Previous Page Next Page 
మొగుడే రెండో ప్రియుడు పేజి 26

    "ప్రొద్దుటినుంచీ ఈ నవ్వు ప్రాక్టీస్ చెయ్యలేక చచ్చాననుకో! అయినా నీకు ఇదేం పిచ్చీ? హీరోలకన్నా విలన్లే ఎక్కువగా నచ్చుతారూ!" అన్నాడు కవ్వింతగా.

    అమృత తన ఎదురుగా వున్న అద్దంలో కనిపిస్తున్న కిచెన్ డోర్ వైపు బెదురుగా చూస్తోంది!

    హర్ష లాలనగా ఆమె మెడమీద తన ముఖంతో రాస్తూ, "ఆలస్యమయిపోయింది డియర్, సారీ! కోపంతో ఈరోజు పాడుచెయ్యకు. ఎంతో వూహించుకుంటూ వచ్చాను" అన్నాడు.

    అతను ముఖాన్ని ఆమె మెడమీద అలా రాస్తుంటే ఆమె గాయం అయినా చోట భగభగా మండుతోంది! అచ్చం ఆమె మనసులాగే!

    "కోపమా? ఎందుకూ?" ఆమె అతనివైపు తిరుగుతూ అంది.

    హర్ష ఉలిక్కిపడినట్లు, "ఇదేమిటీ? నీ నుదుటిమీద ఈ కట్టు?" రక్తంతో తడిసిన కట్టుని చూసి కంగారుగా అడిగాడు.

    అమృత బలవంతంగా నవ్వుతూ, "పెద్ద దెబ్బేం కాదు! 'బాత్ రూం' లో జారిపడ్డాను. టాప్ కొట్టుకుంది అంతే!" అంది, మెడమీద గాటు అతని కళ్ళపడనందుకు 'అమ్మయ్యా' అని నిట్టూరుస్తూ.

    హర్ష ఆమెని దగ్గరగా తీసుకుని, "డాక్టర్ దగ్గరకు వెళ్దామా? ఉండు ఈ లోపుగా నీకు 'స్ట్రాంగ్ టీ' చేసి తీసుకొస్తాను" అని ఆమెని వదిలి కిచెన్ వైపు నడవబోయాడు.

    అమృత గాభరాగా "ఆగు!" అంటూ అతన్ని రెండు చేతులతోటీ పట్టుకుని ఆపి, తనకి అభిముఖంగా తిప్పుకుంది. "నువ్వు ముందు స్నానం చేసి, ఫ్రెష్ అయి రా! ఈలోగా నేను నీ కోసం మంచి కాఫీ చేస్తాను" అంది.

    "ఎంత ఆశగా వచ్చానో తెలుసా?" హర్ష ఆమె స్పర్శకి ఆగలేనట్టు, తమకంగా అల్లుకుపోతున్నాడు.

    ఆమె పెదవులు అదురుతున్నాయి. శృంగారాభిలాషతో కాదు! హృదయాంతర్ఘోషతో! ఆ కళ్ళలోని ఎరుపుజీరనీ, సన్నగా కంపిస్తున్న ఆమె తనూలతనీ చూసి వేరేగా అర్ధం చేసుకున్నాడు.

    "సారీ! చాలా ఆలస్యం చేశాను. ఇంకా నిన్ను ఒక్క క్షణం కూడా వదిలేది లేదు. ఎవరడ్డమొచ్చినా సరే!" అంటూ వూపిరి ఆడకుండా ఆమెని కౌగిలిలో బంధించాడు.

    ఆ చివరి మాటలకి ఆమె అదిరిపడి, హర్ష భుజాల మీదుగా కిచెన్ వైపు చూసింది.

    కిచెన్ డోర్ నెమ్మదిగా తెరుచుకుంటోంది.

    అమృతా...నిన్ను ఇలాగే 'బెడ్ రూం'లోకి ఎత్తుకుని వెళ్ళిపోవాలని అనిపిస్తోంది. ఎంత అందంగా కనిపిస్తున్నావో తెలుసా?" హర్ష ఆమె పెదవులు అందుకుంటూ వుండగా, తలుపు పూర్తిగా తెరచుకున్న చప్పుడైంది!

