Previous Page Next Page 
మొగుడే రెండో ప్రియుడు పేజి 27

    ఆమె లేచి కళ్ళు తుడుచుకుని మామూలుగా వుండటానికి ప్రయత్నిస్తూ వెళ్ళి తలుపు తీసింది.

    "కమాన్! ఈ రోజు మనం చాలా సెక్సయిటింగ్ గా గడుపుదామని చెప్పావుగా!" అన్నాడు ఆమె చెయ్యి పట్టి లాగుతూ.

    అమృత నీరసంగా, "వదిలెయ్ హర్షా!" అంది.

    "నిన్ను వదులుకోగలనా?" అన్నాడు ఆర్తిగా.

    అమృత దెబ్బతిన్నదానిలా అతనివైపు చూసింది.

    హర్ష నవ్వుతున్నాడు. ఎప్పటిలాగే మనోహరంగా! అప్పుడే విచ్చిన పువ్వూ, మనసులోంచి వచ్చిన నవ్వూ చాలా స్వచ్చంగా వుంటాయి!

    అంతలోనే అతను ఆమెని వదిలేస్తూ, "తలనెప్పిగా వుందా? ఆ...ఇప్పుడు చెప్పు నీకు ఈ రోజు జీవితాంతం గుర్తుండిపోవాలన్నావుగా, ఏం చేద్దాం?" అన్నాడు.

    అమృత మనసులో విరక్తిగా అనుకుంది. 'నువ్వు ప్రత్యేకించి ఏమీ చెయ్యక్కరలేదు. ఈ రోజుతో మరపు అనే వరం నన్ను వదిలి పెట్టేసింది. మానిన గాయాలన్నీ తిరిగి రేగాయి. ఈ నరకం ఇకనుంచీ నేను అనుక్షణం అనుభవిస్తూ చాలా...చాలా ఎక్సైటింగ్ గా గడుపుతాను. థ్రిల్స్ అంటే నాకు తగని ఇష్టంకదా! అందుకే అన్య్కుంటా ఆ దేవుడు నా నుదుట ఇటువంటి రాత రాశాడు.

    "ఇందువదనా ఎందుకు చిన్నబోయావూ? మధురభాషిణీ ఏవిటీ మౌనం?
చిత్రాంగీ....చిత్తరువులా నిలబడిపోయావేం?" ఆమె వ్హుబుకం పట్టి పైకి ఎత్తుతూ అడిగాడు హర్ష.

    ఆమె మనసులో మలిసంజెలా అలుముకున్న నైరాశ్యం!

    కళ్ళల్లో పొగమంచులాంటి దైన్యం!

    అధారాల మీద సందె చీకటిలో అలుముకున్న లాస్యం!

    అన్ని భావాలూ కలిపి వ్యక్తం చేసినా భాష్యం.

    అనంతమైన ఆకాశంలాంటి మౌనం!

    "చూశావా! నువ్వే కాదు. నేనూ పిలవగలను రకరకాల పేర్లతో అన్నాడు హర్ష నవ్వుతూ.....

    ఆమె నవ్వలేదు.

    అతనే మళ్ళీ "అన్నింటికన్నా నీ పేరే నీకు సరిగ్గా నప్పుతుంది. అమృతవర్షిణి అని" అన్నాడు ఆరాధనగా.

    "కాదు....కాదు, మృతజీవని. నా ప్రస్తుత పరిస్థికి ఈ పేరు సరిగ్గా సరిపోతుంది" ఘోషించింది ఆమె హృదయం.
   
                                           *    *    *
   
    భ్రమరాంబకి ఆ శబ్దం ఏమిటో మొదట అర్ధం కాలేదు.

    "ధడ్....ధడ్....ధడ్" తలుపు విసురుగా కొట్టుకుంటున్న చప్పుడు అని తెలియగానే, వెంటనే బైటికి వచ్చి చూసింది.

