ఉపదేశం కాంతాసమ్మితంగా ఉండాలి. "తీనె సోకనోరు తియ్యనయగునట్లు." ఉండాలి అన్నది కవయిత్రి మొల్ల. ఆనందకరం గాని ఉపదేశం చెవికి ఎక్కదు. ఆనందకరం కాని ఉపదేశం ఉపన్యసంగా పరిణమిస్తుందేగాని కవిత్వం కాలేదు. అనందం కలిగింది ఉపదేశం లేకపోతె! దీన్నే "కళాకళాకేళి" అన్నారు హిందీలో. కళకళ కోసమే అనే వాదం ఒకటి ఉంది. ఈ వాదాన్ని చాలామంది తోసేస్తారు. నేను కొంచెం అక్కడ వివరిస్తాను. ఒక శిల్పి లేక చిత్రకారుడు ఒక కమలాన్ని చిత్రిస్తాడు. ఇది అనందం కలిగిస్తుంది. ఉపదేశం ఏమీ చెయ్యదు దీన్నీ ఎమంటాం? కళకాదంటామా? కళే! కాని ఇది ఉపదేశం కూడా చేస్తే ఉత్తమోత్తమ కళ ఔతుంది. అందుకని కవిత్వంలో ఛందస్సు ఉన్నా సరే లేకపోయినాసరే , మాత్రాఛందస్సయినా వచన కవిత్వం అయినా అందులో అందం ఉండాలి. లోకానికి మేలు చేదేసిగా ఉండాలి. లోకాన్ని నడిపించేది అయి ఉండాలి. అది ముఖ్యం. "మహర్వకవిత్వపటుత్వ సంపదల్" అన్నాడు పోతన్నగారు. కవిత్వానికి అటు మహత్యాన్ని, ఇటు పటుత్వాన్ని విశేషణాలుగా వేశారు. కవిత్వం చచ్చుగా ఉండగూడదు.
కవిత్వం శ్రేయస్సు కలిగించేదిగా ఉండాలి. ఏకవీ అనుభూతి లేకుండా కవిత్వం వ్రాయలేడు. ఆసలు కవి పొందే అనుభూతి శ్రేయోదాయకంగా ఉండాలి. పోతన్నగారు కవిస్తుతి చేస్తూ అందర్నీ పొగిడారు. గాని కుకవినింద చేయలేదు. తననాటి కవులకు "శుభం" పలికారు. ఇంతవరకు ఎవరూ అననిమాట ఒకటి అన్నారు. "భావికవులను బహూకరించి " అంటూ భవిష్యత్కవులను గూడ సంభావించారు అయన. తర్వాత నుండి నేటివరకు ఉన్న కవులందరు గూడ అయన బహూకృతికి ఋణపడే ఉన్నారు.
కొన్ని కొన్ని భాషలకు కొన్ని కొన్ని సహజగుణాలు అందాలు ఉంటాయి. రచయుతలు వాటిని చక్కగా వినియోగించుకోవాలి. అభివృద్ధి పరచాలి గాని వాటిని నిరాకరించి సహజ సౌందర్యాన్ని పోగొట్టుకోనగూడదు. తెలుగుబాషకు యతి ప్రాసలు సహజమయినవే గాని కృతకంగా అమర్చినవి కావు. భాష సుడికారంలో , సామెతల్లో తెలుగు అందాలన్నీ కనిపిస్తాయి. ఉదాహరణలు ఎన్ని అయినా ఇవ్వవచ్చును.
"చెరపకురా చెడేదవు' - అంగట్లో అన్నీ ఉన్నాయి అల్లుడి నోట్లో శని ఉంది' యతి నియమం వీటిల్లో ఉంది. అట్లాగే ప్రాస నియమం 'అగ్గి మీద గుగ్గిలం' 'ఉత్తరచూచి ఎత్తర గంప' 'ఆవులిస్తే పేవులు లెక్కపెడతాడు ' మొదలయిన వాటిల్లో స్పష్టంగా కనిపిస్తుంది. 'తెలివి తక్కువ - ఆకలెక్కువ' 'ఇల్లు ఇరకాటం - ఆలుమరకటం ' 'ముందు నుయ్యి - వెనుక గొయ్యి ' మొదలయిన వాటిల్లో అంత్యప్రాసలు కనబడతాయి.
ఇట్లాంటి సహజగుణాలతో తెలుగుబాష ఎంతో అందంగా దిద్ది తీర్చబడ్డది. సామెతల్లో గూడ యతి ప్రాసల అందాలున్నది ఒక్క తెలుగు బాషలోనేనని గుర్తుంచుకోవాలి. ఆటల్లో పాటల్లో సామెతల్లో పొడుపుకధల్లో తెలుగుబాష సౌందర్యమయంగా ఉంది. అటువంటి తెలుగుబాషను నీరస నిష్టుర, నిర్భాగ్య నిస్సార వాక్యాలతో అవమానం చెయవద్దు. శబ్ద ప్రయోగ కౌశలం అలవరచుకోవాలి. యువరచయితలకు శబ్ద శిక్ష కావాలి. శబ్ద ప్రయోగంలో అందాన్ని అర్ధ సంయోజనంలో గౌరవాన్ని కోల్పోగూడదు.
భావకవిత్వం అభ్యుదయకవిత్వం ఒకవైపు వ్యాపిస్తున్నా వేరొకవైపు సంప్రదాయ గౌరవంతో విశ్వనాధ , జాషువా , ఎటుకూరి వంటి వారు గూడా గొప్పరచనలు చేశారు. ఏవివ్రాసినా పాఠకునికి అవి అందాలి. "ఫిడెల్ రాగాల డజన్" ఏం పేరది? "అనామిక" అని మరొకరు పేరు పెట్టుకున్నారు.
"తురాయికంటే, ఆకురాయికంటే
కీచురాయి కంటే హిమాంశురాయ్ గొప్పవాడు"
అంటే అర్ధం ఏమిటి?
"5,3,2, ఆముక్తమాల్యద
ఆటవెలది ద్విపదకత్తగారు"
ఛందస్సులో ఈ అత్తమామలేమిటి?
"అక్షయ పాత్రలో ఉమ్మేస్తాం
మక్షికాన్ని మ్రింగి తుమ్మేస్తాం"
"అపాయం 3 తుంది
6 బయట పడుకొంటే
ఎలా 7స్తుంది"
ఇట్లాంటి విలక్షణాలన్నీ ,మననేలలో పుట్టి బట్టకట్టినవి కావు. పాశ్చాత్యపు అనుకరణలు. మనభూసారపు జీవం లేకపోవటం వల్ల అవి అంతరించి పోయాయి.
అసహజంగా చేస్తే అందం కాదు. సహకంగా ఉండాలని మనవి చేస్తున్నాను.