నన్ను ప్రేమించవూ....
మధ్యాహ్నం రెండు కావస్తోంది.
ఎండ తీక్షణంగా ఉండటంతో బస్టాప్ లో నిలుచున్నా ప్రయాణీకుల శరీరాల నుండి చమట్లు కారుతున్నాయి. లంచ్ అవర్ కావడం వల్ల సిటీబస్సులు తిరగడంలేదు. ఆటో రిక్షాలు ప్రయాణీకులతో హడావిడిగా సాగిపోతున్నాయి.
రామకృష్ణ అదే స్టాఫ్ వద్దా నిలబడి బస్సుకోసం చూస్తున్నాడు. అతని షర్టు మొత్తం చమటతో తడిసిపోయింది. ఆకాశం నుండి నిప్పులు కురుస్తున్నట్టు ఎండ ప్రచండంగా కాస్తోంది. షెల్టర్ లేకపోవడం వల్ల మరింత ఇబ్బందిగా ఉందక్కడ. రెండు పూటలు భోజనం చెయ్యక పోవడంచేత అతని మొహం వాడిపోయి కనిపిస్తూంది. నీళ్ళ తడితో దువ్విన వెంట్రుకలు చెదిరిపోయాయి. సర్టిఫికెట్స్ ఫైలు చమటకి తడవకుండా తరచుగా చెయ్యి మారుస్తున్నాడు. అతని మొహంలో ఆతృత తొంగి చూస్తున్నది.
సరిగ్గా నాలుగు గంటలకు ఓ ప్రైవేటు కంపెనీ ఇంటర్వ్యూకి హాజరు కావాలతను. అక్కడ నుంచి కంపెనీకి వెళ్ళేందుకు గంట పడుతుంది. అరగంటలోపు బస్సు రాకపోతే ఇంటర్వ్యూ మిస్ అవుతుంది.
జేబులో నలభై రూపాయల చిల్లర వుంది. ఇంటర్వ్యూకి బస్సుపైన వెళ్ళి రావడానికి ఎనిమిది రూపాయలు ఖర్చు అవుతాయి. ఎందుకైనా మంచిదనే ఉద్దేశ్యంతో ఆ పూట కూడా భోజనం చెయ్యకుండా డబ్బు మిగిల్చాడు. కనీసం రాత్రి భోజనమైనా తొందరగా చెయ్యాలి.
ఆ రోజు ఉదయం జగదాంబ సెంటర్, రామకృష్ణ బీచ్, ఆంధ్రా యూనివర్సిటీ కాలినడకన వెళ్ళి చూసొచ్చాడు. రోడ్లు విశాలంగానూ, శుభ్రంగాను కనిపించాయి. చాలా చోట్ల మున్సిపల్ కార్పోరేషన్ వాళ్ళు పెట్టిన బోర్డులు గమనించాడు. ఆ బోర్డుల పైన రెండు వాక్యాలు మాత్రమే ఉన్నాయి.
క్లీన్ విశాఖ.
గ్రీన్ విశాఖ.
రామకృష్ణ ఆలోచనల నుండి చప్పున తేరుకున్నాడు. తను ఎక్కాల్సిన సిటీబస్సు రావడం గమనించి, జనం ప్రవాహంలా చుట్టేశారు. అతను ఆ జనంతో పాటు కదిలాడు. ఎంత ప్రయత్నించినా బస్సులోకి ఎక్కలేకపోయాడు. తన చేతిలోని ఫైలు కిటికీ ప్రక్క కూర్చున్న యువకుని కిచ్చి చేత్తో స్టీలు రాడ్ పట్టుకుని కాళ్ళు ఫుట్ బోర్డ్ పైన పెట్టి నిలుచున్నాడు. రెండు క్షణాల తరువాత గాలి కోసం తల ప్రక్కకు తిప్పాడు.
బస్సు వెనుక ఇరవై గజాల దూరంలో ఒక వృద్దుడు క్యారేజీ పట్టుకుని నడిచి వస్తున్నాడు. అతని వెనుక ఓ సిటీబస్సు వేగంగా రాసాగింది. అది చూసాడు రామకృష్ణ.
