Previous Page Next Page 
మొగుడే రెండో ప్రియుడు పేజి 29

    "ఎందుకూ?" అడిగింది వర్షిణి.

    భ్రమరాంబ రహస్యం చెప్తున్నట్టు వర్షిణి చెవి దగ్గరగా ఒంగి, "నీకు తెలీదు. అలాంటి వాళ్ళని మంచి చేసుకోవాలి ముఖ్యంగా నీలాంటి స్టన్నింగ్ బ్యూటీలు. ఎప్పుడైన మనని అల్లరి పెట్టినప్పుడు, 'విక్రమ్ మాకు తెలుసు' అంటే చాలట తోక ముడిచి పారిపోతారుట" అంది.

    "అలాగా..." అంది వర్షిణి తేలిగ్గా నవ్వేస్తూ.
   
                                                                             *    *    *

    వర్షిణి పరుగు పెడ్తున్నట్టు నడుస్తోంది.

    ఆమె గుండె చప్పుడు ఆమెకే భయం వేసేటంతగా వినిపిస్తోంది! చుట్టూ చీకటి! పొడుగ్గా వున్న రోడ్డు, నడుస్తున్నకొద్దీ ఇంకా సాగుతున్నట్టుగా అనిపిస్తుంది! మనుషులందరూ వెలేసినట్టు రోడ్డు బావురుమంటోంది!

    వర్షిణికి ఏడుపు ఎగదన్నుకువచ్చేస్తోంది. 'ఛీ, ఛీ నాకు అసలు బుద్దిలేదు. నత దూరాన వున్న బాబాయ్గారింటికి ఒక్కదాన్నీ వెళ్ళకపోతేనేం? వెళ్ళినా ఇంతసేపు కబుర్లు చెప్తూ వుండిపోవటం ఎందుకూ? వున్నా, వెంట శిల్పనో, భ్రమరాంబనో తీసుకెళ్తే పోయేదికదా! ఇప్పుడెలా? తెలియని వూరు, హాస్టల్ తలుపులు మూసేస్తారేమో? ఎం చెయ్యడం? రాత్రంతా ఎక్కడ గడపాలి? మళ్ళీ బాబాయ్ గారింటికి వెళ్ళాలంటే చాలా రాత్రయిపోతుంది.' ఇలా పరిపరి విధాల ఆలోచనలతో నడుస్తోంది.

    ఇంతలో....వెనకనించి విజిల్ వినిపించింది. ఉలిక్కిపది వెనుతిరిగి చూసింది.

    పొడుగాటి ఆకారం! నల్లని ఓవర్ కోట్ లో, అంతకన్నా నల్లగా వున్న చీకట్లోంచి....తనవైపు వడివడిగా దూసుకువస్తున్నట్టు...

    అప్రయత్నంగా ఆమెకి ఒళ్ళు జలదరించింది. అమ్మా, నాన్నా, దేవుడూ అందరూ గుర్తొచ్చారు.

    నడక వేగం పెంచింది.

    వెనక ఆకారం కూడా తన అడుగుల వేగం పెంచినట్టు శబ్దం దగ్గరకాజొచ్చింది.

    విజిల్ ఇంకా గట్టిగా వినిపిస్తోంది! సందేహం లేదు. రౌడీనే అని నిర్ధారణ చేసేసుకుంది. సందు మొదలులో ఒక పాన్ షాప్ కనిపించింది. అక్కడ ఓ నలుగురు నిలబడి ఏదో మాట్లాడుకుంటున్నారు. ఆమెకి వారిని చూడగానే కాస్త ధైర్యం వచ్చినట్లయింది.

    గబగబా వారివైపు నడిచి, అవసరం లేకపోయినా "టైం ఎంతయిందండీ?" అని అడిగింది.

    అందులో పొట్టిగా, లావుగా వుండి, సిల్కు లాల్చీ వేసుకున్న వ్యక్తి "ఎనిమిదింబావు" అన్నాడు బొంగురు గొంతుతో.

