ఫోన్ కట్ అయిపొయింది....
తిరిగి మళ్ళీ చేసే వీలు లేకుండా రిసీవర్ తీసి ప్రక్కనే పెట్టేశాడు .
అసలు స్టేషన్ లో ఏం జరుగుతుందో తనకు తెలియనట్టుగా కామ్ గా బయటకు వెళ్ళిపోయి సెంట్రీతో కబుర్లలోకి దిగిపోయాడు హెడ్ కానిస్టేబుల్.
సెల్ లో వున్న రౌడీల ఆర్తనాదాలు ఆగిపోయాయి.....
తన నుదుట పట్టిన చమటను తుడుచుకుంటూ సెల్ లో నుంచి బయటకు వచ్చింది ధీరజ.
అది గమనించిన హెడ్ కానిస్టేబుల్ లోపలకు పరుగెత్తు కొచ్చాడు.
"మేడమ్ ...."
"రిలీజ్ దెమ్ ....." అన్నది ధీరజ తాపీగా.
ఎందుకు.....ఏమిటి .....అని ఎదురు ప్రశ్న వేయకుండా ఆ రౌడీలను బయటకు రమ్మన్నాడు.
కుంటుతూ, నడవలేక .....నడవలేక వచ్చారు.
ఈ జన్మలో వాళ్ళు మళ్ళీ పోట్లాటల జోలికి వెళితే ఒట్టు....
అంతగా కమిలిపోయాయి వాళ్ళ శరీరాలు....
;ఇంకోసారి నగరంలో మీరు ఏదయినా గొడవచేస్తూ కనిపించారే అనుకో ఏం చేస్తానో తెలుసుగా?" వాళ్ళ వైపు ఉరిమి చూస్తూ అన్నది ధీరజ.
మాట్టాడే ఓపిక కూడా లేక తెలుసునన్నట్లు నీరసంగా తలలు వూపారు.
"కాల్చి పారేస్తాను. ఎందుకు షూట్ చేసానో తగిన సాక్ష్యాలు చూపడం నాకేమీ కష్టం కాదు, అర్ధమయిందా" గంబీరంగా వుంది ఆమె కంఠం
అప్పటికే చచ్చి సగం అయిపోయారు....
ఆమె ఇచ్చిన సెల్ ట్రీట్ మెంట్ ఈ జన్మలో మరచిపోలేనిది....
అందుకే ఖంగారు పడిపోతూ దీనంగా చూశారు.....
"పొండి.....మళ్ళీ నా కంటికి కనిపించవద్దు....
బతుకు జీవుడా అనుకుంటూ పడుతూ లేస్తూ పారిపోయారు.
ఆమె అంత తేలిగ్గా తమను వదులుతుందని వాళ్ళు కలలో కూడా అనుకోలేదు....
అందుకే ప్రాణాల మీద తీపితో క్షణాల మీద అదృశ్య మైపోయారు.
అప్పుడు రిసీవర్ ను తీసి యధాలాపంగా ఉంచింది ధీరజ.
మరో ఐదు నిమిషాల తరువాత రుసరుసలాడుతూ డి. ఏస్. పి మార్తాండ్ తో పాటు ఒక లాయర్ కూడా వచ్చాడు.
లేచి గౌరవంగా సెల్యూట్ చేసిందామె....
"వాట్ ఎబవుట్ మిస్ ధీరజా.....ఎన్నిసార్లు ఫోన్ చేసినా ఫోన్ ఎంగేజ్ వస్తుంది. ఇంతసేపు ఎవరితో మట్టాడుతున్నావూ....."
వచ్చీ రావడంతోటే డో.ఎస్. పి . సీరియస్ గా ప్రశ్నించాడు.
"లేదు సార్.....ఎవరితో మాట్టాడం లేదు....."
"మరి ఫోన్...."
"అలానే వుంది సార్.....బహుశా ఫోన్ ఫాల్ట్ వుండి వుంటుంది. అయినా ఫాల్ట్ వుంటే రింగ్ అయినా ఒక్కొక్కసారి మెసేజ్ సౌండ్ వస్తుంటుంది...." అన్నదామె నింపాదిగా.
ఆమె మాటలకు గుర్రుగా చూశాడు అయన.
"అవునవును.....రిపేర్ వున్నమాట నిజమే"
అయన ఆ మాటలు ఎందుకంటున్నాడో గ్రహించిన ధీరజ తనలో తనే నవ్వుకుంది.
ఇంతకు ముందు దొమ్మి చేస్తున్నవాళ్లను ఎవరినయినా అరెస్ట్ చేసి తెచ్చావా?
"అవును సార్.....శాంతి భద్రతలకు విఘాతం కలిగించడం నా కళ్ళారా చూశాను" అందుకే తెచ్చి లాకప్ లో పెట్టాను...." నింపాదిగా చెప్పింది ధీరజ.
"వాళ్ళు ఏమీ తెలియని అమాయకులు.....వాళ్ళను రిలీజ్ చేయి...." కావాలంటే లాయర్ బెయిల్ ఇస్తాడు" అన్నాడు డి.ఎస్.పి మార్తాండ్.
"అంత అవసరం లేదు సార్....వాళ్ళను లోపల వుంచడం అనవసరం అనిపించి వదిలేశాను."
"వదిలేశావా.....?"
డి. ఎస్.పి. నమ్మలేనట్టు ప్రశ్నించాడు.