అప్రయత్నంగా అతని కాలు ఫుట్ బోర్డ్ పైనుంచి నేలమీద ఆనింది. చెయ్యి ఐరన్ రాడ్ ని వదిలింది. ఏ మాత్రం ఆలోచించకుండా జనాన్ని నెట్టుకుంటూ అటువైపు కదిలాడు
బస్సు ఆ వ్యక్తిని గుద్దడం, అదే సమయంలో రామకృష్ణ అతన్ని ప్రక్కకు లాగడానికి ప్రయత్నించడం, రామకృష్ణ విసురుగా వెళ్ళి బస్సుకి గుద్దుకోవడం ఒకేసారి జరిగింది.
సరిగ్గా అప్పుడే ముందున్న సిటీ బస్సు కదిలింది.
* * * *
సీలింగ్ ఫ్యాన్ నిస్సహాయంగా తిరుగుతోంది. ఏ సంవత్సరంలో దానిని అక్కడ బిగించారో తెలియదు. తిరిగి తిరిగి అలిసిపోయినట్టు నెమ్మదిగా తిరుగుతోంది అది.
దానినే తదేకంగా చూస్తున్నాడు రామకృష్ణ. అరగంట క్రితం స్పృహ వచ్చిందతనికి. కొన్ని క్షణాల పాటు తను అక్కడెందుకున్నాడో అర్ధం కాలేదు. క్రమంగా తను సిటీబస్సు ఎక్కబోవడం, ఒకతన్ని మరో బస్సు గుడ్డుతున్న సమయంలో తను రక్షించటానికి ప్రయత్నించడం గుర్తొచ్చింది.
చప్పున కిటికీలోంచి బయటకు చూశాడు. చీకటి పడకపోవడం వల్ల వెలుగు కనిపిస్తోంది. అంటే తను షుమారుగా రెండు గంటల పాటు, స్పృహలో లేనని అర్ధం చేసుకున్నాడు. ఎవరో తనని హాస్పిటల్లో చేర్చి ఉండాలి. తలకి కట్టిన కట్టు తడిమాడు. దెబ్బ తగిలినచోట సన్నటిపోటు.
ఈపాటికి ఇంటర్ వ్యూ ముగిసి ఉంటుంది. దాని కోసం ఎంతో శ్రమపడి వచ్చి చివరి క్షణంలో అంతా పాడు చేసుకున్నాడు. అప్పుడు గుర్తొచ్చింది. తను సర్టిఫికెట్లు ఒకతనికి ఇవ్వడం. ఒక్కసారిగా గుండె ఝల్లుమంది.
కళ్ళు తెరిచిన మరుక్షణం కనిపించిన సీలింగ్ ఫ్యాన్ ని చూస్తూనే తిరిగి కళ్ళు మూసుకున్నాడు. యాక్సిడెంట్ అయినా తరువాత ఏం జరిగింది? బహుశా ఆ వృద్దునికి పెద్దగా గాయాలు తగలకపోవచ్చు. తనకే గాయం తగిలి ఉంటుంది.
మంచం ప్రక్కన అలికిడి అయింది. రామకృష్ణ ఆలోచనలకు అంతరాయం కలిగింది. అతను కళ్ళు తెరిచి చూశాడు. ఒకాయన స్టూలు లాక్కుని కూర్చుంటూ రామకృష్ణ కళ్ళు తెరవడం గమనించి పలకరింపుగా నవ్వాడు.
అతనికి యాభై సంవత్సరాలు ఉంటుంది వయసు. మనిషి ఉక్కుముక్కలా కనిపిస్తున్నాడు. ఆ వ్యక్తి మొహంలో వయస్సు వల్ల, అనుభవం వల్ల వచ్చిన కళ ఉంది. ఓసారి తన బుర్ర మీసాలు దువ్వుకున్నాడతను.
"నీ పేరేమిటి బాబూ?" గంభీరంగా అడిగాడు.
"రామకృష్ణ."
"ఏం చదువుకున్నావ్?"
"బి.ఏ." చెప్పి, "మీరెవరు?" అడిగాడు.
"నా పేరు వినాయకరావు..." అని మీసాలు దువ్వుకున్నాడు.
