ఆ గ్రామానికి కాలిదారిన వంతెన మైలుకి మించకున్నా మధ్యలో ఎన్నో పొలాలు ఉన్న కారణంగా బండిదారి మూడు మైళ్లవరకూ ఉంటుంది. సాధారణంగా ఆ గ్రామవాసులు కాలిదారినే పట్నం పోతూంటారు. ఎప్పుడో ఇలా సరుకులు పట్నం చేరవేయవలసి ఉంటే మాత్రం బండి వెళుతుంది. ఊరిలోనించి ఒక బండి పట్నం వెళుతూందంటే అందరికీ ఇట్టే తెలిసిపోతుంది. మా సామాన్లకి కాస్త చోటుంటుందా? ఈ రెండు బెల్లపు దిమ్మలు 'మీ బండిలో వేస్తావా? మా ఈరగాడి కొట్టుకాడ ఈ మిరపకాయల బస్తా దింపేస్తావా? అంటూ అడుగుతుంటారు.
అదేవిధంగా మరునాడు అప్పన్నగారి బండి పట్నం పోతున్నాదని తెలిసి, కాలేజీ చదువుకోసం పట్నంపోనున్న తమ్ముడిని అందులో తీసుకుపోయే వీలుంటుందేమో అని అప్పన్నగారిని అడిగేడు శివయ్య.
"ఓ... తప్పకుండా. కావాలంటే మీవాడికోసం ప్రత్యేకం బండికట్టమన్నా కట్టిస్తాను. మన ఊరి పిల్లడు కాలేజీచదువు చదువుకు వస్తాడంటే మాకు లాభం కాదుటయ్యా! నీ తమ్ముడు పెద్ద చదువు చదివి డాక్టరో, ప్లీడరో అయేడనుకో. ఆ అనుభవం ఎవరిది? మా గ్రామంవాడు, 'ఫలానా' అని గొప్పగా చెప్పుకోమూ?" అన్నాడు అప్పన్న.
'బండిలో పిల్లాడికి కూర్చునేందుకు కాస్త చోటైనా లేనంతగా సరుకు నింపి మరీ పంపేడు. మనిషి ముఖంముందు మాటలతో కోటలు కట్టి, 'నువ్వే దీనికి రాజువి' అంటూ ఆకాశానికి ఎత్తి, చేతులతో ఈడ్చిపారవేసే రకం అప్పన్న' అనుకొన్నాడు శివయ్య. ఏది ఎలాగున్నా సామానులు ఉన్న కారణంగా నడిచిపోయేకంటే ఇదే నయమని సమాధానపడ్డాడు.
ఎండ ముఖంమీద పడుతూంటే చేయి అడ్డం పెట్టుకొని వంతెన వైపు చూసేడు రాజు. ఎత్తుగా ఉన్న వంతెన కిందుగా సన్నని పాయలా పారుతున్నది ఏరు. ఏడాదికి ఎనిమిది నెలలు ఆ ఏరు అంతంత మాత్రంగానే ఉంటుంది. ఆ మైలుదూరం నడిచివచ్చి ఇసుకలో చెలమలు తవ్వుకొని తాగేందుకు నీళ్లు తీసుకుపోతారు ఆ గ్రామ స్త్రీలు. ఊళ్లో ఒకటి, రెండు నూతులున్నా వాటిలో నీరు ఉప్పగా ఉంటుంది. వంటకి పనికిరాదు. ఎండయినా, వానయినా ఆ ఏటి నీరే ఆ గ్రామవాసులకు గతి.
వర్షాకాలంలో కాస్త ఒడ్డుదాకా వస్తుంది ఏరు. ఎంతలో వచ్చిందో మళ్లా అంతలోనే తీసిపోతుంది. వంతెన ఉన్నంతమేరా ఏరు నిండుకుని పారడం వరదరాజు ఎప్పుడూ చూడలేదు. 'ఇంత చిన్న ఏరుకి అంత పెద్ద వంతెన ఎందుకు కట్టేరో!' అని చాలాసార్లు అనుకొనేవాడు. కాని, ఎప్పుడో ఒకటి రెండుసార్లు ఆ ఏటికి వరద వచ్చి ఆ గ్రామాన్ని కూడా చాలావరకు ముంచేసిందట. ఆ వరదరోజుల్లో వంతెనమీదనించికూడా నీళ్ళు పారేయంటారు అది చూసినవాళ్ళు.
