రకాశించారు. సామాన్యంగా భావకులకు ఒక ఊహసుందరి ఉంటుంది. ఆవిడ అందదు. తెరచాటున దాగుడు మూతలాడుతుంది. అందీ అందని ఆ సుందరి కోసం భావకవి అర్రులు చాస్తాడు. ఆవేదన పడతాడు. పరిపరి విధాల పరితపిస్తూ భావగీతాలు అలపిస్తాడు.
    "సౌభద్రుని ప్రణయయాత్ర" లో నాయని వారి కావ్యనాయిక వత్సల. ఈమె అందరి కవుల ప్రేయసుల వలె ఊహాసుందరి కాదు. స్వయాన అయన మేనత్తకూతురు. శశిరేఖ , అభిమన్యుడుప్రేమించుకున్నట్టుగానే మేనత్త మేనమామ బిడ్డలైన వత్సల, నాయని ప్రేమించుకుంటారు. పూర్వం బలరాముడు తన కూతురైన వత్సల (శశిరేఖ) ను లక్షణకుమారుడికి ఇవ్వాలని ప్రయత్నం చేసినట్లుగానే వత్సలతండ్రి కూడా తన కూతుర్ని మరొకరికి ఇవ్వాలని నిశ్చయించుకుంటాడు. మనం ఈ కావ్యంలో శశిరేఖను వత్సలగాను,  నాయని వారిని సౌభద్రుడు గాను భావించవచ్చు. భారతంలో లాగానే కొన్ని కష్టాలు ఎదుర్కొన్న తరువాత కొంత వియోగ బాధ అనుభవించిన అనంతరం ప్రేమించుకొన్న నాయికా నాయకుల సమాగమం సంపన్నమౌతుంది.
    "సౌభద్రుని ప్రయ్నయాత్ర" లో పైన పేర్కొన్న నాయికానాయకుల ప్రణయ వృత్తాంతం అంతా అత్యంత హృద్యంగమంగా అభివర్ణీతమైంది. ప్రేమించి పెండ్లాడిన దంపతుల ప్రణయమాధుర్యం అత్యంత మనోహరంగా అనన్య సామాన్యంగా ఉంటుంది. దాన్నే నాయనివారు "ఫలశ్రుతి" లో వర్ణించారు.
    సంయోగ శృంగారంలో కంటే వియోగ శృంగారంలోనే ప్రణయం యొక్క పరిపూర్ణ స్వరూపాన్ని మనం దర్శిస్తాము. ఏ వస్తువైనా మనం అందుకోవటానికి ముందున్న ఆసక్తీ, ఉత్కంఠా అది అందిన అనంతరం ఉండదు. ఆ వస్తువును అందుకోవటానికి చేసిన ఆలోచనలో, భావనలో, ఆశలో, అన్వేషణలో, ఆవేదనలో, ఆరాధనలో, ఒక విచిత్రమైన అనందం ఉంటుంది.
    నాయనివారి భావాలు ఉదాత్తములూ ఉజ్వలములూ , ఈయన ప్రతి పద్యమూ గుండెలో నుంచి చీల్చుకొని వస్తుంది. అందుకనే ఆ పద్యాలలో అంతటి బాధా, అంతటి ఆవేదనా కన్పిస్తాయి. నాయని ప్రతిమాటా హృదయానికి హత్తుకొనేటట్టు చెప్స్తాడు. ఈయన కవిత సరళంగా సహజంగా అప్రయత్నంగా పొంగి పొరలుతూ ప్రవహిస్తుంది. నాజూకుగా ఊహిస్తాడు. ప్రాచీన కావ్యాలలోని గంభీర్యమూ, గౌరవమూ వీరి పద్యాలలో ప్రతిభింభిస్తాయి. మృదుపదాల పొందికలో భావాన్ని చక్కగా వ్యక్తీకరించడం ఈయన ప్రత్యేకత. ఈయన కవిత్వాన్ని ప్రశంశిస్తూ "నాయని వ్రాసిందంతా బంగారమే" అన్నారు. కృష్ణశాస్త్రి గారు . "ప్రతి పదం జీవించే పలుకుతాడు" అన్నారు ముద్దు కృష్ణ." "ప్రేమించి పెండ్లాడిన వారి దంపత్యములోని మాధుర్యం అనితరమైంది. దాని నీ కవి రసమహిటంగా చిత్రించినాడు. పేరునకు "సౌభద్రుని ప్రణయయాత్ర" అయినా ఇందులోని సౌభద్రుడు నాయని వారే. వత్సల మొదట వారి ప్రేయసి. తరువాత ఇల్లాలు." అన్నారు డాక్టర్ సి. నారాయణరెడ్డి గారు. ఈ క్రింది నాయని వారి సుప్రసిద్ధ రచనలు -

