హల్లో! రా, రా!, అంటూ దగ్గరికి వచ్చి అమాంతం కౌగిలించుకొన్నంత పనిచేసి పక్క కుర్చీ చూపెట్టింది కూర్చోమని హిందీలో తెగ దంచేస్తూంది -- తనకెంత ఆనందంగా ఉందో నేను రావడం నాకుమటుకు చాలా బెరుకుగా ఉంది.
నా భయాన్ని నాకళ్ళు ప్రతిబింబిస్తూనే ఉండి ఉంటాయి ఆవిడతో నవ్వుతూ మాట్లాడుతున్నానన్నమాటేగానీ నాకళ్ళు పదే పదే ఆవిడగారి జబ్బ సంచి మీదకి పోయి వస్తున్నాయి దూరంగా పోవడానికి లేకుండా పట్టేసింది చాలా జబర్ దస్తీగా మాట్లాడుతూంది గాని మామూలుగా జుర్రున పర్సు జిప్ లాగక పోవడంతో కాస్త ధైర్యం చిక్కి ఇబ్బందిగానే కుర్చీలో కూలబడ్డాను.
నా భయం నిజం చేస్తూ నేను ఎదురు చూసిన సంఘటన జరగనే జరిగింది రెండు నిముషాలు మాట్లాడి జుర్రున పర్సు లాగింది దాంట్లో నుండి టికట్ల పుస్తకం బయటకు తీసింది "తీసుకోవోయ్ ఏభై టికెట్లు! అంటూ చింపడానికి సిద్ధపడింది" ఆగండి బాబూ చింపెయ్యకండి నేను ఇచ్చుకోలేను ఇప్పటికే రెండు మూడు చోట్ల వదిలాయి ఈ నెలకి భరించలేను" అన్నాను ప్రాధేయపడుతున్నట్లు.
"క్యా, మరీనూ నీకు డబ్బు లేదంటే ఎవరు నమ్ముతారోయ్ బంగారం లాంటి ఉద్యోగం అంతకంటే బిజీరైటర్ వి రెండు చేతులా సంపాదిస్తూ డబ్బు లేదంటే నమ్మలేను? నీకేం ఖర్చులుంటాయి.
రామలీల, ఉత్తరాది నుంచి వచ్చారు బాల్ వాడి ప్రారంభించాలని ధన సేకరణ మొదలు పెట్టాం నీలాంటి వాళ్ళు సహకరించకపోతే ఎలా? కనీసం పాతిక రూపాయలేనా తీసుకోక తప్పదు" అంటూ నా రియాక్షన్ కోసం ఎదురు చూడకుండా టికెట్టు చింపి చేతిలో పెట్టింది. ఏడ్వలేక చిరునవ్వు ముఖం మీదికి తెచ్చుకుని అంత డబ్బు ఉందో లేదో అనుకుంటూ పర్సు తెరిచి చూశాను ముప్పయి ఉంది ఒక పాతిక తీసి ముడుపు చెల్లించాను ఎందుకిచ్చాను? అడగవచ్చు మీరు ఏదో బలహీనత మరీ మొండికేసి తీసుకోనంటే పిసినారి అనుకుంటారేమోనాన్న భయం నాలాంటి చాలామందికి ఉంటుంది. అందుకే డబ్బులున్నా లేకపోయినా ఇలా భారీ టికెట్లకి ముడుపు పెట్టి నెలాఖరున డబ్బులేక ఇబ్బందిపడిపోతూ ఉంటాము ఇబ్బంది ఎవరికి చెప్పుకోవడం?!
అసలిలా చందాలు ఎలా అడుగుతారు? అనిపిస్తూంది అసలిలా అడగడం కూడా ఒక కళే. కొందర్ని చూస్తే - వాళ్ళు టికెట్లు అమ్మే వాళ్ళు అనిపిస్తుంది అందరూ ఈ పని చెయ్యలేరు ఎంత ఛారిటీకయినా బలవంతంగా డబ్బు గుంజుకోగలగడం అందరికీ రాదు.
అలాగే ఒకసారి చాలా గొప్ప సేవచేస్తున్నామన్న ఉద్దేశంతో చందాలు వసూలు చేయడానికి దిగాను. వరద బాధితుల కోసం - తెలిసిన వాళ్ళు, బాగా తెలిసిన వాళ్ళు నన్ను కాదనలేని వాళ్ళందరి దగ్గరికీ ఒక స్నేహితురాలితో బయలుదేరి వెళ్ళాను జోలిపట్టి ముఖ్యంగా నేను అడిగినవి లేదనని వాళ్ళ దగ్గరికే వెళ్ళినా - తీరా వెళ్ళి అడగడానికి వచ్చే మొహమాటం వేసింది సగం చచ్చిపోయినట్టు అనిపించింది.