"యాక్సిడెంట్ లో నీ తలకి దెబ్బ తగిలింది. మా మనిషి ఆకతను అక్కడే ఉండటం వల్ల వెంటనే హాస్పిటల్లో చేర్పించాం. నీ దగ్గరకు పోలీసులు రాలేదా?" అడిగాడు.
"లేదు."
వినాయకరావు నిట్టూర్చి చెప్పాడు. "నువ్వు కాపాడటానికి ప్రయత్నించిన వ్యక్తి అక్కడే చనిపోయాడు. ఫార్మాలిటీస్ పూర్తయ్యేసరికి అర్దరాత్రి అయింది. నేను శ్మశానం నుండి వస్తున్నాను."
రామకృష్ణ మనసు నిండా బాధ చోటు చేసుకుంది. కాసేపు మౌనంగా ఉండిపోయాడు.
"ఇది ఉదయమా?" అంటూ కిటికీ నుంచి బయటకు చూశాడు. అంతకు ముందు చూసిన దానికంటే వెలుగు పెరగడం కనిపించింది.
"అతను చక్రం క్రింద పడ్డాడా?" అడిగాడు.
తలవూపి అడిగాడు వినాయకరావు.
"మీ వాళ్ళకి కబురు చెయ్యడానికి నీ వివరాలు తెలియలేదు. మీ ఇల్లెక్కడ?"
"నేను ఈ ఊరు వాడిని కాదు. ఇంటర్ వ్యూ కోసం బస్సు ఎక్కుతుండగా జరిగింది."
"ఇంటర్వ్యూకి వెళుతున్నావా? నీ దగ్గర సర్టిఫికెట్స్ లేవేం?" సాలోచనగా అడిగాడు వినాయకరావు.
జరిగిందంతా చెప్పాడు రామకృష్ణ.
"నేను వెళతాను. నీ అవసరాలు చూడటానికి ఒక మనిషిని పంపుతాను, డిశ్చార్జ్ అయినా తరువాత నన్ను కలుసుకో..." లేచి చెప్పాడతను.
"మీరేం చేస్తారో చెప్పలేదు."
"చనిపోయిన ఆశిరయ్యమా యూనియన్ సభ్యుడు. నేను ఆ యూనియన్ కి ప్రెసిడెంట్ ని...."
వినాయకరావు వెళ్ళిపోయాడు.
అరగంట తరువాత యూనిఫాంలో ఉన్న సబ్ యిన్ స్పెక్టర్ ఆ వార్డులోకి రావడం రామకృష్ణ గమనించాడు. అతని చేతిలో తెల్లకాగితాలు కట్టిన ఆఫీస్ ప్యాడ్ ఉంది. తిన్నగా రామకృష్ణ దగ్గరకు వచ్చి స్టూలుమీద కూర్చుని చెప్పాడు.
"మీ స్టేట్ మెంట్ కావాలి...."
తలూపాడు రామకృష్ణ.
* * * *
హాస్పిటల్ నుండి తిన్నగా యూనియన్ ఆఫీసుకి చేరుకున్నాడు వినాయకరావు. సొరుగు లాగి ఒక ఫైలు బయటకు తీశాడు. అందులోంచి ఎజెండా కాగితం తీసుకుని చూశాడు. ఎగ్జిక్యూటివ్ మీటింగ్ లో చర్చించాల్సిన విషయాలు వరుసగా రానున్నాయి. అన్నిటికంటే పైన ఆశిరయ్య మరణానికి సంతాపం తెలుపడం, చర్చ అనే వాక్యాలు చేర్చాడు. ఆ కాగితాన్ని తిరిగి సొరుగులో పెట్టేసి కొద్దిసేపు నిశ్చలంగా కూర్చున్నాడు. క్రమంగా అతని మనసులో ఓ ఆలోచన రూపుదిద్దుకుంది.
2
వినాయకరావు పంపిన మనిషి మరునాడు ఉదయం రామకృష్ణ దగ్గరకు వచ్చాడు. అతన్ని లాడ్జిలో ఉంచిన ప్యాకెట్ తీసుకురమ్మని పంపాడు. ఉత్త చేతులతో తిరిగొచ్చాడతను. కట్టుబట్టలతో ఆ నగరంలో చిక్కుకుపోయాడు రామకృష్ణ. హాస్పిటల్లో చేర్పించటంతో తన పని పూర్తయిందని వినాయకరావు భావిస్తే తను మరింత ఇబ్బందులు ఎదుర్కోవలసి వచ్చేదని అతనికి అర్ధమయింది.