    హర్ష ఆ చప్పుడుకి వెనక్కి తిరగబోయాడు. అమృత వెంటనే తన పెదవులు అతని పెదవుల దగ్గరికి జేర్చి, రెండు చేతులతోనూ అతని తలను కదలకుండా నొక్కి పట్టుకుంది. అతను ఆమెని గాఢంగా చుంబించాడు.

    అమృత భారంగా కళ్ళు మూసుకుంది! ఆమెకి తెలుస్తోంది. విక్రమ్ తలుపు తెరచుకుని బైటికి వచ్చేశాడని. ప్రియుడి ఎదురుగా భర్తతో రొమేన్స్! ఈ పరిస్థితి ఏ స్త్రీకి రాకూడదు భగవాన్' అనుకుంది మనసులో.

    హర్ష ఆమెని వదులుతూ, "వాట్ నెక్స్ట్?" అన్నాడు చిలిపిగా కన్నుకొట్టి.

    అమృత అతన్ని వెనక్కి తిరగానివ్వకుండా బాత్ రూంవైపు వెడ్తూ "నువ్వు స్నానం చేసి రా ముందు" అంది.

    "ఓ....కే! ఇవాళ నీ మాట వినాల్సిందేగా, అసలే పుట్టిన రోజు పాపాయివి" అంటూ అతను బాత్ రూం వైపు రెండు అడుగులు వేసి, ఆగి "అమృతా.." అంటూ ఆమె వైపు తిరగబోయాడు.

    అతడికా అవకాశం ఇవ్వకుండా అతన్ని సమీపించి, భుజాలు పట్టి తోస్తూ, పద! మిగతా విషయాలు 'బాత్ రూం' లోనే..." అంటూ లోపలికి తీసుకెళ్ళింది.

    "సరిగంగ స్నానాలు చేద్దామా?" హర్ష ఉషారుగా అడిగాడు.

    "నువ్వు చేస్తూ వుండు, నేను ఇప్పుడే వస్తా" అంటూ లోపలికి తోసి తలుపు బైటనించి గడియ పెట్టింది.
    "ఏయ్....ఏమిటది? తలుపు తెరు" హర్ష లోపల నుండి అరుస్తున్నాడు.

    ఆమె ఆత్రంగా వంటింటివైపు నడిచింది. అక్కడ విక్రమ్ లేడు! హాల్లో కూడా లేడు! ఇల్లంతా వెదికింది.ఎక్కడా కనిపించలేదు. అతను వెళ్లిపోయాడని తెలిశాక ఆమెకి ఊపిరి అందినట్లయింది. ఒక్కసారిగా భరించలేని నిస్సత్తువ ఆవరించినట్టయి, కుర్చీలో కూలబడి, మొహం దోసిట్లో దాచుకుంది. కడుపులోంచి గుండెల్లోకి ఎగదన్నుకువస్తోంది బాధ. ఆ బాధ ఆమె ప్రమేయం లేకుండానే చెక్కిళ్ళ మీదనుంచి కన్నీళ్ళరూపంలో జారిపోతోంది.

    బలవంతంగా ప్రేమని పొందలేరు! అలాగే బలవంతంగా ప్రేమని చంపలేరు కూడా!

    బహుశా తను హర్షతో సన్నిహితంగా వుండడం చూసి, అసహ్యించుకుని వెళ్ళిపోయి వుంటాడు. నిజంగా అలా జరిగితే ఎంత బావుంటుందీ? విషంకూడా ఒక్కోసారి ఔషధంగా పనిచేస్తుంది. అలాగే అసహ్యం కూడా కొందరు వ్యక్తులు కొందరి జీవితాల నుంచి దూరమవదానికి తోడ్పడుతుందేమో!

    "అమృతా....తలుపు తెరు. ఇది అన్యాయం, నన్ను ఒక్కడ్నే స్నానానికి వదిలేసీ..." హర్ష బాత్ రూం లోంచి గోల చేస్తున్నాడు.

 Previous Page Next Page