పెద్ద అధికారులు, హోదాలో ఉన్నవాళ్ళు అడిగీ అడగగానే ఇచ్చారు బుక్కులు తీసుకుని అమ్మి పెడతాం అన్న వాళ్ళూ ఉన్నారు కాని కొందరు అతి సన్నిహితులు అనుకున్నవాళ్ళు ఇంటికి వెళ్ళినందుకు ఆనందిస్తూ అతి మర్యాదలు చేసి తీరా సంగతి విని ముఖాలు మాడ్చుకున్నారు.
అసలే సగం చచ్చి అడగడానికి సిద్ధం అయిన నేను వారి ముఖాలు చూసి పూర్తిగా చచ్చిపోయి, మళ్ళీ ఇంకోసారి రెట్టించి అడగకుండానే లేచి వచ్చేశాను జమిందారుని అనదగిన ఒక ధనికురాలు నన్ను ఎంతో ఆప్యాయంగా పలకరిస్తూ ఉంటుంది 'వందరూపాయిలేనా కొని తీరుతుంది' అనుకుని వెడితే అసలు సంగతి విని ఇలాంటి చందాలు ఇవ్వడం అలవాటు లేదు ఇవి వసూలు చేసే వాడి మీద నమ్మకం లేదు వీటికోసం మీరు తిరగడం బాగోలేదు' అని ఒక లెక్చర్ దంచింది బిక్క ముఖం పెట్టి ఏమీ అనలేక ఎలాగో 'బతుకుజీవుడా' అనుకుని బయటపడ్డాను నిజంగా అంతగట్టిగా చెప్పగలిగిన వాళ్ళే తెలివైన వాళ్ళేమోననిపిస్తుంది ఇష్టం లేకుండా మొహమాటపడిపోయి, లోలోపల తిట్టుకుంటూ చందాలు ఇచ్చి బాధలు పడేకంటే ఇలా నిర్మొహమాటంగా చెప్పడమే, మంచిదేమో అనిపిస్తుంది.
అయితే మంచి పనులు కోసం చందా వసూళ్ళు తప్పదు అలాంటప్పుడు ఏం చెయ్యాలి? ఇదీ పెద్ద ప్రశ్న అవసరం గుర్తించి అడక్కుండా ఎవరైనా ఇస్తారా? ఇవ్వరు.
అందుకే ప్రతిదానికీ చందాలకి బయలుదేరే కంటే ముఖ్యమైనవి చూసుకోవాలి చందాలు సవ్యంగా వినియోగించని వారి సంఖ్య ఎక్కువగా కనిపించడం వల్ల కూడా చందాలు పోగు చేయడం కష్టతరం అవుతూంది గుప్తదానాలు లోపించి ఈ రోజుల్లో పబ్లిక్ దానం చందా కనక వీటి అవసరం కాదనలేం.
కాని ఒక్కసారి చందాల వసూళ్ళ విషయంలో చిక్కుకుంటే బయటపడటం జరిగేపని కాదు. అందుకే ఈ సమాజంలో మిసెస్ శర్మలు పీడకలల్లా ఎదురవుతారు.
కాలనీలలో పిల్లలు పూజలకీ పునస్కారాలకీ అంటూ పావలా, అర్థలు వసూలు చేస్తూ, సాంఘిక కార్యక్రమాలు జరిపిస్తారు ఇవి ఇచ్చుకోవడం, పుచ్చుకోవడం కూడా శ్రమ కాదు. కాని మరీ మిసెస్ శర్మ లాంటి చందాదారులనే నేర్పుగా ఎదుర్కోవాలి దహనాలకని, దర్జాలకని, దేవుడికనీ, దెయ్యానికనీ అన్నిటికీ వూరి మీద పడే తత్త్వం పోయి అందరికీ ఉపయోగించే మంచి పనులకోసం ఈ చందా సేకరణలు సాగాలి.
దీనిలో కూడా నిజాయితీ అవసరం ఒకసారి నమ్మకం వమ్ము చేస్తే మరిక ఒక్క నయా పైసా వసూలు చేయలేం. 'చందాపీడితసంఘం'గా మనుషులని మిసెస్ శర్మ లాంటి వాళ్ళు చేసారు చేయకుండా ఉంటే బాగుండును.
మహిళా సమాజాలు
స్వాతంత్ర్యానంతరం, పంచవర్ష ప్రణాళిక ద్వారా గ్రామాల అభ్యుదయం కోసం, కేంద్ర ప్రభుత్వమూ, రాష్ట్ర ప్రభుత్వమూ అనేక పథకాలను అమలులోకి తెచ్చారు స్త్రీ జనాభ్యుదయాన్ని కూడా విస్మరించలేదు.
స్త్రీ పాల్గొంటే కాని గ్రామాభ్యుదయం సంభవం కాదని గుర్తించారనే మనం అనుకోవాలి అందుకే గ్రామాలలో మహిళా మండలులను స్థాపించారు ఈ మహిళా సమాజాల ద్వారా అనేక కార్యక్రమాలను నడిపించే ప్రయత్నాలు జరిగాయి జరుగుతూనే ఉన్నాయి.