వంతెన మొదట్లో ఉన్న ఎత్తు ఎక్కుతున్నాది బండి. మామిడితోటలో నించి ఎవరో తనని పిలిచినట్లు వినిపించింది వరదరాజుకి. ఆ పిలుపుకూడా వదిన పిలిచినట్లు, 'నాయనా, వరదం!' అన్నట్లు అనిపించింది. తటాలున బండిలోనించి పక్కకి వంగిచూసేడు రాజు. బండిగూడుకున్న వెదురుకర్ర కణతమీద తగిలింది. బాధకి గట్టిగా చేత్తో అదిమి పట్టుకున్నాడు. చేతికి తడిగా తగిలింది. ఎర్రని రక్తం చూసుకొని రాజు కంగారుపడ్డాడు. 'అయ్యో, ఎంత రక్తం! ఇప్పుడు ఏమి చెయ్యడం?' కొత్తగా వదిన కుట్టి ఇచ్చిన జేబురుమాలు జ్ఞాపకం వచ్చింది. లాల్చీ జేబులోనుంచి దాన్ని పైకి లాగి దెబ్బ తగిలినచోట అదిమి పట్టుకొన్నాడు.
"ఏటయింది, రాజుబాబూ?" చుట్ట ముట్టించుకొనే కార్యక్రమంలో ఉండి యాదాలాపంగా అడిగేడు బండివాడు.
"ఏమీలేదు. ఎవరో నన్ను పిలిచినట్లు వినిపిస్తే చూసేను. వదిన పిలుపులా ఉంటే...ఏమిటి నీళ్ళకికాని వచ్చిందేమో అని...."
"వదినమ్మ నీళ్ళు చీకటితోనే ఎత్తుకుపోతది కదా! ఈ ఏలప్పుడు ఎందుకొత్తాది? తిన్నగా కూకో. ఇటు అటు కదిలితే ఏ పేడయినా సేతిలో గుచ్చుకొంటే మీ వదినమ్మ నన్నాడిపోస్తాది" అన్నాడు రాములు.
అంతలో తిరిగి 'వరదం' అన్న పిలుపు వినిపించింది. ఈసారి ఆ పిలుపు రాములుకి కూడా వినిపించింది. "నిజమే, ఏరో పిలుత్తున్నట్టగే ఉంది" అంటూ బండి ఆపి ఇటు అటు చూసేడు.
"అదిగో, మా వదినే!" అని బండిమీదనించి ఒక్కగెంతు గెంతేడు రాజు.
పాత చీరగుడ్డతో కట్టిన చిన్న మూట పట్టుకొని వడివడిగా నడిచి బండివైపే వస్తున్నాది మీనాక్షి. దాన్ని నడక అనేకంటే పరుగు అంటే సరిపోతుంది. ఏటిగాలికి ఎగిరిపడిన జుట్టు ముఖంమీద చెమటలో అంటుకు పోయింది. దగ్గిరపడుతున్న మరిదిని చూస్తూ పైటచెంగుతో చెమట తుడుచుకుంటూ "వరదం!" అని ఇంకోసారి పిలిచింది మీనాక్షి.
రాజుకి తన కణతకి తగిలిన దెబ్బ జ్ఞాపకం వచ్చింది. 'దానిని వదిన చూస్తే?...ఇంకేమైనా ఉందా? వదిన దగ్గిరికి వచ్చేస్తున్నాది. ఇప్పుడేం చెయ్యాలి?' అనుకొన్నాడు. రక్తం మరకలు పడిన రుమాలు జేబులో కుక్కి వేసేడు. నేలకి వంగి పిడికెడు బుగ్గితీసి దెబ్బతగిలినచోట రక్తం కనిపించకుండా అంటించేడు. పరుగుతో వెళ్ళి వదిన్ని కలుసుకొన్నాడు.
"ఏమయింది, వదినా! ఇంతదూరం ఎందుకు వచ్చేవు? పూర్ణలేచిందా? జ్వరం ఎలా ఉంది?" అంటూ ఆత్రంగా ప్రశ్నించేడు.
శివయ్య కూతురు పూర్ణ. నాలుగేళ్ళ పిల్ల. చిన్నాన్న అంటే ప్రాణం. చిన్నాన్న పట్నం వెళ్ళిపోతాడంటే 'నేనూ చిన్నాన్నతో పట్నం పోతా'నంటూ రాగం పెట్టేది. ఆ పిల్లకి వారంరోజులై రాత్రిపూట కొంచెం జ్వరం తగులుతున్నాది. అసలు అప్పట్లో పూర్ణని వదిలి వెళ్ళిపోవడం రాజుకి యెంతమాత్రం ఇష్టంలేదు. అప్పటికే కాలేజీ తెరిచి నాలుగైదు రోజులయిందనీ, వెంటనే వెళ్ళకపోతే అనవసరంగా పాఠాలు పోతాయనీ తొందరచేసి అన్న రాజుని ప్రయాణం కట్టించేడు.