మనసిచ్చిన మగవాడి ముందు ఆడపిల్ల తడబడటం, మాటలు దొరక్క తడుముకోవడం, మనసులో ఏవేవో ఊహలు అల్లిబిల్లి తిరుగుతూ ఉంటే ముఖం మీదకు సిగ్గు తెరలు దొర్లడం సహజంగానూ, అందంగానూ ఉంటుంది ఇది కేవలం ప్రైవేటు విషయం ఒక పరిధిలో పరిమితమైనది మాత్రమే.
పెద్దలతో మాట్లాడేటప్పుడు ఆణుకువగా తలవంచి మాట్లాడటంలో సిగ్గు ఛాయలు కన్పిస్తాయి కాని అది పైన చెప్పిన లాంటి సిగ్గు కాదు.
బాహ్య ప్రపంచంలో అడుగుపెట్టి పదిమంది మధ్య తిరగవలసిన స్త్రీ చీటికీమాటికీ సిగ్గుపడుతూ ఉంటే ఆమె సమాజంలో నిజమైన స్థానాన్ని అంటే, పురుషుడితో సమానమైన స్థానాన్ని పొందినా, దాన్ని గ్రహించే పరిస్థితిలో ఉండలేదు కనుక స్త్రీ ఈ విషయం గురించి ఆలోచించాలి.
ఆ మధ్య ఒక న్యూస్ వచ్చింది కట్నం కానుకలు బేరం చేస్తున్న కాబోయే మామగారి ముందుకు వచ్చి ఒక అమ్మాయి మీ అబ్బాయి ఇంటిపని చేస్తాడా? నేను ఉద్యోగం చేసి పోషిస్తాను" అన్నదట.
దాంతో పైపంచలు భుజాలమీద వేసుకుని వూడిపోతున్నగోచీలను పట్టుకొని పెద్ద మనుషులు పారిపోయారట ఒక ఆడపిల్ల తన పెళ్ళి విషయంలో అలా మాట్లాడ్డం విని మన పెద్ద మనుషులకు మతులు పోతాయనడంలో సందేహం లేదు.
ఆ అమ్మాయిని నేను మనసారా అభినందిస్తున్నాను ఆ అమ్మాయిని చూసి కనీసం చదువుకున్న కొందరు ఆడపిల్లలైనా ఆత్మవిశ్వాసంతో కట్నం తీసుకొనే వాడిని వివాహం చేసుకోవడానికి ఎదురు తిరిగితే మనదేశంలోని ఆడపిల్లల జీవితాలు తప్పక బాగుపడతాయని విశ్వసిస్తున్నాను.
సంభాషణ కూడా ఒక కళే
మీ మాటల ప్రభావం ఇతరుల మీద పడాలంటే, సంభాషణను ఒక కళగా మీరు మలచుకోవాలి మృదుభాషి లోక ప్రయత్నాన్ని సాధిస్తాడు ఎక్కువమంది మిత్రులను పొందగలడు ఇతరులను నొప్పించకుండా మాట్లాడే వ్యక్తి అందరి ప్రశంసల్ని అందుకుంటాడు కటువుగా మాట్లాడే వ్యక్తిని వీలయినంతవరకూ దూరంగా ఉంచటానికి ప్రయత్నిస్తారు.
కొందరు నోరు తెరిస్తే చాలు -- పరనిందతో పాటు ఆత్మ ప్రశంశ ప్రారంభిస్తారు ఎంత గొప్పవ్యక్తి అయినా తనను తను పొగడుకునేప్పటికి ఇతరుల దృష్టిలో చులకనయిపోతాడు కొందరి నోటి నుంచి వ్యంగ్యం తప్ప మరొకటి వినిపించదు సంభాషణలో మనుష్యుల్ని దగ్గర వేసుకోవాలంటే కొన్ని రహస్యాలను తెలుసుకోవాలి.
"మాట్లాడడం ఒక జబ్బు వినడం ఒక కళ" అన్నారు పెద్దలు ఇది అన్నిచోట్లా వర్తించకపోవచ్చును కాని కొందరు ఇతరులు చెప్పేది వినరు తాము చెప్పేది మాత్రమే వినాలనుకుంటారు. అలాంటప్పుడు సంభాషణ విసుగును కలిగిస్తుంది ఒక కవిగారు ఉన్నారు ఆయన మేథావి బాగా చదువుకున్నాడు అతనితో ఒక గంట మాట్లాడితే ఎన్నో కొత్త విషయాలు నేర్చుకోవచ్చును కాని అతను వస్తున్నాడంటే చాలామంది (నేను కూడా) "చచ్చాంరాబాబూ!" అనుకుంటారు ఎందుకంటే అతను ఎన్ని గంటలు కూర్చున్నా మాట్లాడుతూనే పోతాడు ఎదుటి మనిషికి అయిదు నిమిషాలైనా మాట్లాడటానికి అవకాశం ఇవ్వడు. ఎంత మంచి విషయాలైనా ఏకబిగిని వింటూ కూర్చోవాలంటే విసుగు పుడుతుంది ఇలాంటివారు ఎదుటి వారు ఆవలిస్తున్నా పట్టించుకోరు. ఒకవేళ నాలాంటి వాళ్ళెవరైనా టాపిక్ మార్చి ఏదైనా అడిగితే దానికి సమాధానం ఇచ్చి, మొదటి సంభాషణలో ఆపిన వాక్యం అందుకొని మళ్ళీ అదే విషయాన్ని దంచేస్తారు.
