"చిన్నప్పటినుంచీ అదంతే! పద, బీచ్ కి పోదాం" అన్నాడు లావుపాటి అతను వర్షిణికి కన్నుకొట్టి.
వర్షిణి బిత్తరపోతూ "బీచ్ కా?" అని అరిచింది.
"ఏం సినిమాకి వెళ్దామా? నీ యిష్టం" అన్నాడతను తాపీగా.
"నేను ఎందుకు రావాలి? నేను రాను" అంది ఆమె కోపంగా.
లావు వ్యక్తి ఆమెవైపు కోపంగా చూస్తూ గట్టిగా "ఎందుకు రావాలా? మేనమామ కూతురిని కనుకా. ఈ విక్రమ్ అంటే కాలేజీలో అందరికీ హడల్...నువ్వేమిటీ ఇలా చెప్పిన మాట వినకుండా...మొండిగా?" అన్నాడు.
వర్షిణి ఏడుపుగొంతుతో "అసలు నువ్వెవరో నాకు తెలీదు" అంది.
"నేను ఎవరో నీకు తెలీదా?" అంటూ విచిత్రంగా చూసి, పక్కనున్న పొడుగాటి అబ్బాయితో "ఒరే రాత్రి నీతో ఏం చెప్పిందిరా?" అన్నాడు లావు అతను.
"విక్రమ్ నా మేనత్త కొడుకు అని చెప్పింది" అని చెప్పాడతను సీరియస్ గా.
"మరి ఇప్పుడు నన్ను తెలీదంటుందేవిటీ?" ఆశ్చర్యంగా అడిగాడతను.
"నాకు నిజంగా తెలీదు ఒట్టు" చెప్పింది వర్షిణి.
"ఏయ్...ఆటలుగా వుందా?" మీసాలు మెలివేశాడతను.
భ్రమరాంబ కల్పించుకుంటూ "మీరేనా విక్రమ్! అబ్బా ఇవాళ ఎంతో మంచి రోజండీ-మీతో పరిచయం అయింది! అసలు మా వర్షిణి కొత్తగా వచ్చిందండీ. మీరెవరో దానికి తెలీదు. ఏదో రాత్రి కంగారులో అలా చెప్తే ఆ అబ్బాయి భయపడతాడని చెప్పేసి వుంటుంది" అంటూ వర్షిణిని "ఏమే! అంతేనా?" అని అడిగింది.
తల నిలువునా ఆడించింది వర్షిణి.
"అయితే నాతో అబద్దం చెప్పారన్నమాట! ఎంత మోసం? అసలు ఈ సంగతి అప్పుడే తెలుస్తేనా..." అన్నాడు పొడుగాటి అబ్బాయి కఠినంగా.
"ఆ...అప్పుడే తెలిస్తే...ఒంటరిదాన్ని చేసి....అల్లరిపెట్టి...నా బతుకు నాశనం చేసేవాడిని కదూ!" రోషంగా అడిగింది వర్షిణి.
"ఔను!" అతను ఆమె కళ్ళలోకి సూటిగా చూస్తూ, గట్టిగా అన్నాడు. అంతలోనే తల విదిలిస్తూ, "ఛీ...ఛీ...మంచి అవకాశం పోయింది" అన్నాడు.
"అలా మాట్లాడటానికి బుద్దిలేదూ! ఆడపిల్ల ఒంటరిగా దొరికితే చాలు.వెంటపడీ...వేధించీ..." వర్షిణి ఆవేశం కట్టలు తెంచుకుంది. కానీ దుఃఖం ఆమె గొంతు నొక్కేస్తోంది.
"హలో విక్రమ్. ఏవిటీ హడావుడీ?" ఇంగ్లీష్ ప్రొఫెసర్ శ్యాం సుందర్ వాళ్ళ దగ్గరికి వస్తూ అడిగాడు.
లావుపాటి అబ్బాయి ఏదో పనున్నట్లు అక్కడి నుంచి వెళ్ళిపోయాడు.
"విక్రమ్...ఎనీ ప్రోబ్లెమ్?" ప్రొఫెసర్ పొడుగాటి అబ్బాయి భుజాలమీద చెయ్యి వేస్తూ అడిగాడు.
వర్షిణీ, ఆమె బృందం తెల్లబోయి చూశారు.
"ఏం లేదు సార్! ఈ అమ్మాయిలకి ఐ యామ్ విక్రమ్....స్టూడెంట్స్ యూనియన్ లీడర్నీ అని పరిచయం చేసుకుంటున్నాను. అంతే" అని వర్షిణివైపు తిరిగి "అంతేనా!" అంతేనా.
"మీరు విక్రమా? మరి అతనూ?" వెళ్ళిపోతున్న లావు అబ్బాయిని చూపిస్తూ అడిగింది భ్రమరాంబ.
"అతను సుబ్బారావు" చెప్పాడు విక్రమ్ నవ్వుతూ.
జగమెరిగిన బ్రాహ్మడికి జంధ్యం ఎందుకు అన్నట్లు నీకు పరిచయం ఏమిటయ్యా" అని నవ్వేసి వెళ్ళిపోయారు ప్రొఫెసర్ శ్యాంసుందర్.
వర్షిణికి అతనే విక్రమ్ అని తెలిశాక సిగ్గుతో చితికిపోయినట్లయింది. "విక్రమ్ మా మేనత్తగారబ్బాయి...." అని తను చెప్తే అతను విస్మయంగా చూడడం, తనని వెనక నుంచి రెండు చేతులతో అతను గోడ ఎక్కించడం గుర్తొచ్చి తల ఎత్తలేకపోయింది!
"మిస్, వర్షిణీ ఇటు చూడండి" అన్న అతని పిలుపుకి_
ఆమె తల ఎత్తి అతని కళ్ళలోకి చూసింది.
ఆ కళ్ళలో చెప్పలేని ఆకర్షణ! అతని గడ్డం మాటున అణిచిపెట్టబడ్తున్న చిరునవ్వుతో కూడిన కవ్వింపు!
"మనం తెలివైన వాళ్ళం అనుకుంటే ప్రమాదం లేదు! కానీ ఎదుటి వాళ్ళు మూర్ఖులు అనుకుంటేనే చిక్కుల్లో పడతాము వస్తా" అనేసి వెళ్ళిపోయాడు.
వెళ్తూన్న అతనివైపు చూస్తూ ఇతనా విక్రమ్! ఇంత మామూలుగా వుంటాడా? ఇతనినేనా రాత్రి తను విక్రమ్ కి చెప్తాను అన్నట్లు బెదిరించింది. రాత్రంతా తన తెలివితేటలు తలచుకుని తనే మురిసిపోయిందీ! అనుకుంటూ వుంటే నవ్వూ....సిగ్గూ...ఉద్వేగం...ఆనందం...అన్నీ కలిపి కలగాయి!
ముద్దుగా 'ఛీ' అని విసుక్కుంది తన మనసుని.
లైబ్రరీలో చీమ చిటుక్కుమన్నా వినిపించేటంత నిశ్శబ్దంగా వుంది. అందరూ తలలు కూడా పైకి ఎత్తకుండా తమ ముందున్న పుస్తకాల్లో దూరిపోయారు.
వర్షిణి తనకి కావలసిన పుస్తకాలు తీసుకుని శిల్పా, భ్రమరాంబల కోసం చుట్టూ చూసింది. భ్రమరాంబ కనిపించలేదు. కానీ, విక్రమ్ కనిపించాడు. పలకరించదానికి వీలుకాకపోతే కనీసం చిరునవ్వైనా నవ్వాలనుకుని అతనివైపు నడిచింది.