    "థాంక్స్" అని ఆమె అక్కడే కాసేపు నిలబడింది. వెనకాల వస్తున్న వ్యక్తి తనను దాటిపోయిన తరువతః నడుద్దామని. అంతగా అయితే అక్కడున్న వాళ్ళతో అతని సంగతి చెప్పి గొడవ చేద్దామని కూడా అనుకుంది.

    "మసక...మసక...చీకటిలో...మల్లెతోట ఎనకాలా..." ట్రాన్ సిస్టర్ లోంచి వస్తున్న పాత చాలా అసందర్భంగా తోచింది.

    వెనక నడచి వస్తున్న వ్యక్తి ఆమెని దాటి ముందుకు వెళ్ళిపోయాడు.

    అతను సందు చివరకు చేరేవరకూ వర్షిణి  'టెన్షన్' గా చూసి, ఆ తర్వాత బయల్దేరింది.

    "ఏయ్...ఆగు...టైం అడిగి వెళ్ళిపోతున్నావేం?" అన్న బొంగురుగొంతు వినిపించి హతాశురాలయింది.

    సిల్కు లాల్చీ వ్యక్తి ఆమె దగ్గరకు తూలుతూ వచ్చి రేటెంత?" అన్నాడు. అతని నోటి నుండి సారా కంపు గుప్పున కొట్టింది.

    "ఏం రేటు?" అంది బెదురుతూ.

    అక్కడ నిలబడి తమాషా చూస్తున్న మిగతావాళ్ళు పగలబడి నవ్వుతున్నారు. ఆమెకి అంతలోనే అతని భావం కాస్త అర్ధం అయింది. వెంటనే వెనక్కి చూడకుండా పరుగు మొదలెట్టింది.

    "ఆగు....ఎక్కడికీ" ఆ వ్యక్తి ఆమె వెనకాలే వచ్చి, మీద చెయ్యివేశాడు.

    వర్షిణి వేసిన "కెవ్వు" మన్న కేక ఆ నిశీధిలో ప్రతిధ్వనించింది. అతని రెండోచెయ్యి ఆమె శరీరం మీద పాకుతుండగా....వినిపించింది "అమ్మో!" అన్నకేక. ఆ కేక విని వర్షిణి కళ్ళు తెరిచి చూసింది.

    సిల్కు లాల్చీ వ్యక్తి క్రిందపడి దొర్లుతున్నాడు.

    తన వెనక నడిచి వచ్చిన యువకుడు, ఆపకుండా అతన్ని కొడ్తున్నాడు. ఇది చూసి పాన్ షాప్ దగ్గర నిలబడిన మిగతావారు అతనికి సాయం వచ్చారు. ఆ యువకుడు ఒక్కడే ఆ నలుగురికీ సమాధానం చెప్పి చిత్తుగా కొడ్తున్నాడు. బాగా తాగివున్నవాళ్ళు బూతులు తిట్టుకుంటూ, కాసేపటికే కాలికి బుద్ది చెప్పారు.

    వాళ్ళు వెళ్ళిపోగానే, తన పని అయిపోయినట్లు అతనూ వెళ్ళిపోసాగాడు. భయంతో వర్షిణికి ఒళ్ళంతా ముచ్చెమటలు పట్టాయి. తనూ అతని వెనకే నడవసాగింది.

    కాస్త దూరం వెళ్ళాక అతను ఆగి, సిగరెట వెలిగించుకుంటూ, "ఎక్కడికి వెళ్ళాలి?" అన్నాడు.

    "వి.....మెన్స్...హా...స్ట...ల్" ఆమెకి కంగారులో మాటరావడం కష్టమయింది.

    ఆ చీకట్లో సైతం ఆ కళ్ళల్లో బెదురు అతనికి స్పష్టంగా కనిపించింది కాబోలు!

    "ఇంత రాత్రిదాకా ఏం చేస్తున్నట్టు? బోయ్ ఫ్రెండ్ తో షికార్లా?" అతను హేళనగా అడిగాడు.

 Previous Page Next Page