కొందరు ఉంటారు వాళ్లు ఎదుటి వాళ్ళ మాటలు వినరు తాము మాట్లాడవలసిన దాన్ని గురించి ఆలోచిస్తూ ఉంటారు అవతలి వ్యక్తి గాలి పీల్చుకోవడానికి ఆపితే చాలు అందుకుంటారు.
సంభాషణ క్రమం తెగిపోతుంది ఎదుటివ్యక్తి మాటలు శ్రద్ధగా విని మీరు మాట్లాడినప్పుడే అవతలి వ్యక్తికి గూడా ఆ సంభాషణలో అభిరుచి కలుగుతుంది తాళం రెండు చేతులూ కలిసినప్పుడే మోగుతుంది.
మనం మాట్లాడేప్పుడు ఎదుటివ్యక్తి అభిరుచిని తెలుసుకొని మాట్లాడాలి వాళ్ళకు అభిరుచిని కలిగించని విషయాలు చెబుతూపోతే విసుక్కుంటారు.
కొందరు రెండు ముక్కల్లో చెప్పే విషయాన్ని అర్థగంటసాగదీసి, అనవసరమైన వివరాలతో చెబుతారు ఉదాహరణకు "మీ ఆరోగ్యం ఈ మధ్య బాగా లేదన్నారు ఇప్పుడు ఎలా ఉంది?" అని అడిగారనుకోండి. బ్లెడ్ టెస్టురిజల్టు నుంచి, డాక్టరు దగ్గరకు ఎన్నిసార్లు వెళ్ళిందీ, ఎంతడబ్బు ఖర్చు అయిందీ, రోజుకు ఎన్ని మందులు ఏయే టైంకు మింగుతుందీ సవివరంగా చెబుతారు.
కొందరికి మాటల మధ్యలో ప్రతిసారీ ప్రత్యేక శబ్దాన్ని ప్రయోగించే అలవాటు ఉంటుంది ఉదాహరణకు మాట్లాడుతూ కొందరు మధ్య మధ్య "అర్థం అయిందా?" అంటారు ఇటువంటి అప్రసంగిక నిరర్థక శబ్ద ప్రయోగాల అలవాటును తప్పించుకోవడానికి ప్రయత్నించాలి.
కొందరు మాట్లాడి ఆపగానే 'వర్షం కురిసి' వెలిసినట్లు అనిపిస్తుంది గోలగోలగా మాట్లాడకూడదు నిదానంగా, ఎదుటివాడు వింటున్నాడో లేదో గమనిస్తూ మాట్లాడాలి కొందరికి దిక్కులు చూస్తూ మాట్లాడే అలవాటు ఉంటుంది కొందరు మూతికి కర్చీపు అడ్డం పెట్టుకుని మాట్లాడతారు.
ఇటువంటి అలవాటు ఎదురుగా కూర్చున్న వారికి చిరాకు కలిగిస్తాయి ఒక గంభీర విషయం మీద మాట్లాడుతున్నప్పుడు మధ్య మధ్య ఆగి "మీ అభిప్రాయం ఏమిటి? మీరేమంటారు?" అని అడగాలి అందువల్ల ఎదుటివ్యక్తికి కూడా తన అభిప్రాయాలను వెల్లడించే అవకాశం లభిస్తుంది సంభాషణలో ఇద్దరికీ ఇంటరెస్టు కలుగుతుంది.
ఇతరుల అభిప్రాయాలతో ఒకోసారి మనం ఏకీభవించము ఏకీభవించాలని కూడా ఎక్కడా లేదు మృదువుగా ఎదుటివారి అభిప్రాయాలను ఖండిస్తే ఎక్కడలేని కోపం వస్తుంది. ఇలాంటి వ్యక్తులతో గంభీరమైన విషయాల మీద చర్చించడం అనవసరం వీలయినంతవరకు తప్పించుకోవడానికి ప్రయత్నించాలి.
