Previous Page Next Page 
మొగుడే రెండో ప్రియుడు పేజి 30

    వర్షిణి షాక్ కొట్టినట్లు చూసింది. ఇదేమిటీ ఆడపిల్లలంటే ఇంత చులకనా! మంచివాడు అనుకుంది అనవసరంగా! "కాదు! మా బాబాయ్ గారింటికి వెళ్ళి వస్తున్నాను" అంది ఉక్రోషం, దుఃఖం కలిపి ఎగదన్నుకొస్తుండగా, అతను నడుస్తూనే ఆమెని ఆమూలాగ్రం పరీక్షగా చూడసాగాడు ఆమెకి మళ్ళీ భయం ఆవహించింది. 'వీడు కూడా ఆ బాపతే! ఈసారి ఎవరొచ్చి రక్షిస్తారూ?' అనుకుంది మనసులో.

    ఈ లోపులో అతను మరింత దగ్గరికి (కావాలని) వచ్చాడు.

    "ఏం చదువుతున్నావు?" అడిగాడు మొరటుగా.

    "ఎం. ఏ. లిటరేచర్" అంది-కాస్త దూరంగా జరిగింది.

    "నేను ఇంతకు ముందు ఈ ఏరియాలో చూడలేదే"

    ఆమెకి ఒళ్ళు మండింది. వీడి వరస సరిగ్గా లేదు అనిపించింది. వీడి రోగం ఎలా కుదర్చాలా? అనుకుంటూ వుండగా భ్రమరాంబ చెప్పిన మాటలు గుర్తొచ్చాయి.

    "మీరేం చేస్తుంటారూ?" అడిగింది ధైర్యం తెచ్చుకుని.

    "నేనూ ఇక్కడే 'లా' చేస్తున్నాను" చెప్పాడు.

    "విక్రమ్ తెలుసా?" ఠపీమని అడిగింది.

    అతను త్రుళ్ళిపడ్డట్లు చూసి "ఏ విక్రమ్?" అన్నాడు.

    "స్టూడెంట్స్ యూనియన్ లీడర్ విక్రమ్... అతనూ....అతనూ..." ఆమె తడబడింది.

    "ఊఁ అతను మీకు తెలుసా?" అడిగాడు భయపడుతున్నట్టు అప్రయత్నంగా కాస్త దూరంగా జరిగి.

    "తెలియడం ఏవిటీ? మా మేనత్తగారబ్బాయి" అంది తెగించి.

    "నిజంగా!" అతని కళ్ళలోని విస్మయం ఆమెకి కొండంత ధైర్యాన్నిచ్చింది.

    "ఔను! ఉండవే తోడుగా వస్తానూ అన్నాడు పాపం! నేనే వినకుండా ఒక్కదాన్నే బయలుదేరి వచ్చేశాను. ఈపాటికి నా వెనకాల మోటార్ సైకిల్ మీద బయల్దేరే వుంటాడు" అంది వెనక్కి తిరిగి చూస్తూ.

    "ఐ...సీ..." అన్నాడతను. అతడి కంఠంలో కాస్త బెదురు కనిపించింది ఆమెకి.

    హాస్టల్ సమీపించాక చాలా మర్యాదగా "మీ మేనత్త కొడుకు....అదే మీ విక్రమ్ బావ రాలేదు! అయినా మిమ్మల్ని క్షేమంగానే దిగబెట్టానుగా. ఇక లోపలికి వెళ్ళండి" అన్నాడు.

    "థాంక్స్" అంటూ ఉషారుగా వెళ్ళబోయి, గేటుమూసి వుండడం చూసి వెనక్కి తిరిగి "ఇప్పుడెలా?" అంది దిగాలుపడిపోతూ.

    అతను ఒకసారి దగ్గరగా వెళ్ళి గేటుని పరీక్షించి చూసి "ఒకటే మార్గం!" అన్నాడు.

    "ఏవిటి?" అడిగింది ఆత్రంగా. అప్పటికే గొంతులో దుఃఖపు తెర అడ్డుపడ్తోంది.

