Previous Page Next Page 
నన్ను ప్రేమించవు పేజి 2

    అతను త్రాగడానికి ఏవో కారణం ఉంటుంది.  ఎందుకంటే ప్రతి రోజూ త్రాగడం అతనికి ముఖ్యం!
    ఆశిరయ్య తన స్నేహితులతో కబుర్లు చెబుతూ త్రాగుతున్న సారా కొట్టుకి వంద గజాల దూరంలో ఫుడ్ కార్పోరేషన్ వారో గోడౌన్ల మధ్యకున్న హమాలీ సంఘం ఆఫీసులో కూర్చుని తన పని చూసుకుంటున్నాడు ఆశిరయ్య మెంబరుగా ఉన్న యూనియన్ ప్రెసిడెంట్.
    అతను వినాయకరావు.
                                 *    *    *
    వినాయకరావుని చూచిన మరుక్షణం అతని మీసాలు దృష్టిని ఆకట్టుకుంటాయి. తెల్ల వెంట్రుకలతో గుబురుగా కనిపించే అతని మీసాలు మెలితిరిగి ఉంటాయి. హమాలీల సంఘం ప్రారంభం నాటినుండి అతనే దానికి ప్రెసిడెంట్. కూలీల్లో అతనితో పోటీపడేవాడు లేడు. యూనియన్ కార్యకలాపాలలో అతనికి అపారమైన అనుభవం ఉంది. నిర్భయంగానూ నిర్మొహమాటంగాను మాట్లాడటం అతని ప్రత్యేకత!
    అతని కొడుకు ప్రస్తుతం బొంబాయి హార్బర్ లో పనిచేస్తున్నాడు. కూతురికి పెళ్ళయిపోయింది. ఆమె ప్రస్తుతం విజయవాడలో ఉంటోంది. వినాయకరావుకి సీతమ్మధారలో స్వంత ఇల్లుంది. దాని మీద నెలకి వెయ్యి రూపాయలు అద్దె, బ్యాంక్ డిపాజిట్లపై మరో వెయ్యి, యూనియన్ ప్రెసిడెంట్ గౌరవవేతనంగా ఐదువందలు అతని ఆదాయం. ఆ డబ్బుతో ఎటువంటిలోనూ లేకుండా జీవిస్తున్నాడు. ప్రస్తుతం అతనికి సమస్యలేం లేవు.
    రెండు సంవత్సరాల క్రితం కొడుక్కి బొంబాయిలో ఉద్యోగం వచ్చింది. సంవత్సరం పనిచేసిన తరువాత ఒకసారి శలవులో వచ్చి వెళ్ళాడు. తనతోపాటు ఒక అమమయిని వెంటతీసుకొని పోయాడు. కొడుకు పెళ్ళి గురించి ఎన్నో ఆశలు పెట్టుకున్న వినాయకరావు చాలా బాధపడ్డాడు.
    కొడుకు చేసిన గాయం మానుతున్న సమయంలో ఒక అపరిచిత యువకుడు వినాయకరావు దగ్గరకు వచ్చాడు. తను విజయవాడలో ఉద్యోగం చేస్తున్నానని తనకి ఎవరూ లేరని, మీ అమమయిని పెళ్ళి చేసుకుంటానని అతను వినయరావుతో చెప్పాడు. అతను తడుముకోకుండా, ఎలాంటి భయం లేకుండా సూటిగా విషయం చెప్పడం వినాయకరావుకి నచ్చింది.
    కొడుక్కి టెలిగ్రాం యిచ్చాడు. అతను వచ్చిన తరువాత ఆ వివాహం గురించి చర్చించాడు. ఆశ్చర్యకరంగా కొడుకు ఆ పెళ్ళిని వ్యతిరేకించాడు. అతను కూడా కులాంతర వివాహం చేసుకున్నాడు. ఆ విషయమే అడిగాడు వినాయకరావు. దానికి అతను చెప్పిన రీజన్ ఏమిటంటే, తను పై కులం అమ్మాయిని చేసుకున్నానని, తన చెల్లెలు దిగువ కులం వాడిని చేసుకోవడానికి ఒప్పుకోడట.