ఎదుటి వ్యక్తి అభిప్రాయాలను అతను బాధపడకుండా ఖండించగలగడం ఒక కళ అందుకు ఎంతో వోర్పూ నేర్పూ కావాలి.
బెంజిమెన్ ఫ్రాంక్ లిన్ చాలా చక్కగా ఇతరులను నొప్పించకుండా తన అభిప్రాయాలను వ్యక్తం చేసేవాడట మీరు చెప్పే ఈ మాటతో నేనూ ఏకీభవిస్తాను -- కాని.... అంటూ తను చెప్పదలచుకున్నది చెప్పేవాడు.
ఒక వర్గాన్ని కానీ, ఒక జాతిని కానీ, ఒక కులాన్ని కానీ నిందించేమాటలు అనకూడదు ఒక వ్యాపారి మోసం చేస్తే ఆ వ్యాపారం చేసే అందర్నీ నిందించకూడదు ఈ మధ్య అక్షరపు ముక్కలు నాలుగు నేర్చుకున్న ప్రతి ఒక్కరూ రచయిత్రుల నవలలను దుయ్యబడుతూ రచయిత్రులు అందర్నీ కించపరుస్తున్నారు.
మనం ఒక విషయం గురించి మాట్లాడుతున్నప్పుడు ఎదుటి వ్యక్తి సంభాషణ మరోవైపు మళ్ళిస్తే, అతనికి మనం మాట్టాడే సంభాషణ నచ్చలేదని గ్రహించాలి దాన్ని అంతటితో వదిలేసి వేరే విషయం మాట్లాడాలి.
నేను చదువుకునే రోజుల్లో మద్రాసులో ఒక స్నేహితురాలు ఉండేది ఆమె మాటకు ముందు "నేను అమాయకురాల్ని,ఏదో అనేస్తాను, బాధపడకండి" అనేది ఎదుటివ్యక్తిని బాధపెట్టినప్పుడు కాని, ఆమెను చిన్నమాట అన్నా భరించేదికాదు "నా మనస్సు చాలా సున్నితం ఏమి భరించలేను" అంటూ దాదాపు ఏడ్చినంత పనిచేసేది.
యిలా మాట్లాడేవాళ్ళను గురించి చాటుగా నవ్వుకుంటారు తన మనస్సు సున్నితం అనీ, యితరుల మనసు బండరాయి అనీ అనుకోవడం సెల్ఫ్ పిటీ కిందకు వస్తుంది.
ఎప్పుడూ పరులను నిందించటం మాత్రమే తెలిసిన వ్యక్తులకు ప్రతి ఒక్కరూ వీలయినంత దూరంగా ఉండటానికే ప్రయత్నిస్తారు.
ఒక్కమాటలో చెప్పాలంటే మనం యితరులు ఎలా మాట్లాడాలని కోరుకుంటామో తెలుసుకోవాలి వాళ్ళు మనల్ని ఎందుకు ఎలా తమ మృదుభాషణతో ఆకర్షించారో ఆలోచించాలి ఇది తెలుసుకుంటే మనం ఎదుటి వారితో ఎలా, ఎంతవరకు మాట్లాడాలో అర్థం చేసుకోగలము ఎక్కువమంది మిత్రులను పొందగలము.
సంభాషణ కళ స్త్రీలలో ఎక్కువ అనే చెప్పాలి ఎంతసేపూ తమ సోది చెప్పడానికి ప్రయత్నిస్తారు యితరులను అనాలోచితంగా ఖండిస్తారు తమ అభిప్రాయాలను ఖండించినప్పుడు బాధపడతారు కోపం తెచ్చుకుంటారు అంతటితో వూరుకోక మరొకరి ముందు ఆ విషయం చర్చిస్తారు మళ్ళా విషయం తిరిగి తిరిగి మొదటి వ్యక్తికి చేరుతుంది.
మాటల మీద సంయమనం ఉన్న వ్యక్తి జీవితంలో మంచి పేరుతో పాటు, తమకు కావాల్సిన వాటిని కూడా సాధించుకోగలడు.
చందాలు
గాంధీభవన్ లో ఏదో కార్యక్రమం ఉంటే వెళ్ళాను ఎదురుగా సెస్ శర్మ ప్రత్యక్షం ఆమెను చూడగానే గతుక్కుమన్నాను ఏదో స్త్రీల సమస్యల మీద సెమినార్ గదా -ఆడవారి సమస్యలు చర్చించే అవకాశం కలుగుతుందన్నట్టు వెళ్ళాను నన్ను చూడగానే మిసెస్ శర్మ కళ్ళు మిలమిల మెరిశాయి ఆకలిగా ఉన్నవాడి ముందు భోజనాపదార్థాలు కనిపించినట్టు?"