    ఆ దృశ్యం చూస్తూనే, "ఆగు!" అంటూ, పరిగెత్తుకుంటూ వచ్చి, విక్రమ్ చెయ్యి పట్టుకుంది. "ఏవిటీ ఘోరం? పిచ్చెక్కిందా?" అంటూ అరిచింది.

    అప్పటికే తలుపు మధ్యలో పెట్టి నలగకొట్టుకోవడం వలన విక్రమ్ కుడి అరచెయ్యి చిట్లి రక్తం కారుతోంది.

    విక్రమ్ విసురుగా ఆమెని తోసేసి, "వదులు, నన్ను ఆపకు" అన్నాడు తిరిగి చెయ్యి తలుపు సందులో పెడ్తూ.

    భ్రమరాంబ తలుపు కదలకుండా తన చేత్తో ఒడిసిపట్టుకుని, అతనివైపు అయోమయంగా చూసింది.

    మనిషి పూనకం వచ్చినవాడిలా ఊగిపోతున్నాడు. కళ్ళు రక్తం కక్కుతున్నంత ఎర్రగా మారాయి!

    ఆమెకి ఎందుకో జాలేసింది! "ఏం జరిగింది? ఎవరిమీద ఈ కోపం?" అంది అనునయంగా.

    అతను ఆమె భుజాలు గుచ్చి పట్టుకుని ఉద్రేకంగా.

    "నిజం చెప్పు భ్రమరాంబా! వర్షిణి నన్ను మనస్పూర్తిగా ప్రేమించింది కదూ!" అన్నాడు.

    భ్రమరాంబ తల 'ఔను' అన్నట్టుగా ఊపింది. "మరి...మరి....అతనితో ఎలా వుంటోంది? అతను ముట్టుకుంటే ఎలా భరిస్తోందీ?

    ఇదంతా కళ్ళారా చూస్తూ ఇంకా నేను ఎలా బ్రతికి వున్నానూ?" అతను బాధగా అడిగాడు.

    భ్రమరాంబ అతన్ని సున్నితంగా విడిపించుకుని, లోపలికి వెళ్ళి గూట్లోంచి కొబ్బరి నూనెసీసా తీసుకొచ్చింది. అతన్ని మంచంమీద కూర్చోపెట్టి, తాను క్రింద కూర్చుని, "ఏదీ చెయ్యిపట్టు" అని, అతని అరచేతికి నూనె రాయసాగింది.

    అతను కళ్ళు మూసుకున్నాడు. ఏదో ట్రాన్స్ లోకి వెళ్ళినట్టుగా మంద్రంగా మాట్లాడటం ప్రారంభించాడు. "ఆమె...ఆమె నా వర్షిణేనా? పూర్వపు అందం, మధురమైన స్వరం, ఆ వివేకం, అన్నీ వున్నాయి. కానీ భావాలు మాత్రం కొత్తవి. మళ్ళీ ఇన్నాళ్ళకి...ఇన్నేళ్లకి ఆమెని చూశాను. దగ్గరగా నించున్నాను. నేను స్పర్సించిన పెదవులు, నేను ఆడుకున్న ముంగురులు, పోగొట్టుకున్నదేదో మళ్ళీ దొరికినట్టయింది! ఆమె నా సొంతం! గిలిగింతలు పెట్టి కవ్వించే నా నిధి! ఆమెని ఎలా వదులుకోనూ? అసలు దూరంగా వుండడం సంభవమా? నాతో రానంటుందేమిటి? ఆ కొత్త వ్యక్తి భర్త కాబట్టి...సర్వం అతనే అంటుందేమిటి? ఇక నేనేం కానా తనకి?"

    భ్రమరాంబ అతని కళ్ళల్లో వర్షిణిపట్ల కదలాడే ఆరాధనకి అబ్బురంగా చూస్తోంది. 'నా బొమ్మ నాకు ఇచ్చెయ్' అని మారాంచేసే, పసిపిల్లవాడిలా కనిపించాడు అతను. ఆడవాళ్ళు ఎదిగిపోవడానికి ఎంతో సమయం పట్టదు.

 Previous Page Next Page