Previous Page Next Page 
వారధి పేజి 3


    'పూర్ణ నీకోసం ఏడుస్తున్నాది, ఇంకోరోజు  పోవచ్చులే. వెనక్కి తిరిగిరా' అంటుందేమో వదిన  అని  ఆశతో  చూసేడు రాజు.

    రాజుకి పట్నం పోవడం ఎంతమాత్రం  ఇష్టంలేదు. స్కూలు ఫైనలు పాసయేడు. 'ఈ చదువు చాలదా? హాయిగా అన్నయ్యతోపాటు  తనూ ఆ ఊళ్ళోనే ఉండి పొలం చూసుకొంటే  సరిపోదూ? పట్నంలో ఏం గొప్పవుందని అంతా పడిచస్తారు?' అనుకొనేవాడు.

    ఆ గ్రామంలో అయిదవ తరగతివరకే చదువు ఉంది. ఆపై చదువు పట్నంలోనే చదివేడు వరదరాజు. రోజూ ఉదయాన్నే చద్దిఅన్నం తినిపోయి సాయంకాలానికి తిరిగి  వచ్చేవాడు. వదిన అతనికి మధ్యాహ్నం  ఫలహారం కోసం జంతికలో, చక్కిలాలో, చేగోడీలో, మినపసున్ని ఉండలో, అరిసెలో, అప్పాలో ఏదో ఒకటి చేసివుంచి  ఇచ్చేది. అవి రెండు తిని కడుపునిండా  ఇన్ని  మంచినీళ్ళు  తాగేవాడు రాజు.

    "అదేం  తిండిరా? పట్నంలో  హాయిగా  ఇన్ని  కాఫీహోటళ్ళు ఉన్నాయి. వేడి వేడిగా ఇడ్లి, దోసె తింటే బాగుంటుంది. అందులోపాటు కాఫీకూడా తాగితే మజాగా  వుంటుంది. మీ అన్నయ్య మరీ అంత  పిసినారిలా నీ చేతిలో కాణీ అయినా  పెట్టడేం? పోనీ, నువ్వే అడుగు. అడిగితే ఇవ్వనంటాడా?" అనేవారు తోటిపిల్లలు.

    "నాకు ఇవే బాగుంటాయి, మీకు  కావలిస్తే  మీరు పోయి  తినండి. నేను రాను" అనేవాడు రాజు.

    స్కూలు విడిచిన తరవాత  తోడిపిల్లలు బజార్లవెంట, పార్కుల వెంట తిరుగుతూంటే  వరదరాజు  ఇంటిముఖం  పట్టేవాడు.

    "అక్కడ  గోడలమీద  మంచి సినీమా బొమ్మలున్నాయి. పోయి చూద్డామురా. అసలు మీ వదినమ్మ ఆరు కొట్టకుండా  ఇంటికి రావాలంటే మాత్రం నువ్వు  వెళ్ళిపోవాలా ఏం? మా అమ్మమాత్రం  చెప్పలేదూ?" అన్నా, రాజు వినిపించుకొనేవాడుకాదు.

    ఆ పిల్లాడికి బజార్లో  గోడలమీద సినిమా  బొమ్మలు  చూడడంకన్నా వదిన వంట  చేస్తుంటే  దగ్గిర కూర్చుని కబుర్లుచెప్పడం  ఇష్టంగా ఉండేది.

    పల్లె ప్రజలంతా  ఘనంగా చెప్పుకొనే  పట్నంమీద రాజుకి ఏ కారణం వల్లో  గురి కుదరలేదు. అందుకే పట్నంలో  ఉండి చదువుకోడం  అంటే ముఖం వేలవేసేడు.

    "నాకు మరి చదవాలని లేదు వదినా!" అన్నాడు.

    రాజుకు చదువుమీద ఎందుకు  విముఖత  కలిగిందో మీనాక్షి  గ్రహించింది. ఊరి పొలిమేర దాటి బయటి ప్రపంచంలో కాలు పెట్టేందుకు  మగపిల్లడు భయపడడం  మంచి విషయం  కాదనుకొంది.

    రోజులు మారిపోతున్నాయి. ఏ ఊరివారు  ఆ ఊరికే  ముడివేసుకుని కూర్చునే కాలం తరలిపోయింది. మనిషి బాగుపడి బ్రతకాలంటే  నలుగురితో కలిసిమెలిసి జీవించడం, నాలుగు సంగతులు నేర్చుకోవడం అవసరం అనుకొంది. రాజుమాటకి  తను ఇప్పుడు అవునంటే  యెందుకూ  పనికిరాని పిరికివాడుగా  తయారవుతాడు. నయాన్నో, భయాన్నో  చదువులో  పెడితే అటు చదువు, ఇటు నలుగురితో తిరగడం కూడా  నేర్చుకొంటాడు.

