ఆమెను ఎక్కడ వుంచాలీ అనేదే పై అధికారుల చర్చనీయాంశం అయింది....
తిరిగి మరొక విభాగం....
మరల, అక్కడా ధీరజ తన పద్దతిలోనే ఉద్యోగం చేయడం....
ఇక లాభం లేదు అనుకుని మారుమూల ప్రాంతాలకు లా అండ్ ఆర్డర్ ఎస్. ఐ .గానే పోస్టింగ్ ఇచ్చి పంపారు.
ధీరజ ఎక్కడ వుంటే అక్కడ వాళ్ళ గుండెల్లో నిద్రపోయేది.....
అలా ఎనిమిది సంవత్సరాల కాలంలో కనీసం పాతికసార్లు అయినా మారి వుంటుంది.
చివరకు విసిగి వేసారిపోయిన హోం డిపార్టుమెంట్ ఆమె సిన్సియారిటీ వైపు వేలుపెట్టి చూపలేక ప్రమోషన్ ఇచ్చి మరీ విజయవాడ రైల్వేకు సాగనంపారు.....
అంతటితో ఆమె బెడద తాత్కాలికంగా వదిలిపోయింది అనుకున్నారు.
ఎనిమిదేళ్ళ కాలంలో జరిగిన గతం ఇది.....
తిరిగి అలాంటి సూటి పోటీ మాటలు.... పై అధికారుల చీవాట్లు ఇప్పుడు పునరావృత్తం కాబోవడం లేదు కదా అనుకున్నది ధీరజ.
ఎందుకంటే వెంటనే వచ్చి కలవమని రైల్వే డి.ఎస్.పి చంచలరావు నుంచి ధీరజకు అర్జెంట్ మెసేజ్ వచ్చింది....
ఏది ఏమయినా చెక్కు చెదరని గంభీరత్వం ఆమె స్వంతం కాబట్టి ఎలాంటి తడబాటు లేకుండా డి. ఎస్.పి ఆఫీసుకు బయలుదేరింది లేడి ఇన్ స్పెక్టర్ ధీరజ.
* * *
గవర్నమెంట్ రైల్వే పోలీస్ స్టేషన్....
విజయవాడ.....
లేడీ ఇన్ స్పెక్టర్ ధీరజ ఒక క్రిమినల్ కేసుకు సంబంధించిన వివరాలను గురించి పబ్లిక్ ప్రాసిక్యుటర్ తో సీరియస్ గా డిస్కస్ చేస్తున్నది.
అప్పుడే టేబుల్ మీదనున్న రెడ్ కలర్ ఫోన్ మోగింది.
ఇన్ స్పెక్టర్ రిసీవర్ తీసింది.
"హల్లో...."
ఒక అపరిచిత స్వరం వినిపించింది.
"ఎస్.....ఇన్ స్పెక్టర్ ప్లీజ్ .....వాట్ డుయు వాంట్...."
"హల్లో మేడమ్ ....గుడ్ మార్నింగ్ ....నిన్నటి కేసు విషయంలో ఏమయినా ఇన్ ఫర్ మేషన్ తెలిసిందా?"
"హూ ఆర్ యూ మిస్టర్.....?"
"నేను ఎవరో తెలుసు కోవడం అంత ముఖ్యం అంటారా .....ప్రస్తుతం నేను ఎవరయినా మీ పరిశోధనకు ఉపయోగించదు..... కేసు విషయం తెలుసుకోవాలను కోవడం తప్పు కాదుగా.....?"
ఇన్ స్పెక్టర్ ధీరజ భ్రుకుటి వింతగా ముడిపడింది.
"మిస్టర్ ..... ఏ కేసు విషయం నువ్వు మాట్లాడేది?"
"అదే మేడమ్ --నిన్న సాయంత్రం మీ పోలీసులను హడావుడి పెట్టిన పీపాలోని శవం ఎవరిదో తెలిసిందా అని....."
అతని మాటలు విన్న ధీరజ ఉలిక్కిపడింది.
"ఎవరు నువ్వు....?"
"మళ్ళీ అదే ప్రశ్న.....నిన్న ఆ శవాన్ని కళ్ళారా చుసిన జనంలో ఒకడిని-- అందుకే అడుగుతున్నాను. మీ దర్యాప్తు ఎంతవరకు వచ్చింది అని....?"
"మిస్టర్....డోంట్ వెస్ట్ మై టైం....హూ ఆర్ యూ"
"ఒక సాధారణ పౌరుడ్ని మేడమ్ .....నేరం జరిగిందని తెలిసిన తరువాత అది ఎలా జరిగిందో తెలుసుకునే హక్కున్న భారత పౌరుడ్ని. ఎందుకో ఆ శవాన్ని చూశాక మీరు చచ్చి గీ పెట్టినా ఐడెంటి ఫై చేయలేరు అనిపించింది నాకు.....! అందుకే రెట్టించి అడుగుతున్నాను తప్ప నా గురించి అలోచించి తమరి విలువయిన కాలాన్ని వృధా చేసుకోకండి.....ఎవరయినా అనుమానితులను గుర్తించారా?"