    "గోడ ఎక్కి అవతలకి దూకెయ్యడమే" చాలా మామూలుగా అనేశాడతను.

    ఎత్తుగా వున్న ఆ గోడని చూస్తూ, "అమ్మో!" అని గుండె మీద చెయ్యి వేసుకుంది.

    "ఏం చేతకాదా?" అడిగాడు.

    "ఇంకో మార్గం లేదా?" అడిగింది లేదని తెలిసి కూడా!

    "అదొక్కటే సురక్షితమైన, పాటించదగ్గ మార్గం. సాధారణంగా అలాగే చేస్తారు. ఆలోచన మాని-

    "ఆ హ్యాండ్ బేగ్ ఇటిచ్చి మీరు ప్రయత్నించండి" అంటూ ఆమె చేతిలోనుండి బ్యాగ్ అందుకున్నాడు.

    వర్షిణి ఎక్కడానికి ప్రయత్నించింది కానీ అలవాటులేక జారి పోతోంది.


    "అలా కాదూ...." అంటూ అతను చనువుగా, వెనుక నుండి రెండు చేతులతోటి ఆమెని ఎత్తేశాడు.


    ఆమెకి పట్టు దొరికింది. గోడ అంచులు పట్టుకుని పైకి ఎగబాకింది. గోదాపైకి చేరాక క్రిందకి చూసింది.


    "ఊ....దూకెయ్యండి" అన్నాడు గొంతు తగ్గించి.

    ఆమె ఆలోచించలేదు. దూకేసింది.

    అతనో నిమిషం అక్కడే నిలబడి లోపలినుండి ఏమీ గందరగోళం వినిపించకపోవడంతో అక్కడనుంచి నిష్క్రమించాడు. వెళ్ళేటప్పుడు అతని పెదవులపై సన్నని నవ్వు పరచుకుంది.

                                                                        *    *    *
   
    భ్రమరాంబ హుషారుగా "అయితే విక్రమ్ పేరు చెప్పగానే భయపడిపోయాడన్న మాట!" అంటూ 'నే చెప్పలేదూ' అన్నట్లు శిల్పకేసి చూసింది.

    శిల్ప ఆత్రంగా "ఎలా వున్నాడే అతనూ?" అని అడిగింది.

    "పొడుగ్గా సన్నగా. కొద్ది గడ్డంతో-చూడగానే 'రఫ్' క్యారెక్టర్ అన్న ఇంప్రెషన్ ఇచ్చాడు" అంది వర్షిణి.

    "అలా వుంటాడా?" క్యాంటీన్ లోంచి బైటికి వస్తున్న ఓ పొడవాటి అబ్బాయిని పోలిక చూపిస్తూ అడిగింది భ్రమరాంబ.

    వర్షిణి ఆ వైపు చూసి "ఆ!..." అంటూ విస్తుబోయింది.

    "అచ్చు అలాగే వుంటాడా?" అడిగింది శిల్ప.

    "అలాగే కాదు. అతనే!" అంది వర్షిణి.

    ఆ పొడుగాటి అబ్బాయి, పక్కనే ఇంకో లావుపాటి అబ్బాయీ వున్నారు. సరాసరి వీళ్ళ దగ్గరికే వచ్చి "హాయ్" అన్నారు.

    లావుగా వున్న అబ్బాయి చేతిలో వర్షిణి హేండ్ బాగ్ వుంది. "ఏవిటి మరదలా? రాత్రి హడావుడి చేశావుటా?" అన్నాడు బేగ్ ఆమెకి అందిస్తూ అతను.

    వర్షిణి కంగారుగా స్నేహితురాళ్ళ కేసి చూసింది. వాళ్ళుకూడా అతనికేసి విస్తుబోయి చూస్తున్నారు. విక్రమ్ అంత లావుగా వుంటాడని వాళ్ళు వూహించలేదు. ఈ లోపులో ఆ లావాటి వ్యక్తివైపు తిరిగి, "విక్రమ్....మీ మరదలికి సిగ్గెక్కువ" అన్నాడు రాత్రి పరిచయం అయినా పొడుగాటి అబ్బాయి.

 Previous Page Next Page