Previous Page Next Page 
మొగుడే రెండో ప్రియుడు పేజి 28

    భ్రమరాంబ నెమ్మదిగా, "ఈ పరిస్థితిలో నీకు నేనేం చెప్పినా నచ్చదు. కానీ, నిదానంగా ఆలోచించి చూడు! నీ తర్కం ఎంత అర్ధరహితమో నీకే అర్ధమవుతుంది, ముచ్చటైన కాపురంలో మంట పెడ్తానంటున్నావు. మంట చూడటానికి అందరికీ తమాషాగా బానే వుంటుంది. కానీ, వేడి మాత్రం అనుభవించేవాళ్ళకే తెలుస్తుంది. నిలువునా కాలిమసి అవుతారు" అంది.

    "ఆ వేడే నన్ను నిలువునా దహించి వేస్తోంది. నా ఎదురుగానే వాడు....నా వర్షిణిని ముద్దు పెట్టుకున్నాడు. అప్పుడు నా రక్తం ఎంత ఉడికిపోయిందో తెలుసా?" అతని గుప్పెళ్ళు బిగుసుకున్నాయి. పళ్ళు పటపటా కొట్టుకున్నాయి.

    భ్రమరాంబ విస్మయంగా అడిగింది, "నీ ఎదురుగానా?"

    "ఆ...నేను అక్కడ వున్నట్టు వాడికి తెలీదు. వర్షిణి నన్ను దాచిపెట్టింది. నేను అతని ఎదురుపడితే తనని తాను చంపుకుంటానని బెదిరించింది. పైగా ఈ రోజు ఆమె పుట్టిన రోజు...అందుకే ఆమె మాట కాదనలేకపోయాను" ఏ మధురస్మృతులు అతని కంఠానికి అడ్డుపడ్డాయోగానీ అంతటితో ఆగిపోయాడు!

    భ్రమరాంబకి అంతా వింటూ వుంటే, వర్షిణి పరిస్థితి తలచుకుని ఒళ్ళు జలదరించింది. "అయితే ఇప్పుడేం చేస్తావూ?" అని అడిగింది.

    ఒక నిశ్చయానికి వచ్చినట్టు, "రేపు ఉదయం పది గంటలకి వెళ్ళి నా వర్షిణిని నేను తెచ్చేసుకుంటాను" అన్నాడు.

    షాక్ తిన్నదామె...అతడి సమాధానం విని. ఆ షాక్ నుంచి నెమ్మదిగా తేరుకున్న ఆమె అడిగింది "అంత తేలిక అనుకుంటున్నావా?" అని.

    "ఈ విక్రమ్ తలచుకుంటే అసాధ్యమయినదేదీ లేదు అని తెలుసుగా! ఇంకా నువ్వెళ్ళు..." అన్నాడు మంచం మీద వాలి కళ్ళు మూసుకుంటూ.

    "భ్రమరాంబ అతన్ని అలాగే ఒక్క క్షణం తదేకంగా చూసింది. అతడి తత్వం తెలిసిన ఆమె అక్కణ్ణించి కదిలింది.
   
                                                                      *    *    *

    అమృత గతం నీడలా కళ్ళముందు కదలాడింది.

    "మద్దికాయలు కడుం గదలాడగ ముద్దుగారు పొందిక జిగి పాల బుగ్గలను..." అంటూ పాడింది భ్రమరాంబ.

    అమృతవర్షిణి వెనక్కి తిరిగి "ఏమిటి?" అంది అర్ధం కానట్టు.

    భ్రమరాంబ వర్షిణిని క్రింద నుంచి పైకి ఓసారి చూసి, "ఏమనుకోకు. నీ అందం చూస్తుంటే నాలో కవిత్వం పొంగుకొస్తోంది! "ఏ వన్నెకానికీ లావణ్యవతి గోటి చెవకులు కళలూర జేయునొక్కొ..." అంటూ మళ్ళీ పద్యం మొదలెట్టింది.

    వర్షిణి గలగలా నవ్వింది.

    శిల్ప చదువుతున్న పుస్తకం మూసేస్తూ, "తల్లీ ప్రబంధ పరమేశ్వరీ...ఆ అమ్మాయికి కొత్త కాస్తా నీ  ధాటి తగ్గించుకో!" అంది.