    భార్యమాటలతో  తనూ  ఏకీభవించేడు  శివయ్య. కాని రాజుని ఒప్పించే పనిమాత్రం ఆమెకే  అప్పగించేడు.

    "నీకు చదవాలని  లేదంటున్నావుకాని, నాకుమాత్రం మా రాజు పెద్దచదువులు చదివి పెద్ద  ఉద్యోగస్థుడయితే  సంతోషంగా ఉంటుంది. నీకు తెలియదుకాని, రాజా! నాకో తమ్ముడు వుండేవాడు. వాడు కొంత చదివి నీలాగే తనకి చదవాలని లేదన్నాడు. నేను చెప్పినమీదట 'అలాగే చదువు కొంటాను అక్కా' అన్నాడు కాని, మా నాన్నగారికి  డబ్బులేక వాడిని చదివించలేకపోయేరు. అప్పటినుండి  నాకు  ఈ కోరిక తీరనేలేదు" అంది మీనాక్షి.

    రాజుకి ఒక మంచి ఆలోచన  వచ్చింది. అన్నయ్య తన చదువుకి డబ్బు ఖర్చుచెయ్యబోతున్నాడు కదా! ఆ సొమ్ముతో వదిన  తమ్ముడిని  చదివిస్తేసరి....ఉత్సాహంగా  ఆ మాట  వదినతో  చెప్పేడు.

    "వాడు చచ్చిపోయేడు రాజూ!" అంది మీనాక్షి.

    "అయ్యో పాపం.... అలాగా!" అంటూ  సానుభూతి  చూపించేడు.

    మీనాక్షి రాజుమాట  విననట్లు  చెప్పుకుపోసాగింది: "పోనీ, నాకు కొడుకన్నా ఉంటే వాడిని చదివించి కోరిక తీర్చుకొనేదాన్ని." కొడుకు లేడు కాబట్టి నిన్ను బతిమాలుకోవలసివస్తున్నాది  అన్న ధోరణిలో  అంది ఆ మాట.

    'ఎంతపని  జరిగింది! చక్కగా  వదినకి  ఒక కొడుకు పుడితే తన కీ బాధ లేకపోయేది కదా' అనుకొన్నాడు రాజు. అంతలో  రాజుకి చక్కని ఆలోచన వచ్చింది. "వదినా! వదినా! మన పూర్ణని చదివిద్దాం. మా స్కూల్లో  ఎందరో  ఆడపిల్లలు  కూడా  చదువుతున్నారు" అన్నాడు ఉత్సాహంగా.

    "పూర్ణ ఆడపిల్లకదా, వరదం! కొంతవరకు చదివించి  దానికి పెళ్ళి చెయ్యాలి. ఇంతకీ పూర్ణ ఎప్పటికి పెద్దదవుతుంది? అప్పటికి మీ అన్నయ్య దగ్గర ఉన్న డబ్బంతా ఖర్చయిపోతుంది. నువ్వు చదువుకొని  ఉద్యోగం చెయ్యనంటున్నావు. ఇంక  దానికి  చదువెవరు  చెప్పిస్తారు? పెళ్లెవరుచేస్తారు?" అంది మీనాక్షి.

    ఆ మాట వరదరాజుమీద  బాగా పనిచేసింది.

    "నేను పట్నంపోయి  చదువుకొంటాను. వదినా! నేను ఉద్యోగం చేస్తూ  పూర్ణని  చదివిస్తాను. చాలా నగలు  కొంటాను. ఇంకా...బాగా పెళ్ళి చేస్తాను. ఇంకా....ఇంకా...." ఏం చెప్పాలో  రాజుకి  తోచలేదు.

    "అన్నయ్యకీ, వదినకీ తిండి పెడతావు. అవసరానికి  ఆదుకొంటావు."

    రాజు సగంలో  వదిలిన  మాట  పూర్తిచేస్తూ  మీనాక్షి  రాజుని దగ్గిరకి  తీసుకుంది. చంటిపిల్లాడిలా  వదిన  ఒడిలో  సిగ్గుతో  తలదూర్చుకొన్నాడు  రాజు.

    "నీకు ఏళ్ళు  వస్తున్నా  వయసుకి తగిన జ్ఞానం  రాలేదు రాజూ! నీ  ఈడు పిల్లలంతా  ఇలాగే ఉన్నారా? ఇప్పుడు ఎవరైనా  చూస్తే ఏమనుకుంటారు? 'ఛీ ఇదేమిటీ?.... కాలేజీకి  వెళ్ళబోతున్న  రాజు  పసివాడిలా  వదిన ఒళ్ళో  తల దూర్చుకొన్నాడు' అంటారు. ఈరోజునించే  నువ్వు  పెద్దవాడి వన్నమాట. మరి పెద్దవాడిలాగే ప్రవర్తించాలి" అంది మీనాక్షి  లాలనగా.
 

 Previous Page Next Page