వారం రోజుల తరువాత హాస్పిటల్ నుండి డిశ్చార్జ్ చెయ్యబడ్డాడు.
రామకృష్ణ బయటకొచ్చాడు. గెడ్డం వత్తుగా పెరిగింది. తైల సంస్కారం లేని జుట్టు ఎరుపు రంగులో కనిపిస్తోంది. కళ్ళక్రింద నల్లని గీతలు పడ్డాయి. శరీరం మీదున్న బట్టలు మాసిపోయి చమట కంపు కొడుతున్నాయి.
కింగ్ జార్జ్ హాస్పిటల్ ప్రక్కనున్న బస్ స్టాప్ లో ఆ వ్యక్తితోపాటు నిలుచున్నాడు రామకృష్ణ. పది నిమిషాల్లో సిటీబస్సు వచ్చింది. మౌనంగా అతని వెనుక బస్సెక్కి నిలుచున్నాడు. ఆ వ్యక్తి రెండు టిక్కెట్లు తీసుకున్నాడు.
నడుస్తున్న బస్సులోంచి బయటకు చూడసాగేడు రామకృష్ణ. అతని మనస్సులో ఆలోచనలు సుడులు తిరుగుతున్నాయి. ఉద్యోగ ప్రయత్నంలో ఉన్నానని కంగారు పడొద్దని నాలుగు రోజుల క్రితం తల్లికి కార్డు రాసి పడేసాడు. అందుచేత తన తల్లి ఆందోళన పడుతుందనే బెంగలేదు. ప్రస్తుతం తను ఇంటికి వెళ్ళాలంటే చార్జీకి డబ్బులు కావాలి. అప్రయత్నంగా తల తడిమాడు. గాయం తగిలినచోట వెంట్రుకలు కత్తిరించారు. గాయం పూర్తిగా మానడానికి మరో పది రోజులు పడుతుంది. జుట్టు పెరగడానికి మాత్రం ఇంకా ఎక్కువ సమయం తీసుకుంటుంది. ఈ లోపు ఇంటికెళితే తల్లి ప్రశ్నలతో ప్రాణాలు తీస్తుంది. ఆమెకు బాధ కలిగించకూడదు. వెంట్రుకలు పూర్తిగా పెరిగేవరకూ వెళ్ళకూడదు. అంతవరకూ ఏం చేయాలి? జవాబులేని ప్రశ్న మనస్సుని ఆక్రమించింది.
ఒక స్టాఫ్ లో ఆ వ్యక్తి రామకృష్ణనని హెచ్చరించి బస్సు దిగాడు. ఆలోచనలనుండి తేరుకుని రామకృష్ణ కూడా బస్సు దిగాడు. ఇద్దరూ కొంతదూరం నడచి రైల్వే ట్రాక్ దాటారు. ఆ ప్రాంతంలో పెద్దగా జన సంచారం లేదు. ఫుడ్ కార్పొరేషన్ గోడౌన్లు వరుసగా ఉన్నాయి. ఇద్దరూ వాటి వెనక్కి వెళ్ళారు. అక్కడ చిన్న గది ముందు యూనియన్ పేరు సూచిస్తూ ఒక బోర్డు వ్రేలాడుతుంది.
తలుపు తెరిచి లోపలకు నడిచాడతను. అతని వెనకే రామకృష్ణ కూడా వెళ్ళాడు. ఆ గదినిండా సిగరెట్లు పొగ క్రమ్మేసింది. కొంతమంది కూర్చుని కబుర్లు చెప్పుకుంటున్నారు.
టేబుల్ వెనుక కుర్చీలో వినాయకరావు కూర్చుని కనిపించాడు. టేబుల్ ముందున్న బల్లమీద నలుగురు వ్యక్తులు కూర్చుని ఉన్నారు. వాళ్ళతో ఏదో చర్చిస్తున్న వినాయకరావు లోపలకు వచ్చిన రామకృష్ణని గమనించి అన్నాడు.