    వర్షిణి ఆంధ్రా యూనివర్సిటీలో ఎం.ఎ. లిటరేచర్ లో చేరి, బంధువులు ఎవరూ కాలేజీ దగ్గరలో లేకపోవడంతో హాస్టల్లో చేరింది. ఆమె తల్లిదండ్రులు, వాళ్ళ నాన్నగారి ఉద్యోగరీత్యా నాగ్ పూర్ లో వుంటారు. ఈమధ్యనే విజయవాడ నుంచి నాగపూర్ కి ట్రాన్స్ ఫర్ అయింది. ఆమెకంటే మూడు నెలల ముందు చేరారు. శిల్పా, భ్రమరాంబ. ఇద్దరూ మంచి స్నేహశీలలు కావడం వలన ఆమెకు కొత్తపోయి, కాస్త ధైర్యం వచ్చింది.

    "ఆ డబ్బాలో వున్న కారప్పూస అయిపోయిందా?" అడిగింది భ్రమరాంబ.

    "ఇంకా కొంచెం వుంది" అంటూ అందించింది. వర్షిణి.

    ఇంతలో పక్కరూం అమ్మాయి హడావుడిగా వచ్చి, "శిల్పా! విక్రమ్ ని అరెస్ట్ చేశారుట!" అంది.

    శిల్ప "ఆహా!" అంటూ తన చేతిలోని పుస్తకంలో మునిగిపోయింది.

    భ్రమరాంబ ఒక్క అంగలో ఆ అమ్మాయిని చేరి, "ఏమయిందీ? ఎందుకు అరెస్ట్ చేశారూ?" అంది.

    "ఆ శీనుగాడు మార్క్స్ తక్కువ వేశారని వింధ్యవాసినీ మేడమ్ ని రోడ్డు మీద పట్టుకుని ఏదో తిట్టాడుట ఆ సంగతి విక్రమ్ కి తెలియగానే వెళ్ళి ఉతికేశాడుట. అసలే ఆ శీనుగాడికి పొలిటికల్ బ్యాకింగ్ వుంది" అంది ఆ అమ్మాయి కళ్ళు తిప్పుకుంటూ మహా ఉత్సాహంగా.

    "విక్రమ్ ఎవరూ?" అడిగింది కుతూహలంగా వర్షిణి.

    "అతను స్టూడెంట్స్ యూనియన్ లీడర్, ఎప్పుడూ ఏవో గొడవల్లో తల దూర్చి, తన్నులు తినడమో, కొట్టడమో చేస్తుంటాడు" అంది శిల్ప విసుగ్గా.

    భ్రమరాంబ వెంటనే కోపంగా "అంటే నీ ఉద్దేశం ఏమిటీ? అన్యాయం జరుగుతున్నా ఎవడూ పట్టించుకోకూడదనా? మొన్నటికి మొన్న స్వప్నని మోహన్ ఏడిపిస్తుంటే తన్ని బుద్ది చెప్పలేదూ! అప్పట్నుంచి వాడు సొంత చెల్లెలితో మాట్లాడటానికి కూడా భయపడ్తున్నాడుట" అంది.

    "ఈవిడగారికి ఆయనంటే గొప్ప హీరో వర్షిలే" అంది శిల్ప నవ్వేస్తూ.

    "భ్రమరాంబకే కాదు ప్రతి ఆడపిల్లకీ అతనంటే క్రేజ్" అంది పక్కరూం అమ్మాయి, తన చెంపల్లో గులాబీలు పూస్తూండగా.

    "చూడటానికి ఎలా వుంటాడూ? తెలుగు సినిమాల్లో విలన్ లాగా భీకరంగా వుంటాడా?" అంది వర్షిణి.

    "మేము మాత్రం చూశామా ఏమన్నానా? వూరికే వినడమే!" అంది శిల్ప. భ్రమరాంబ వర్షిణితో ఉత్సాహంగా, ఈసారి పోలీస్ స్టేషన్ నించి రాగానే అందరం కలిసి అభినందించి పుష్పగుచ్చం ఇద్దాం" అంది.

 Previous Page Next Page