    పెద్ద చదువు చదువుకుని, నగరాలలో నివసిస్తూ రాబోయే కాలంలో తమ తరానికి ప్రాతినిధ్యం వహించాల్సిన ఒక యువకుని అవకాశవాదం గమనించి జీవితంలో మొదటిసారి తన గాంభీర్యాన్ని ప్రక్కన పెట్టి బిగ్గరగా నవ్వాడు వినాయకరావు. ఎక్కువగా నవ్వడంవల్ల అతని రెండు కళ్ళూ నీళ్ళతో నిండిపోయాయి.
    కూతురి పెళ్ళి ఆ యువకునితో జరిపించాడు. బ్రతికుండగా ఆ ఇంటి గుమ్మం త్రొక్కనని ప్రతిజ్ఞ చేసి కొడుకు వెళ్ళిపోయాడు. వినాయకరావు చలించలేదు. ఆ రాత్రి భార్య అతన్ని అడిగింది.
    "అబ్బాయి కోపంగా వెళ్ళిపోయాడు. వాడికి మాట పట్టింపు ఎక్కువ. ఇల్లు వాడి కోసమే కట్టాం. ఇప్పుడెలా?"
    తన కత్తిలాంటి చూపు భార్య వైపు తిప్పాడు వినాయకరావు.
    "ఎలా ఏమిటి? ఇక్కడ ఏం జరుగుతున్నదో నీకు తెలుసా?" అడిగాడు చాతిమీద కొట్టుకొని.
    ఆమె సమాధానం చెప్పలేదు.
    "బ్రతికుండగా గుమ్మ త్రొక్కడట. ఎవరు బ్రతికుండగా త్రొక్కడు? బిడ్డలు నూరేళ్ళు చల్లగా బ్రతకాలని కోరుకుంటున్నాం. బదులుగా కొడుకు నేను బ్రతికుండగా ఇంట్లోకి రానని అన్నాడు. ఓహో! ఎంత గొప్ప పట్టింపు నీ కొడుకుది. వాడు నీ కడుపులో పడినది మొదలు ఎన్ని ఆశలు అల్లుకున్నాం వాడి చుట్టూ. గుళ్ళకు వెళ్ళాం, గోపురాలు చూసాం. ఎటువంటి లోటూ రాకుండా పెంచి చదువు చెప్పించాం, భవిష్యత్తులో కష్టాలు పడకూడదని ఇల్లు కట్టి, బ్యాంకులో డబ్బు దాచాం. ప్రతిఫలంగా వాడు ఎవరో అమ్మాయిని తీసుకెళ్ళి పెళ్ళి చేసుకున్నాడు...." అని కొన్ని క్షణాలు ఆగి తిరిగి అన్నాడు.
    "దానికి నచ్చినవాడితో నా కూతురి పెళ్ళి చేశాను. ఇందులో ఎవరికీ సంజాయిషీ చెప్పాల్సిన పని నాకు లేదు. నీ కొడుక్కి పట్టింపు ఎక్కువయితే దానిని వాడి దగ్గరే ఉంచుకోమను. నాకు ఎటువంటి అభ్యంతరం లేదు."
    ఆ వినాయకరావు ప్రస్తుతం హమాలీ సంఘం ఎగ్జిక్యూటివ్ మీటింగ్ కోసం ఎజెండా రూపొందిస్తున్నాడు. తయారైన ఎజెండాకి తుది రూపం యివ్వసాగేడు. అంత కష్టపడి తయారుచేస్తున్న ఎజెండాలో ఓ ముఖ్యమైన అంశం చేర్చాల్సి ఉంటుందని, దానికి సంబంధించిన సంఘటన పదిహేను గంటల తరువాత జరుగుతుందని అతనికి తెలియదు.
    కాలం మాత్రం పదిహేనుగంటల సమయాన్ని తగ్గిస్తూ నెమ్మదిగా కదుల్తోంది.
                                   *    *    *

 

 Previous Page Next Page