అవును.....తరువాత మీరు వచ్చి ఎటూ వదిలేయమని అడుగుతారని తెలుసు కాబట్టి ముందుగానే ఆ పని చేశాను....పైకి అనలేకపోయినా మనస్సులో అనుకున్నది ధీరజ.
"ఎస్ సర్....బుడ్డి చెప్పి వదిలేశాను."
అయన ముఖంలో నమ్మలేనంత ఆశ్చర్యం కనిపించింది.
"ఇట్స్ అల్ రైట్....." అంటూ వెళ్ళి పోయాడాయన.
ఆ లాయర్ కు ఆమె అలా చేస్తుందని ఏమాత్రం వూహించలేక పోవడం వలన ధీరజ వైపు అదోలా చూస్తూ డి.ఎస్.పి. మార్తాండ్ ను అనుసరించాడు.
తమ ఎస్.ఐ ఎందుకు అలా ప్రవర్తించిందో హెడ్ కానిస్టేబుల్ కు అప్పుడు అర్ధం అయింది. ధీరజ తరువాత జరగబోవు పరిణామాల కోసం ఎదురుచూస్తూ కూర్చున్నది.
ఆమె వూహించినట్టుగానే ఒక అరగంట తరువాత ఫోన్ మోగింది....
"మిస్ ధీరజా....యూ ఆర్ గోయింగ్ అన్ రాంగ్ ట్రాక్.... క్రాసింగ్ యువర్ లిమిట్స్ .....నీ దృష్టిలో బుద్ది చెప్పడమంటే ఈ జన్మలో తిరిగి కోలుకోలేని విధంగా చావబాధడం అన్నమాట....ఇట్స్ టూ బాడ్.....నీలాంటి అవేశం వున్నవాళ్ళు మన డిపార్ట్ మెంట్ కు పనికిరారు. ఆలోచన వివేకం వున్నవాళ్ళే శాంతి భద్రతలను కాపాడగలరు. నీలాంటి షార్ట్ టెంపర్ కలిగినవాళ్ళు చేతులలో అధికారం వుంటే ఆవేశానికి లోనై ఏదయినా చేయగలరు....
"యాక్షన్ చూపించాలి కానీ ఓవర్ గా రియాక్ట్ కాకూడదు. అసలు నువ్వు డ్యూటీలో చేరి ఎంతకాలం అయిందో ఒకసారి ఆలోచించుకో. ఇంతవరకు ఎన్ని కేసులు కట్టి వుంటావు. వాటిలో ఏ ఒక్కటి అయినా నిలబడిందా....లేదే,....ఆవేశంగా పైలు చేయడం ఒక్కటే నీకు తెలిసింది. మన ద్రుష్టిలోకి వచ్చిన ప్రతి కేసునూ కటకటాల వెనకకు తీసుకు రాకూడదు....
"అలా తెలుసుకుని సమయస్పుర్తిగా మసలా గలిగినవాడే నిజమైన పోలీస్ ఆఫీసర్....నీ పై ఇప్పటికి ఎన్ని కంప్లయింట్స్ వచ్చాయో తెలుసా? అందుకే నిన్ను లా అండ్ ఆర్డర్ నుంచి ట్రాన్స ఫర్ చేయమని పై అధికారులకు రికమెండ్ చేశాను. ట్రాన్సఫర్ ఆర్డర్స్ వచ్చేవరకు అయినా నీ దుడుకుతనం తగ్గించుకోక పొతే తరువాత ఏం అవుతుందో నేను చెప్పలేను. సారీ ధీరజా" అని ఫోన్ పెట్టేశాడు డి.ఎస్.పి . మార్తాండ్.
అలాంటి శ్రీ ముఖం ఏదో వినవలసి వస్తుంది అని ముందే వూహించింది కాబట్టి ధీరజ ఆశ్చర్యపోలేదు.....
పోలీస్ ఉద్యోగం అన్న తరువాత ఇలాంటి సూటి పోటి మాటలు అటు పోట్లు తప్పవు అని ముందే తెలుసుకున్నది కాబట్టి ఆమె బాధపడి పోలేదు.
నీతి నిజాయితీతో....సామాన్య పౌరులకు రక్షణ కల్పించవలసిన బాధ్యతను గుర్తెరిగి ప్రవర్తించే ఆఫీసర్ లా అండ్ ఆర్డర్ లోనే వుండి తీరాలని రూలేం లేదు....
తనను ఎక్కడ వేసినా అక్కడా ఇలాంటి దుమారమే రేగుతుంది.
ఏం జరుగుతుందో చూద్దాం.....వెయిట్ అండ్ సి.....అనుకున్నదామే.
ఆమె వుహించినట్టుగానే వారం రోజులలోనే ట్రాఫిక్ ట్రాన్సఫర్ ఆర్డర్స్ అందాయి.
ధీరజ ఎలాంటి సంకోచం లేకుండా వెంటనే చార్జ్ తీసుకున్నది.
ట్రాఫిక్ రూల్స్ నిబంధనలను అతిక్రమించిన పౌరులను, వాళ్ళ హోదాలను కూడా పట్టించుకోకుండా కేసులను బుక్ చేసి కోర్టుకు లాగి పెనాల్టీలు విధించేలా చేయడంతో అక్కడా ధీరజపై దుమారం బయలు దేరింది....