    1. సౌభద్రుని ప్రణయయాత్ర 2. ఫలశ్రుతి 3. మాతృగీతాలు, 4. సౌందర్యలహరి 5. విషాదమోహము 6. వేదనావాసుదేవము 7. జన్మభూమి 8. భాగ్యనగర కోకిల. వీనిలో సౌభద్రుని ప్రణయయాత్ర, ఫలశ్రుతి శృంగార కావ్యాలు. మాతృగీతాలు, విషాదమోహనము కరుణ కావ్యాలు. సౌందర్య లహరి, వేదనావాసుదేవము భక్తీకావ్యాలు, జన్మభూమి, భాగ్యనగర కోకిల దేశభక్తికావ్యాలు. అవికాక వివిధ ఖండికలతో గూడిన "ముక్తకములు" అనే ఖండ కావ్య సముచ్చయం ఒకటున్నది.

    సౌభద్రుని ప్రణయయాత్ర:

    ఈ కావ్యంలో నలుబదియారు శీర్షికలున్నాయి. కావ్యమంతా ఉత్తమపురుషలో ఉంది. నాయిక నామం వత్సల కనుక నాయకుడైన తనను సౌభద్రుడుగా సంభావించుకొన్నారు నాయనివారు. "సౌభద్రుని ప్రణయయాత్ర" కావ్యాన్ని తన ప్రేయసియైన వత్సలకు అంకితం చేస్తూ ఇలా అన్నారు అయన -

        స్వీకరింపుము ప్రణయదేవీ! కరాంచ
        లముల జారిన తులసీదళమ్ము లవియు
        నా హృదయరాగసుధ యందు నాని చెడని
        దివ్యసౌరభ్యముల్ ప్రసాదించుకొనియేన్!

    తన ప్రణయగీతాలను అనురాగసుధలో నాని పరీమళాలు ప్రసధించుకొన్న తులసీదళాలుగా రూపించి తన ప్రణయం ఎంత పవిత్రమో నిరూపించుకొన్నారు నాయనివారు. ఆ తులసీదళాలు అంతటి భవ్యములూ, పవిత్రములూ, కనుకనే కావ్యసౌరభ్యములను "ప్రసాదించుకోన" గలిగినవి.
    తన ప్రేయసిని చక్కదనాల చుక్కగా , చిన్నారి మల్లెపూవుగా కమ్మని మలయమారుతవీచిగా, ఒప్పుల గులాబిగా , కన్నెపికముగా భావించి ఆమె సమాగమం కోసం ఉత్కంఠితు డౌతాడు. ఈ కావ్యనాయకుడు. ఐతే ఆ చక్కని చుక్క కారుమబ్బుల తెరబాసి కదలిరావాలి. ఆ మురిపాల మల్లెపూవు మండుటెండలకు కందిపోకుండా తనకు చేజిక్కాలి. ఆ మలయపవన వీచిక ఉత్తరపు చలిగాలి ఒత్తిళ్లకు లొంగిపోకుండా వచ్చి తనపై హాయిగా ప్రసరించాలి. ఆ ఒప్పుల గులాబి క్రూరకంటకాల వారి నుండి తప్పించుకొని తన కందోయికి విందు చేయాలి. ఆ గాన కోకిల ఆ కాకి మూకల కన్నుగప్పి తన హృదయరసాలాన్ని చేరి కమ్మగా గానం చేయాలి. అటువంటి మధురక్షణం "ఎపుడో" అని ఎదురుచూస్తాడు.
        
        మినుకు మినుకని మిన్నున మెఱయు చుక్క
        కాలరాక్షసు డడ్డము గట్టినట్టి
        కాఱు,మబ్బుల తెర బాసి కదలివచ్చి
        హృదయముం జొచ్చి యట ప్రకాశించుటెపుడో!

        చూడ ముచ్చటయై మనస్సున బ్రియమ్ము
        వెల్లిగొలిపెడు చిన్నారి మల్లెపూవు
        మండుటెండకు గందిపోకుండ నాడు
        చేతిలోనికి వచ్చి వాసించు టెపుడో!

        నెమ్మనము తాపమడగించు కమ్మతావు
        లలముకొనుటలో తనరాక తెలియుచుండ
        నుత్తరపుగాలి చలిబాధ కోర్చి మించి
        మలయపవనమ్ము నా మీద మలయుటెపుడో!

        ప్రకృతి కాంతాధరరసమ్ము వడియగట్టి
        పోతపోసినట్లోప్పు నొప్పుల గులాబి
        క్రూరకంటుకహతి సొంపు గోలుపోక
        కన్నులకు విందోనర్చేడు కాలమెపుడో!

 Previous Page Next Page