వీరి కార్యక్రమాలకు బ్లాక్ స్థాయిలోనూ పనిచేసే ప్రభుత్వం సిబ్బంది మార్గదర్శకత్వం వహిస్తుంది అంతేకాక అడపాదడపా ప్రభుత్వం నుంచి వారికి గ్రాంట్లు కూడా వస్తూ ఉంటాయి అన్ని రాష్ట్రాలలోలాగే ఆంధ్రప్రదేశ్ లో కూడా అనేక గ్రామాలలో మహిళా సమాజాలు ఉన్నాయి.
తీరిక సమయాల్లో గ్రామీణ మహిళలు మండలికి వస్తారు మిషను కుట్టడం, అప్పడాలు చెయ్యడం, పచ్చళ్లు పట్టడం (కొన్ని చోట్ల నవారు నెయ్యడం)వగైరా కార్యక్రమాలు నిర్వహిస్తారు కిచెన్ గార్డెన్స్ పెంచడం, పౌల్ట్రీ యూనిట్స్ (కోళ్ళ పెంపకం) నిర్వహించడం, గొర్రెలు పెంచడం మొదలైన కార్యక్రమాలు కూడా ఉంటాయి.
కొన్ని గ్రామాలలో ఈ మహిళా సమాజాల కార్యక్రమాలను గూర్చి చెప్పాలంటే చాలా ఉన్నది ఇక్కడ నేను చెప్పదల్చుకున్న విషయం వేరు అందుకే వారి కార్యక్రమాలను టూకీగా మాత్రం చెప్పడం జరిగింది.
ఈ మధ్య రాజేంద్రనగర్ లో మహిళా సమాజాలకు సంబంధించిన వర్క్ షాప్ నిర్వహించబడింది అందులో పాల్గొనేందుకు అనేక ప్రాంతాలకు సంబంధించిన ఆఫీసర్లు వచ్చారు.
మూడు రోజులు "ఈ మహిళా సమాజాల కార్యక్రమాలలో ఎలాంటి మార్పులు తేవాలి? చేర్పులు అవసరం: ఏ విధమైన ఆర్ధిక సహాయం ప్రభుత్వం నుంచి ఇవ్వడానికి వీలు ఉంటుంది?" అనే విషయాల మీద చర్చ జరిగింది చర్చను బట్టి ఇతర రాష్ట్రాలలో కంటే మన రాష్ట్రంలోనే మహిళా మండలులు బాగా పని చేస్తున్నాయని తేలింది.
ఒక పందిపిల్లను, ఒక మహిళా మండలి మెంబరుకు ఇస్తే, సంవత్సరంలో దాని మీద వచ్చే ఆదాయం ఎంత: ఒక గొర్రె పిల్లనూ, బర్రె పిల్లనూ (దూడను) ఇస్తే సంవత్సరంలోపు దాని ఖరీదు ఎంత అవుతుంది వాళ్ళు చేసే అప్పడాలకూ, కారంపొడికీ, వడియాలకూ మార్కెట్ ఎలా ఏర్పాటు చేయడం" వగైరాలు గురించి తలలు బద్ధలు కొట్టుకున్నారు.
మరో విషయం - బలహీనవర్గాల స్త్రీలు ఈ సమాజాల కార్యక్రమాలలో పాల్గొనడం లేదనీ, వాళ్ళను ఎలాగయినా ఈ మహిళా సమాజాలలో మెంబర్లుగా చేర్పించాలనేది కాని బలహీన వర్గాలకు చెందిన స్త్రీలకు పగటిపూట మహిళా మండలులకు వెళ్ళే తీరిక ఉండదని ఎవరూ ఆలోచించరు.
శ్రామిక వర్గానికి చెందిన స్త్రీలు పొద్దుటి నుంచీ సాయంత్రం వరకూ పొలాలలో కాయకష్టం చేస్తే గాని పొయ్యిలో పుల్లలేవదు వారికి రోజూ వచ్చే కూలి ఈ సమాజాల కార్యక్రమాలలో పాల్గొనడం వల్ల లభిస్తేగాని వారు యిలాంటి కార్యక్రమాలలో పాల్గొనలేరనే విషయాన్ని మేధావులు విస్మరించి చర్చించడం ఆశ్చర్యాన్నే కలిగించింది.
ఇకపోతే, ఎంతసేపు గొర్రెల పెంపకం, పందుల పెంపకం, కోళ్లపెంపకం అప్పడాలు వత్తడం గురించి తప్ప గ్రామీణ స్త్రీల స్థానం సమాజంలో (వివిధ రాష్ట్రాలలో) ఏమిటి? వాళ్ళలో సాంఘిక చైతన్యం కలిగించడానికి ఏం చెయ్యాలి? వాళ్ళ దైనందిన సమస్యలు ఏమిటి? అనే విషయాల గురించి ఒక్క మహిళా మాట్లాడలేదు.