"ముందు నీ బయోడేటా ఏంటో చెప్పు మిస్టర్?"
"నా పేరు తెలుసుకోవడం మీకు అనవసరం మేడమ్?"
"పేరు చెప్పడానికే సంశయించే వాడివి ....నీకు కేసు వివరాలు కావాలా?"
"సరే మీ యిష్టం" అని ఫోన్ పెట్టేశాడు.
అతని ప్రవర్తన ఇన్ స్పెక్టర్ ధీరజకు వింతగా తోచింది.
ఫోన్ చేసిన వ్యక్తీ ఎవరై వుంటాడు?"
పత్రికల వాళ్ళు అయితే అలా దాగుడుమూతలు ఆడవలసిన పని లేదు. తను ఎవరో చెప్పినండువలన అతనికి ఎలాంటి హాని జరగదు.... సో ....అతను జర్నలిస్టు కావడానికి వీల్లేదు.
ముక్కూ మొహం తెలియని వ్యక్తీ శవం పై ఒక సాధారణమైన పౌరునికి అంత శ్రద్ధ కలిగి ఫోన్ చేయడం ఎంతో వింతగా తోచింది.
తన సర్వీసులో ఇలాంటి అనుభవం ఎదురుకావడం అదే మొదటి సారి.....
ప్లాట్ ఫారం పై ఎందరో గుమిగూడారు. అంత మందిలో ఈ ఒక్క వ్యక్తీకీ ఆ శవం ఎవరిదో తెలుసుకోవాలన్న కుతూహలం ఎందుకు కలిగిందో....?
ఏదో శవం దొరిగింది.....విచారణ ప్రారంభించాలని అనుకున్నదే తప్ప, ఫార్మాలిటీస్ కూడా పూర్తీ కాకముందే ఆ శవాన్ని గూర్చి అజ్ఞాత వ్యక్తీ ఫోన్ చేయడం చూసిన తరువాత ఇన్ స్పెక్టర్ ధీరజకు అతని ప్రశ్నల వెనుక ఏదో లింక్ వున్నట్టు అనిపించసాగింది.
రోజుకు ఎన్నో ఘోరాలు, నేరాలు తన దృష్టికి వస్తున్నాయి.
కానీ ఎప్పుడూ ఎవ్వరూ ఇలా ఫోన్ చేయలేదు.
చనిపోయిన వ్యక్తిని గురించి, అతని తరపు వాళ్ళు ఫోన్ చేసి అడగడంలో అర్ధం వుంది. అసలు ఆ శవం ఎవరికి చెందిందో , ఏ వూరి వాడో ఎలా చనిపోయాడో కూడా గుర్తించక ముందే ఎవరో ఫోన్ చేసి అడగడం లేడీ ఇన్ స్పెక్టర్ కు ఎన్నో సందేహాలను రేపింది.
అసలు ఎవడై వుంటాడు అతను?
ఆ శవం ఎవరిదో తెలియనప్పుడు అతనికి ఎందుకంత శ్రద్ధ?
ప్రత్యేకించి ఆ శవాన్ని గూర్చే అడుగుతున్నాడూ అంటే అతనికి ఆ శవానికీ ఏదో సంబంధం వుండి వుండాలి.....
అతను అలా అడగవలసిన ఇన్ స్పెక్టర్ ధీరజకు పట్టుదల పెరిగింది. ఎలాగయినా ఆ కేసుని చాలెంజ్ గా తీసుకోవాలనుకున్నది.
మరుక్షణం ఆ శవం తాలూకు కేసు ఫైలు తెరచి వివరాలను పరిశీలించడంలో మునిగిపోయింది లేడీ ఇన్ స్పెక్టర్ ధీరజ.
* * *
విజయవాడ......
మల్లిఖార్జున పేటలోని ఒక వీధి.....
కానిస్టేబుల్ సుందరం ఒక ఇంటిముందు ఆగిపోయాడు.
ఆ ఇంటి తలుపులు వేసి వుండడంతో సుందరం నిరుత్సాహంగా వెను దిరిగాడు.
ఎందుకో అనుమానం వచ్చి వెళ్ళిపోతున్న వాడల్లా ఒక క్షణం తల తిప్పి గుమ్మం వైపు చూశాడు. మరుక్షణం ఆశ్చర్యంగా ముడిపడింది అతని భ్రుకుటి.
వాకిలి వద్ద వున్న చెప్పుల జత అతనిని ఆకర్షించింది.
అది ఎవరివో అతనికి తెలియకపోయినా , ఆ సమయంలో అవి అక్కడ వున్నాయంటే లోపల ఎవరున్నారో అర్ధమయింది.
వెంటనే తన నిర్ణయాన్ని మార్చుకుని తలుపుని సమీపించి మెల్లగా నెట్టి చూశాడు. లోపల గడియ పెట్టి వున్నందువలన అవి తెరచుకోలేదు.